Tuesday, August 9, 2011

మహర్షి ఆదికవి నన్నయ (Maharshi Aadikavi Nannaya)

వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్య ప్రక్రియలో నిత్యసత్య వచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికి ఆంధ్రమహాభారత కావ్యం పండిత పామరులను ఆకట్టుకొంటున్నది. 

భూమిక్రిందున్న పాతాళలోకం చీకటిమయం కదా? అక్కడకు వెలుగు ఎలా ప్రసరిస్తుందన్న ప్రశ్నకు సమాధానం నన్నయ మహర్షి ఎలా చెప్పగాలిగారో చదివితే తెలుస్తుంది. 

ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆంధ్రమహాభారత రచన జరిగి నేటికి వెయ్యేళ్ళు కావస్తున్నది. నన్నయగారు 4000 పద్యాలలో ఆదిసభారణ్యపర్వాలను తెలుగు చేసారు. అరణ్యపర్వంలో 4వ  ఆశ్వాసంలో పద్యరచన ఆగింది. కారణం నన్నయ గారు పరమపదించడం. ఆంధ్రానువాదపీఠికలో తనను గురించి నన్నయగారు నిత్య సత్యవచనుడననీ, అవిరళజపహోమతత్పరుడననీ చెప్పుకున్నారు.

రాజరాజు కుల బ్రాహ్మణుగా ఉంటూ అనుదినం రాచకార్యాలలో పాల్గొంటూ కావ్యారంభంలో ఎంతో వినయశీలాన్ని ప్రదర్శించారు. వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్యప్రక్రియలో నిత్యసత్యవచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికీ ఈ రచన పండితపామరులను ఆకట్టుకొంటున్నది. "నా నృషిహ్ కురుతే కావ్యం" - మహాకావ్యాలను ఋషులే వ్రాయగలరు. మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను స్వీకరించిన మహోన్నత ఆదర్శపురుషులు. 

ఆనోభద్రా క్రతవోన్యంతువిశ్వతః - Let noble thoughts come to us from every side. ఋషులు మన కళ్లెదుటనున్న నిత్యసత్యాలను వెలికిదీసి చూపేవారు. మరి కవులో, అతిశయోక్తి అలంకారానికి జీవం పోసేవారు. ("కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " - ఏనుగుల సమూహం దోమ కుత్తుకలో ప్రవేశించటం). నన్నయగారు కావ్యారంభంలో స్మరించిన ఋషిపుంగవులు ఇద్దరే- వారే వాల్మీకి, వ్యాసులు. వారి అడుగుజాడల్లో నిత్యసత్యాలను వెదికి మనకు జ్ఞానతేజాన్ని చూపారు.

వాల్మీకి మహర్షిని - "దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు), గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి), అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)" అన్నాడు నన్నయ.

వ్యాసమహర్షిని - "భరతవాక్యములను శుభకరములైన కిరణములచేత సంసార దుఃఖమను చీకటి తొలగించి పండిత హృదయ కమలములకు వికాసము కల్గించిన వ్యాససూర్యుడు"గా కీర్తించాడు. వ్యాసహృదయకమల వికాసము శాశ్వతమని అన్నాడు.


ఆంధ్రభారతకావ్యాన్ని విశ్లేషిస్తే...


శకుంతల, దుష్యంతునిసభలో నిరాదరణకు గురియై, కుమారుడు భరతుని, రాజుకు చూపిస్తూ,

     "విపరీతప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ  ! ఈ పుత్రగా
      త్ర పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
      ద్ర పరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం బుత్రగా
      త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే ? కడున్ శీతమే ?"

    అంటుంది. ఓ రాజా, విరుద్ధాలైన మారుమాటలు ఎందుకు ? కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖానుభూతి పొందుము. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధం, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు మంచి చల్లదనాన్ని, సుఖాన్ని కలిగించలేవు. 

ఇందులో నన్నయ ఎన్నుకొన్న ఉపమానాలన్నీ, వ్యాసభారతంలో లేని విషయాలు. సర్వప్రాణులకు అంటే పశుపక్ష్యాదులకూ కౌగిలి సుఖం సమానమేనంటున్నాడు - విశ్వజనీన భావన. 

వేటకై వెళ్లిన దుష్యంతుడు అడవిలో తిరుగుతూ, తాను ముని ఆశ్రమంలో ప్రవేశించానని ఎలా ఊహించాడో, నన్నయ వాక్కులో చూడండి. 

"అపేయలతాంతములైనను బాయని మధుపప్రకరంబు జూచి"- దుష్యంతుడు చెట్లకొమ్మలు చూచాడు. వాటిపై పుష్పములు లేకున్నప్పటికీ తుమ్మెదల గుంపు కొమ్మలపై ఎలా వ్రాలాయి అని ఆశ్చర్యంగా తిలకిస్తున్న రాజుకు, కారణం వెంటనే స్ఫురించింది. యజ్ఞహవిస్సులో కమ్మని నెయ్యి, హోమద్రవ్యాలు ఋషులు వాడటం వల్ల సువాసనల పొగలతో చూరిన తీగలు ఆ చెట్ల కొమ్మలను అల్లుకొనడం వల్ల తుమ్మెదల గుంపులు అక్కడ చేరాయి.
  ఎంత కమ్మని మధురభావన ! 

ఉపమా కాళిదాసస్య (నన్నపార్యస్య) - ఉపమాలంకారానికి కాళిదాసుతో సమానుడు నన్నయ. కచదేవయాని కథలో కచుడు ఉదయ పర్వత గుహాద్వారము నుండి ఉదయించు పూర్ణచంద్రుడో యనునట్లు శుక్రాచార్యుని ఉదరము ఛేదించుకొని బయటకు వచ్చాడు. 

మరణించిన శుక్రాచార్యుడెలా బ్రతికాడో చూడండి -
   "విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై వెలుంగెదనుజమంత్రి ఉచ్ఛారణ దక్షుచేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".  

ఉచ్ఛారణ సామర్ధ్యం గల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన వేదశబ్దం ఎలా సజీవంతో వెలుగునో, ఆ విధంగా శుక్రాచార్యుడు కచుని చేత సంజీవనీవిద్య చేత బ్రతికింపబడ్డాడు. 

బ్రహ్మవేత్తలైన ఋషులే ఇలా భావన చేయగలరు. అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు. 

గర్భవతియైన జరత్కారువు భార్య (ఆస్తీకుని తల్లి) "దినకరగర్భయగు పూర్వదిక్సతివోలె" ఉన్నది అంటాడు నన్నయ. సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంత వలె ఆమె ప్రకాశించింది. 

      అలాగే కిరాతార్జునీయ సన్నివేశంలో -
 కం||   హరుశరమును నరు శరమును సరి నిరుపక్కియలు దాకి జవమఱి శరసం
         భరమున దిరిగె వరాహము శరనిధి మథనమున దిరుగు శైలముపోలెన్" 

శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపులా ఆ పందిని తాకాయి.  రెండు డొక్కలలో నాటుకొన్న ఆ రెండుబాణాల తాకిడికి ఆ వరాహం శక్తి నశించి క్షీరసాగరమథన సమయంలో తిరిగిన మందరపర్వతం  వలె గిరగిర తిరిగింది. 

    తాతగారు మనవడికి కథ చెప్తున్నాడు.
    1. భూలోకం మనమున్నది.
    2. పైన స్వర్గనరకలోకాలు
    3.  క్రింద- పాతాలలోకం 

  భూమి క్రిందున్న పాతాల లోకం చీకటి కదా తాతయ్యా, అక్కడకు వెలుగు ఎలా వస్తుందన్న మనవడి ప్రశ్నకు, నన్నయ మహర్షి సమాధానం చూడండి. 

"అలఘు ఫణీంద్ర లోకకుహరాంతర దీప్త మణి స్ఫురత్ ప్రభావలి
గలదాని, శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా
చలముని సౌఖ్యహేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబుల
వెలిగెడుదాని గాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్"

ఇది సముద్రవర్ణన. సముద్రం రత్నగర్భ. వెలలేని మాణిక్యాలకు నెలవు. అవి సముద్రం అట్టడుగున ఎందుకున్నవో తెలుసా? ఆ మణుల కాంతి పాతాళలోకానికి వెలుగు ప్రసాదించి, చీకటి పోగొట్టుటకే. అలాగే సముద్రగర్భంలో తపస్సు చేసుకొంటున్న మునుల చలిని పోగొట్టే బడబాగ్నికూడ వారికి సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నది. 
నిజంగా నన్నయగారు వేయి సంవత్సరాలకు పూర్వమే నీటిలో వెచ్చని శక్తి (కరెంటు) ఉందని చెప్పగలిగారు. మహర్షుల వాక్కులు అమోఘం, దివ్యం! 

అంధుడైన దీర్ఘతమమునిసత్తముని, ఒక్కడిని తల్లి ఆజ్ఞపై పడవలో బంధించి కుమారులు గంగాప్రవాహంలో వదలగా, కొట్టుకుపోతున్న ఋషి ఎంచేసాడు అన్న ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పకపోతే, మహర్షి నన్నయ ఏమంటున్నాడంటే - "ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయ స్వరభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదము చదువుచుండెనట"- ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయస్వరభేదం స్పష్టంగా తెలిపేటట్లు లక్షణ సహితంగా వేదాలను చదువుతూ కాలం వెళ్లబుచ్చాడు. 

"తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత 
యును ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
లనఘ, యుపనేత మరియు నిరంతరాధ్యాపకుండు,
ననగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు"

స్త్రీలకు తండ్రులుగా కన్నవాడినీ, అన్నం పెట్టినవాడినీ, భయం నుండి రక్షించినవాడినీ, మొత్తం వరుసగా ముగ్గురిని గురువులుగా ముచ్చటగా చెప్పుతారు. ఓ పుణ్యాత్ముడవైన మహర్షీ! పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసినవాడినీ, వేదాలు చెప్పినవాడినీ కలిపి మొత్తం ఐదుగురిని గురువులుగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు. 

"మూలంలో శరీరకృత్, ప్రాణదాతా, యస్య చాన్నానిభుంజతే,  క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరోధర్మదర్శనే" అని స్త్రీలకు గురువులైన ముగ్గురే చెప్పబడియుండగా, నన్నయ పురుషులకు ఐదుగురు గురువులని విశేషించి పేర్కొన్నాడు. 

శాస్త్ర సమ్మత నియమాలను పంచమవేదమైన భారతంలో మహర్షి వంటి నన్నయ తప్ప కవులెవరైనా నిర్దేశించి చెప్పగలరా? 

                                                *****

No comments:

Post a Comment