Sunday, November 25, 2012

నన్నయ కవితలో తరుగని పరువము (Nannaya Kavithalo Tharugani Paruvamu)

"నీ రొమ్ము చీల్చి రక్తం త్రాగుతాను" అని దుశ్శాసనున్ని - "నా గదాఘాతంతో నీ తొడలు విరుగగొడతా"నని దుర్యోధనుణ్ణి, ఉద్దేశించి భీముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞలు, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం లోనివి. పై భావాలను వ్యక్తీకరించే పద్యాలు నన్నయగారు వేయిసంవత్సరాల క్రితం ఆంధ్రమహాభారతంలో రచించారు. నేటికీ ఈ పద్యాలు - "కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవుల్", "ధారుణిరాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి" అని రాగయుక్తంగా నటులు నాటకరంగంలో పాడుతూనే ఉన్నారు. శ్రోతలు మధురానుభూతి పొంది "వన్స్ మోర్" అంటూ రెండవమారు వినగోరుతున్నారు. పద్యాలు సంస్కృత సమాసాలతో కూడి సామాన్యునకు అర్థం కావు. మరి ఎలా విని, ఆనందిస్తున్నారో చదివి తెలుసుకుందాం.

మన మహర్షులు విశ్వం నలుమూలలనుంచి గొప్ప భావాలను ఆహ్వానించారు. సమస్త ప్రాణకోటికీ సుఖశాంతులు ఆకాంక్షించారు. మాకు, వారికి అన్న సంకుచిత తత్వం వారి ఊహకే అందని విషయం. 
మన కవులు కూడా మహర్షుల మార్గాన్నే అనుసరించారు. ఋషిత్వాన్ని ఉపాసించారు. ఋషిత్వం లేకుంటే కవిత్వం లేదనే వారి విశ్వాసం. కావ్యాల వల్ల కవులు ఆశించిన ప్రయోజనం విశ్వశ్రేయస్సు. విశ్వశ్రేయాన్ని మాటల్లో వల్లెవేయడం తేలికే. కాని మనసులోనూ, మనుగడలోను దాన్ని ప్రతిఫలింపజేయడం కష్టం. 

నన్నయ నిత్యసత్యవచనుడూ, విజ్ఞాననిరతుడూ, అవదాతచరితుడునూ. ఆయన త్రికరణశుద్ధి నిండుగా పండిన మనీషి, అంచేత ఆయన్ని ఋషి అనడానికి సందేహం వుండదు. 
నన్నయ భారతం రచించింది తెలుగులోనే. అయినా దానివల్ల ఆయన కాంక్షించిన ప్రయోజనం జగద్ధితం! తెలుగువారికి మాత్రమే ప్రయోజనం కాదు. భాషకు హద్డులుంటాయి. కాని అవి భావానికి ఉండవని ఆయనకు తెలుసు. విశ్వవిశాలమైన ఈ భావన, ఆయన రచనలో అక్కడక్కడా మనకు గోచరిస్తూనే ఉంటుంది. కొడుకును కౌగిలించుకుంటే కలిగే సౌఖ్యం మరి దేని వల్లా కలుగదని చెప్పేటప్పుడు, అది జీవులన్నింటికీ అంతే అంటాడాయన. (పుత్రగాత్రపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే); దాన్ని మనుష్యులకు మాత్రమే పరిమితం చెయ్యడు. "ఆత్మవ త్సర్వ భూతాని" అన్న తత్వం ఆయనలో ఇమిడిపోయింది. అలాంటి మహర్షి మన భాషకు ఆదికవి కావటం మన అదృష్టం!

నన్నయ భారతం రచించి దాదాపు వెయ్యేండ్లు కావస్తున్నా, ఈనాటికీ అది కొత్తదనం కోలుపోలేదు. భారతకథా వస్తువే అలాంటిది అనే సమాధానం ఒకటి ఉండనే ఉంది. కానీ నన్నయ కవిత్వంలో అలాంటి ఒకానొక నిత్యనూతనత్వం పొందుకొని ఉండడం గమనింపవలసిన విశేషం. 

పాతదైనా కొత్తగా తోచడం, సౌందర్యానికి లక్షణం. ఈ సౌందర్యం నన్నయగారి శబ్దరచనలోనూ, అర్థరచనలోనూ, మనం దర్శించవచ్చు. విశేషమేమిటంటే శబ్దార్థ సౌందర్యాలు రెండూ అవినాభావంతో ఆయన రచనలో కానవస్తాయి. అందుకే ఆయన భారతం అందరి ఆదరాన్ని అందుకున్నది; అందుకుంటున్నది. ఆ అంశాన్ని ఇక్కడ కొద్దిగా పరిశీలిద్దాం. 

మ||  కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో 
        ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ 
        కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర 
        ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"

తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను. 

ఉ||   "ధారుణి  రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
         భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
         ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
         గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"

తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను.          

ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు. ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి. అంతమాత్రమే కాదు. కొంత ఇంచుమించుగానైనా ఈ ఘట్టంలో వీటికి సాటిరాగల పద్యాలు మరేవీ మనకు కానరావడం లేదు కూడా. మరి ఈ నాటకాన్ని చూచే ప్రతివారికీ ఈ పద్యాల్లోని భావం పూర్తిగా అర్థమౌతుందని మనం తలవడానిక్కూడా వీల్లేదు. ఇందులోని సంస్కృతపదాలు, సమాసాలు చదువుకున్నవాళ్లకే అర్థంకావడం కొంతకష్టం. ఇక చదువురాని వాళ్ల మాట చెప్పనవసరం లేదు. అయినా ప్రేక్షకులంతా ఈ పద్యాలు విని సంతోషిస్తున్నారు. అందులోని భావమంతా తమకు అర్థమైనట్లు తలచి మురిసిపోతున్నారు. భీమసేనుడితో ఆత్మైక్యం చెంది పరవశిస్తున్నారు. అందువల్ల ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. "మరోసారి మరోసారి వినాలి" అని కేకలు పెడుతున్నారు. 

ఇదంతా మనం గమనించినప్పుడు, నన్నయ గారి వాక్కులలో మాటలకందని, కాలాన కరిగిపోని, ఏదో ఒక మహత్తరమైన ఆకర్షణశక్తి ఉందనీ, ప్రవాహరూపంగా సాగిపోతున్న తెలుగుభాషలో ఎన్ని కొత్తదనాలు తలయెత్తుతున్నా ఆయన రచనలో వాటికన్నింటికీ మించిన ఏదో ఒక కొత్తదనం చోటు చేసుకుందనీ తప్పక అనిపిస్తుంది. 

పాండవులు జూదంలో పరాభూతులయ్యారు. ద్రౌపది, కౌరవులకు వరవుడు చేయవలసివచ్చింది. దుశ్శాసనుడామెను జుట్టు పట్టి సభకు లాగి వలువలూడ్చినాడు. అదో అమానుషకృత్యం. పరాయివాళ్లకే ఆ దృశ్యం చూడ సహించరానిది. ఇక భీముడెట్లా ఓర్చుకుంటాడు? పైగా ద్రౌపది తన దిక్కులేనితనాన్ని వెళ్లగక్కుతూ చూచిన చూపులు, భీమసేనుని హృదయంలో పాముకాట్లవలె పని చేసివుంటాయి. ఈ దృశ్యంలో ప్రేక్షకులంతా భీమసేనుని మీదనే మనసు, కళ్లు నిలిపి చూస్తుంటారు. 

అప్పటి భీమసేనుడి కోపావేశం ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే వారి హృదయాల్లో కూడా అలాంటి పరిస్పందన వుంటుంది. కనుక దాన్ని భీముడెట్లా వెల్లడిస్తాడో చూడాలనేదే ప్రేక్షకుల ప్రతీక్ష. ఆ సందర్భంలో భీముడు "కురువృద్ధుల్" అన్న పద్యంతో తన కోపోద్రేకాన్ని ప్రకటిస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని జూచి తొడమీద కూర్చుందువు రమ్మని సైగ చేస్తాడు. అది చూచిన భీముడు, అగ్గిమీద గుగ్గిలంలా మండిపడతాడు. వెంటనే తన మనసులోని ఉడుకునంతా వెళ్లగక్కుతాడు. ఈ పద్యాలు చెవిలో పడగానే ప్రేక్షకులు ఇంతకుముందు తమకు అందీ అందకుండా వుండిన ఏదో అనుభూతి హృదయమంతా పరుచుకున్నట్లు భావించి తన్మయత్వం చెందుతారు. అంటే భీముని నోటి నుండి వెలువడిన ఆ మాటలు, అందులోని విన్యాసాలు అంత సందర్భోచితంగా ఉన్నాయన్నమాట!

ఈ పద్యాలు చదువుతున్నప్పుడు వీటిలోని మాటలకన్నింటికీ అర్థాలు తెలియకున్నా అందులోని భావం హృదయాన్ని తాకుతున్నట్లు తోచడం, శబ్దాలు చెవిలో పడుతున్నప్పుడు ఏదో మాధుర్యం హృదయానికి ఆప్యాయంగా వుండడం, అందులోని ధ్వనుల విన్యాసం ఆ సన్నివేశానికి సముచితంగా ఉన్నట్లు అనిపించడం, ఇవన్నీ ప్రేక్షకులు తమకు తెలియకుండానే అనుభవిస్తారు. అందులోనే లీనమౌతున్నారు. 

కోకిలపాటకు అర్థమేమో మనకు తెలియదు. అయినా అది వినగానే మన హృదయంలో ఏదో ఒక సంవేదన కలుగుతుంది. దాన్ని మనం ఫలానా అని నిర్వచించలేకపోవచ్చు. కాని అందువల్ల కలిగే హృదయస్పందనను కాదనడానికి వీల్లేదు. అదేమో మన హృదయంలో చిరుగుప్త సౌహృదయాలను మేలు కొలుపుతుంది. రమ్యమైన దృశ్యాలకు, మధురమైన శబ్దాలకు ఈ శక్తి సహజం. నన్నయ గారి మాటలకు అంతే. వాటి మాధుర్యం అలాంటిది. అందువల్లనే అవి మంత్రాల్లాగా మనల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి.

నన్నయగారి పద్యాలు చదువురాని వాళ్లని సైతం ఆకర్షించడానికి మరొక కారణం కూడా ఉంది. ఒక భావాన్ని స్ఫురింపజేయడానికి, నన్నయ ఆ భావం యొక్క జీవస్థానాలను సామాన్యుడికి కూడా అర్థమయ్యే మాటల్లోనే మీటుతాడు. అందువల్ల పద్యంలోని సారభూతమైన అర్థం శ్రోతకు సుబోధకంగానే ఉంటుంది. 

"ధారుణి రాజ్యసంపద" అన్న పద్యంలో మదమున కోమలి చూచి, పిలిచిన యిద్దురాత్ముని బాహుగదాభి ఘాతమున, భగ్న ణాంతరంబున అనే మాటలు దుర్యోధనుని పొగరుబోతుతనాన్ని, దాన్ని ఓర్చుకోలేని భీమసేనుడి భీష్మప్రతిజ్ఞను, సామాన్యుడు కూడా అర్థం చేసుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయి. అందులోనూ కోమలిని చూచి పిలిచిన అన్న మాటలు ప్రేక్షకులకు పద్యభావాన్నంతా పిడిచి ఇచ్చేట్టుగా ఉన్నాయి. "కురువృద్ధుల్" అన్న పద్యంలో కూడా ద్రౌపదినట్లు చేసిన ఖలు దుశ్శాసనున్ అన్న మాటలూ, రక్తౌఘము, ఉర్వీపతి చూచుచుండగా, ఆస్వాదింతున్ అన్న మాటలూ, అందులోని భావాన్ని సామాన్యులకు కూడా అనుభవానికి తెస్తున్నాయి.

నన్నయ గారి రచన ఇలా ఉంటుంది. కవిత్వంలో ఇదోరకమైన విద్య. అందులో నన్నయ విశారదుడు. అందుకే తిక్కన ఆయనను గురించి "ఆంధ్రకవిత్వవిశారదుడు" అన్నాడు. నన్నయ కవిత్వం పండితులనే ఉద్దేశించి వ్రాసింది కాదు. సామాన్యులు, పామరులు కూడా విని ఆనందించడానికి వ్రాసింది.


                                                ******

దుర్యోధన ధర్మరాజుల సంవాదం (Duryodhana - Dharmarajula Samvaadam)

లక్ష శ్లోక సంఖ్య గల మహాభారతంలోని ఈ కథ, దుర్యోధన ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణా సన్నివేశమే. వీరిరువురు ఎదురుపడిన సందర్భాలు (యుద్ధ పర్వాలు మినహాయిస్తే) మూడు అంటే ఆశ్చర్యంగా లేదూ? వాటిని కవిత్రయంలోని ముగ్గురు కవులు ప్రస్తావించారు. ఆ సన్నివేశాలసారం చదివేందుకు 5 ని||లు మాత్రం పడుతుందంటే ఇంకా ఆశ్చర్యం కాదా?

పద్దెనిమిది అక్షౌహిణుల సేన (కొన్ని కోట్ల కాల్బలం, రథాలు, గుర్రాలు, ఏనుగులు) తో పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని, వేదవ్యాసమహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం (రమారమి క్రీ.పూ. 3500 లలో) ఆంధ్రమహాభారతకథను లక్షశ్లోకసంఖ్యగా చెప్పాడని, ఈనాటికీ పండితపామరులు అనూచానంగా వింటున్నారు, చదువుతున్నారు. 

ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు, అధర్మానికి ప్రతీకగా దుర్యోధనుడు - వీరి మధ్య సంగ్రామం సంభవించిన కథ అందరూ ఎరిగినదే. వీరిరువురూ ఎదురుపడ్డ సందర్భాలు భారతంలో మూడు మాత్రమే ప్రసిద్ధంగా కనబడుతున్నాయి. (యుద్ధపర్వాలు మినహాయిస్తే)

1. మాయాద్యూత సమయం - సభాపర్వం - నన్నయ కృతం.
2. ఘోషయాత్ర - అరణ్యపర్వం - ఎర్రన కృతం.
3. దుర్యోధనుడు మడుగులో దాగిన సమయం - శల్యపర్వం - తిక్కన కృతం

నన్నయ రచన:

ద్యూతసమయంలో దుర్యోధనుడు ధర్మరాజుతో -

"అనఘ! సుహ్రుదూ్ద్యతం బొందొనరింతము, ప్రొద్దు వోవకయును నగు
జూదంబునకుం ప్రియుడవు దక్షుడవన విందుము నిన్ను బ్రీతి నక్షజ్ఞుల చేన్" అంటాడు.   

పుణ్యాత్మా! ధర్మరాజా! ఇక్కడ స్నేహంగా జూదం ఆడుకుందాం. కాలక్షేపమూ అవుతుంది. పాచికలాడటం బాగా తెలిసినవాడివి; జూదంలో ఆసక్తి గలవాడవని, సమర్థుడవని జూదరులు చెబితే విన్నాను. 

"అనఘ! మా మామ శకుని నాకై కడంగి జూదమాడెడి,
నీ తోడ గాదు నాక, నీతదొడ్డిన ధనరాసు
లెవ్వియైన బోడిగా నీకు నేనీయగలవాడ నేను" అని కూడా చెబుతాడు.

పుణ్యాత్మా! ఓ ధర్మరాజా! నా పక్షాన శకుని నీతో జూదమాడతాడు. కాదని అనకుండా ఇతడొడ్డిన ధనరాసులు ఏవైనా సరే, నీకిస్తాను. 

దీనికి బదులుగా ధర్మరాజు,  దుర్యోధనునితో మోసం, జూదం క్షత్రియధర్మానికి తగినవి కావు సుమా! ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్లు, ఈ రెండింటిని వదిలివెయ్యాలి. రాజు జూదం ఆడడం పాపపుపని, వంచన మార్గాలు అనుసరించే నీచపు జూదరులతో జూదమాడకూడదు. దానివల్ల లోకంలో ఎటువంటి వాళ్లయినా ధనాన్నీ, ధర్మాన్నీ కోల్పోతారు. అంతేకాక కపటద్యూతంలో గెలవటం మహాపాపమని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం ధర్మంగా చేసిన యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడైన దేవలుడు చెప్పాడు అంటాడు.

జూదమాడే కళలో నేర్పరివైన నీవే జూదాన్ని నిందించటం తగునా? జూదమాడటానికి నీవు భయపడితే మానుకొమ్మని శకుని రెచ్చకొట్టగా, "అన్యులకై యన్యులు జూదం బాడుట యెంతయు విషమం" ఒకరికై మరొకరు జూదమాడటం అక్రమమని అంటూ ధర్మరాజు, "బలవదూ్ద్యతార్థముగా బిలువంబడి మగుడనగునె"; బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్లటమా? జూదమాడటం తప్పని తెలిసికూడా, దైవనిర్ణయానుసారం అందుకు అంగీకరించాడు. 

చిత్రమేమంటే ఇంత తెలిసీ, ఇన్ని ధర్మాలు చెప్పీ ధర్మరాజు చివరకు జూదమాడాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని ద్యూతవ్యసనం అంత బలీయం (విధి బలీయం అంటారు గదా !)

ఇక ఘోషయాత్రలో ఎర్రన రచన:

ఇందులో ఒకే పద్యం ఉక్తివైచిత్రికి ఉదాహరణ. పాండవులు ద్వైతవనసరోవర తీరంలో వనవాసక్లేశాలను అనుభవిస్తున్నారని, వారి ముందు కౌరవసంపదను ప్రదర్శించి వారికి మరింత దుఃఖాన్ని కలిగించాలని, దుష్టచతుష్టయం పన్నాగం పన్నింది. 

ఘోషయాత్ర - గోరక్ష నెపంతో  వెళ్లిన దుర్యోధనుడు, చిత్రసేనుడనే గంధర్వరాజు చేత  బంధితుడై, ధర్మరాజు దయాభిక్షతో బయటపడతాడు. భీమార్జునులు గంధర్వులను జయించిన పిదప, పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని బంధాలను ఊడదీయించిన ధర్మరాజు, 

"ఎన్నడు నిట్టి సాహసము లింక ఒనర్పకుమయ్య! దుర్జనుం 
డన్నున సాహసక్రియల యందు గడంగి నశించు కావునం 
గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని యిమ్ముల బొమ్ము వీటికిన్ 
సన్నుత! దీనికొండొక విషాదము బొందకుమీ మనంబునన్" అని చెబుతాడు. 

నాయనా! దుర్యోధనా! ఎప్పుడైనా సరే, ఇటువంటి పరాభవాన్ని చేకూర్చే సాహసకృత్యాలను ఒడిగట్టకు. ఇపుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద భవిష్యత్కాలంలోనైనా బుద్ధి కలిగి ప్రవర్తించుము. 

దుర్జనుడు దురభిమానంతో తన అంతరం, ఎదిరి గొప్పతనం తెలియక, కన్నూ మిన్నూ కానక సాహసానికి కడంగి నశిస్తాడు. జాగ్రత్త సుమా! ఇక శీఘ్రంగా తమ్ములను, దొరలను వెంటబెట్టుకొని నీ రాజధాని నగరానికి వెడలిపో, మంచివారల చేత పొగడబడినవాడా! ఇట్టి అవమానం జరిగినందుకు ఎటువంటి దుఃఖాన్నీ మనసులో పెట్టుకోవద్దు. 

ఎర్రన వ్రాసిన పద్యాలలో ఇది తలమానికం. నన్నయగారి కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థసూక్తి, తిక్కనగారి సంభాషణ చాతురి, సజీవపాత్రచిత్రణ.. ఈ పద్యంలో కనబడుతాయి. ఈ పద్యం అల్పాక్షరముల అనల్పార్ధ రచనకు ఉదాహరణ. వ్యంగ్యంగా (ఎత్తిపొడుపుగా) అర్థాన్ని విశ్లేషిస్తే...

ఎన్నడూ ఇట్టి సాహసాలు ఇకపై ఒనర్పకుమయ్య- ఇక మీద ఇట్టి దుస్సాహసాలు చేయకుము. అనగా ఇంతకు పూర్వం దుర్యోధనుడు ఎన్నో చేసినట్లే కదా! అయితే ఇప్పుడు పాపం బ్రద్దలైంది. ఇటువంటి సాహసాలకే అతడు సద్యః ఫలం అనుభవించాడు, ప్రత్యక్షప్రమాణం నశించటం భావిసూచన.

"క్రన్నన తమ్ములం దొరల గైకొని పొమ్ము వీటికిన్" - ఇక్కడ నీవు పొందిన అవమానం నీ రాజధానిలోని వారలకు తెలియదు కదా! ఈ పరాభవాన్ని దులుపుకొని, ఏమియూ జరగనట్లుగా తిరిగి పొమ్ము, అనగా ఏమి మొగం పెట్టుకొని తిరిగి నీవు పోగలవు? అనే ఎత్తిపొడుపు.

ఇంత అవమానం నిలువెల్లా దహించే దుర్భరమైన అవమానాగ్ని కాదా? ధర్మరాజు పెట్టిన సున్నితమైన చీవాట్లు, దుర్యోధనుని ఆపాదమస్తకమూ దహించి, భావి ప్రాయోపవేశానికి నాందిగా, అతన్ని తేజోహీనుడు గావించింది. అందుకే ధర్మరాజును తిక్కన, "మెత్తని పులి" అన్నాడు.

తిక్కన రచన:

పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత, దుర్యోధనుడు ద్వైపాయనహ్రదంలో దాగి ఉన్నాడని బోయల ద్వారా తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తమ్ములతో, బంధువర్గంతో, శ్రీకృష్ణసమేతంగా వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులూ వ్యాపిస్తూ వుండగా, ఆ సరోవరాన్ని సమీపించాడు. 
దుర్యోధనా! నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు నీకు తప్పుతుందా? లోకంలో ఇట్టి నీచస్థితి నీకు తగునా? శూరుడవేనా? నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేయతగునా? రాజు ధర్మం వదిలితే ఇహపరాలుంటాయా?

యుద్ధంలో కుమారులు, తమ్ములు భయంకరంగా చనిపోగా, చూచినా, నీ బుద్ధి, నీ శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకున్నావు? రారాజు, పాండురాజకుమారుల భుజబల విజ్రుంభణానికి తట్టుకొనలేక మడుగులో దాగినాడట! అని ప్రజలు ఛీ కొట్టరా? చచ్చేటప్పుడు భుజబలదర్పం కూడా తొలగిపోయిందా?

"తెంపు జేసి మా మీద కురుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు పురుషుడవేని దీని ననుష్ఠింపు మనిన" - సాహసంతో మా మీదికి యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీన్ని ఆచరించు. మగటిమి కలవాడివైతే దీన్ని చేయుమని పలుకగా, దుర్యోధనుడు ధర్మరాజుతో, 18 రోజుల యుద్ధంలో అలసట చెంది, విశ్రాంతి కైకొన్నాను తప్ప యుద్ధభీతి కాదు. తనవారితో కలిసి అనుభవించదగు సుఖమే సుఖం గానీ, అదిలేనిచో రాజుకు అది రాజ్యమూ కాదు, ఆ సుఖము సుఖమూ కాదు. నీ సోదరులు, సేవకులు అందరూ బ్రతికే ఉన్నారు. ప్రపంచాన్నంతటినీ నీవే ఏలుకొమ్ము. "ఏనింక సమర మొల్లను మహీనాయక, నీక యుర్వినెల్ల నిచ్చితి శాంతిం, గానకు జని వల్కలపరిధానుడనై తపమొనర్చెదను మునుల కడన్" అంటాడు.

"ఓడివచ్చినాడ నుద్ధతి నాకేల? యుడుకు మాని నీవ యుర్వియేలు గుర్రములను ఏనుగులు లేని బయలు నీ తలనె కట్టికొనుము ధర్మతనయ!" నాకిక యుద్ధం వద్దు. ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను. శాంతంగా అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారచీరలు కట్టుకొని తపస్సు చేసుకొంటాను. ఓడిపోయి వచ్చాను, నాకెందుకయ్యా గర్వం? ఈ భూమిని నీవే పాలించుకొమ్ము. గుర్రాలూ, ఏనుగులూ లేని ఈ బీడును నీ నెత్తి మీదే కట్టుకొమ్ము.

దానికి ధర్మరాజు, ఈ ప్రలాపనలెందుకు గాని, ధర్మం ఎంచి యుద్ధానికి లెమ్ము. నీ ఈ దానమును రాజైన నేను అంగీకరించను. యుద్ధంలో నిన్ను చంపి భూమిని పాలిస్తాను. వైరులకు సంపదనిస్తాననే వెర్రివాడుంటాడా? అంటాడు.

దీనికి దుర్యోధనుడు మీ ఐదుగురు సేనలతో, బంధువులతో, అఖిలాస్త్రశస్త్రాలతో ఉన్నవారు. నేనా ఒక్కడను, తోడు లేనివాడను, అనేకులు ఒక్కడితో యుద్ధం చేయటం న్యాయమా? అని అడుగుతాడు.

ఇందుకు ధర్మరాజు దుర్యోధనా! యుద్ధంలో నిన్ను మా పక్షం నుండి ఒక్కడే ఎదిరిస్తాడు. అతడి గర్వాన్ని నీవు అణచగలిగితే ఈ రాజ్యాన్నంతా నీవే గ్రహించి దాని వైభవాన్ని అనుభవించుము. చివరి మాటగా, "ధర్మసుతు డాతనితో గద నొక్కరుండ నే గొనియెద నీదు ప్రాణములకుంఠితబాహువిలాసభాసినై" అని రెచ్చగొట్టాడు.

దుర్యోధనా! అకుంఠితభుజశక్తితో ప్రకాశిస్తూ గద గొని, నేనొక్కడినే నీ ప్రాణాలు తీస్తానని పలుకగా, "బుట్ట లోపలి మహాభుజగేంద్రుడు రోజునట్ట రోజె నధిప! యవ్విభుండు తన చిత్తము నప్పలుకుల్ గలంచినన్"- తన మనసును ధర్మరాజు మాటలు కలతపెట్టగా, దుర్యోధనుడు పుట్టలోని పెనుబాము బుసకొడుతూ రోజినట్లుగా బుస కొట్టాడు.

వెంటనే దుర్యోధనుడు జలస్తంభస్థితిని వదిలి నీటిమడుగు అల్లకల్లోలం కాగా, కులపర్వతం వలె ఒప్పారి, భయంకరాకారుడై గదాదండాన్ని తన భుజపీఠం మీద పెట్టుకుని వెడలి వచ్చాడు.


                                              *****

ధర్మబద్ధుడు పాండురాజు (Dharmabaddhudu Panduraju)

కురువంశము ప్రతిష్ఠింప, ధర్మసంపన్నుడై పాండురాజు అంబాలికకు వ్యాసుని వలన జన్మించాడని భారతకావ్యం చెప్తున్నది.

తాను రాజైయ్యు అంధుడైన అన్నగారిని ఆదరించి, గౌరవించి, ఆయనదే రాజ్యమన్నట్లు నడచుకొన్న తమ్ముడు పాండురాజు. వికలాంగుడైన అన్నను గౌరవించి, అతని పేరుమీద అన్ని వ్యవహారములు నడుపు తమ్ములు నేడు ఎందరున్నారు?

శాపగ్రస్తుడైన పాండుమహారాజు భార్య మాద్రి కౌగిలిలో ప్రాణాలు వదలడం ఎంత దురదృష్టకరం, ఎంత హృదయ విదారకమో, ఊహించండి.
నిండు యౌవనంలో ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యకరంగా లేదూ? మరి సప్తవ్యసనాలలో ఒకటైన వేటకు బానిసైన వ్యక్తి జీవితగాధ ఎంతో ఉత్కంఠభరితం.

మహాభారతంలో అనురాగమున్న అన్నదమ్ములు ధృతరాష్ట్రపాండుభూపతులు. తాను రాజయ్యు, అంధుడైన అన్నగారిని ఆదరించి, గౌరవించి, ఆయనదే రాజ్యమన్నట్లు నడుచుకొన్న తమ్ముడు పాండురాజు. రాజ్యము తనకు రాకపోయినను తమ్ముని ప్రభుత చూచి ఆనందించిన అన్న ధృతరాష్ట్రుడు.

వికలాంగుడైన అన్నను గౌరవించి అతని పేరు మీదనే అన్ని వ్యవహారాలు నడుపు తమ్ములు నేడు ఎందరున్నారు?
పాండురాజు అఖిలాస్త్రశస్త్రవిద్యలను గడించి విస్తృత దండయాత్రలు చేసి అపారధనరాసులు తెచ్చి ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. మిత్రులకు అనుకూలంగా ఉంటూ, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపటంతో దిక్కులేనివాళ్లకు, భయం లేకుండా చేయటంతో ప్రజలకు, సంతోషం కల్గించేవాడు.

పాండురాజు వంశకర్త. భావిచక్రవర్తుల వర్తనవిధిని ఆదర్శంగా ఆచరించి చూపించాడు. పాండురాజు తన వంశాన్ని, కుటుంబాన్ని సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఆదర్శవంతంగా ఉంచటానికి తన శక్తియుక్తులన్నీ ధారపోయగా, వంద అశ్వమేధాలు చేసిన ధృతరాష్ట్రుడు వంశవిచి్ఛతి్తకి దోహదం చేశాడు. పాండురాజు ప్రవర్తిల్ల చేసిన ఉదారచరిత్రను పాండవులు కొనసాగించారు. అందువలననే పాండవులు వంశోద్ధారకులైనారు. ధార్తరాష్ట్రులు నశించారు.

ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగి వేసారిపోయాడు. ఒకచోట రెండు మృగాలు క్రీడిస్తుంటే (కిందముడనే ముని, తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు), చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడు పాండురాజు వేసిన బాణాలు తగిలి చనిపోతూ, "నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపొతావు. నీ భార్య కూడ చనిపోతుంది" అని శపించి, ఆ ఋషిదంపతులు కన్ను మూశారు. పాండురాజు విషణు్ణడయ్యాడు. విరక్తుడు కూడా అయ్యాడు.

ఎంత సామా్రజ్యమున్ననేమి? ఎంత ఐశ్వర్యమున్న, ఎన్ని దిగ్విజయయాత్రలు చేసినా, ఎంత యౌవనమున్ననేమి? అనుభవయోగ్యలైన భార్య లెందరున్ననేమి? ఒక పురుషుడుగా అతని బ్రతుకు వ్యర్థమైనది.

పాండురాజు పెక్కు దానములు చేసి, తక్కిన సర్వమును ధృతరాష్ట్రునకు వదిలి మమత్వాహంకారవిముక్తుండై ధర్మపత్నులిరువురును తనపట్ల తపస్వినులై తోడురాగా ఆశ్రమవాసమునకేగినాడు.

అడవులకు వెళ్లునాటికి పాండురాజునకు పుత్రులు కలుగు అవకాశమే లేదు. శాపస్వభావ మట్టిది. అందుచేత మున్ముందు వచ్చు రాజ్యవారసత్వ విషయము ఆలోచింపవలసిన అవసరం గాని, ఆలోచింపగలిగిన మానసిక స్థితి గాని ఆ మహారాజునకు ఆనాడు లేదు.
శతశృంగ పర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లే దారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని వారు నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ క్రుంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. అన్ని లోకాలు ధర్మం మీదనే స్థిరంగా నిలుస్తాయి. ధర్మదేవతను స్మరించుము. దేవతలలో ధర్మంలోను, సత్యంలోను అతడే పెద్దవాడు అన్నాడు.

"విశ్వం ధరతీతి ధర్మః" - లోకాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మానికి అధిదేవత ధర్ముడు. అతడిని స్మరించి సంతానాన్ని పొందటంలో పాండురాజు విశ్వశ్రేయోభిదృష్టి వ్యక్తమవుతుంది. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరటం ఉత్తమ గృహస్థు ధర్మం. పుట్టబోయే కొడుకు మూర్తికట్టిన ధర్మం కావాలని పాండురాజు సంకల్పం.

దిక్కులన్నీ వెలుగగా, చంద్రుడు జే్యషా్ఠనక్షత్రంతో కూడి ఉచ్ఛస్థితిలో ఉండగా, సూర్యాదిగ్రహాలు శుభస్థానాలలో ఉండగా అష్టమినాడు అభిజిన్ముహూర్త ప్రారంభంలో ధర్మదేవత అంశ చేత, శత్రువులను జయించగల పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు. (లోకాన్ని ధరించే ధర్మమే మూర్తి కట్టినవాడు). అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. ఆకాశవాణి ఇలా పలికింది - "ఇతడు కురుకులదీపకుడౌతాడు. ధర్మస్థిరమతి కావటం చేత "యుధిష్ఠిరుడు" అని పిలువబడతాడు".

పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని, వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్వుడైన కుమారుని పొందుమని అడిగాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన, విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి "భీమసేనుడు" అని పేరు పెట్టింది.

అదేరోజున హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్నీ, లోకాన్నీ నాశనం చేయగల దుశ్శకునాలు ఎన్నో పొడసూపాయి. అందరూ భయవిహ్వలులైనారు. కులనాశకుడైన దుర్యోధనుని ఒక్కడిని విడువుమని పెద్దలు ధృతరాష్ట్రునకు సూచించారు. అతడు పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు.

అన్నకు వందమంది పుత్రులు కలిగారని తెలిసి, పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు ఏకపాదం మీద నిలువబడి ఒక సంవత్సరకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేసాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై "శత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు నీకు కొడుకుగా పుడుతా"డని వరమిచ్చాడు. కృతార్థుడైన పాండురాజు, కుంతీదేవిని దేవేంద్రుని ఉపాసించమని కోరాడు. ఆమె అట్లాగే ఆరాధించింది. స్థిరపౌరుషుడు, లోకోత్తరుడు, వంశాకరుడు అయిన పుత్రుడు ఇంద్రాంశతో పుట్టాడు. ఆ సమయంలో దేవతలు, ఆ బాలుని భావికార్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్గునీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని ఫల్గునుడనీ, అర్జునుడనీ పిలిచారు.

ఆ విధంగా, ధర్ముడిని ఆరాధించి సత్యాన్ని, ధర్మాన్ని, సర్వలోకంలో నిలుపగలవాడుగా మొదటి కొడుకు  ధర్మరాజుగా పొందాడు (లోకరక్షణ కొరకు). మహాబలశాలి అయిన భీముని వంశరక్షణ కొరకు రెండవవాడుగా పొందాడు.

త్రిలోకవిజయుడైన పుత్రుడు మాత్రమే ధార్తరాష్ట్రులకు దీటుగా నిలిచి పాండవప్రాభవాన్ని, లోకాధిపత్యాన్ని నిలుపగలడని పాండురాజు, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వరంతో మూడవ కొడుకును పొందాడు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడులోకాలు జయించినట్లు పొంగిపోతుండేవాడు. మాద్రి కోరికపై కుంతిని ఒప్పించి దుర్వాసుని మంత్రప్రభావంతో మాద్రి చేత అశ్వినీదేవతలను ఆరాధింపచేసి కవల పిల్లలను పొందగలిగాడు. వారే నకులసహదేవులు. సౌందర్యపరాక్రమాలలో సాటిలేనివారు. ఇట్లా పంచపాండవులు పుట్టి శుక్లపక్షచంద్రబింబాలవలె పెంపొందుతూ ఉన్నారు.

అంతలో ఒక విపత్తు, వసంత ఋతువు వచ్చింది. ప్రకృతి శోభ మానవహృదయాలను ఉప్పొంగజేస్తున్నది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాద్రి ఒక్కతే పాండురాజు పక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం, వసంతప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది.

"చారు సువర్ణహాసి నవచంపకభూషయు సింధువారము
క్తార రమణీయయున్ వకుళ దామవతంసయునై యపూర్వశృం
గారవిలాసలీల యొసగన్ తన ముందట నున్న మాద్రినం 
భోరుహ నేత్ర జూచి కురుపుంగవు డంగజ రాజుమత్తుడై"

-అందంలో బంగారాన్ని మించిన క్రొత్త సంపెంగపువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలిపూలనే ముత్యాల చేత మనోహరమైనదై, పొగడ దండలు చెవి ఆభరణాలుగా కలదై, అంతకు ముందెన్నడూ లేని శృంగారవిలాసంతో, తన ముందున్న కమలాల వంటి అందమైన కన్నులు గల మాద్రిని చూచి కురుశ్రేష్ఠుడైన పాండురాజు మన్మథరాగవశుడై-

సహజంగానే సౌందర్యవతి అయిన మాద్రికి వసంతపుష్పాలంకారాలు (సంపెంగలు, వావిలిపూలు, పొగడలు) అమితమైన శోభను కల్గించాయి, ఆమె రూపం ఆనాడు పాండురాజునకు మత్తెక్కించింది.

పాండురాజు కిందమ ముని శాపం మరిచాడు. ఆ శాపం గుర్తున్న మాద్రి, ఎంతో భయంతో, దుఃఖంతో, తనను వారిస్తున్నా బలాత్కారంగా ఆమెతో సంభోగసుఖాన్ని పొందగోరి కౌగలించుకొని ప్రాణాలు కోల్పోయాడు.

"ఎట్టి విశిష్టకులంబున బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్ గల్గిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురే మనుజుల్"

-మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచిచెడ్డల గురించి పరిజ్ఞానాలు కలిగి ఉన్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు!

విధి కంటే కర్మ బలీయమని సుభాషితం. ఫలం కర్మాధీనం కాబట్టి దేవతలతోను, దైవంతోను మాకేమి పని? దేవతలకు కూడా శక్యం కాని కర్మకే నమస్కారం అంటాడు భర్తృహరి.

           
                                         ******

భగవంతుడు మెచ్చిన భీష్మాచార్యుడు (Bhagavanthudu Mecchina Bheeshmacharyudu)

మహాభారత కథలో ప్రతిష్ఠాత్మకమైన పాత్ర భీష్మునిది. గంగాశంతనుల కుమారుడైన దేవవ్రతుడు, తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారుడిగా ఉండిపోతానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. ఇచా్ఛ మరణం వరంగా పొంది, కాలం యొక్క ప్రాముఖ్యమును (ఉత్తరాయణ పుణ్యకాలం) లోకానికి తెలియజేశాడు.

అష్టమ వసువు అంశతో జన్మించినవాడు భీష్ముడు. పుట్టగానే శిశువును తీసుకువెళ్లిన గంగాదేవి యౌవనుడైన కుమారుణ్ని తండ్రికి అప్పగిస్తూ ఓ రాజా ఇతడు వశిషు్ఠని వద్ద వేదాలను పూర్తిగా నేర్చుకున్నాడు. శుక్ర, బృహస్పతులు నేర్చుకున్న సకల ధర్మశాస్త్రాలను నేర్చాడు. శ్రేష్ఠమైన అస్త్రాలను ప్రయోగించడంలో పరశురామునితో సమానుడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదులంతటి పుణ్యాత్ముడు, అని భీష్ముని సుగుణాల గురించి వివరిస్తుంది.

ఉత్తరగోగ్రహణ యుద్ధ సమయంలో అర్జునుడు ఉత్తరునికి తన తాత భీష్ముని పరిచయం చేస్తాడు:
"మా తాత అయిన భీష్ముడు గొప్ప పరాక్రమం గలవాడు. శత్రు పక్షాన ఉన్న గర్వమనే అరణ్యాన్ని తన ప్రతాపాగ్నిజ్వాల చేత భస్మీపటలం చేయగల సమర్థుడు. కురుపాండవుల హితం కోరేవాడు. ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. కాబట్టి కౌరవులకు సహాయపడుతున్నాడు. అంతేగాని ప్రత్యేకించి కౌరవ పక్షపాతి మాత్రం కాడు" అని అంటూ తమ తాత భీష్ముని మంచితనాన్ని తెలుపుతాడు అర్జునుడు.

కౌరవ సైన్యాధ్యక్షునిగా పదిరోజులు పోరాడిన తరువాత భీష్ముడు జీవితంపై విరక్తి చెందుతాడు. అందుకే తన ఇష్టానుసారం మరణించే వరాన్ని పొందిన భీష్మాచార్యుడు తనను చంపమని అడిగి మరీ హత్య చేయించుకున్నాడు. పాండవులకు తన పరాజయ రహస్యం తెలిపి తనువును అంపశయ్యపై దాల్చి, త్యాగమయ చరిత్ర సృష్టించిన మహామనీషి.

పాండవులతో సంధి చేసుకుని సౌఖ్యంగా జీవించుమని భీష్ముడు కౌరవులకు చేసిన విజ్ఞప్తి బూడిదలో పోసిన పన్నీరయింది.

శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు తన ధర్మజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధిస్తాడు.

కన్నుమూసే క్షణంలో శ్రీకృష్ణుని సంబోధిస్తూ భీష్ముడు - 

"బలము నీవ నాకు, భక్తుడ నీయెడ
ఆలుబిడ్డలు లేని యట్టివాడ
కావు నన్ను అధిక కారుణ్యమున
నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞ నయన"

ఆ మూగ వేదన ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా పొరపాటునైనా బయటకు రాలేదు. అంత జాగ్రత్తగా బ్రతుకు వెళ్లదీసుకున్న భీష్ముడు చివరి క్షణంలో భగవంతుని ముందు తన చిత్తంలో అట్టడగు పొరకింద ఉన్న అనుభవైక్య వేద్యమైన జీవన సంస్కార లక్షణాన్ని బయటకు తీశాడు. భార్యాపిల్లలు లేని జీవిత దుర్భరత్వాన్ని భీష్ముడు అనుభవించాడు. జీవితం పరిపూర్ణం కావడానికి ఆలుబిడ్డలు కావలెనని భావించాడు. భీష్ముని కంటే ఆత్మజ్ఞాని ఎవరు?

ఇంతటి మనోవేదనకు కారణమేమై ఉండవచ్చు? సకల రాజ సమక్షంలో నిండుసభలో రాజసూయ యజ్ఞానంతరం శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ పలికిన పలుకులే, ఆయన జీవిత పర్యంతం వెంటాడి ఉంటాయి.

"జన నిందితమైన నీ యందనపత్యత 
యను యధర్మమది యుండగ
ధర్మనివృత్త చరిత్రక, నీయనుశాసన 
మెట్లు నమ్మనగు జనములకున్"

"భీష్మా! సంతానం పొందడం అనే ధర్మం నీలో లేదు. కాబట్టి బిడ్డలను పుట్టించలేనివాడివైన నీ ఆజ్ఞను జనులెట్లా శిరసావహిస్తారు?"

సంస్కృత భారతంలో-
"మోహంతో వీరంతా నిన్ను ధర్మజ్ఞుడంటారు. మహాప్రాజ్ఞుని వలె బ్రహ్మచర్యమనే మిషతో నీ తమ్ముని భార్యకు నీవుగాక ఇతరుడు పుత్రులను కన్నాడు (వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండురాజుల జననం). ఇది, ఒక మహాబ్రహ్మచర్య నిష్ఠయా? మోహం వల్లనో, నపుంసకత్వం వల్లనో బ్రహ్మచర్య నిష్ఠను పూనావు, కాని ధర్మములను తెలుసుకుని, వాటిని అనుసరించేవాడివై ఈ దీక్షను చేపట్టిన వాడివికావు. కాబట్టి నీవు సాధువుల సేవచేసి పెద్దల వలన బుద్ధులను పొందలేదు. దానము, అధ్యయనము, యజ్ఞాచరణ, వ్రతానుష్ఠానం, ఉపవాసాలు సంతానము కలుగుటలో పదహారవపాలు కావు. సంతతి లేనివారి ధర్మబోధ నిరర్ధకం" అని శిశుపాలుడు భీష్ముని నిందిస్తాడు.

తాత్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియ నిగ్రహం, ఇన్ని సులక్షణాలు రాశి పోసుకున్న కారణంగా భీష్ముడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. ధర్మానికి, భక్తికి, సనాతన దివ్యజీవనానికి ఆచార్యుడు అయ్యాడు. యావద్భారత జాతి సంస్కరింపదగినవాడు భీష్ముడు. అందుకే ఆయన పేరున ఒక పర్వమే ఏర్పడింది.

భీష్మ పితామహుని పతనానంతరం ధర్మరాజు...

"అకట తండ్రి సచ్చినంత నుండియు మమ్ము నరసి బ్రోచినట్టి యనుగుతాత 
జంపమదిదలంచుతెంపు చూచితె రాజధర్మ మింత క్రూరకర్మమగునె" అంటూ వాపోతాడు.

ధన్యజీవి భీష్ముడు. అల్పుడైన శిశుపాలుని దృష్టిలో భీష్ముని త్యాగం ఎటువంటి విపరీత అర్థాలకు బీజమయిందో విజ్ఞులే నిర్ణయించాలి.


                                                 ******

కర్మఫలం..కర్ణుడు (Karmaphalam..Karnudu)

మహాభారత కావ్యం మొత్తం మూడు విషయాలపై వ్యక్తుల ప్రామాణికతను నిర్ణయిస్తున్నది. 
1. అభిజాత్యం,  2. సంస్కారం,  3. దైవీసంపత్తి.  
కర్ణుని విషయానికొస్తే కర్మసాక్షియైన సూర్యభగవానుడే తండ్రి, అయినా సంస్కారవంతుడు కాలేకపోయాడు. దుష్టచతుష్టయంలో ప్రముఖ పాత్ర వహించాడు. దైవీసంపదకు దూరమయ్యాడు. విధి వక్రించడం చేత అయ్యో పాపమనిపించే మరణం పొందాడు. 

కర్ణుని మరణానికి కారణాలు ఎన్నని, ఎందరని లెక్కపెట్టగలం? ఆంధ్రమహాభారత శాంతిపర్వంలో నారదుడు ధర్మరాజుతో వినుము నరేంద్ర అంటూ చెప్పిన కారణాలు ఇవి...
1. విప్రుడలిగెన్, 2. జమదగ్నిసుతుండు శాపమిచ్చె, 3. అమరభర్త వంచనము సేసె, 4. వరంబని కోరి కుంతిమాన్చె నలుక, 5. భీష్ముడర్ధరథుజేసి యడంచె, 6. కలంచె మద్రరాజు నుచితమాడి (శల్యుడు), 7. శౌరి  విధియయ్యె, 8. నరుండటు జంపె కర్ణునిన్.

కర్ణుడు పుట్టుక నుంచే దురదృష్టవంతుడు. కన్న తల్లి గంగపాలు చేసింది. అఖండ భూమండలాధీశ్వరుడు కాదగిన యోగ్యతలు ఉండి సూతపుత్రుడుగా పెరగవలసి వచ్చింది. పరశురామ శుశ్రూష శాపాన్ని ప్రాప్తింపజేసింది. అస్త్రవిద్యాసాధన బ్రాహ్మణ శాపమును సంక్రమింపజేసింది. దానవ్రతము కవచకుండలములను తొలగించింది. యుద్ధంలో కూడా దురదృష్టమే కర్ణుడ్ని వెంటాడింది. నరునిపై వేసిన నాగాస్త్రం శల్యసారథ్యం వల్ల గురితప్పినది. భార్గవాస్త్రము బుద్ధికి స్ఫురింపలేదు. రథచక్రము భూమిలో క్రుంగిపోయింది. చివరకు అయ్యోపాపమనిపించే మరణం పొందాడు కర్ణుడు. విషాదాంత నాయకులు అవివేకులు కారు, అసమర్థులు అంతకంటే కారు. కర్ణుడెంత సమర్థుడో అంత వివేకి. పైగా స్వశక్తితో సూతపుత్రస్థితి నుండి రారాజు అర్ధాసనమలంకరించే స్థితికి వచ్చినవాడు. పరిస్థితుల ప్రాబల్యం, కౌరవ పక్షాన కట్టిపడేసినా ధర్మజుని ధార్మికతను, శ్రీకృష్ణుని ప్రాపున పాండవ విజయమును తెలియనివాడు గాడు. 

రాయబారం విఫలమైన తర్వాత శ్రీకృష్ణుడు వెనుదిరిగి వెళ్తూ రాధేయుని తన రథమెక్కించుకున్నాడు. ఏకాంతంలో అతని జన్మరహస్యం చెప్పాడు. సార్వభౌమ యోగం, పాంచాలి పొందు దొరుకుతాయని ఆశపెట్టాడు. పాండవ పక్షానికి రమ్మని పిలిచాడు. దానికి కర్ణుడు శ్రీకృష్ణునితో "ధర్మరాజు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహించడు. కానీ అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ పుడమికంతటికి చక్రవర్తిగా పాలించడం న్యాయం కదా? కృష్ణా, ధర్మజుడు తన తమ్ముళ్లు నలుగురూ యజ్ఞం చేయించే యాజకులు కాగా, ఈ పని ఇట్లా చేయండి అని యజ్ఞకర్మలలోని గుణదోషాలను కనిపెట్టే ఉపద్రష్టవు నీవు కాగా, కౌరవులనే యజ్ఞపశువులను చంపుట ద్వారా యుద్ధమనే యాగాన్ని సంప్రీతితో చేస్తాడు. ఈ సమర యుద్ధాన్ని ఈదుకుంటూ వెళ్లి, మీ విజయాన్ని స్వర్గం నుంచి చూసి ఆనందిస్తాను. నా మాట మన్నించు" అని వేడుకున్నాడు. 

ఫలం కర్మాధీనం

పెంచి పెద్ద చేసిన రాధ, అతిరథుల పట్లనున్న పుత్రధర్మం, అంగరాజ్యమిచ్చి ఆదరించి తననింత వాడిని జేసిన సుయోధనుని మీద స్వామి భక్తి. చివరికి సార్వభౌమ యోగాన్ని కాలదన్నాడు. సోదర ప్రేమను జయించాడు. ఇంత వివేక ఉదాత్త గుణసంపన్నుడైన కర్ణుడు జీవితాన్ని ఎందుకు విషాదాంతం చేసుకున్నాడని సందేహం కలుగకమానదు. అందుకు కారణాలు అతని వైయక్తిక లోపాలే. అర్జునుడంటే మాత్సర్యం, స్వాతిశయం, దురదృష్టజాతకం వెన్నంటాయి.

"ఎట్టివిశిష్ఠ కులంబున బుట్టియు సదసద్వివేకంబులు గల్గియున్ 
మును గట్టిన కర్మఫలంబుల నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్"

మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచి చెడ్డలను గురించిన పరిజ్ఞానం కలిగివున్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదన్నమాట అక్షర సత్యమే కదా. "ఫలం కర్మాధీనం, దేవతలతో దైవంతో మాకేం పని? దేవతలకు కూడా తప్పించుకునే వీలులేని కర్మకే నమస్కారం" అంటాడు భర్తృహరి. కర్ణుని జీవితం అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. 


                                             ******

Sunday, November 18, 2012

గాంధారి (Gandhari)

భారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారి విశిష్ఠ పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెకు మానసిక క్షోభ నిరంతరం వెన్నంటింది. గాంధారి విధివంచిత, జాత్యంధుడైన భర్తను పితృవచన దత్తగా స్వీకరించి కళ్లకు గంతలు (నేత్రపట్టము) కట్టుకున్నందువలన సాధించిన ప్రయోజనము తెలియరాదు. పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే, కన్న 101 సంతానానికి మంచిచెడ్డలు ఎవరు బోధించాలి? బిడ్డకు కన్నతల్లి ప్రథమగురువు అంటారు. ఆమె ఆ బాధ్యత నేరవేర్చిందా?

అరణ్య మధ్యలో కార్చిచ్చుకు ధృతరాష్ట్ర దంపతులు ఆహుతి అయ్యేంతవరకు ఆమె మానసిక అంధురాలు. పుత్రులపై మమకారాన్ని చంపుకోలేక వారి మరణానికి దోహదపడ్డ దంపతులు వారు.
 
"ఆ చావు సావదగు ఆ న్నీచునకున్"

ఆ నీచునికి (అధముడికి) అట్లాంటి చావు తగినదే. కురుసార్వభౌముడైన దుర్యోధనుని గురించి స్వయంగా కన్నతల్లి గాంధారి భీమునితో అన్న మాటలివి.
ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు?
దుర్యోధనుడు కల్యంశమున పుట్టిన అసూయ, క్రోధదురభిమానాలున్న వ్యక్తి. పాండవుల తేజోవైభవముల మీద అతని కేర్పడిన అకారణ అసూయాద్వేషములే కౌరవ నాశనమునకు, సంఘవినాశనమునకు కారణభూతములైనవి.

బిడ్డలకు ప్రథమగురువు తల్లి. తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టము గట్టుకుని త్యాగమయ జీవితము గడిపినందువలన ఒనగూడిన ప్రయోజనము ఏ మాత్రమూ భారతమున కానరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై బడింది. శకుని కుటిలబుద్ధి అతనిని ఆత్మీయుడుగా చేసింది.

శాస్త్రాన్ని పరిశీలిస్తే..
- "ఉత్తమా ఆత్మనాఖ్యాతాః" స్వయంకృషితో వృద్ధిలోనికి వచ్చేవాడు ఉత్తముడు.
- "పిత్రు ఖ్యాతాశ్చ మధ్యమా" తండ్రివలన వృద్ధిలోనికి వచ్చేవాడు మధ్యముడు.
- "మాతులాశ్చాధమా" మేనమామ వలన ఉన్నతి సాధించేవాడు అధముడు.
- "శ్వశురా శ్చాధ మాధమా" పిల్లనిచ్చిన మామ వల్ల వృద్ధిలోనికి వచ్చేవాడు అధమాధముడు.

నేటి కలికాలంలో వీరి సంఖ్యే సమాజంలో అధికమవుతున్నది. ఏకాంతంలో మామ శకునితో, దుర్యోధనుడు "పాండవలక్ష్మిని ఎలా అపహరించాలి?" అని ప్రశ్నిస్తాడు. సూర్యతేజస్సుతో సమానమైన ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా మోసపు జూదమనే నెపంతో నీకు అపహరించి ఇస్తానని మాట ఇస్తాడు. ధర్మజుని ద్యూతవ్యసనం అనుకూలించటంతో దుర్యోధనుని అసూయ చల్లబడింది.

గాంధారి నూర్గురు పుత్రుల కన్నతల్లి. కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, గారాల కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు సింధు దేశాధిపతి, భర్త కురుసార్వభౌముడు. తాను రాజమాతగా కలకాలం తరగని దీప్తితో, సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి, దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది?

కోడలిని వేదవ్యాసుల వారు, గురుసారధీర బుద్ధి (విచక్షణతో కూడిన జ్ఞానం) కలిగినదని, అతిశాంతచిత్త, ధైర్యవంతురాలని కీర్తించాడు. జాత్యంధుడైన భర్తను పితృవచనదత్తగా స్వీకరించిన దొడ్డ ఇల్లాలు గాంధారి.

కుంతివలె కుమారులను గాంధారి పెంచలేదన్నది అక్షరసత్యం. కాని ఆమె తానుగా తీసుకున్న నిర్ణయం (నేత్రపట్టం) వెనుక, సంసారభారాన్ని ఎలా ఈదగలగాలని తలచిందో భారతంలో తెలియని అగాధ భాగంగా మనకు తోస్తున్నది.

వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోకముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్నెరిగిన వాడు కృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.

దుర్యోధనునకు అనునయవాక్యములు, ధర్మప్రపన్నాలు, ఒంటబట్టకపోయినా, కన్నతల్లిగా ఆమె ఆవేదనను లోకం గుర్తింపకపోలేదు. దుర్యోధనునకు హితము చెప్పుమని భర్త తన్నర్ధించినపుడు -

"నీ పుత్రు డవినీతు డగుట యెరిగి ఎరిగి వాని వశంబున నేల పోయెదీవు?
పాండవులకు నేమి యిచ్చి తేని యడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప" అని నిలదీసి భర్తను ప్రశ్నించిన గాంధారి, కురుసార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధము ప్రకటించిననాడే నేత్ర పట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించకల్గిన మాతగా జీవించి ఉంటే, భారతకథ ఏవిధంగా ఉండేదో కదా?
ఆమె కుమారుడు అధముడెందుకు కాగలిగాడో పాఠకులే నిర్ణయించాలి.

                                         *****

దుర్యోధనుడు (Duryodhanudu)

స్థూలంగా సప్తవ్యసనాలు లేని వ్యక్తిగా మనకు మహాభారతంలో ఈయన గోచరిస్తాడు. కాని ఈ మహానుభావునికి ఉన్న ఒకే ఒక దుర్గుణం అసూయ. అది తల్లి నుంచి ఆయనకు సంక్రమించింది. తనకు లేదన్నది గాదు ఈయన బాధ, అవతలి వానికి ఉన్నదే అన్న వ్యథ పట్టి పీడిస్తుంది. మరణించిన వ్యక్తిగా ఈయన మహాభారతంలో కనబడతాడు. సంతాపసభలో ఈ సార్వభౌముని గురించి రెండు మంచి మాటలు చేబుతామంటే మొత్తం కావ్యంలో కాగడాతో వెదకినా దొరకడం చాలా కష్టం. ఒకవేళ వాటిని గురించి చేబుతామన్నా శ్రోతలు సమర్థించరు. సూక్ష్మంగా అన్నీ తెలిసిన మూర్ఖుడుగా ఈయన మహాభారత కావ్యంలో దర్శనమిస్తాడు. 

దుర్యోధనుడు అసూయాగ్రస్తుడు. తల్లి గర్భము నుండియే దుర్యోధనునకు అసూయాక్రోధములు, దురభిమానము సంక్రమించినవి. కల్యంశమున గాంధారీ ధృతరాషు్ట్రలకు అగ్రజుడుగా జన్మించాడని వ్యాసభారతం చెబుతున్నది.

బాల్యమాదిగా దుర్యోధనుడు మహారాజుకుమారుడుగా, 99 మంది తమ్ములకు అన్నగా, కాబోయే యువరాజుగా, భావి మహారాజుగా మన్ననలందుకొన్నాడు. మహావైభవంతో పెరిగాడు. పాండవుల హస్తిన ప్రవేశంతో పరిస్థితులు తారుమారైనవి. ఒక్కసారిగా ప్రజల, కురువృద్ధుల, కృపద్రోణాచార్యుల దృష్టి పాండవులపై మరలింది. పాండవులను, చదువులలోను, ఆటపాటలలోను అతిశయించుట అసాధ్యమని తెలిసింది. భీమునితో సమ ఉజ్జీ కాగల మల్లయుద్ధప్రావీణ్యం తాను సంపాదించుకున్నా, అద్వితీయ ధనుర్విద్యాపారంగతుడైన అర్జునునకు సాటిరాగల వీరుడు, తన పక్షాన లేడని దిగులుపడ్డ తరుణంలో కర్ణుని ప్రవేశంతో దుర్యోధనునకు కొండంత ధైర్యం కలిగింది. అంగరాజ్యమిచ్చి ఆదరించినాడు. శాశ్వతస్నేహాన్ని మహీనుతముగ పాటించి, కృతజ్ఞతాబద్ధుని గావించుకొన్నాడు. అర్జునుని వలన భయం తొలిగి ఆనాటి నుండి నిశ్చింతగా నిద్రించాడు.

నాటి కర్ణదుర్యోధనుల మైత్రి, కురుపాండవ కక్షలను ఘనీభవింపజేసి, మహాభారత కథాగమనమునే మార్చివేసింది. కురు మహాసంగ్రామానికే పునాదులు వేసింది. తుదకు శ్రీకృష్ణరాయభారం కూడా విఫలమైంది.

"ఏమును వారు, బంచికొని యేలుట కల్గదు, పల్కకుండు మిం
కేమియు వాడి సూదిమొన యించుక మోపిన యంతమాత్రయున్
భూమి యొనర్చి పాండునృపపుత్రుల కిత్తునె? యెవ్వరైన సం
గ్రామమునన్ జయంబుగొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్" అని ఖండితంగా సభలో తేల్చి చెప్పినాడు. సంధి విఫలమై మహాభారత సమరం సిద్ధమైంది.

11 అక్షౌహిణుల సైన్యానికి అధిపతిగా భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, కృపాశ్వత్థామ వీరులు తన వెంటరాగా జయం తథ్యమని నమ్మిన రారాజు, 18 రోజుల యుద్ధానంతరం ఏకాకిగా మిగలగలడని ఎవరూహించగలరు? జయాపజయాలు దైవాధీనాలని తెలియని మూర్ఖుడు రారాజు. చివరకు ప్రాణరక్షణకై మడుగులో ఊరి చివర తలదాచుకోవలసిన స్థితి,  విధి వక్రించడమే కదా?

మడుగు వెడలి యుద్ధమునకు రమ్మని ఆహ్వానించు యుధిష్ఠిరునితో, "ఏ నింక సమరమొల్ల, మహీనాయక నీక యుర్వినిచ్చితి, శాంతిం గానకు జని వల్కలపరిధానుడనై తపమొనర్చెద మునుల కడన్"

ఓడి వచ్చినాడ నుద్ధతి నాకేల 
యుడుకుమాని నీవ యుర్వి యేలు
గుఱ్ఱములును నేనుగులు లేని బయలు
నీ తలనె కట్టికొనుము ధర్మతనయ!
(నాకింక యుద్ధం వద్దు. ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను. శాంతంగా అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారచీరలు కట్టుకుని తపస్సు చేసికొంటాను. ఓ ధర్మరాజా, ఓడిపోయి వచ్చినాను. నాకెందుకయ్యా గర్వం! ఈ భూమిని నీవే పాలించుకొమ్ము - గుఱ్ఱాలు, ఏనుగులు లేని ఈ బీడును నీ నెత్తి పైననే కట్టుకొమ్ము). 
18 రోజుల క్రితం వాడి సూదిమొన మోపిన భూమి పాండవుల కివ్వనని ప్రతిన బూనిన రారాజు నోటనే యింత వైరాగ్యపు మాటలు వినటం, నిజంగా ప్రకృతిలో వింతల్లో వింత! అంతకు మునుపు, ఈ వైరాగ్యంలో నూరవ పాలున్నా ఇంతటి వినాశనం జరిగెడిది కాదు గదా! 
తొడలు విరిగి నేలబడిన దుర్యోధనుడు, చివరకు పాండవులను, శ్రీకృష్ణులను నిందించి, జీవితభోగానుభవమును గూర్చిన తృప్తిని ప్రకటించినాడు.

"చదివితి నెల్ల వేదములు, జన్మము లొప్పగ జేసితిన్, రమాస్పదమగు వృత్తి బొల్చి నరపాలకు లెల్లను గొల్వగంటి, దుర్మదరిపు గాఢగర్వ పరిమర్దనకేళి నొనర్చితిన్, దగం దుదినని మిత్రబాంధవులతో త్రిదివంబున కేగు టొప్పదే?"
(అన్ని వేదాలను చదివాను, యజ్ఞాలను విధి ప్రకారం చేశాను. సంపదలకు తావలమైన నడవడికతో బ్రతికాను. రాజులెందరో సేవించగా చూశాను. దురహంకారగర్వంతో ఉన్న రాజులను యుద్ధంలో జయించాను. తుదకు బంధువులు, స్నేహితులతోను కలసి స్వర్గానికి వెళ్లడం ఒప్పదా?)

అసూయక్రోధ దురభిమానవ్యక్తి వలన సంఘవినాశనం తప్పదని, దుర్యోధనుని పాత్ర మహాభారతంలో రుజువు చేస్తున్నది.

"జానామి ధర్మమపి జానా మ్యధర్మం
నైవతాదృక్ వచనరూప మధర్మమేవ జానామి"

(ధర్మమేమిటో నాకు తెలుసు కాని నా మనస్సు ధర్మమార్గంలో వెళ్లలేదు. అధర్మమంటే ఏమిటో కూడా తెలుసు. అది నన్ను విడిచి పెట్టడం లేదు.)

-అన్నీ తెలిసిన మూర్ఖుడు దుర్యోధన సార్వభౌముడు.


                                             ******

కృష్ణద్వైపాయనుడు (Krishnadwaipaayanudu)

"వ్యాసో నారాయణో హరిః" అంటారు.  
కారణజన్ముడు. పరాశర మహర్షికి, సత్యవతికి సద్యోగర్భమున జన్మించిన ముని సత్తముడు. జన్మించిన వెంటనే ఆయన జ్ఞానియై, తపోమార్గంలోనే మనసు నిలిపాడు. భూత, భవిష్య, వర్తమానములను ఎరిగిన తపోధనుడు. 
భారత యుద్ధభూమిలో చచ్చిన మృతవీరులను సజీవంగా సశరీరులుగా నిల్పిన మహనీయుడు. గాంధారి గర్భపాతమైన మాంసపేశిని  101 భాగాలుగా విభాగించి ప్రాణం పోసిన అపరబ్రహ్మ. ఇది ఎలా సాధ్యం?

పరాశరమహర్షికి, సత్యవతి యందు సద్యోగర్భమున జన్మించినవాడు వ్యాసుడు. నల్లని రంగు కలిగి, యమునా ద్వీపమున జన్మించుటచే ఈయన కృష్ణద్వైపాయనుడనీ, వేదములను నాలుగుగా విభజించుట చేత వేదవ్యాసుడని పేరు గాంచినాడు. జన్మించిన వెంటనే ఆయన జ్ఞానియై తపోమార్గంలోనే మనసును నిలిపినాడు.

వ్యాసుడు జింకచర్మవస్త్రంతోను, ఎర్రని జడలతోను, దండకమండలాలు ధరించి, తల్లి ముందు నిల్చి ఆమెకు మొ్రక్కి "మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే నేను వస్తాను" అని చెప్పి, లోకహితానికై తపోవనానికి వెళ్లి, భయంకర తపస్సులో నిమగ్నుడైన మహనీయుడు.

ఆజన్మ మునివృత్తినవలంబించిన వ్యక్తి సంసారబంధమున చిక్కుబడుట దైవఘటన. ప్రబలకారణముచే మహాత్ములడుగు వేసినను, వెంటనే, అందుండి బయటపడుదురు. అది వారి వ్యక్తిత్వసామర్థ్యము. తల్లి కోరికపై వ్యాసుడు విచిత్రవీర్యుని భార్యలతో కలయవచ్చి, ధృతరాష్ట్ర-పాండు-విదురులకు తండ్రి కావలసి వచ్చింది. అట్లని ఆ మహర్షి సంసారసుఖముల తగులుకొనలేదు. అయినను సంసార సాంగత్య మాయను వదలలేదు. ఆజన్మాంతము సంసారమునకు దూరముగ మునిజీవితమునే గడిపినాడు. అవసరమైనప్పుడు అవసరమైనవారికి హితముపదేశించినాడు. మాట సహాయము చేసినాడు.

ధృతరాష్ట్ర-పాండు-విదురులు పుట్టిన తర్వాత హస్తినను విడిచి వెళ్లిన కృష్ణద్వైపాయనుడు గాంధారి కడుపును బాదుకొన్నప్పుడు మరల అక్కడికి వచ్చినాడు. ("గాంధారి మనస్తాపంబున ఉదరదాడనము జేసికొని గర్భపాతంబగుడును").

గర్భపాతమైన ఆ మాంసపుముద్దను 101 ముక్కలుగా చేసి, వేర్వేరుగా వాటిని నేతికుండలలో పెట్టి, చన్నీళ్లతో తడుపుతూ ఉండమని, వాటి నుండి 100 మంది కుమారులూ, ఒక కుమార్తె పుట్టుతారని చెప్పి వెళ్లగా, గాంధారీధృతరాషు్ట్రలు ఆయన చెప్పిన ప్రకారం చేయించి, దుర్యోధనాది నూర్గురు కుమారులనూ, దుస్సల అనే కుమార్తెనూ పొందారు. వారికి పుత్రభిక్ష పెట్టినది వ్యాసుడే.

నిజంగా వ్యాసుడు మాంసపేశిని ఎలా విభజించి పుత్రులే కలుగుతారని చెప్పగలిగాడు? ఆయన చేసిన శస్త్రచికిత్స ఎలా జరిగింది?  ఊహించటానికి కూడా సాధ్యం కానిది. వర్తమానంలో నేటికీ వైద్యులు గర్భచ్యుతి అయిన మాంసపేశికి ప్రాణం పోయలేకపోతున్నారు. మరి ఆ మహర్షి విభజించిన గర్భపాతానికి ప్రాణం ఎలా పోయగలిగాడు? ఊహించలేని మహాద్భుతం!

భావికాలంలో జరుగబోయే వినాశనాన్ని కూడా ఆయన ఎలా చెప్పగలిగాడో, ఏ జ్యోతిష్కుడూ కూడా నిర్ధారించలేడు. తల్లి సత్యవతితో వ్యాసుడు-

"క్రూరులు, విలుప్తధర్మాచారులు ధృతరాషు్ట్రసుతులు, అసద్వ్రత్తులు, నిష్కారణవైరులు, వీరల కారణమున నెగ్గు పుట్టు కౌరవ్యులకున్"

-ధృతరా
షు్ట్రని కుమారులు దుర్మార్గులు. నశించిన ధర్మబద్ధమైన నడవడి గలవారలు, మంచి కాని పనులను ఆచరించు స్వభావం గలవారు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వీరి కారణంగా కౌరవవంశానికి కీడు కలుగుతుంది. భవిష్యత్తును ఇంత చక్కగా విశ్లేషించిన ఋషిపుంగవుడు వ్యాసుడు నిజంగా ధన్యుడు!

పాండవులకు లాక్షాగృహదహనమొక చావు దెబ్బ! ఏదో దైవానుగ్రహమున, విదురుని సాహయ్యమున వారు బ్రతికి బయటపడినారు. ఎంత వ్యక్తిత్వమున్నవారైనను, ఇట్టి దెబ్బకు క్రుంగిపోవుట సహజము. జీవితములో ఒక నిస్సహాయత, నిస్ప్ృహ  ఆవరించి, వారి ఉత్సాహము కొడిగట్టి వెలుగు తగ్గును. ఈ దశలో ఎవ్వరైనా వారి నోదార్చి ధైర్యము చెప్పుట చాలా మంచిది. వ్యాసమహర్షి ఈ అవసరము గుర్తించినాడు. లాక్షాగృహదహనము నుండి బయటపడి, హిడింబుని ప్రమాదమును తప్పించుకొని శాలిహోత్రుని ఆశ్రమము చేరిన పాండవులను కలుసుకొన్నాడు.

మనుమలను దీవించి కౌగిలించుకొని, బాష్పపూరితనయనయై మొ్రక్కిన కోడలు కుంతి నోదార్చి, "నీ కొడుకు యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. అతడు నారాయణుని భుజాలవంటి నలువురు తమ్ముల బలం చేత, రాజులందరినీ శాసించి, సార్వభౌముడు చేసే రాజసూయ, అశ్వమేధాదియాగాలు చేసి, తాత తండ్రుల రాజ్యం ఏలగలుగుతాడు. కురువంశాన్నంతటినీ పవిత్రం చేస్తాడు" అని వారి శోకాన్ని ఉపశమింపజేశాడు.

దెబ్బ తిని క్రుంగిపోవు దీనులకు ఇంతకంటే కావలసినది ఏమున్నది?

ఆశ్రమవాసమున, గాంధారీధృతరాషు్ట్రల కడుపు కోతను, కుంతీదేవి మనోవ్యథను, వ్యాసుడు కనిపెట్టినాడు. తన దివ్యశక్తిచే గంగాజలమున మృతవీరులందరూ కనిపించునట్లు చేసినాడు. ఆ మువ్వురికి మనశ్శాంతిని ప్రసాదించినాడు.
వివరాలకు వెళితే...
నగరవాసులు, పల్లెవాసులతో సహా ధృతరాషు్ట్రలందరూ కదలి గంగ వద్దకు వెళ్లారు. వ్యాసమహర్షి గంగాజలంలో మునకవేసి, ప్రేమతో తియ్యనైన గొంతుతో, "ఇక్కడికి (మహాభారతయుద్ధంలో మరణించినవారిని) రండీ!" అన్నారు. అపుడు ఆ నీళ్లలో దుర్యోధనుడూ, అతని తమ్ములూ, ఆ ధార్తరాషు్ట్రల కొడుకులూ, మొదలైన ఆ కుటుంబం వారు, అభిమన్యుడు, ఉపపాండవులు మొదలైన పాండవకుటుంబంవారు, కర్ణుడు, ద్రుపదవిరాటులు, వాళ్ల చుట్టాలు, శకుని, భీష్మ ద్రోణులు మొదలైనవాళ్లు తమ దివ్యశరీరాలు ప్రకాశిస్తుండగా కనబడ్డారు. తన తపః ప్రభావాన్ని చూచి జనమంతా ఆశ్చర్యపడే విధంగా వ్యాసుడు ఆ ధృతరాషు్ట్రనకు సంపూర్ణదృష్టిని ఇచ్చాడు.

భర్తకు చూపు రావటం విని గాంధారి, ఆశ్చర్యానందాలతో, తాను కూడా కళ్లకు కట్టిన వస్త్రాన్ని తొలగించి దుర్యోధనాదులు చూస్తుండగా వారంతా కలిసి తమ ఉదారబుద్ధిని ప్రకటిస్తూ, ధృతరాషా్ట్రదుల సమీపానికి వచ్చారు. వీరంతా అక్కడ ఉన్న చుట్టాలందరకు అత్యుత్తమమైన ఆనందం కలిగించి, చేయవలసిన సత్కారాది ఆచారాలు చేసారు.

ఆ రోజంతా వాళ్లు అందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా కలసిమెలసి వ్యవహరించారు. ఆ విధంగా దివ్యులు మానవులతో స్వస్వరూపంతో వచ్చి కలసివుండటం, అందరినీ ఆశ్చర్యప్రవాహంలో ముంచింది. మునిశ్రేష్ఠుడైన ఆ వ్యాసుని మహిమ ఏమని చెప్పటం?

మర్నాడు ఉదయాన్నే వ్యాసుని నియోగం మీద రెండు విధాలైనవారు (దివ్య దుర్యోధనాది, మానుషధృతరాషా్ట్రది దేహులు) పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. దివ్యదేహులైన ఆ వీరులు ఎవరి లోకాలకు వారు వెళ్లటం కొరకు గంగాజలంలోకి దిగి అంతర్థానమయ్యారు.

ఫలశ్రుతి:
ఈ వృత్తాంతాన్ని విన్నా, చదివినా ఆ జనులకు ఈలోకంలోనూ, పరలోకంలోనూ అనేక విధాలుగా అత్యుత్తమమైన కోర్కెలు నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్లు తమ తమ బంధువులను కలుసుకొనే ఆనందకరమైన స్థితిని వారు పొందుతారు. వారి రోగాలు తొలగుతాయి. తిరుగులేని ఆనందం, అధిక శుభాలు కలుగుతాయి.

భూతభవిష్యవర్తమానాలను తెలుసుకొన్న మహనీయులు వ్యాసమహర్షి. వీరినే క్రాంతదర్శులంటారు.

ఆయననే "వ్యాసాయ విష్ణురూపాయ" అన్నారు పెద్దలు. కురుపాండవ కుటుంబ గాధ మానవస్వభావ సమగ్రచిత్రణకు, లోకపు పోకడ ప్రదర్శనకు, ధర్మతత్వ నిరూపణకు, ఎంతో అనుకూలమని ఎంచి, మూడు సంవత్సరములు కృషి చేసి మహాభారతగ్రంథముగ రూపొందించి, మానవలోకమునకు అందించినవాడు వ్యాసమహర్షి.

                                         ******

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం (Kaalunitho Kalasi Nadichina Sathee Savitriki Jeevaathma Darshanam)

 జీవాత్మ, పరమాత్మను ప్రత్యక్షంగా చూసిన వారెవరున్నారు? జీవుడెలా ఉంటాడు? ఆయన నివాసం ఎక్కడ - ఈ ప్రశ్నలకు సమాధానం ఎర్రన కృత సావితు్ర్యపాఖ్యానం చెబుతుంది. మహాసాధ్వియైన సావిత్రి ప్రత్యక్షంగా జీవాత్మను దర్శించి, యమ ధర్మరాజు ఆశీర్వాదంతో సౌభాగ్యాన్ని తిరిగి పొందగలిగింది.

నన్నయ సభాపర్వంలో శిశుపాలవధ ఘట్టాన్ని వివరించాడు. రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందపడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ బయటికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.

ఆత్మనివాసం....

జీవి (జీవాత్మ) నివాస స్థానం గురించి మంత్రపుష్పంలో ఇలా ఉంది-

'పద్మకోశ ప్రతీకాశగ్o  హృదయం చాప్యధోముఖం'

గొంతుకు కింద, నాభికి పైన ఉన్న ప్రదేశంలో 12 అంగుళాల ఎడంగా ఉండే హృదయ కమలమే జీవాత్మ-పరమాత్మ నివాసస్థానమని మంత్రపుష్పం తెలుపుతున్నది. సృష్టికి మూలమైన ఆ మహాశక్తి అగ్నిమాలికలా ప్రకాశిస్తున్నది. ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా  భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు.

ప్రత్యక్ష దర్శనం...

ఇంతకూ ఆ జీవున్ని ప్రత్యక్షంగా దర్శించిన వారెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. ఆ వ్యక్తే మహాసాధ్వి సావిత్రి, సత్యవంతుని భార్య. జీవున్ని యముణి్న దర్శించగలిగింది, కేవలం ఆమె పాతివ్రత్య మహిమ చేతనే.

నల్లని మేఘంలా శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారంతో, భయంకరమైన కోరలతో, మిలమిల మెరిసే నెత్తుటి రంగు నేత్రాలు కలిగి, ప్రళయకాలంలోని అగ్నిలా మండుతూ బంగారు రంగుతో వెలుగుతున్న వస్త్రాలు ధరించి, లోకంలోని జనులకు భీతిని కలిగించే విధంగా యమధర్మరాజు సావిత్రికి ప్రత్యక్షమవుతాడు. నిడివి ఎక్కువగా గల పాశాలను రాకుమారుడైన సత్యవంతుడి పైకి భయంకర రీతిలో ప్రయోగిస్తాడు. అతడి శరీరం నుంచి జుత్తిలి కొలత గల (చూపుడు వేలు, బొటనవేలు చాపగా, పైన నడిమ కొలతకు లోబడిన ఆకృతి) జీవుడిని బంధించి బయటకు లాగగా ఆ జీవుణి్న సావిత్రి ప్రత్యక్షంగా దర్శిస్తుంది.

కారణజన్మురాలు...

సావిత్రి ఉపాఖ్యానం మహాభారతంలో ఒక విశిష్ఠ రచన. వైధవ్యం తప్పదని తెలిసి వివాహం చేసుకున్న సాధ్వి సావిత్రి. ఆమె కారణజన్మురాలు, ధీరమాత కూతురు. ఆమె అంగీకారానికి ఆమోదముద్ర పలికిన ఆమె తండ్రి ధైర్యవంతుడు. 'పేర్కొనజాల పెంపునన్' అని కోరిన వరునితో వివాహం జరిపిస్తాడు. త్రిరాత్రోపవాసం చేసిన సావిత్రికి యమదర్శనం కలగడం విడ్డూరం కాదు. కాని ఆమె వివాహమైన తరువాత ఆ సంవత్సరకాలం కాలుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పుణ్యవతిగా గోచరిస్తుంది. అంటే ఆమె తన భర్త మరణకాలాన్ని కొలుస్తున్నందువల్లే ఆమె కాలుడిని చూడగలిగిందన్నమాట. సావిత్రి కాలుడితో చాలా దూరంగా నడిచి ఎన్నో మాటలు మాట్లాడింది. 'సఖ్యం - సాప్తపదీనం' అంటూ ఏడు అడుగులు నడిచి మాట్లాడితే  ఎవరైనా బంధువులవుతారని వివరించింది. ప్రసన్నుడైన యమధర్మరాజు పరిపూర్ణ ఫలాన్నిచ్చాడు సావిత్రికి. భర్త పరిపూర్ణ ఆయుస్సును, శతపుత్ర లాభాన్ని వరంగా పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహాపతివ్రతా శిరోమణి సావిత్రి. కొలిచిన దైవం ప్రత్యక్షం కాగా కలిసి నడిచిన ఏకైక భక్తురాలు సావిత్రి, ధన్యురాలు.


త్రిరాత్రోపవాస వ్రతం..

సావిత్రి ఉపాఖ్యానంలో సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, భర్త మరణాన్ని ఆమె ఎలా ఎదుర్కోపోతున్నది ? కథను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు స్వల్పం. సావిత్రి అందమైన ఆభరణాలు, వస్త్రాలు త్యజించి నారచీరలతో అడవిలో భర్తకు సపర్యలు చేసింది. నారద మహాముని చెప్పిన ప్రకారం తన భర్త ఆయువు ప్రమాణం లెక్కించుకుంటూ గడిపిన సావిత్రి అతని మరణానికి ఇంకా నాలుగురోజులే ఉన్నట్లు తెలుసుకుంది. అంటే అప్పటికి నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరకాలం గడిచిపోయిందన్నమాట. వెంటనే పరమనిష్ఠతో త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. పగళ్లతో కూడిన మూడురాత్రులు దీక్షతో ఉపవాసాలు చేసింది. నాలుగవ రోజున వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని, భక్తితో భర్త శుశ్రూష చేసి, అత్తమామలకు, పెద్దలకు ప్రత్యేకంగా నమస్కరించింది. వారు ప్రీతితో చిరకాలం మాంగల్యంతో వర్ధిల్లమని పలికిన దీవెనలను మనసారా గ్రహించింది. భర్త సమిధలు, దర్భలు తేవడానికి అడవికి పోతుండగా అత్తమామల అనుమతితో అతడిని అనుసరించింది. అడవిలో చెట్లు నరుకుతుండగా సత్యవంతుడు శిరోవేదనతో బాధపడుతూ సావిత్రి ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన యముడిని చూసి "ఆర్యా, మీరెవరు?" అని ప్రశ్నించింది సావిత్రి. ప్రతిగా యముడు నేను కాలుడను సుమా! నీవు మహాపతివ్రతవు, అందుకనే నన్ను చూడగలిగావు. నీ భర్త ఆయువు తీరింది. ఇతడు పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను అంటూనే సత్యవంతుడి శరీరం నుంచి జీవుడిని బయటకు లాగి బంధించి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయనను అనుసరిస్తూ సావిత్రి యముణి్న భక్తిపూర్వకంగా ఆరాధిస్తూ ఇలా సంబోధించింది.

"అంతకుండు, దండధరుడు, సంస్తుతగుణుడు, సమవర్తి, పితృపతి, ధర్మదేవత, యముడు, జలజాప్తసుతుడు, బ్రేతపతి, వైవస్వతుడు, ప్రథమ ధర్మాధ్యక్షుడు, ధర్మరాజు, ధర్మపదవీ పరిరక్షణుడు..."

గమనిస్తే ఆమె సంవత్సర కాలం త్రికరణశుద్ధిగా ఆరాధించి కొలిచిన దైవం ఎవరో కాదు...కాలుడే (కాలం) అని అర్థమవుతుంది. ఆ కాలాన్నే ఆమె లెక్కిస్తూ నిరంతరం కాలాన్ని కొలవడం వల్ల యముణి్న ఆరాధించిన ఫలం దక్కింది. దీక్షతో త్రిరాత్రోపవాసాలు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని భర్త ప్రాణం పొంది ఆదర్శనారిగా, పతివ్రతగా జీవించింది ధీరవనిత సతీసావిత్రి.


                                              ******

Tuesday, November 13, 2012

మహర్షులు ప్రసాదించిన అమృతం (Maharshulu Prasadinchina Amrutham)

 అపమృత్యువును జయించే శక్తి మనలోనే ఉన్నది. ఎటువంటి ధర్మాచరణవల్ల అన్ని భయాలకు దూరంగా అమృతప్రాయమైన జీవితాన్ని గడపవచ్చనే అంశంపై మహాభారతంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. 
జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు.

పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు.

ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమేమిటని వారు ప్రశ్నించారు మునిపుంగవుడిని.

అందుకు తార్క్షు్యడు...
ఆలస్యం బొక యింత లేదు
శుచి ఆహారంబు
నిత్యక్రియాజాలం బేమరము
అర్చనీయు లతిథుల్
సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము 
అట్లౌట నెక్కాలంబుం బటురోగమృత్యు భయశంకం బొంద మేమెన్నడున్
- అని చెప్పాడు.

ఆశ్రమజీవితంలో మృత్యుంజయసిద్ధికి అనుష్ఠించబడే నియమాలు...

కాలం విలువ గుర్తించడం, ఆహారం పరిశుభ్రంగా ఉంచడం, ప్రతిదినం జరపాల్సిన పనులు ఏమాత్రం మరువకపోవడం, అతిథులను పూజించడం, సదా సత్యవ్రతాన్ని పాటించడం, శాంతి, ఇంద్రియ నిగ్రహంతో కూడిన నిష్కామవ్రతాచరణ చేయడం.

ఈ విధమైన ధర్మాచరణ వల్ల మనం రోగమృత్యు భయాందోళనలు లేక నిశ్చింతగా జీవించవచ్చనేది మహర్షుల బోధనాసారం.

ఫలశ్రుతి: 
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు 
అర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు 
వినయార్థులకు మహావినయ 
మతియు పుత్రార్థులకు బహుపుత్రసమృద్ధియు 
సంపదర్థుల కిష్టసంపదలును 
గావించు నెప్పుడు భావించి 
వినుచుండువారికి నిమ్మహాభారతంబు

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధనలాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్రసంతానాన్ని కోరేవారికి పుత్రసంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం - వినయాల ప్రాధాన్యం ఏమిటి?

విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం, తతస్సుఖం ||

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాల నుంచారు మనవాళ్లు, అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబస్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుష్షు, ధనం, సంతతి, ఐశ్వర్యం, అన్నీ వ్యర్థాలే.


                                            ******

ఇంద్రద్యుమ్న మహారాజు (Indradyumna Maharaju)

 ప్రాణాయామ యోగ సాధనద్వారా జీవితకాలాన్ని ఎలా పెంచుకోగలమో తెలిపే విలక్షణమైన కథ ఇది.

ఇంద్రద్యుమ్నమహారాజు మరణించి పైలోకాలకు వెళ్లాక ఆయనకు నేరుగా స్వర్గలోకప్రవేశం లభిస్తుంది. కొంత కాలమైన తరువాత ఆయనకు పుణ్యలోకంలో గడువు పూర్తయిందని దేవతలు చెప్పేసరికి మహారాజుకు కోపం వస్తుంది. తను ఎన్నో పుణ్యకార్యాలు చేశానని ఇంకా భూలోకంలో తన గురించి చెప్పుకునేవారున్నారని వాదిస్తాడు. తన వాదాన్ని నిరూపించేందుకు భూలోకానికి వచ్చి తన రాజ్యంలో ఉన్న చిరంజీవియైన మార్కండేయ మహామునిని కలుసుకుని, తన గురించి ఆయనకేమైనా తెలుసునేమోనని ఆరా తీస్తాడు. అయితే మార్కండేయముని, మహారాజు గురించి తనకు వివరాలు తెలియవని చెప్పి, దగ్గరలో ఉన్న కొంగ, గుడ్లగూబ లాంటి పక్షుల వద్దకు తీసుకువెళ్లి, "మహారాజును గుర్తించారా?" అని వాటిని ప్రశ్నిస్తాడు. అయితే అవి కూడా ఆ మహారాజు గురించి తెలియదని చెబుతాయి. ఆ సరోవరం సమీపంలోనే ఉన్నఅకూపారుడనే తాబేలు మాత్రం కొంచెంసేపటికి జ్ఞాపకం తెచ్చుకుని, కన్నుల నుండి ఆనందబాష్పాలు రాలగా, గద్గదస్వరంతో ఇట్లన్నాడు.

"అయ్యో ఎంతమాట! ఆ ఇంద్రద్యుమ్న మహారాజునా నేను మరచిపోవటం, అతడు మహాత్ముడు. గొప్ప గుణాల చేత అలంకరింపబడినవాడు. పెక్కుమారులు ఆ మహనీయుడు నన్ను పెక్కు ఆపదల నుండి కాపాడినాడు. జనులలో శ్రేష్ఠుడై ఎంతో గొప్పతనాన్ని ఆర్జించిన ఆ ఇంద్రద్యుమ్నమహారాజుని నేను సదా కృతజ్ఞతతో స్మరించవలసివున్నది. మహానుభావుడైన ఆ రాజు ఎన్నో యజ్ఞాలు చేసి, దక్షిణగా అనేక గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ మహాత్ముడు దానం చేసిన వేలవేల ఆవుల గిట్టల రాపిడే కదా, లోకం పొగిడే ఈ మడుగు ఏర్పడటానికి కారణం!"
ఈ మాటలు వినగానే దేవతలు వచ్చి విమానం తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అతడి కీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచి ఉండేది, కాబట్టి స్వర్గలోకసౌఖ్యాలు శాశ్వతంగా అనుభవించవచ్చునన్నారు. అంటే, ఈ లోకంలో ఎవరి కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో, వారు అంతకాలం వరకు స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారన్నమాట!

ఈ కథను విన్నవారికి, సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రాణాయామం (ఉచా్ఛ్వసనిశా్శ్వసాల ప్రక్రియ) విలువ ఇందులో అంతర్లీనమై ఉంది. మనిషి నిమిషానికి 15-18 సార్లు గాలి పీల్చి వదులుతున్నందున 100 సంవత్సరాలు జీవిస్తున్నాడు. తాబేలు నిమిషానికి నాలుగైదు సార్లు గాలిపీల్చి వదలడం వలన 200 ఏళ్లు బతుకుతున్నది.

యోగశాస్త్రప్రకారం:

తాబేలు 4-5/ నిమిషానికి  - 200 సం||
పాము 7-8/ నిమిషానికి -  150 సం||
మనిషి 15-18/ నిమిషానికి - 100 సం||
గుఱ్ఱం 20-22/ నిమిషానికి - 40 సం||
కుక్క 28-30/ నిమిషానికి - 14 సం||

మనిషి సగటున ఒకరోజుకు 21,600 మార్లు గాలి పీల్చి వదులుతున్నాడు. కానీ, ప్రాణాయామ యోగసాధన ద్వారా 7200 మార్లు మాత్రమే గాలిని పీల్చి వదిలి, జీవితకాలాన్ని 30-50 ఏండ్ల వరకు పెంచుకోగలుగుతాడు.

                                                 *****శివ సాక్షాత్కారం (Shiva Saakshaathkaram)

 అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ఇవ్వబోయే శివుని ప్రత్యక్ష వర్ణన చదవండి:
"జటామకుటేందురేఖయుం, గరమున శూలమున్, గరళ గాలగళంబు, బృహద్గజాజినాంబరము, తృతీయ లోచనము, పన్నగహారము నొప్పుచుండగన్" 

శివుడు జడలు గట్టిన శిరస్సుపైగల చంద్రవంకతో త్రిశూలం చేతితో ధరించి, విషం వల్ల నల్లనైన గొంతుకతో, గజచర్మధారియై, మూడవ కన్ను కలిగి, పాముల హారం ఆభరణంగా ధరించి అర్జునునకు దర్శనమిచ్చాడు. ప్రత్యక్షమైన శివుణ్ని అర్జునుడు స్తోత్రించటం: 

దండకము: 

     శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవాస్థాన సంహారకారీ, పురారీ, మురారీప్రియా, చంద్రధారీ, మహేంద్రాదిబృందారకానంద సందోహసంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్పప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మల జ్ఞానదీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారమాయంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యానపీయూషధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా, భవ్య సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గవాగస్త్యకుత్సాది నానా మునిస్తోత్రదత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణగంధర్వులున్,  సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా, నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః 

తాత్పర్యం

శ్రీ కంఠా! లోకాలకు పాలకుడా! సృష్టిస్థితిలయకారుడా! త్రిపురాలను విధ్వంసం చేసినవాడా! మురుడు అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుదేవుడికి ప్రియమైనవాడా! చంద్రవంకను ధరించినవాడా! దేవేంద్రుడు మున్నగు దేవతలకు ఆనందాలను చేకూర్చేవాడా! పుణ్యాలు ఆకృతిగొన్నవాడా! ముక్కంటీ! దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడా! దేవా! మేధావులు నీ దైవతత్త్వాన్ని ఆలోచించి వింగడించి కర్మం ప్రధానమైనదగు విజ్ఞానం అధ్యాత్మయోగం సర్వక్రియా కారణమని అనేకవిధాల విచారణలు చేస్తూ నిన్ను ధ్యానిస్తారు. సర్వేశ్వరుడవైన శర్వ! సర్వజ్ఞ! సమస్తసృష్టికి ఆత్మ వంటివాడా! మొక్కవోని మహిమ కలవాడా! పార్వతీపతీ! నీవు మూడు లోకాల ప్రవర్తనాన్ని భూమి, గాలి, ఆకాశం, ఆత్మ, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, నీళ్లు ఈ ఎనిమిదింటితో నిర్మించి, ఈ విశ్వసంసార చక్రబంధయంత్రాన్ని ధరించి నడుపుతున్నావు. ఆది దేవుడివి నీవు. మహాదేవుడివి నీవు. నిర్మలమైన జ్ఞానప్రదీప్తి చేత సంసార మాయాంధకారాన్ని నిర్మూలించి, వైరాగ్యసంపన్నులై జితేంద్రియులైన యతీంద్రులు నీ పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతాన్ని నిరంతరం గ్రోలుతూ సంత్రుప్తులై, నిత్యులై ఉన్నారు. నాశం లేనివాడా! పూజ్యుల చేత సేవించబడేవాడా! సర్వం నీవే అయినవాడా! భర్గా! విద్వాంసుడా! భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మున్నగు మహర్షులు చేసిన స్తోత్రాలను చెవియొగ్గి వినేవాడా! నుదుటి కంటి మంట చేత మన్మథుడిని బూడిద చేసినవాడా! భస్మం పూయబడిన దేహం కలవాడా! గంగను ధరించినవాడా! నీ దయవలన గీర్వాణులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఉరగశ్రేష్ఠులు, రాక్షస ప్రముఖులు మున్నగువారు ఎడతెగని సంపదలతో వర్దిల్లినారు. పరిపాలకుడివైనవాడా! విశ్వకర్తా! నాకు కోరికలు ఈడేర్చుము ఓ దయామయా! మూడులోకాలను పాలించే సార్వభౌముడా! సురాభ్యర్చితుడా! నీకు నా నమస్కృతులు.

శివార్చనపై నన్నయచే విరచితమైన ఇది తొలిదండకం. ఆంధ్రమహాభారతములో ఇది కామబాణవృత్తంలో రచించబడింది. రెండు గురువులు, ఒక లఘువు గల "తగణంతో" ధాటిగా ఎక్కడా ఆగకుండా నడుస్తుంది. ఈ స్తోత్రరచన మాటల్లో భావనాబలమే కాక శబ్దశక్తి రహస్యాన్ని గ్రహించి తద్వారా మంత్రాలను దర్శించారు ఋషులు. ఏ శబ్దాన్ని ఎలా కూర్చితే ఎటువంటి దివ్యశక్తి ఆవిర్భవిస్తుందో గమనించి ఆ విధంగా అనేకమంత్రాలను ఏర్పరచారు. అందుకే మాట ఆశీస్సుగాను, శాపంగాను పరిణమించగలదు. మానసికభావంతో పాటు శబ్దాల బలిమి వల్ల పలుకులకు ఆ పటిమ ప్రాప్తిస్తుంది. దేవతలను ఆహ్వానించే శక్తి మాటకే ఉంది.

శబ్దశాసనుడైన నన్నయ మహర్షి మనకందించిన ఈ స్తోత్రం ద్వారా అపూర్వ ఐశ్వర్యప్రదుడైన శివున్ని ధ్యానించి తరిస్తాం.


                                      ******

హనుమత్ ప్రార్థన (Hanumath Praarthana)

 అరణ్యపర్వ భాగంలోనే నన్నయ మహర్షి భీమసేనునకు సౌగంధిక పుష్పసమయంలో హనుమంతుని దర్శనభాగ్యం కలిగించాడు. ఆశ్చర్యకర విషయమేమంటే ఆ మూర్తిని ఆయన ఎలాగ తన మనః ఫలకంపై ముద్రించుకున్నాడో చదవండి. 

సీ: హ్రస్వపీనగ్రీవు నచలితాయతహను నతి చపలస్వభావాభిరాము
దనుమధ్యకటిచక్రు, దహనకణాకారతామో్రషు్ఠ, నతికృశదశనకరజు
బృథులవిద్యుత్ పింజ పింగాక్షు, నుత్తుంగదృఢవక్షు, నాజాను దీర్ఘబాహు నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజ లీల గ్రాలుచునుండ నేకాంతయోగ నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతు జూచి పాండురాజుసుతుడు వాని నిద్ర జెఱుప గడగి నిజసత్త్వమేర్పడ సింహనాద మొప్ప జేసే డాసి".

భీమసేనుడు దర్శించిన హనుమంతుని వర్ణన:

   "తదేకధ్యానయోగమనే గాఢనిద్రలో ఉన్నవాడు, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం గలవాడు, పొట్టిగా బలిష్ఠంగా ఉన్న కంఠభాగం గలవాడు, కదలని పొడుగాటి మీది దవడ గలవాడు, నిలుకడ లేని స్వభావం చేత ముచ్చట గొలిపేవాడు, సన్నని నడుముతో గుండ్రని మొలభాగం గలవాడు, నిప్పు కణంవలె ఎర్రనైన పెదవులు గలవాడు, మిక్కిలి కృశించిన దంతాలు, గోళ్లు గలవాడు, మెఱపు తీగల సముదాయం వంటి గోరోజనవర్ణంతో భాసించే కన్నులు గలవాడు, ఎత్తైన బలిష్ఠమైన రొమ్ము గలవాడు, మోకాళ్ల వరకు వ్యాపించిన నిడివైన చేతులు గలవాడు, ఎత్తుగా నిక్కబొడిచిన తోక మిక్కిలి ఎత్తుగా ఉన్న జండావలె ప్రకాశిస్తున్నవాడైన హనుమంతుని చూచి, తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా భీమసేనుడు సింహనాదం చేశాడు. 

                                                                *****

సూర్య స్తోత్రం (Soorya Sthotram)

 సంస్కృత వ్యాసభారతంలోని వేయి నామాలు కలిగిన సూర్యసహస్రనామస్తోత్రాన్ని నన్నయ గారు ఆంధ్రమహాభారతంలో కేవలం ఒక లయగ్రాహివృత్తంలో క్లుప్తీకరించి వ్రాసి, ఎల్లరూ నిత్యం పారాయణ చేసేందుకు వీలుగా, అరణ్యపర్వంలో నిక్షేపించారు. సూర్యపారాయణ వల్ల ఆయుర్ వృద్ధి కాగలదని ఆదిత్యహృదయం చెబుతున్నది.

లయగ్రాహి
"వారిరుహమిత్రు, నమరోరగ మునిద్యుచరచారణగణ ప్రణుత చారుగణు, లోకా 
ధారు, అఖిలశ్రుతిశరీరు హరి, శంకర సరోరుహభవ ప్రతిమున్ దారుణతమిస్రా 
వారణ మరీచి పరిపూరిత దిగంతరున్, భూరికరుణానిరతున్, సూరు, త్రిజగద్ర
క్షారతున్, సహస్రకరున్ కోరి భజియింపుము మనోరథఫలంబులగు భూరమణ నీకున్"

ధౌమ్యమహర్షి ధర్మరాజుతో, ఓ మహారాజా, పద్మాలకు మిత్రుడు, దేవతలు, పాములు, మునులు, ఆకాశంలో చరించేవారు, దేవ గాయకులైన చారణులు మొదలైనవారి చేత పూజింపబడేవాడు, సమస్త లోకాలకు ఆధారభూతుడు, సమస్తవేదరూపుడు, విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానుడు, ఘోరమైన చిమ్మచీకట్లను తన వేవెలుగులతో పోగొట్టి దిగంతరాలను ప్రకాశింపజేసేవాడు, గొప్ప దయాస్వరూపుడు, విజ్ఞాని, మూడులోకాలను రక్షించటానికి పూనిక గలవాడు, వేయికిరణాలు గలవాడైన సూర్యదేవుని, నీ మనోసిద్ధి కొరకై ప్రార్ధించుము అని చెబుతాడు. 

                                                                   *****

Sunday, November 11, 2012

మాయాద్యూతం (Mayaadyootham)


 శకుని, ధర్మరాజు మధ్య జరిగిన ఈ ద్యూత ప్రక్రియలో ధర్మరాజు చేతికి పాచికలు వేసేందుకు అవకాశమే రాలేదు. ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులు, ద్రౌపది ఏ సందర్భం వచ్చినా తమ పరాజయానికి శకుని మాయాజూదమే కారణమంటారు. ఆశ్చర్యమేమంటే భారతం మొత్తం కావ్యంలో ధర్మరాజు మాయాద్యూత పదంతో శకునిని నిందించలేదు, ఆశ్చర్యంగా లేదూ !

కవిత్రయ మహాభారతంలోని మాయాద్యూతాన్ని ఎరుగని పండితుడు గాని, పామరుడు గాని ఆంధ్రదేశంలో లేడనే చెప్పవచ్చు. ఇంతకూ ఈ మాట ఎవరి నోట మొట్టమొదట వచ్చింది? ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులూ, ద్రౌపదీ, ఏ సందర్భం వచ్చినా, తమ పరాజయానికి శకుని మాయాద్యూతమే కారణమని, ధర్మజుని ద్యూతవ్యసనాన్ని దుయ్యబడుతారు. ద్యూతవ్యసనుడైన ధర్మరాజు మాత్రం భారతం మొత్తంలో ఎక్కడ కూడా మాయాద్యూతమని శకునిని నిందించనే లేదు.

సభాపర్వంలోని ఆంధ్రమహాభారత గాధ విశ్లేషిస్తే...

అసూయాగ్నితో రగిలే దుర్యోధనుడు, మామ శకునితో (ఏకాంతంలో) ధర్మజుని రాజసూయ యాగానంతరం పాండవలక్ష్మి ఏ విధంగా అపహరింపనగునని ప్రశ్నిస్తాడు.  దీనికి శకుని, "భాను ప్రభుడగు పాండుమహీనాథాత్మజులక్ష్మి యెల్లను నీకున్ నేనపహరించి యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్" అంటాడు. లోకం కొనియాడే ఓ దుర్యోధనా! సూర్యునితో సమానమైన తేజస్సుగల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా "మోసపు జూదమనే" నెపంతో నీకు నేను అపహరించి ఇస్తాను. 

ఇంతకూ జూదంలో శకుని నైపుణ్యమేమని ఎవరికైనా స్ఫురించకమానదు. దీనికి సమాధానంగా శకుని, "ధర్మతనయుండు జూదంబునకుం బ్రియుండు గాని యందుల యుక్కివం బెరుగడు ఏ నక్షవిద్యయం దతిదక్షుండ" అంటాడు. ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం. కానీ అందులో ఎంత మోసం ఉంటుందో అతనికి తెలియదు. నేను ద్యూతవిద్యలో సులభంగా ఓడించి అతని రాజ్యసంపదనంతా నీకిస్తానన్నాడు. 

"అభిమతాక్షముల్ తొల్చి మాయావిదుండు సుబలాత్మజుడు ధర్మసుతు జయించె" తన కిష్టమైన పాచికల రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును ఓడించాడు. ఇక్కడ 'తొల్చి' అన్న పదానికి, 'యుక్తిగా దొర్లించి' అన్న అర్థం వున్నది. 

ధర్మరాజు, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం, ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడైన దేవలుని ప్రామాణికతతో జూదమాడాడు.

"బలవదూ్ద్యతార్థముగా బిలువంబడి మగుడనగునే" బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్లటమా ? అన్న శంక ధర్మరాజుకు కలిగింది. కానీ విధి బలీయం. 

సప్తవ్యసనాలు: 

"వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేతయనెడు సప్తవ్యసనముల జనదు తగుల"

- స్త్రీ, జూదం, తాగుడు, వేట, వాక్పారుష్యం, అతిక్రూరంగా దండించుట, డబ్బును వృథా చేయటం - అనే ఈ ఏడు వ్యసనాల యందు ఆసక్తి చూపరాదు. 

విదురుడు, ధృతరాష్ట్రునికి చెప్పిన నీతిబోధ ఇది. ఈనాటికీ పెద్దలు వీటి జోలికి పోరాదంటారు. ఫలితం దారుణమే!

జూదానికి ధర్మజుడే కాదు, నలమహారాజు కూడా బలయ్యాడు. ఆయన కూడా ధర్మజుని వలె అక్షప్రియుడే కానీ అక్షహృదయజ్ఞుడు కాడు (జూదంలో మెలకువలు తెలియనివాడు). 

"ద్యూతార్థము తత్కితవాహూతుడనై, జూదమాడకుండుట ధర్మాపేతంబని, యభిముఖుడై యాతనితో నలుడు జూదమాడ గడంగెన్". 

జూదమాడటానికై జూదరుల చేత పిలువబడినవాడై జూదమాడకుండుట అధర్మమని తలచి నలుడు సమ్మతించి పుష్కరునితో జూదమాడాడు. 

నలుడు పిలువబడి జూదమాడకుండుట అధర్మమని ఎంచాడు. 
ధర్మరాజు జూదం ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యఫలమని తలచాడు. 

ఇరువురి భావనలో ఎంత భేదమో చూడండి. 


                                                  *****