Sunday, November 18, 2012

గాంధారి (Gandhari)

భారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారి విశిష్ఠ పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెకు మానసిక క్షోభ నిరంతరం వెన్నంటింది. గాంధారి విధివంచిత, జాత్యంధుడైన భర్తను పితృవచన దత్తగా స్వీకరించి కళ్లకు గంతలు (నేత్రపట్టము) కట్టుకున్నందువలన సాధించిన ప్రయోజనము తెలియరాదు. పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే, కన్న 101 సంతానానికి మంచిచెడ్డలు ఎవరు బోధించాలి? బిడ్డకు కన్నతల్లి ప్రథమగురువు అంటారు. ఆమె ఆ బాధ్యత నేరవేర్చిందా?

అరణ్య మధ్యలో కార్చిచ్చుకు ధృతరాష్ట్ర దంపతులు ఆహుతి అయ్యేంతవరకు ఆమె మానసిక అంధురాలు. పుత్రులపై మమకారాన్ని చంపుకోలేక వారి మరణానికి దోహదపడ్డ దంపతులు వారు.
 
"ఆ చావు సావదగు ఆ న్నీచునకున్"

ఆ నీచునికి (అధముడికి) అట్లాంటి చావు తగినదే. కురుసార్వభౌముడైన దుర్యోధనుని గురించి స్వయంగా కన్నతల్లి గాంధారి భీమునితో అన్న మాటలివి.
ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు?
దుర్యోధనుడు కల్యంశమున పుట్టిన అసూయ, క్రోధదురభిమానాలున్న వ్యక్తి. పాండవుల తేజోవైభవముల మీద అతని కేర్పడిన అకారణ అసూయాద్వేషములే కౌరవ నాశనమునకు, సంఘవినాశనమునకు కారణభూతములైనవి.

బిడ్డలకు ప్రథమగురువు తల్లి. తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టము గట్టుకుని త్యాగమయ జీవితము గడిపినందువలన ఒనగూడిన ప్రయోజనము ఏ మాత్రమూ భారతమున కానరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై బడింది. శకుని కుటిలబుద్ధి అతనిని ఆత్మీయుడుగా చేసింది.

శాస్త్రాన్ని పరిశీలిస్తే..
- "ఉత్తమా ఆత్మనాఖ్యాతాః" స్వయంకృషితో వృద్ధిలోనికి వచ్చేవాడు ఉత్తముడు.
- "పిత్రు ఖ్యాతాశ్చ మధ్యమా" తండ్రివలన వృద్ధిలోనికి వచ్చేవాడు మధ్యముడు.
- "మాతులాశ్చాధమా" మేనమామ వలన ఉన్నతి సాధించేవాడు అధముడు.
- "శ్వశురా శ్చాధ మాధమా" పిల్లనిచ్చిన మామ వల్ల వృద్ధిలోనికి వచ్చేవాడు అధమాధముడు.

నేటి కలికాలంలో వీరి సంఖ్యే సమాజంలో అధికమవుతున్నది. ఏకాంతంలో మామ శకునితో, దుర్యోధనుడు "పాండవలక్ష్మిని ఎలా అపహరించాలి?" అని ప్రశ్నిస్తాడు. సూర్యతేజస్సుతో సమానమైన ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా మోసపు జూదమనే నెపంతో నీకు అపహరించి ఇస్తానని మాట ఇస్తాడు. ధర్మజుని ద్యూతవ్యసనం అనుకూలించటంతో దుర్యోధనుని అసూయ చల్లబడింది.

గాంధారి నూర్గురు పుత్రుల కన్నతల్లి. కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, గారాల కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు సింధు దేశాధిపతి, భర్త కురుసార్వభౌముడు. తాను రాజమాతగా కలకాలం తరగని దీప్తితో, సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి, దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది?

కోడలిని వేదవ్యాసుల వారు, గురుసారధీర బుద్ధి (విచక్షణతో కూడిన జ్ఞానం) కలిగినదని, అతిశాంతచిత్త, ధైర్యవంతురాలని కీర్తించాడు. జాత్యంధుడైన భర్తను పితృవచనదత్తగా స్వీకరించిన దొడ్డ ఇల్లాలు గాంధారి.

కుంతివలె కుమారులను గాంధారి పెంచలేదన్నది అక్షరసత్యం. కాని ఆమె తానుగా తీసుకున్న నిర్ణయం (నేత్రపట్టం) వెనుక, సంసారభారాన్ని ఎలా ఈదగలగాలని తలచిందో భారతంలో తెలియని అగాధ భాగంగా మనకు తోస్తున్నది.

వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోకముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్నెరిగిన వాడు కృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.

దుర్యోధనునకు అనునయవాక్యములు, ధర్మప్రపన్నాలు, ఒంటబట్టకపోయినా, కన్నతల్లిగా ఆమె ఆవేదనను లోకం గుర్తింపకపోలేదు. దుర్యోధనునకు హితము చెప్పుమని భర్త తన్నర్ధించినపుడు -

"నీ పుత్రు డవినీతు డగుట యెరిగి ఎరిగి వాని వశంబున నేల పోయెదీవు?
పాండవులకు నేమి యిచ్చి తేని యడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప" అని నిలదీసి భర్తను ప్రశ్నించిన గాంధారి, కురుసార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధము ప్రకటించిననాడే నేత్ర పట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించకల్గిన మాతగా జీవించి ఉంటే, భారతకథ ఏవిధంగా ఉండేదో కదా?
ఆమె కుమారుడు అధముడెందుకు కాగలిగాడో పాఠకులే నిర్ణయించాలి.

                                         *****

No comments:

Post a Comment