Sunday, November 11, 2012

గురుదక్షిణ (Gurudakshina)

 ఇది విలక్షణమైన భారతీయ సంప్రదాయం. జ్ఞానప్రదాత అయిన గురువును శిష్యుడు విద్యార్జన తర్వాత సత్కరింపదగిన విధి. దీనికి సంబంధించిన కథలు ఆదిపర్వంలో మూడు కనబడతాయి. 

1. ఉదంకోపాఖ్యానం
2. కూమార అస్త్ర విద్యాప్రదర్శన - గురుదక్షిణ
3. ఏకలవ్య చరిత్ర 

కటిక దారిద్ర్యంతో సతమతమై కుమారుని పాల కొరకు నాలుగు పాడి ఆవులు ఇవ్వకపోలేడా అని, భేదం లేని స్నేహితుడైన ద్రుపద మహారాజు చేత అవమానింపబడిన ద్రోణుడు 13 సంవత్సరాలు జీవచ్ఛవంగా బ్రతికి ఎలా ప్రత్యర్ధిపై పగతీర్చుకున్నాడో శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే సన్నివేశము ఈ కథ. 

ఇది ద్రోణవృత్తాంతం మహాభారతంలో విలక్షణమైన కథావృత్తాంతం. ఆదిపర్వంలో నన్నయ కృతం ఈ కథ. 
ద్రుపదద్రోణులు బాల్య స్నేహితులు, పాంచాలదేశాధీశుని కుమారుడు ద్రుపదుడు, భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణుడు. విచిత్రమేమంటే ఇరువురు అయోనిజులు, కారణజన్ములు. వేదాభ్యాసం, భరద్వాజ మున్యాశ్రమంలో, ధనుర్విద్య అగ్నివేశుని వద్ద అభ్యసించారు. 

గృహస్థాశ్రమంలో స్థిరపడవలసిన  మిత్రులు విడిపోతున్న సమయంలో, తన రాజ్యభోగముల ననుభవింపరమ్మని ద్రుపదుడు ద్రోణున్ని కోరతాడు. దానికి ఆమోదిస్తాడు ద్రోణుడు. 

కాలాంతరంలో ద్రోణుడు, కృపాచార్యుని చెల్లెలిని వివాహమాడి, అశ్వత్థామకు తండ్రి అవుతాడు. మున్యాశ్రమంలో విద్యార్జనే ధ్యేయంగా జీవిస్తూ అమితదారిద్ర్య దుఃఖాన్ని అనుభవిస్తాడు. పరిస్థితి ఎంత దారుణానికి వస్తుందంటే పిల్లవానికి ఆవుపాలను కూడా ఇవ్వలేని స్థితి దాపురిస్తుంది ద్రోణాచార్యునకు. 

అలాంటి సమయంలో సమయస్ఫూర్తితో, తల్లి పిల్లవానికి బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇస్తుంది. దానికి ఆ పిల్లవాడు సంతోషంతో, తాను కూడా ధనవంతుల బాలకుల వలె పాలు తాగుతున్నానని గంతులు వేస్తున్నట్లు వ్యాసుడు సంస్కృతంలో వ్రాశాడు. 
నిజం తెలుసుకున్న ద్రోణుడు దారుణదారిద్ర్య పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి ధనేక్షతో పరశురాముణ్ని ఆశ్రయిస్తాడు. అప్పటికే ఆయన ద్రవ్యాన్నంతా బ్రాహ్మణులకు దానం చేసేశాడు. విధి లేని పరిస్థితిలో ఆచార్యుని నుంచి శస్త్రాలు, సంపద మాత్రం గ్రహిస్తాడు. దీనివలన పరిస్థితి తిరిగి మొదటికే వచ్చింది. బ్రాహ్మణుడు దానపరిగ్రహణం కోసం రాజులను ఆశ్రయించవచ్చుగా? ద్రోణునివాక్కులో విందాం - "పురుష విశేషవివేకాపరిచయు లగు ధరణిపతుల పాలికి బోవం, బరులందు దుష్ప్రతిగ్రహభర మెదలో రోసి ధర్మపథముననున్నన్". 
వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గరికి వెళ్లటానికి, ఇతరుల నుండి చెడు దానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలోనే జీవితం గడుపుతుండగా...అప్పుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. మరి అతడు రాజు గదా? అలాగే తలచడా? కాదు, కానేకాదు. 
యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదంలేని మిత్రుని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోడా  అని,
పుత్రకళత్ర అగ్నిహోత్రశిష్యగణంతో నిండు సభలో కొలువు దీరిన ద్రుపదుని చూచి,
"ఏను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ, నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా పలికిన"- నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకొన్నవాడిని, తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపించి, ద్రోణునితో, ఇద్దరి అంతరం తెలియకుండా, నాతో ఈ విధంగా మాట్లాడతగునా కూడదా అని తలచక, నన్ను నీ స్నేహితుడినని చెప్పటం న్యాయంగా ఉందా? పేద బ్రాహ్మణులకూ, మహారాజులకూ స్నేహం ఎలా సాధ్యపడుతుంది? నోరు మూసుకుని పొమ్ము. అయ్యో, అసలు బ్రాహ్మణుడు రాజుకు ఎక్కడైనా స్నేహితుడు అవుతాడా ?
ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది ?
(మొదటి పద్యభాగంలో ద్రుపదుడు ద్రోణుని మనసును పుండు చేయగా, రెండవ పద్యంలోని మాటలు ఆ పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి.)
సమానమైన శీలం (స్వభావం), విద్య, సంపద, మంచి నడవడి గలవాళ్లకు
స్నేహం, వివాహం ఏర్పడతాయి కాని, సమానులు కాని వాళ్లకు ఏర్పడవు (కయ్యానికి వియ్యానికి సామ్యం ఉండాలి). 
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వశత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. అందుచేత మా వంటి రాజులకు మీవంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీలేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు - అని ద్రుపదరాజు ఐశ్వర్య గర్వంతో తిరస్కరించి మాట్లాడగా, ద్రోణుడు అవమానం చేత కలిగిన కోపం వలన కలత చెందిన మనసు కలవాడై, ఏం చేయటానికి తోచక, కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడా పట్టణం బయట కౌరవపాండు కుమారులు బంతి ఆట ఆడగా, బంగారు బంతి బావిలో పడింది. దానిని వెలికి ఎలా తీయాలో తెలియని బాలురను సమీపించి ద్రోణుడు, తన అస్త్రప్రావీణ్యంతో వరుస బాణాలను ప్రయోగించి బంతిని పైకి తీసి ఇచ్చాడు. 

వెంటనే బాలురు సంతోషించి ద్రోణుని, తాతగారైన భీష్మునకు పరిచయం చేస్తారు. అన్ని విషయాలను కూలంకషంగా విచారించి భీష్ముడు, ద్రోణుని వృత్తాంతం విని "రోయు తీగ గాళ్లం బెనగె దాననుచు బొంగి" - వెదుకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునకు ధనధాన్యాలిచ్చి సంతృప్తిపరచి కురుపాండు కుమారులకు గురువుగా నియమించాడు. 
"నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చి నాకోరిక మీలో ఎవ్వడు తీర్చగలడని అడుగగా కౌరవులందరూ మౌనం వహించగా, అర్జునుడు "నేను తీరుస్తా" నని ముందుకు వచ్చాడు. 
అంత, గురుడు అర్జునుని అపారప్రేమతో కౌగిలించుకొని ఎంతో సంతోషించి కుమారులందరికీ విలువిద్య నేర్పుతున్నాడు. 
"భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్ర 
విద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱ యందు 
విద్యోపదేశము తుల్యమైనను నుత్తమోత్తముడయ్యె 
విద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్"
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప శస్త్రాస్త్రవిద్యా బోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేషు్ఠడయ్యాడు

అస్త్రశస్త్రవిద్యలలో నిష్ణాతులైన కురుపాండుకుమారుల అస్త్రవిద్యానైపుణ్యాన్ని పెద్దల ముందు, ప్రజలముందు తెలియబరచేందుకు ధృతరాష్ట్రుడు అనుమతించాడు. 
తొలుతగా భీమదుర్యోధనులు తమ గదా పాటవాన్ని ప్రదర్శించారు. వారిద్దరి గదా కౌశలం రాబోయే కురుపాండవ మహాసంగ్రామాన్ని సూచించే విధంగా, ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకోగా, రంగస్థలం రణభూమిగా మారే ప్రమాదం గుర్తించి ఆచార్యుడు ఆ ప్రదర్శనను ఆపించాడు. 
వెంటనే అర్జునుడు రంగప్రవేశం చేసి తన విలువిద్యాప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 
అర్జునుని అస్త్రవిశేషాలు అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తిలకిస్తూ 
"వీడె కృతహస్తు డఖిలాస్త్రవిద్యలందు 
వీడె యగ్రగణ్యుడు ధర్మవిదులలోన 
వీడె భరతవంశం బెల్ల వెలుగ కుంతి 
కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు" - ఈ అర్జునుడే అస్త్రవిద్యలన్నింటిలో నేర్పరి, ఇతడే ధర్మం తెలిసినవాళ్లలో మొదట లెక్కపెట్టతగినవాడు. ఇతడే భరతవంశానికంతటికి కీర్తివచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజశాలి -అనుకున్నారట. 
ఆ తరుణంలో ప్రజలంతా ఎంతో భయపడేటట్లు భుజం చరచటం వలన పుట్టిన 
శబ్దం పర్వత సమూహంపై బడే మహావజ్రాయుధ శబ్దమా అనేటట్లు రాగా, అందరు సాలవృక్షం వలె ఎత్తైనవాడు, సహజ కవచకుండలాలతో ప్రకాశించేవాడు, బాలసూర్యుని పోలిన కర్ణుని చూచి ఆశ్చర్యపడ్డారు. 
అర్జునుడు చూపిన అస్త్రవిశేషములన్నింటిని శ్రమ లేకుండా చూపించి అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు కర్ణుడు.  
కర్ణుని ప్రవేశంతో దుర్యోధనునకు కొండంత ధైర్యం కలిగింది. అంగరాజ్యమిచ్చి ఆదరించాడు. శాశ్వత స్నేహాన్ని మహీనుతముగ పాటించేటట్లు కృతజ్ఞతాబద్ధుని గావించుకొన్నాడు. అర్జునుని వలన భయం తొలగి ఆనాటి నుండి రొమ్ముపై చేయుంచి నిశ్చింతగా నిద్రించాడు దుర్యోధనుడు. 

కుమారాస్త్ర విద్యా ప్రదర్శనానంతరం ద్రోణుడు, పాండుకుమారుల రాబనిచి, తనకు గురుదక్షిణ ఇవ్వవలసినదని ఆజ్ఞాపించాడు. 
13 సంవత్సరాల విద్యాభ్యాసానంతరం ద్రుపదుని విషయం జ్ఞాపకం చేసుకుని, అత్యధికసంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రుపదుడిని ఓడించి తీసుకురమ్మని, ఇదే తనకిష్టమైన గురుదక్షిణ అని పలికాడు. 
అడగటమే తరువాయి, కౌరవులంతా సేనాసమేతులై ద్రుపదరాజపురాన్ని ముట్టడించారు. ద్రుపదుని బాణపరంపరలకు ఓర్వజాలక రణభూమి నుండి నిష్క్రమించారు. 
అర్జునుడు మాత్రం గురువుతో సమాన శౌర్యపరాక్రమాలు గల ద్రుపదుని ఎదుర్కొనేందుకు వ్యూహం రచించి, భీమసేనుడు తన సైన్యానికి ముందు నడువగా నకుల సహదేవులు తన చక్రరక్షకులు కాగా ద్రుపదుడి సైన్యమనే సముద్రాన్ని తాకాడు. 
ద్రుపదుని ఏనుగుల సమూహమనే చీకటిని, అశ్వసమూహమనే మంచును, సైనిక సమూహమనే నక్షత్రసముదాయాన్ని తన బాణాల కిరణసంపద చేత అణగేటట్లు చేసి యుద్ధమనే ఆకాశవీధిలో సూర్యుడివలె ప్రకాశించాడు. 
కొండమీదకు దూకే కొదమసింహం వలె అర్జునుడు ద్రుపదుని రథం మీదికి ఎగిరిదూకి, అతడిని పట్టుకుని కార్యసాధకుడై రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుడిని సంతోషపెట్టాడు. 

అప్పుడు ద్రోణాచార్యులు ద్రుపదునితో - 
"వీరెవ్వరయ్య ? ద్రుపదమహారాజులె ! ఇట్లు 
కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె ? యహహ !
మహారాజ్యమదాంధకార మది వాసెనొకో "
వీరేవ్వరయ్యా ద్రుపద మహారాజులేనా ? ఈ విధంగా దిక్కులేక పట్టుపడవలసిన పరిస్థితి ఏర్పడిందే ? ఆహాహా ! మహారాజ్యమదం చేత కలిగిన కన్నుగానని తనం తొలగిపోయిందా? 
ఈ మాటలలో వింత వెటకారం ధ్వనిస్తున్నది. ద్రుపదా, నీ ఐశ్వర్యం, పరాక్రమం, నా శిష్యుల అధీనం, నా దయాభిక్ష అని తలపింపజేసి తన ఔన్నత్యాన్ని, అదృష్టాన్ని వ్యంగ్యంగా ద్రోణుడు ధ్వనింపజేస్తున్నాడు. 
"ఇంకనైన మమ్ము నెఱుగంగ నొక్కొ యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు విడిచి పుచ్చె గురుడు, విప్రుల అలుకయు దృణ హుతాశనంబు దీర్ఘమగునె?"
ఇక నుంచైనా, మమ్మల్ని గుర్తుంచుకోగలరా ? అని ఎగతాళి చేసి ద్రోణుడు, ద్రుపదుడిని విడిచిపెట్టాడు. బ్రాహ్మణుని కోపం, గడ్డినిప్పు ఎక్కువ కాలం ఉంటాయా? 
చేసిన స్నేహాన్ని మరిచేవారికి తగిన గుణపాఠం ద్రోణుడు, తన శిష్యుని ద్వారా సాధించి, లోకానికే ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా ఆచంద్రార్కంగా నిలిచే కీర్తిని గడించాడు. 
కథ ఇక్కడితో ముగిసిందా ? లేదు. లేనేలేదు. ఇక్కడి నుండే మొదలైంది. ఎలాగా?
ద్రోణుడికి జరిగిన అవమానం ద్రుపదుని నిండు సభలో - ఎవరి ముందు? పుత్రకళత్ర అగ్నిహోత్ర శిష్యగణం ముందు. 13 సంవత్సరాల మౌనం వహించాడు. కారణం పేదవానికోపం పెదవికి చేటన్న సామెత నెరిగిన బ్రాహ్మణోత్తముడు. మరి కార్యమెలా సాధించాడు? జరిగిన అవమానాన్ని భరిస్తూ, జీవచ్ఛవంగా బ్రతుకు ఈడ్చాడు. కాని అర్జునుడొక్కడే నేనున్నానని భరోసా ఇచ్చినప్పుడు, మనసులోని కోర్కెను దాచుకుని తనంతటి శిష్యుణి్న 13 సంవత్సరాలు శ్రమించి తయారు చేసుకున్నాడు. గురుదక్షిణతో కార్యసాధకుడయ్యాడు. 
కాని ద్రుపదుడు, ద్రోణుని పేదరికాన్ని ఎగతాలి చేసి స్నేహధర్మాన్ని కాలరాచాడు. 
కథకంతకూ ప్రాణప్రదమైన ద్రోణుని కోరిక ఏమిటో తెలిస్తే, ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. నన్నయగారి వాక్కుల్లో -
"వేడుటెంతయు కష్టమైనను వేఱు లేని సుహృజ్జనున్
వేడికో లుచితంబ కావున వేడ్కతో జనిసోమకున్ 
వేడినన్ ధన మోపడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాడికుఱ్ఱుల నీడె వీనికి బాలు ద్రావుచు నుండగన్" 

యాచించటం ఎంతో కష్టమైన పని, అయినప్పటికి భేదం లేని స్నేహితుణ్ని యాచించటం ఉచితమే అంచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా అశ్వత్థామ పాలు త్రాగటానికి నాలుగు పాడి ఆవులు ఇవ్వకపోడా? 

ఊహించండి, ఆనాడే ద్రుపదుడు ద్రోణున్ని ఆదరించి, బాల్యస్నేహానికి చిహ్నంగా నాలుగు పాడిఆవులు ఇచ్చి వుంటే, సంతోషంగా తీసుకువెళ్లగలిగిన ద్రోణుడు, మహాభారత సంగ్రామంలో ద్రోణపర్వానికి శ్రీకారం చుట్టగలిగేవాడేనా? 

"చిలికి చిలికి గాలివానలాగా" అన్న సామెతకు సాక్షిగా కథలో ప్రతి సన్నివేశం పాఠకుల హృదయాలను రంజింపచేస్తూ అజరామరంగా నేటికి నిత్యనూతనత్వాన్ని సంతరించుకుని కవిత్రయ ఆంధ్రమహాభారతం పండితపామరులను రంజింపచేస్తున్నది. 
ధన్యజీవులు ఆంధ్రులు !  


                                             ******

No comments:

Post a Comment