Tuesday, November 13, 2012

శివ సాక్షాత్కారం (Shiva Saakshaathkaram)

 అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ఇవ్వబోయే శివుని ప్రత్యక్ష వర్ణన చదవండి:
"జటామకుటేందురేఖయుం, గరమున శూలమున్, గరళ గాలగళంబు, బృహద్గజాజినాంబరము, తృతీయ లోచనము, పన్నగహారము నొప్పుచుండగన్" 

శివుడు జడలు గట్టిన శిరస్సుపైగల చంద్రవంకతో త్రిశూలం చేతితో ధరించి, విషం వల్ల నల్లనైన గొంతుకతో, గజచర్మధారియై, మూడవ కన్ను కలిగి, పాముల హారం ఆభరణంగా ధరించి అర్జునునకు దర్శనమిచ్చాడు. ప్రత్యక్షమైన శివుణ్ని అర్జునుడు స్తోత్రించటం: 

దండకము: 

     శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవాస్థాన సంహారకారీ, పురారీ, మురారీప్రియా, చంద్రధారీ, మహేంద్రాదిబృందారకానంద సందోహసంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్పప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మల జ్ఞానదీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారమాయంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యానపీయూషధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా, భవ్య సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గవాగస్త్యకుత్సాది నానా మునిస్తోత్రదత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణగంధర్వులున్,  సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా, నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః 

తాత్పర్యం

శ్రీ కంఠా! లోకాలకు పాలకుడా! సృష్టిస్థితిలయకారుడా! త్రిపురాలను విధ్వంసం చేసినవాడా! మురుడు అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుదేవుడికి ప్రియమైనవాడా! చంద్రవంకను ధరించినవాడా! దేవేంద్రుడు మున్నగు దేవతలకు ఆనందాలను చేకూర్చేవాడా! పుణ్యాలు ఆకృతిగొన్నవాడా! ముక్కంటీ! దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడా! దేవా! మేధావులు నీ దైవతత్త్వాన్ని ఆలోచించి వింగడించి కర్మం ప్రధానమైనదగు విజ్ఞానం అధ్యాత్మయోగం సర్వక్రియా కారణమని అనేకవిధాల విచారణలు చేస్తూ నిన్ను ధ్యానిస్తారు. సర్వేశ్వరుడవైన శర్వ! సర్వజ్ఞ! సమస్తసృష్టికి ఆత్మ వంటివాడా! మొక్కవోని మహిమ కలవాడా! పార్వతీపతీ! నీవు మూడు లోకాల ప్రవర్తనాన్ని భూమి, గాలి, ఆకాశం, ఆత్మ, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, నీళ్లు ఈ ఎనిమిదింటితో నిర్మించి, ఈ విశ్వసంసార చక్రబంధయంత్రాన్ని ధరించి నడుపుతున్నావు. ఆది దేవుడివి నీవు. మహాదేవుడివి నీవు. నిర్మలమైన జ్ఞానప్రదీప్తి చేత సంసార మాయాంధకారాన్ని నిర్మూలించి, వైరాగ్యసంపన్నులై జితేంద్రియులైన యతీంద్రులు నీ పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతాన్ని నిరంతరం గ్రోలుతూ సంత్రుప్తులై, నిత్యులై ఉన్నారు. నాశం లేనివాడా! పూజ్యుల చేత సేవించబడేవాడా! సర్వం నీవే అయినవాడా! భర్గా! విద్వాంసుడా! భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మున్నగు మహర్షులు చేసిన స్తోత్రాలను చెవియొగ్గి వినేవాడా! నుదుటి కంటి మంట చేత మన్మథుడిని బూడిద చేసినవాడా! భస్మం పూయబడిన దేహం కలవాడా! గంగను ధరించినవాడా! నీ దయవలన గీర్వాణులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఉరగశ్రేష్ఠులు, రాక్షస ప్రముఖులు మున్నగువారు ఎడతెగని సంపదలతో వర్దిల్లినారు. పరిపాలకుడివైనవాడా! విశ్వకర్తా! నాకు కోరికలు ఈడేర్చుము ఓ దయామయా! మూడులోకాలను పాలించే సార్వభౌముడా! సురాభ్యర్చితుడా! నీకు నా నమస్కృతులు.

శివార్చనపై నన్నయచే విరచితమైన ఇది తొలిదండకం. ఆంధ్రమహాభారతములో ఇది కామబాణవృత్తంలో రచించబడింది. రెండు గురువులు, ఒక లఘువు గల "తగణంతో" ధాటిగా ఎక్కడా ఆగకుండా నడుస్తుంది. ఈ స్తోత్రరచన మాటల్లో భావనాబలమే కాక శబ్దశక్తి రహస్యాన్ని గ్రహించి తద్వారా మంత్రాలను దర్శించారు ఋషులు. ఏ శబ్దాన్ని ఎలా కూర్చితే ఎటువంటి దివ్యశక్తి ఆవిర్భవిస్తుందో గమనించి ఆ విధంగా అనేకమంత్రాలను ఏర్పరచారు. అందుకే మాట ఆశీస్సుగాను, శాపంగాను పరిణమించగలదు. మానసికభావంతో పాటు శబ్దాల బలిమి వల్ల పలుకులకు ఆ పటిమ ప్రాప్తిస్తుంది. దేవతలను ఆహ్వానించే శక్తి మాటకే ఉంది.

శబ్దశాసనుడైన నన్నయ మహర్షి మనకందించిన ఈ స్తోత్రం ద్వారా అపూర్వ ఐశ్వర్యప్రదుడైన శివున్ని ధ్యానించి తరిస్తాం.


                                      ******

No comments:

Post a Comment