Sunday, November 25, 2012

దుర్యోధన ధర్మరాజుల సంవాదం (Duryodhana - Dharmarajula Samvaadam)

లక్ష శ్లోక సంఖ్య గల మహాభారతంలోని ఈ కథ, దుర్యోధన ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణా సన్నివేశమే. వీరిరువురు ఎదురుపడిన సందర్భాలు (యుద్ధ పర్వాలు మినహాయిస్తే) మూడు అంటే ఆశ్చర్యంగా లేదూ? వాటిని కవిత్రయంలోని ముగ్గురు కవులు ప్రస్తావించారు. ఆ సన్నివేశాలసారం చదివేందుకు 5 ని||లు మాత్రం పడుతుందంటే ఇంకా ఆశ్చర్యం కాదా?

పద్దెనిమిది అక్షౌహిణుల సేన (కొన్ని కోట్ల కాల్బలం, రథాలు, గుర్రాలు, ఏనుగులు) తో పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని, వేదవ్యాసమహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం (రమారమి క్రీ.పూ. 3500 లలో) ఆంధ్రమహాభారతకథను లక్షశ్లోకసంఖ్యగా చెప్పాడని, ఈనాటికీ పండితపామరులు అనూచానంగా వింటున్నారు, చదువుతున్నారు. 

ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు, అధర్మానికి ప్రతీకగా దుర్యోధనుడు - వీరి మధ్య సంగ్రామం సంభవించిన కథ అందరూ ఎరిగినదే. వీరిరువురూ ఎదురుపడ్డ సందర్భాలు భారతంలో మూడు మాత్రమే ప్రసిద్ధంగా కనబడుతున్నాయి. (యుద్ధపర్వాలు మినహాయిస్తే)

1. మాయాద్యూత సమయం - సభాపర్వం - నన్నయ కృతం.
2. ఘోషయాత్ర - అరణ్యపర్వం - ఎర్రన కృతం.
3. దుర్యోధనుడు మడుగులో దాగిన సమయం - శల్యపర్వం - తిక్కన కృతం

నన్నయ రచన:

ద్యూతసమయంలో దుర్యోధనుడు ధర్మరాజుతో -

"అనఘ! సుహ్రుదూ్ద్యతం బొందొనరింతము, ప్రొద్దు వోవకయును నగు
జూదంబునకుం ప్రియుడవు దక్షుడవన విందుము నిన్ను బ్రీతి నక్షజ్ఞుల చేన్" అంటాడు.   

పుణ్యాత్మా! ధర్మరాజా! ఇక్కడ స్నేహంగా జూదం ఆడుకుందాం. కాలక్షేపమూ అవుతుంది. పాచికలాడటం బాగా తెలిసినవాడివి; జూదంలో ఆసక్తి గలవాడవని, సమర్థుడవని జూదరులు చెబితే విన్నాను. 

"అనఘ! మా మామ శకుని నాకై కడంగి జూదమాడెడి,
నీ తోడ గాదు నాక, నీతదొడ్డిన ధనరాసు
లెవ్వియైన బోడిగా నీకు నేనీయగలవాడ నేను" అని కూడా చెబుతాడు.

పుణ్యాత్మా! ఓ ధర్మరాజా! నా పక్షాన శకుని నీతో జూదమాడతాడు. కాదని అనకుండా ఇతడొడ్డిన ధనరాసులు ఏవైనా సరే, నీకిస్తాను. 

దీనికి బదులుగా ధర్మరాజు,  దుర్యోధనునితో మోసం, జూదం క్షత్రియధర్మానికి తగినవి కావు సుమా! ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్లు, ఈ రెండింటిని వదిలివెయ్యాలి. రాజు జూదం ఆడడం పాపపుపని, వంచన మార్గాలు అనుసరించే నీచపు జూదరులతో జూదమాడకూడదు. దానివల్ల లోకంలో ఎటువంటి వాళ్లయినా ధనాన్నీ, ధర్మాన్నీ కోల్పోతారు. అంతేకాక కపటద్యూతంలో గెలవటం మహాపాపమని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం ధర్మంగా చేసిన యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడైన దేవలుడు చెప్పాడు అంటాడు.

జూదమాడే కళలో నేర్పరివైన నీవే జూదాన్ని నిందించటం తగునా? జూదమాడటానికి నీవు భయపడితే మానుకొమ్మని శకుని రెచ్చకొట్టగా, "అన్యులకై యన్యులు జూదం బాడుట యెంతయు విషమం" ఒకరికై మరొకరు జూదమాడటం అక్రమమని అంటూ ధర్మరాజు, "బలవదూ్ద్యతార్థముగా బిలువంబడి మగుడనగునె"; బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్లటమా? జూదమాడటం తప్పని తెలిసికూడా, దైవనిర్ణయానుసారం అందుకు అంగీకరించాడు. 

చిత్రమేమంటే ఇంత తెలిసీ, ఇన్ని ధర్మాలు చెప్పీ ధర్మరాజు చివరకు జూదమాడాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని ద్యూతవ్యసనం అంత బలీయం (విధి బలీయం అంటారు గదా !)

ఇక ఘోషయాత్రలో ఎర్రన రచన:

ఇందులో ఒకే పద్యం ఉక్తివైచిత్రికి ఉదాహరణ. పాండవులు ద్వైతవనసరోవర తీరంలో వనవాసక్లేశాలను అనుభవిస్తున్నారని, వారి ముందు కౌరవసంపదను ప్రదర్శించి వారికి మరింత దుఃఖాన్ని కలిగించాలని, దుష్టచతుష్టయం పన్నాగం పన్నింది. 

ఘోషయాత్ర - గోరక్ష నెపంతో  వెళ్లిన దుర్యోధనుడు, చిత్రసేనుడనే గంధర్వరాజు చేత  బంధితుడై, ధర్మరాజు దయాభిక్షతో బయటపడతాడు. భీమార్జునులు గంధర్వులను జయించిన పిదప, పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని బంధాలను ఊడదీయించిన ధర్మరాజు, 

"ఎన్నడు నిట్టి సాహసము లింక ఒనర్పకుమయ్య! దుర్జనుం 
డన్నున సాహసక్రియల యందు గడంగి నశించు కావునం 
గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని యిమ్ముల బొమ్ము వీటికిన్ 
సన్నుత! దీనికొండొక విషాదము బొందకుమీ మనంబునన్" అని చెబుతాడు. 

నాయనా! దుర్యోధనా! ఎప్పుడైనా సరే, ఇటువంటి పరాభవాన్ని చేకూర్చే సాహసకృత్యాలను ఒడిగట్టకు. ఇపుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద భవిష్యత్కాలంలోనైనా బుద్ధి కలిగి ప్రవర్తించుము. 

దుర్జనుడు దురభిమానంతో తన అంతరం, ఎదిరి గొప్పతనం తెలియక, కన్నూ మిన్నూ కానక సాహసానికి కడంగి నశిస్తాడు. జాగ్రత్త సుమా! ఇక శీఘ్రంగా తమ్ములను, దొరలను వెంటబెట్టుకొని నీ రాజధాని నగరానికి వెడలిపో, మంచివారల చేత పొగడబడినవాడా! ఇట్టి అవమానం జరిగినందుకు ఎటువంటి దుఃఖాన్నీ మనసులో పెట్టుకోవద్దు. 

ఎర్రన వ్రాసిన పద్యాలలో ఇది తలమానికం. నన్నయగారి కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థసూక్తి, తిక్కనగారి సంభాషణ చాతురి, సజీవపాత్రచిత్రణ.. ఈ పద్యంలో కనబడుతాయి. ఈ పద్యం అల్పాక్షరముల అనల్పార్ధ రచనకు ఉదాహరణ. వ్యంగ్యంగా (ఎత్తిపొడుపుగా) అర్థాన్ని విశ్లేషిస్తే...

ఎన్నడూ ఇట్టి సాహసాలు ఇకపై ఒనర్పకుమయ్య- ఇక మీద ఇట్టి దుస్సాహసాలు చేయకుము. అనగా ఇంతకు పూర్వం దుర్యోధనుడు ఎన్నో చేసినట్లే కదా! అయితే ఇప్పుడు పాపం బ్రద్దలైంది. ఇటువంటి సాహసాలకే అతడు సద్యః ఫలం అనుభవించాడు, ప్రత్యక్షప్రమాణం నశించటం భావిసూచన.

"క్రన్నన తమ్ములం దొరల గైకొని పొమ్ము వీటికిన్" - ఇక్కడ నీవు పొందిన అవమానం నీ రాజధానిలోని వారలకు తెలియదు కదా! ఈ పరాభవాన్ని దులుపుకొని, ఏమియూ జరగనట్లుగా తిరిగి పొమ్ము, అనగా ఏమి మొగం పెట్టుకొని తిరిగి నీవు పోగలవు? అనే ఎత్తిపొడుపు.

ఇంత అవమానం నిలువెల్లా దహించే దుర్భరమైన అవమానాగ్ని కాదా? ధర్మరాజు పెట్టిన సున్నితమైన చీవాట్లు, దుర్యోధనుని ఆపాదమస్తకమూ దహించి, భావి ప్రాయోపవేశానికి నాందిగా, అతన్ని తేజోహీనుడు గావించింది. అందుకే ధర్మరాజును తిక్కన, "మెత్తని పులి" అన్నాడు.

తిక్కన రచన:

పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత, దుర్యోధనుడు ద్వైపాయనహ్రదంలో దాగి ఉన్నాడని బోయల ద్వారా తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తమ్ములతో, బంధువర్గంతో, శ్రీకృష్ణసమేతంగా వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులూ వ్యాపిస్తూ వుండగా, ఆ సరోవరాన్ని సమీపించాడు. 
దుర్యోధనా! నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు నీకు తప్పుతుందా? లోకంలో ఇట్టి నీచస్థితి నీకు తగునా? శూరుడవేనా? నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేయతగునా? రాజు ధర్మం వదిలితే ఇహపరాలుంటాయా?

యుద్ధంలో కుమారులు, తమ్ములు భయంకరంగా చనిపోగా, చూచినా, నీ బుద్ధి, నీ శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకున్నావు? రారాజు, పాండురాజకుమారుల భుజబల విజ్రుంభణానికి తట్టుకొనలేక మడుగులో దాగినాడట! అని ప్రజలు ఛీ కొట్టరా? చచ్చేటప్పుడు భుజబలదర్పం కూడా తొలగిపోయిందా?

"తెంపు జేసి మా మీద కురుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు పురుషుడవేని దీని ననుష్ఠింపు మనిన" - సాహసంతో మా మీదికి యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీన్ని ఆచరించు. మగటిమి కలవాడివైతే దీన్ని చేయుమని పలుకగా, దుర్యోధనుడు ధర్మరాజుతో, 18 రోజుల యుద్ధంలో అలసట చెంది, విశ్రాంతి కైకొన్నాను తప్ప యుద్ధభీతి కాదు. తనవారితో కలిసి అనుభవించదగు సుఖమే సుఖం గానీ, అదిలేనిచో రాజుకు అది రాజ్యమూ కాదు, ఆ సుఖము సుఖమూ కాదు. నీ సోదరులు, సేవకులు అందరూ బ్రతికే ఉన్నారు. ప్రపంచాన్నంతటినీ నీవే ఏలుకొమ్ము. "ఏనింక సమర మొల్లను మహీనాయక, నీక యుర్వినెల్ల నిచ్చితి శాంతిం, గానకు జని వల్కలపరిధానుడనై తపమొనర్చెదను మునుల కడన్" అంటాడు.

"ఓడివచ్చినాడ నుద్ధతి నాకేల? యుడుకు మాని నీవ యుర్వియేలు గుర్రములను ఏనుగులు లేని బయలు నీ తలనె కట్టికొనుము ధర్మతనయ!" నాకిక యుద్ధం వద్దు. ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను. శాంతంగా అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారచీరలు కట్టుకొని తపస్సు చేసుకొంటాను. ఓడిపోయి వచ్చాను, నాకెందుకయ్యా గర్వం? ఈ భూమిని నీవే పాలించుకొమ్ము. గుర్రాలూ, ఏనుగులూ లేని ఈ బీడును నీ నెత్తి మీదే కట్టుకొమ్ము.

దానికి ధర్మరాజు, ఈ ప్రలాపనలెందుకు గాని, ధర్మం ఎంచి యుద్ధానికి లెమ్ము. నీ ఈ దానమును రాజైన నేను అంగీకరించను. యుద్ధంలో నిన్ను చంపి భూమిని పాలిస్తాను. వైరులకు సంపదనిస్తాననే వెర్రివాడుంటాడా? అంటాడు.

దీనికి దుర్యోధనుడు మీ ఐదుగురు సేనలతో, బంధువులతో, అఖిలాస్త్రశస్త్రాలతో ఉన్నవారు. నేనా ఒక్కడను, తోడు లేనివాడను, అనేకులు ఒక్కడితో యుద్ధం చేయటం న్యాయమా? అని అడుగుతాడు.

ఇందుకు ధర్మరాజు దుర్యోధనా! యుద్ధంలో నిన్ను మా పక్షం నుండి ఒక్కడే ఎదిరిస్తాడు. అతడి గర్వాన్ని నీవు అణచగలిగితే ఈ రాజ్యాన్నంతా నీవే గ్రహించి దాని వైభవాన్ని అనుభవించుము. చివరి మాటగా, "ధర్మసుతు డాతనితో గద నొక్కరుండ నే గొనియెద నీదు ప్రాణములకుంఠితబాహువిలాసభాసినై" అని రెచ్చగొట్టాడు.

దుర్యోధనా! అకుంఠితభుజశక్తితో ప్రకాశిస్తూ గద గొని, నేనొక్కడినే నీ ప్రాణాలు తీస్తానని పలుకగా, "బుట్ట లోపలి మహాభుజగేంద్రుడు రోజునట్ట రోజె నధిప! యవ్విభుండు తన చిత్తము నప్పలుకుల్ గలంచినన్"- తన మనసును ధర్మరాజు మాటలు కలతపెట్టగా, దుర్యోధనుడు పుట్టలోని పెనుబాము బుసకొడుతూ రోజినట్లుగా బుస కొట్టాడు.

వెంటనే దుర్యోధనుడు జలస్తంభస్థితిని వదిలి నీటిమడుగు అల్లకల్లోలం కాగా, కులపర్వతం వలె ఒప్పారి, భయంకరాకారుడై గదాదండాన్ని తన భుజపీఠం మీద పెట్టుకుని వెడలి వచ్చాడు.


                                              *****

No comments:

Post a Comment