ఒక శిశువు ఇద్దరు తల్లులకు ఏకకాలంలో అర్ధశరీరంతో పుట్టడం ఎలా సాధ్యం? వైద్య విజ్ఞానశాస్త్రంలో ఎవరూ ఇలాంటి సంఘటన జరిగినట్లుగా చదువలేదు, వినలేదు, కనలేదు.
విశ్వసాహిత్యంలో ఇలాంటి ఆశ్చర్యకర కథను ఎవరైనా విన్నారా? చదివారా? ఆశ్చర్యం గొలిపే అంశం.
ఆంధ్ర మహాభారతంలో ఇలాంటి కథలెన్నో పరిశోధించి, సమగ్ర పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలను విజ్ఞానపరంగా, వైద్యవిద్యాపరంగా కూడా విచారించాల్సి ఉన్నది.
మచ్చుకి కొన్ని :
1. సద్యోగర్భమున సత్యవతీ పరాశరులకు వ్యాసుడు జన్మించాడు. అంటే తల్లిగర్భంలో 10 నెలలు పెరగకుండా భార్యాభర్తల సమాగమము అయిన వెంటనే జన్మించడం. అలాంటిదే కర్ణ జననం కూడ.
2. వసురాజు వీర్యంతో చేప గర్భందాల్చి సత్యవతి జన్మించడం (చేప అప్సర వనిత - శాపకారణం).
3. అగ్నిగుండంలో (యాగాగ్ని) ద్రౌపది అయోనిజగా పుట్టడం.
4. కృపుడు రెల్లుగడ్డి గంటలో, ద్రోణుడు కుండలో పుట్టడం అందరికీ తెలిసినదే.
5. తండ్రి గర్భ జననం.
పై వృత్తాంతాలకు సమాధానంగా ఆంధ్రమహాభారతం ఆదిపర్వంలో
"శూరుల జన్మము, సురల జన్మము, ఏరుల జన్మము ఎరుగనగునె ?" (శూరాణాంచ, నదీనాంచ, దుర్విదాః ప్రభవాః కిలా)
శూరుల, దేవతల, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా?
అలాంటిదే ఈ జరాసంధుని జన్మవృత్తాంతం. మగధరాజయిన బృహద్రధునకు ఇద్దరు భార్యలు, కాశీరాజు పుత్రికలు, కవలలు. బృహద్రధుడు సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. కాని ఫలితం కన్పించలేదు. పుత్రులు లేని సంపదలు వ్యర్థమని అడవికి వెళ్లి మునిశ్రేష్ఠుడైన చండ కౌశికుడిని భక్తితో నియమ నిష్ఠతో సేవించాడు.
కౌశికుడు రాజుసేవలను మెచ్చి వరమేదయినా కోరుకోమన్నాడు. అందుకు బృహద్రధుడు సంతానాన్ని ప్రసాదించమన్నాడు. ముని ధ్యానంతో కళ్లు మూసుకోగా మామిడిపండు ఒకటి ఆయన ఒడిలో పడింది. దానిని మంత్రించి ముని బృహద్రధునకిస్తూ తప్పక కుమారుడు కలుగుతాడని దీవించాడు.
రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ మహాప్రసాదాన్ని భార్యలిద్దరికి సమానంగా పంచియిచ్చాడు. కొద్దికాలానికి భార్యలిద్దరకు సగం బిడ్డలు జన్మించారు. వారు ఒక కన్ను, ఒక చెవి, అర్ధముఖము, కడుపు ఇలా సగం అవయవాలతో జీవం పోసుకున్నారు.
ఈ మానవాకార ముక్కలను రాజుకు చూపేందుకు సిగ్గుపడి కాన్పు చేసిన దాదులు రాణుల అనుమతితో రాజభవనం వెలుపలికి విసిరేశారు.
జర అనే రాక్షసి ఆ ముక్కలను చూసి, బలి ఇచ్చిన ప్రాణ శరీరాలని తలచి, రెండు ముక్కలను కలిపి గట్టిగా పట్టుకోగానే అవి రెండూ కలిసి ఒక శిశురూపాన్ని పొందాయి. వజ్రకఠిన శరీరంతో రూపం పొందిన ఆ బాలుడు గట్టిగా ఏడుపు అందుకున్నాడు. వెంటనే రాణులు చెలికత్తెలతో అక్కడకు పరుగున వచ్చి బాలున్ని తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బృహద్రధుడు సంతోషంతో జరనుద్దేశించి నీవు రాక్షసివి కావు. నీవు మా వంశాన్ని ఉద్ధరించటానికి వచ్చిన దేవతవని శ్లాఘించాడు.
జర కలిపినంతనే మానవరూపం దాల్చాడు కనుక ఆ శిశువుకు "జరాసంధుడు" అని నామకరణం చేశాడు రాజు. ఇద్దరు తల్లుల గారాల బిడ్డగా, బృహద్రధుని కలల పంటగా పెరిగాడు జరాసంధుడు. ఆయుధాలతో మరణం లేనివాడుగా, ముని ఆశీర్వాదబలంతో ఓటమిని ఎరుగని పరాక్రముడిగా రాజ్యమేలుతున్నాడు.
జరాసంధుడి కుమార్తె కంసుడి భార్య. శ్రీకృష్ణుడు కంసుని సంహరించడం వల్ల కుమార్తె ప్రేరణ వల్ల జరాసంధుడు మథురపై పదిమారులు దండెత్తాడు. ఆయుధ నిహతుడు గాని జరాసంధుడిని జయించలేమని తెలిసి శ్రీకృష్ణుడు మథుర నగరం నుంచి పారిపోయి చివరకు ద్వారక సముద్రతీరాన రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు. దుర్మార్గుడైన జరాసంధుడు లోకంలోని రాజులందరిని జయించి బంధించి కసాయిగా రోజుకొక్కరిని వధించి భైరవ పూజలు కావిస్తున్నాడు.
రాజసూయాధ్వర ప్రవర్తకుడైన ధర్మరాజు ఆజ్ఞమేరకు శ్రీకృష్ణుడు జరాసంధుడిని వధించేందుకు భీమార్జునులతో బ్రాహ్మణుల వేషధారులై అర్ధరాత్రమున గిరివ్రజము వెళ్లారు. శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు భీముడు ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడిని వధించి బందీలుగా ఉన్న వేలాదిమంది భూపతులను విడుదల చేశాడు. ఔత్తరాహిక సంస్కృత భారతప్రతితో నన్నయ ఏకీభవించి జరాసంధుని 13 రోజుల ద్వంద్వ యుద్ధంలో చంపినట్లు పేర్కొన్నాడు.
సంస్కృత భారత దాక్షిణాత్య ప్రతిలో అధ్యాహారంగా
"తత స్తుభగవాన్ కృష్ణో జరాసన్ధ జిఘాంసయా!
భీమసేనం సమాలోక్య నలం జగ్రాహ పాణినా ||
ద్విధా చిఛ్చేద వై తత్తు జరాసన్ధవధం ప్రతి ||
తత సా్త్వజ్ఞాయ తస్యైవ పాద ముతిక్షిప్య మారుతి: ||
ద్విధా బభజ్ఞ తద్గాత్రం ప్రాక్షిపద్ననాదచ ||
పున స్సనా్ధయ తు తదా జరాసన్ధః ప్రతాపవాన్ ! ....
"జరాసంధుని సంహరించవలెనన్న తలంపుతో శ్రీకృష్ణుడు భీమున్ని వీక్షించి ఒకగడ్డి పోచను చేతితో గ్రహించి రెండుగా చీల్చాడు. భీముడు శ్రీకృష్ణుని అభిప్రాయము గ్రహించి జరాసంధుని పాదము పట్టుకుని, రెండుగా చీల్చి రెండువైపుల విసరివేయగా, మరల అవి రెండు ఒకటిగా చేరి పునః జరాసంధుడు పునర్జీవితుడయ్యాడు. అంతట శ్రీకృష్ణుడు మరల గడ్డిపోచను రెండుగా చీల్చి వ్యత్యాసము చేసి విసరగా, కృష్ణుని ఇంగితము గ్రహించిన భీముడు జరాసంధుని దేహము మరల చీల్చి అదేవిధంగా విసరివైచి, వధ గావించి, సింహనాదము చేశాడు.
దాక్షిణాత్యుడైన నన్నయ, ప్రసిద్ధమైన జరాసంధ వధ - రెండుగా చీల్చి వ్యత్యాసం గావించి, విసిరేసి సంహరించటం అన్న విషయానికి మారుగా ఔత్తరాహిక సంస్కృత ప్రతిననుసరించి ద్వంద్వయుద్ధంలో సంహరించడం వెనుకగల అంతర్యమేమి తెలియకున్నది.
వైద్యవిజ్ఞానపరంగా కడుపులు రెండు ఒకటిగా కలిసిన కవలలు జన్మించడం చూస్తూనే ఉన్నాము. వాటిని శస్త్ర చికిత్స ద్వారా శస్త్ర నిపుణులు వేరు చేస్తున్నారు కూడా. కాని ఒక శిశువు ఇద్దరు తల్లులకు ఏకకాలంలో అర్ధశరీరంతో పుట్టడం వింతలో వింత. కాని ఆ తల్లులిద్దరు కవలలు కావటం సాధ్యమేమో, వైద్యవిజ్ఞానం ఇంకా పురోగతి సాధిస్తే సాధ్యాసాధ్యాలను విశ్లేషించవచ్చు.
*****
No comments:
Post a Comment