Tuesday, August 9, 2011

మహర్షి ఆదికవి నన్నయ (Maharshi Aadikavi Nannaya)

వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్య ప్రక్రియలో నిత్యసత్య వచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికి ఆంధ్రమహాభారత కావ్యం పండిత పామరులను ఆకట్టుకొంటున్నది. 

భూమిక్రిందున్న పాతాళలోకం చీకటిమయం కదా? అక్కడకు వెలుగు ఎలా ప్రసరిస్తుందన్న ప్రశ్నకు సమాధానం నన్నయ మహర్షి ఎలా చెప్పగాలిగారో చదివితే తెలుస్తుంది. 

ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆంధ్రమహాభారత రచన జరిగి నేటికి వెయ్యేళ్ళు కావస్తున్నది. నన్నయగారు 4000 పద్యాలలో ఆదిసభారణ్యపర్వాలను తెలుగు చేసారు. అరణ్యపర్వంలో 4వ  ఆశ్వాసంలో పద్యరచన ఆగింది. కారణం నన్నయ గారు పరమపదించడం. ఆంధ్రానువాదపీఠికలో తనను గురించి నన్నయగారు నిత్య సత్యవచనుడననీ, అవిరళజపహోమతత్పరుడననీ చెప్పుకున్నారు.

రాజరాజు కుల బ్రాహ్మణుగా ఉంటూ అనుదినం రాచకార్యాలలో పాల్గొంటూ కావ్యారంభంలో ఎంతో వినయశీలాన్ని ప్రదర్శించారు. వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్యప్రక్రియలో నిత్యసత్యవచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికీ ఈ రచన పండితపామరులను ఆకట్టుకొంటున్నది. "నా నృషిహ్ కురుతే కావ్యం" - మహాకావ్యాలను ఋషులే వ్రాయగలరు. మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను స్వీకరించిన మహోన్నత ఆదర్శపురుషులు. 

ఆనోభద్రా క్రతవోన్యంతువిశ్వతః - Let noble thoughts come to us from every side. ఋషులు మన కళ్లెదుటనున్న నిత్యసత్యాలను వెలికిదీసి చూపేవారు. మరి కవులో, అతిశయోక్తి అలంకారానికి జీవం పోసేవారు. ("కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " - ఏనుగుల సమూహం దోమ కుత్తుకలో ప్రవేశించటం). నన్నయగారు కావ్యారంభంలో స్మరించిన ఋషిపుంగవులు ఇద్దరే- వారే వాల్మీకి, వ్యాసులు. వారి అడుగుజాడల్లో నిత్యసత్యాలను వెదికి మనకు జ్ఞానతేజాన్ని చూపారు.

వాల్మీకి మహర్షిని - "దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు), గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి), అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)" అన్నాడు నన్నయ.

వ్యాసమహర్షిని - "భరతవాక్యములను శుభకరములైన కిరణములచేత సంసార దుఃఖమను చీకటి తొలగించి పండిత హృదయ కమలములకు వికాసము కల్గించిన వ్యాససూర్యుడు"గా కీర్తించాడు. వ్యాసహృదయకమల వికాసము శాశ్వతమని అన్నాడు.


ఆంధ్రభారతకావ్యాన్ని విశ్లేషిస్తే...


శకుంతల, దుష్యంతునిసభలో నిరాదరణకు గురియై, కుమారుడు భరతుని, రాజుకు చూపిస్తూ,

     "విపరీతప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ  ! ఈ పుత్రగా
      త్ర పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
      ద్ర పరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం బుత్రగా
      త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే ? కడున్ శీతమే ?"

    అంటుంది. ఓ రాజా, విరుద్ధాలైన మారుమాటలు ఎందుకు ? కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖానుభూతి పొందుము. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధం, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు మంచి చల్లదనాన్ని, సుఖాన్ని కలిగించలేవు. 

ఇందులో నన్నయ ఎన్నుకొన్న ఉపమానాలన్నీ, వ్యాసభారతంలో లేని విషయాలు. సర్వప్రాణులకు అంటే పశుపక్ష్యాదులకూ కౌగిలి సుఖం సమానమేనంటున్నాడు - విశ్వజనీన భావన. 

వేటకై వెళ్లిన దుష్యంతుడు అడవిలో తిరుగుతూ, తాను ముని ఆశ్రమంలో ప్రవేశించానని ఎలా ఊహించాడో, నన్నయ వాక్కులో చూడండి. 

"అపేయలతాంతములైనను బాయని మధుపప్రకరంబు జూచి"- దుష్యంతుడు చెట్లకొమ్మలు చూచాడు. వాటిపై పుష్పములు లేకున్నప్పటికీ తుమ్మెదల గుంపు కొమ్మలపై ఎలా వ్రాలాయి అని ఆశ్చర్యంగా తిలకిస్తున్న రాజుకు, కారణం వెంటనే స్ఫురించింది. యజ్ఞహవిస్సులో కమ్మని నెయ్యి, హోమద్రవ్యాలు ఋషులు వాడటం వల్ల సువాసనల పొగలతో చూరిన తీగలు ఆ చెట్ల కొమ్మలను అల్లుకొనడం వల్ల తుమ్మెదల గుంపులు అక్కడ చేరాయి.
  ఎంత కమ్మని మధురభావన ! 

ఉపమా కాళిదాసస్య (నన్నపార్యస్య) - ఉపమాలంకారానికి కాళిదాసుతో సమానుడు నన్నయ. కచదేవయాని కథలో కచుడు ఉదయ పర్వత గుహాద్వారము నుండి ఉదయించు పూర్ణచంద్రుడో యనునట్లు శుక్రాచార్యుని ఉదరము ఛేదించుకొని బయటకు వచ్చాడు. 

మరణించిన శుక్రాచార్యుడెలా బ్రతికాడో చూడండి -
   "విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై వెలుంగెదనుజమంత్రి ఉచ్ఛారణ దక్షుచేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".  

ఉచ్ఛారణ సామర్ధ్యం గల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన వేదశబ్దం ఎలా సజీవంతో వెలుగునో, ఆ విధంగా శుక్రాచార్యుడు కచుని చేత సంజీవనీవిద్య చేత బ్రతికింపబడ్డాడు. 

బ్రహ్మవేత్తలైన ఋషులే ఇలా భావన చేయగలరు. అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు. 

గర్భవతియైన జరత్కారువు భార్య (ఆస్తీకుని తల్లి) "దినకరగర్భయగు పూర్వదిక్సతివోలె" ఉన్నది అంటాడు నన్నయ. సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంత వలె ఆమె ప్రకాశించింది. 

      అలాగే కిరాతార్జునీయ సన్నివేశంలో -
 కం||   హరుశరమును నరు శరమును సరి నిరుపక్కియలు దాకి జవమఱి శరసం
         భరమున దిరిగె వరాహము శరనిధి మథనమున దిరుగు శైలముపోలెన్" 

శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపులా ఆ పందిని తాకాయి.  రెండు డొక్కలలో నాటుకొన్న ఆ రెండుబాణాల తాకిడికి ఆ వరాహం శక్తి నశించి క్షీరసాగరమథన సమయంలో తిరిగిన మందరపర్వతం  వలె గిరగిర తిరిగింది. 

    తాతగారు మనవడికి కథ చెప్తున్నాడు.
    1. భూలోకం మనమున్నది.
    2. పైన స్వర్గనరకలోకాలు
    3.  క్రింద- పాతాలలోకం 

  భూమి క్రిందున్న పాతాల లోకం చీకటి కదా తాతయ్యా, అక్కడకు వెలుగు ఎలా వస్తుందన్న మనవడి ప్రశ్నకు, నన్నయ మహర్షి సమాధానం చూడండి. 

"అలఘు ఫణీంద్ర లోకకుహరాంతర దీప్త మణి స్ఫురత్ ప్రభావలి
గలదాని, శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా
చలముని సౌఖ్యహేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబుల
వెలిగెడుదాని గాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్"

ఇది సముద్రవర్ణన. సముద్రం రత్నగర్భ. వెలలేని మాణిక్యాలకు నెలవు. అవి సముద్రం అట్టడుగున ఎందుకున్నవో తెలుసా? ఆ మణుల కాంతి పాతాళలోకానికి వెలుగు ప్రసాదించి, చీకటి పోగొట్టుటకే. అలాగే సముద్రగర్భంలో తపస్సు చేసుకొంటున్న మునుల చలిని పోగొట్టే బడబాగ్నికూడ వారికి సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నది. 
నిజంగా నన్నయగారు వేయి సంవత్సరాలకు పూర్వమే నీటిలో వెచ్చని శక్తి (కరెంటు) ఉందని చెప్పగలిగారు. మహర్షుల వాక్కులు అమోఘం, దివ్యం! 

అంధుడైన దీర్ఘతమమునిసత్తముని, ఒక్కడిని తల్లి ఆజ్ఞపై పడవలో బంధించి కుమారులు గంగాప్రవాహంలో వదలగా, కొట్టుకుపోతున్న ఋషి ఎంచేసాడు అన్న ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పకపోతే, మహర్షి నన్నయ ఏమంటున్నాడంటే - "ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయ స్వరభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదము చదువుచుండెనట"- ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయస్వరభేదం స్పష్టంగా తెలిపేటట్లు లక్షణ సహితంగా వేదాలను చదువుతూ కాలం వెళ్లబుచ్చాడు. 

"తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత 
యును ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
లనఘ, యుపనేత మరియు నిరంతరాధ్యాపకుండు,
ననగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు"

స్త్రీలకు తండ్రులుగా కన్నవాడినీ, అన్నం పెట్టినవాడినీ, భయం నుండి రక్షించినవాడినీ, మొత్తం వరుసగా ముగ్గురిని గురువులుగా ముచ్చటగా చెప్పుతారు. ఓ పుణ్యాత్ముడవైన మహర్షీ! పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసినవాడినీ, వేదాలు చెప్పినవాడినీ కలిపి మొత్తం ఐదుగురిని గురువులుగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు. 

"మూలంలో శరీరకృత్, ప్రాణదాతా, యస్య చాన్నానిభుంజతే,  క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరోధర్మదర్శనే" అని స్త్రీలకు గురువులైన ముగ్గురే చెప్పబడియుండగా, నన్నయ పురుషులకు ఐదుగురు గురువులని విశేషించి పేర్కొన్నాడు. 

శాస్త్ర సమ్మత నియమాలను పంచమవేదమైన భారతంలో మహర్షి వంటి నన్నయ తప్ప కవులెవరైనా నిర్దేశించి చెప్పగలరా? 

                                                *****

Saturday, July 30, 2011

తండ్రిగర్భ జననం (Thandrigarbha Jananam)

అఖిలలోక ప్రాణులు తల్లిగర్భం నుండే జన్మిస్తారు. మరి తండ్రి గర్భజననం అన్నది విశ్వసాహిత్యంలో వేదవ్యాస సృష్టిగానే గన్పడుతున్నది. ఈ కథ అతిప్రాచీనం. సముద్ర మథనం వల్ల దేవతలకు అమృతం అప్పటికి లభించలేదన్నమాట. 
గర్భం ధరించినవాడు రాక్షస గురువు శుక్రాచార్యుడు. గర్భస్థ శిశువు కచుడు, దేవతల గురువైన బృహస్పతి కుమారుడు. ఉత్కంఠభరితము ఈ కథ.  

అఖిలలోక ప్రాణులు తల్లి గర్భం నుండే జన్మిస్తారు. మరి తండ్రి గర్భ జననం అన్నది ప్రపంచంలోని ఏ సాహిత్యంలోనూ ఉన్నట్లుగా లేదు. సృష్టిలో అలా జన్మించటానికి ఎలా వీలు కలిగింది? ఆ జననానికి కారకులెవరు? గర్భస్థ శిశువు ఎలా జన్మించాడు? జననం తర్వాత తండ్రి బతికే ఉన్నాడా? మొదలైన ప్రశ్నలు కథ చెబుతున్న తాతగారిని ప్రశ్నిస్తే, ఆ మనవడికి తాత ఎలా సమాధానం చెపుతాడో చదవండి. 

క:  "ఉదర భిదా ముఖమున నభ్యుదితుండై   
      నిర్గమించె బుధనుతుడు కచుం-
      డుదయాద్రి దరీముఖమున నుదితుండగు
      పూర్ణహిమ మయూఖుడ పోలెన్"

దేవతలచే పొగడబడిన కచుడు ఉదయపర్వతగుహ ద్వారము నుండి ఉదయించు పూర్ణచండ్రుడోయనునట్లు శుక్రుని ఉదరము ఛేదించుకొని (కడుపు రంధ్రం నుండి) బయటకు వచ్చాడు. 

ఎవరీ కచుడు? ఎవరీ శుక్రుడు? 

ఆ కచుడే దేవతల గురువు బృహస్పతి యొక్క కుమారుడు. శుక్రుడే రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఈ దేవతలు, రాక్షసులు పరస్పరం కలహ స్వభావులు కదా మరి. వారు సఖ్యజీవులై ఎలా సన్నిహితులయ్యారు? 

ఈ కథ ఎంత ప్రాచీనమంటే, కథ జరుగుతున్న కాలంవరకు, దేవదానవ యుద్ధంలో దేవతలు మరణిస్తున్నారు. అంటే వారికి అమృతం ఇంకా లభ్యం కాలేదన్నమాట. (సముద్ర మథనానికి పూర్వకథ).
యుద్ధంలో మరణించిన రాక్షసులు మాత్రం తిరిగి బ్రతుకుతున్నారు. కారణం రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద ఉన్న మృతసంజీవని విద్య చేత.  చచ్చిన దేవతలు మాత్రం బ్రతకటం లేదు, కారణం ఆ విద్య వారివద్ద  లేకపోవటమే. 
అందుచేత రాక్షసులను జయించలేక, శుక్రుని వద్ద నుండి మృతసంజీవని విద్యను పొంది తిరిగి రాగల గొప్ప సమర్థుడెవ్వడా అని విచారించి, బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లి దేవతలు -

"బాలుండవు, నియమవ్రతశీలుండవు నిన్ను బ్రీతి జేకొని తద్విద్యాలలనాదానము గరుణాలయుడై జేయునమ్మహాముని నీకున్".

నీవు బాలుడివి. నియమాలు, వ్రతాలు నీకు స్వభావసిద్ధమైనవి. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడుగా స్వీకరించి, సంతోషంతో నీకా విద్యాకన్యను దయతో ఇవ్వగలడు అని కోరగా, కచుడు వెంటనే వృషపర్వుడి (రాక్షసరాజు) పట్టణానికి వెళ్లి, శుక్రాచార్యుని గని, "సూర్యసన్నిభుడవైన ఓ మహర్షీ, నేను కచుడనేవాడిని. బృహస్పతి కుమారుడిని. మీకు శుశ్రూష చేసి సేవించటానికి వచ్చాను" అన్నాడు. కచుని సౌకుమార్యాన్ని, అతని వినయప్రణయప్రియవచనాలలోని మెత్తదనాన్ని, తియ్యదనాన్ని, నిత్యనియమవ్రతాల వలన అతని ముఖంలో వెలిగే ప్రశాంతతను చూచి, శుక్రుడు మిక్కిలి ప్రేమతో, వీడిని పూజిస్తే దేవగురువును పూజించినట్లే అని తలచి, అతిథిమర్యాదలు చేసి అతడిని తన శిష్యుడుగా స్వీకరించాడు. 

గురుడు, గురుపుత్రియైన దేవయాని ఏ పని చెప్పినా వెంటనే చేస్తూ, కచుడు త్రికరణశుద్ధిగా  మిక్కిలి విధేయుడై, ఎన్నో సంవత్సరాలు వారిరువురిని కొలిచి ఎంతో నేర్పుతో వారి ప్రేమను పొందాడు. 

ఈ విధంగా కచుడు తన సేవానైపుణ్యంతో శుక్రుడికి ప్రియశిష్యుడై ఉండటం తెలిసికొని రాక్షసులు సహించలేక, దేవగురువైన బృహస్పతితో తమకుగల వైరాన్ని పురస్కరించుకొని కోపించి, ఆ కచుడు ఒకరోజు హోమ ధేనువులను కాస్తూ   ఒంటరిగా ఉండగా, అతడిని వధించి ఒక చెట్టు బోదెకు బంధించి వెళ్లిపోయారు. 
అప్పుడు సూర్యాస్తమయమైనది. హోమధేనువులు తిరిగి ఇంటికి వచ్చాయి. వాటి వెంబడి కచుడు రాకపోవటాన్ని గమనించి దేవయాని కలవరపడుతూ, తన తండ్రి   వద్దకు వెళ్లి కచుడు రాని విషయం తెలిపి, అడవిలో మృగరాక్షసపన్నగ బాధ పొందాడేమో అన్న ఆవేదనతో పలికింది. 

శుక్రుడు తన దివ్యదృష్టితో రాక్షసుల చేత చంపబడిన కచుని చూచి, అతడిని బ్రతికించి తెచ్చేందుకు మృతసంజీవని విద్యను పంపగా అది ప్రాణరహితుడైన కచుడిని తత్క్షణమే బ్రతికించి తన వెంట తీసుకొని రాగా చూచి శుక్రుడు, దేవయాని సంతోషించారు. 

కొన్నిరోజుల తర్వాత ఒకరోజున, రాక్షసులు పువ్వులు తెచ్చేందుకై అడవికి వెళ్లిన కచుడిని మళ్లీ చంపారు. అంతటితో ఆగక వాళ్లు అతడి రూపురేఖలు లేకుండా కాల్చి, ఆ బూడిదను మద్యంతో కలిపి గురువైన శుక్రాచార్యునకు త్రాపించారు. మత్తులో ఉన్న తండ్రిని లేపి దేవయాని, కచుడు ఇంకా ఇల్లు చేరలేదని, రాక్షసుల చేత చంపబడినవాడయ్యాడు కాబోలునని దుఃఖించింది. తండ్రి దానికి దుఃఖపడవలదని, ఉత్తమగతికి వెళ్లుగాక కచుడని ఒదార్చగా, 

"మతి లోకోత్తరుండైన అంగిరసు మన్మండు, ఆశ్రుతుండా బృహస్పతికిం బుత్రుడు మీకు శిష్యుడు సురూపబ్రహ్మచర్యశ్రుతవ్రతసంపన్నుడు, అకారణంబు దనుజవ్యాపాదితుండైన అచ్యుత, ధర్మజ్ఞ, మహాత్మ! అక్కచున కే శోకింపకెట్లుండుదున్". 

ధర్మమార్గం తప్పని ఓ తండ్రీ! మహానుభావా! బుద్ధియందు లోకాతీతుడైన అంగిరసుడనే మునికి మనుమడునూ, నిన్నాశ్రయించిన వాడునూ,  ప్రసిద్ధుడైన బృహస్పతికి కుమారుడునూ, మీకు శిష్యుడూ, మంచిరూపం గలవాడునూ, బ్రహ్మచర్యాశ్రమవ్రతంతో కూడినవాడునూ, అయినటువంటి కచుడు కారణం లేకుండానే రాక్షసుల చేత చంపబడినవాడు కాగా, అతడి కొరకు నేనెట్లా    దుఃఖించకుండా ఉంటాను?  ఆ కచున్ని చూచిన తర్వాత కాని అన్నం తినేందుకు అంగీకరించనని దేవయాని ఏడుస్తుండగా, చాలాసేపటికి అనుగ్రహం గలవాడై    శుక్రుడు, దివ్యదృష్టితో చూచి లోకాలోకపర్వతము వరకు విస్తరించిన ప్రపంచం మధ్యలో కచుడు కనిపించక, మద్యంలో కలిసిన బూడిద రూపాన తన కుక్షిలో ఉన్న ఆ కచుడిని చూచి, మద్యపానం చేసిన హానినీ, రాక్షసులు చేసిన కీడును తెలుసుకొని, మద్యపానదోషవిషయమై ఇలా ప్రజలను శుక్రాచార్యుడు శాసించాడు. 


"నేడు మొదలుకొని బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని పానం చేస్తే    పాపమందు తగులుకొని దుర్గతి పొందుతారు. పూర్వమందలి అనేకజన్మలలో పుణ్యకార్యాలు ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానాన్ని క్షణమాత్రంలోనే పోగొట్టే మద్యపానం జనులకు చేయదగదు. నేనీ కట్టడి చేసాను. మద్యం త్రాగటం గొప్ప పాపం!"

శుక్రాచార్యుడు తన పొట్టలో నున్న కచుడిని ఆ క్షణమందే మరల బ్రతికించగా కడుపులోనే ఉండి కచుడు శుక్రుడితో ఇట్లా పలికాడు - "ఓ మునిశ్రేషా్ఠ! నీ  అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని బలాన్ని పొందాను. నాకు దయతో నీ కడుపు నుండి బయటకు వచ్చే విధం తెలుపవలసింది".  దానికి శుక్రాచార్యుడు "నా కడుపు ఛేదిస్తే కాని నీవు బయటకు రాలేవు. కడుపు బ్రద్దలవటం చేత మూర్ఛపొందిన నన్ను నీవు మరల బ్రతికించాలి" అని కచుడికి సంజీవనివిద్యను ఉపదేశించగా, కచుడు శుక్రుడి కడుపు రంధ్రం నుండి బయటకు వచ్చాడు. 

ఆ తరువాత "విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై   వెలింగె దనుజమంత్రి యుచ్ఛారణ దక్షు చేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".
శుక్రుడు కచునిచే బ్రతికినవాడై ఉచ్ఛారణ సామర్ధ్యంగల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన శబ్దం ఎలా సజీవంగా వెలుగొందుతుందో అలా వేదశబ్దం వలె ప్రకాశించాడు. (ఈ పద్యంలోని ఉపమ అపూర్వం. శబ్దబ్రహ్మవేత్తలకే అది తెలుస్తుంది). అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు. 

ఈ విధంగా అధికమైన ప్రయత్నంతో కచుడు, శుక్రుడి నుండి మృతులను బ్రతికించే విద్యను పొంది స్వర్గలోకానికి తిరిగివెళ్తూ, దేవయానికి అతిప్రీతిపూర్వకంగా ఆ వార్త తెలుపగా ఆమె అతని ఎడబాటుకు దుఃఖించి తనను వివాహమాడుమని కోరింది. 

సంస్కృతభారతంలో వ్యాసుడు - స్వయానా నేను నీ తండ్రీ గర్భం నుండే జన్మించాను కాన నీవు నాకు భగినివి (సహోదరివి) అంటాడు. కాని ఆంధ్ర  మహాభారతంలో నన్నయగారు మార్చి "గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థము లోకధర్మ పథమిది, దీనిం బరికింపక, యీ పలుకులు తరుణీ గురుపుత్రి నీకు తగునే పలుకన్" అన్నాడు. 

గురువులకు శిష్యులు కొడుకులతో సమానులు. ఇది పరమసత్యం, లోకమనుసరించవలసిన ధర్మమార్గం. దీనిని ఆలోచింపక నన్ను వివాహమాడమని పలకటం నీకు తగినది కాదు అని పలుకగా, దేవయాని మిక్కిలి కోపించి, నీవు నా కోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీకు సంజీవనివిద్య ఉపయోగపడకుండు గాక అని శాపమిచ్చింది. కచుడు నేను ధర్మమార్గాన్ని అతిక్రమించనివాడను, నీ శాపవచనం చేత నాకు సంజీవనీవిద్య పనిచేయకపోయినా నా చేత ఉపదేశం గ్రహించినవారికి పనిచేస్తుందని, నీవు ధర్మం కాని పని (సోదరప్రాయుడైన నీ తండ్రియొక్క శిష్యుడిని పెళ్ళాడాలని) తలపోశావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడకుండు గాక అని ప్రతిశాపమిచ్చి స్వర్గానికి వెళ్లి దేవతలకు సంజీవనీవిద్య ఉపదేశించి దేవతలకు ఎనలేని మేలు చేశాడు. 

కచదేవయాని కథ భారతంలో చక్కని ప్రేమ కథ. ఆధునిక నవలాసాహిత్యంలో కనిపించే మలుపులన్నీ ఈ కథలో ప్రత్యక్షమవుతాయి. నన్నయ ఈ కచదేవయాని వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దాడు. ఈ కాలంలో యువతీయువకుల మధ్య ఏర్పడే ప్రేమానురాగాలకు దర్పణం కచదేవయానులు. చదువుకోవడానికి వచ్చాడు కచుడు. చూడచక్కనివాడైన కచుని దేవయాని ప్రణయానురాగాలతో చూచింది. తుదకు శుక్రాచార్యుడు అతనికి మృతసంజీవనివిద్య నేర్పి బ్రతికించే స్థితి కల్పించింది. నీవు బ్రహ్మచారివి, నిన్ను ప్రేమించానంటుంది. నీవు గురుపుత్రివి, సోదరతుల్యవని అతడు త్రోసిపుచ్చాడు. మాత్సర్యం, మమతానురాగాలు ఈ కథలో మలుపులు. ధర్మబద్ధుడు కచుడు. 

అవిరళ జపహోమతత్పరుడు నన్నయ. ధర్మనిగ్రహానికి ఈ కథ పరాకాష్ఠ.  


                                           *****   


Monday, February 21, 2011

వింటే భారతాన్నే వినాలి! (Vinte Bharathanne Vinali)

మన మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను ఆహ్వానించారు. సమస్త ప్రాణకోటికి సుఖశాంతులు ఆకాంక్షించారు. మాకు, వారికి అన్న సంకుచిత తత్త్వం వారి ఊహకే అందని విషయం. ( "ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః" వేదప్రమాణం  - Let noble thoughts come to us from every side.)

అలాంటి మన మహర్షులు ప్రపంచమానవాళికి  ప్రసాదించిన అమృతకలశములు రామాయణ, మహాభారత కావ్యములు. భారతీయ సాహితికి సువర్ణ శిరోభూషణములు. రామాయణము వాల్మీకి మహర్షి విశిష్ఠ సృష్టి, భారతము భారతీయ ధర్మతత్త్వ సమగ్రదృష్టి. ఈ మహాభారతాన్ని 3 సం||లు కృషి చేసి మహాభారత గ్రంధముగా వేదవ్యాసుడు రూపొందించినాడు.

విశ్వసాహితిలో మహాభారతము వలె మానవ స్వభావమును మథించి వివిధరీతుల విస్తృతముగ చిత్రించిన మహాకావ్యము ఇంకొకటి లేదు. యదిహాస్తి తదన్యత్ర అన్న ఆర్యోక్తి సర్వవిదితము.

భారతము గురించి వివిధజ్ఞాన వేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు:

1. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనిరి (Great Seers)
2. ఆధ్యాత్మవిదులు వేదాంతమనిరి (Philosophers)
3. నీతివిచక్షణులు నీతి శాస్త్రంబనిరి (Jurists)
4. లాక్షణికులు సర్వ లక్ష్యసంగ్రహమనిరి (Critics)
5. కవివృషభులు మహాకావ్యమనిరి (Poet laureates)
6. ఐతిహాసికులు ఇతిహాసమనిరి (Historians)
7. పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబనిరి. (Mythologists)

ఋషివంటి నన్నయ భట్టు 1000 సంవత్సరముల క్రితం సంస్కృతవ్యాస భారతాన్ని తెలుగులో రచించారు. ఆంధ్రసారస్వత ప్రపంచానికి తొలి తెలుగు గ్రంథం నన్నయ భారతమే.

వింటే భారతమే వినాలి, మరి తింటే గారెలే తినాలి అన్న నానుడి ఏనాటి నుంచో ఆంధ్రదేశంలో ఉన్నది. నన్నయ కాలం నాటికి తెలుగుభాషకు వ్యాకరణమే లేదాయె. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథము సంస్కృతములో విరచితం. అంటే ఆనాడు తెలుగు, వాడుకలో వికృత పదాలు మరియు అచ్ఛికశబ్దములు కలిగిన దేశభాష. 

"కై రాకుత్తుక జుట్టు వాక్షి మెఱయున్ గట్టాణి పేరెంతయున్" ఆనాటి తెలుగు మాట కవిరాజు కంఠసీమనలంకరించిన ముత్యాలసరము - అని దీని అర్థము.

మా ఇంటికి భోజనానికి రండి అంటే మీరు సంస్కృతంలో మాట్లాడుతున్నారు. పదహారు అణాల ఆంధ్రుడిగా మరి మీరు తెలుగులో ఎలా పిలవాలి? మా ఇంటికి కూటికి రండి అని గాని లేక మా ఇంటికి తిండికి రండని గాని; కాని నన్నయ గారు మహాభారత రచనలో నూటింట డెబ్బయి ఐదు తత్సమపదములు గొని తెలుగుజాతి స్మృతికి ఇంపు గొల్పు అక్షర రమ్యతను నిండుగా సాధించారు.

కృష్ణద్వైపాయన మునిశ్రేష్ఠుని చేత చెప్పబడిన మహాభారతార్థము,   స్పష్టమగునట్లు నన్నయ తెలుగులో రచించాడు. 

ధర్మరాజు వంటి రాజరాజు సంకల్పము, నరుని వంటి నన్నయభట్టు మిత్రసహకారము వల్ల ఇట్టి మహత్తర సాధనసంపత్తి సమకూడి, ఆంధ్రజాతి పుణ్యోదయమున ఆంధ్రమహాభారత శీర్షోదయమయినది.

జీవకోటిలో శ్రేష్ఠజీవి మానవుడు, లోకములోని వింతలలో వింత మానవ స్వభావము. మానవస్వభావగతులు బహువిధములు, సంకీర్ణములు. దాని మలుపులు అనేకాలు, ఆశ్చర్యకరాలు. మహాభారత పాత్రలు నిత్యము లోకములో మనకు కనిపించు వ్యక్తులు. మహాభారత ధర్మములు మానవజాతికి శాశ్వత సందేశములు. నేలమీద మానవుడు ఉన్నంతకాలం ఇది నూతనము. అతడు పరిపూర్ణకై పరిశ్రమించినంత కాలము ఇది అవశ్యపఠనీయము. ఆశక్తిజనకము. ఆలోచనామృతము.

మహాభారతపాత్రలు సజీవశిల్పాలు. వ్యాసమహర్షి వానిని అద్భుతముగ తీర్చి దిద్దినారు. కథారూపంగా మరపురాని మనోహర మూర్తులుగా మన ముందు నిలిపినాడు. 

మహాభారత కథలు:
హృద్యములు- హృదయమునకు హత్తుకునేవి, మనోహరములు. 
అపూర్వములు- పూర్వము లేనివి, నిత్య నూతనములు.
ఎఱుక సమగ్రమములు- పూర్తి  జ్ఞానము నొసంగునవి.
అఘనిబర్హణములు- పాపము పోగొట్టునవి.

ఆ మహాముని సంకల్పబలమో 
అతని ప్రోత్సహించిన రాజేంద్రుని ప్రేరణశక్తియో
ఆ కాలపు ప్రజల ఆమోదవిలసనమో
ఆంధ్రుల శాశ్వతభాగ్య విలాసమో లేక
అన్నింటి సమాహారఫలమో !

వేయి వసంతాలు గడిచినా, నిత్యనూతనత్వాన్ని నేటికీ ఆంధ్ర మహాభారతకావ్యం సంతరించుకుని, పండితపామర హృదయాలను తరగని పరువంతో రంజింపజేయగలుగుతున్నది.

                                           ******


Saturday, February 19, 2011

ఉపోద్ఘాతము (Upodghathamu)

మా తండ్రిగారైన కీ. శే. డా|| శ్రీ సి.యం. కృష్ణమూర్తి గారు కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధి గాంచిన వైద్య నిపుణులు. తేది 24-02-1940 న కృష్ణం చెట్టిపల్లె, గిద్దలూరు తాలుకా, ప్రకాశం జిల్లా లో తల్లితండ్రులైన చిత్తారి మాచరౌతు ఎల్లమ్మ, చిత్తారి మాచరౌతు వెంకటసుబ్బయ్య వర్మ గార్లకు జన్మించి, కర్నూలు పురపాలకోన్నత పాఠశాల,  కర్నూలు ఉస్మానియా కళాశాల, తదనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను  కొనసాగించి, జనరల్ మెడిసిన్ లో ఏం.డీ., డిగ్రీ తీసుకొన్నారు. విశాఖపట్టణం ప్రభుత్వ వైద్య కళాశాలలోను, గుంటూరు మరియు కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలోను వైద్య ఆచార్య (మెడిసిన్ ప్రొఫెసర్) పదవి నిర్వహించారు. 
తెలుగు భాష పై, తెలుగు సాహిత్యం పై నున్న అభిమానం కొలదీ డా|| కృష్ణమూర్తి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి తెలుగు లిటరేచర్ లో బ.ఏ., ఏం.ఏ., డిగ్రీలు కైవసం చేసుకున్నారు. కవిత్రయ మహాభారతముపై చిన్ననాటినుండే మక్కువ ఏర్పడి నిత్యపారాయణముగా చదివి, దాదాపు రెండు వేల పద్యములు కంటస్థం చేసారు. నన్నయ మహాభారతముపై ఆంధ్రదేశమున అనేక ప్రసంగాలు, సప్తాహాలు చేసారు. 2005, 2006 సం|| లలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో మహాభారతంపై  వ్యాసాలు ప్రచురించారు.  అమెరికా, ఇంగ్లండు దేశములలో కూడా నన్నయ మహాభారతముపై ఉపన్యాసములు వహించారు. 2007 న "కవిత్రయ మహాభారతంలో ధర్మసూక్ష్మాలు" అను పుస్తకమును రచించారు.  

రెండవ పుస్తకమును ప్రచురించు యత్నములో ఉండగా, దైవ నిర్ణయమున 2010 జూన్ 17 న దివంగతులయ్యారు. కవిత్రయ మహాభారతములోని ధర్మసుక్ష్మాలను వివిధ జనులకు అందించాలనే మా తండ్రి గారి ఆశయం నెరవేర్చడం కొరకు మరియు వారి స్మృతిగా తలపెట్టిన ఈ "పద్యాల వైద్యుడు" శీర్షికను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.