Saturday, July 30, 2011

తండ్రిగర్భ జననం (Thandrigarbha Jananam)

అఖిలలోక ప్రాణులు తల్లిగర్భం నుండే జన్మిస్తారు. మరి తండ్రి గర్భజననం అన్నది విశ్వసాహిత్యంలో వేదవ్యాస సృష్టిగానే గన్పడుతున్నది. ఈ కథ అతిప్రాచీనం. సముద్ర మథనం వల్ల దేవతలకు అమృతం అప్పటికి లభించలేదన్నమాట. 
గర్భం ధరించినవాడు రాక్షస గురువు శుక్రాచార్యుడు. గర్భస్థ శిశువు కచుడు, దేవతల గురువైన బృహస్పతి కుమారుడు. ఉత్కంఠభరితము ఈ కథ.  

అఖిలలోక ప్రాణులు తల్లి గర్భం నుండే జన్మిస్తారు. మరి తండ్రి గర్భ జననం అన్నది ప్రపంచంలోని ఏ సాహిత్యంలోనూ ఉన్నట్లుగా లేదు. సృష్టిలో అలా జన్మించటానికి ఎలా వీలు కలిగింది? ఆ జననానికి కారకులెవరు? గర్భస్థ శిశువు ఎలా జన్మించాడు? జననం తర్వాత తండ్రి బతికే ఉన్నాడా? మొదలైన ప్రశ్నలు కథ చెబుతున్న తాతగారిని ప్రశ్నిస్తే, ఆ మనవడికి తాత ఎలా సమాధానం చెపుతాడో చదవండి. 

క:  "ఉదర భిదా ముఖమున నభ్యుదితుండై   
      నిర్గమించె బుధనుతుడు కచుం-
      డుదయాద్రి దరీముఖమున నుదితుండగు
      పూర్ణహిమ మయూఖుడ పోలెన్"

దేవతలచే పొగడబడిన కచుడు ఉదయపర్వతగుహ ద్వారము నుండి ఉదయించు పూర్ణచండ్రుడోయనునట్లు శుక్రుని ఉదరము ఛేదించుకొని (కడుపు రంధ్రం నుండి) బయటకు వచ్చాడు. 

ఎవరీ కచుడు? ఎవరీ శుక్రుడు? 

ఆ కచుడే దేవతల గురువు బృహస్పతి యొక్క కుమారుడు. శుక్రుడే రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఈ దేవతలు, రాక్షసులు పరస్పరం కలహ స్వభావులు కదా మరి. వారు సఖ్యజీవులై ఎలా సన్నిహితులయ్యారు? 

ఈ కథ ఎంత ప్రాచీనమంటే, కథ జరుగుతున్న కాలంవరకు, దేవదానవ యుద్ధంలో దేవతలు మరణిస్తున్నారు. అంటే వారికి అమృతం ఇంకా లభ్యం కాలేదన్నమాట. (సముద్ర మథనానికి పూర్వకథ).
యుద్ధంలో మరణించిన రాక్షసులు మాత్రం తిరిగి బ్రతుకుతున్నారు. కారణం రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద ఉన్న మృతసంజీవని విద్య చేత.  చచ్చిన దేవతలు మాత్రం బ్రతకటం లేదు, కారణం ఆ విద్య వారివద్ద  లేకపోవటమే. 
అందుచేత రాక్షసులను జయించలేక, శుక్రుని వద్ద నుండి మృతసంజీవని విద్యను పొంది తిరిగి రాగల గొప్ప సమర్థుడెవ్వడా అని విచారించి, బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లి దేవతలు -

"బాలుండవు, నియమవ్రతశీలుండవు నిన్ను బ్రీతి జేకొని తద్విద్యాలలనాదానము గరుణాలయుడై జేయునమ్మహాముని నీకున్".

నీవు బాలుడివి. నియమాలు, వ్రతాలు నీకు స్వభావసిద్ధమైనవి. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడుగా స్వీకరించి, సంతోషంతో నీకా విద్యాకన్యను దయతో ఇవ్వగలడు అని కోరగా, కచుడు వెంటనే వృషపర్వుడి (రాక్షసరాజు) పట్టణానికి వెళ్లి, శుక్రాచార్యుని గని, "సూర్యసన్నిభుడవైన ఓ మహర్షీ, నేను కచుడనేవాడిని. బృహస్పతి కుమారుడిని. మీకు శుశ్రూష చేసి సేవించటానికి వచ్చాను" అన్నాడు. కచుని సౌకుమార్యాన్ని, అతని వినయప్రణయప్రియవచనాలలోని మెత్తదనాన్ని, తియ్యదనాన్ని, నిత్యనియమవ్రతాల వలన అతని ముఖంలో వెలిగే ప్రశాంతతను చూచి, శుక్రుడు మిక్కిలి ప్రేమతో, వీడిని పూజిస్తే దేవగురువును పూజించినట్లే అని తలచి, అతిథిమర్యాదలు చేసి అతడిని తన శిష్యుడుగా స్వీకరించాడు. 

గురుడు, గురుపుత్రియైన దేవయాని ఏ పని చెప్పినా వెంటనే చేస్తూ, కచుడు త్రికరణశుద్ధిగా  మిక్కిలి విధేయుడై, ఎన్నో సంవత్సరాలు వారిరువురిని కొలిచి ఎంతో నేర్పుతో వారి ప్రేమను పొందాడు. 

ఈ విధంగా కచుడు తన సేవానైపుణ్యంతో శుక్రుడికి ప్రియశిష్యుడై ఉండటం తెలిసికొని రాక్షసులు సహించలేక, దేవగురువైన బృహస్పతితో తమకుగల వైరాన్ని పురస్కరించుకొని కోపించి, ఆ కచుడు ఒకరోజు హోమ ధేనువులను కాస్తూ   ఒంటరిగా ఉండగా, అతడిని వధించి ఒక చెట్టు బోదెకు బంధించి వెళ్లిపోయారు. 
అప్పుడు సూర్యాస్తమయమైనది. హోమధేనువులు తిరిగి ఇంటికి వచ్చాయి. వాటి వెంబడి కచుడు రాకపోవటాన్ని గమనించి దేవయాని కలవరపడుతూ, తన తండ్రి   వద్దకు వెళ్లి కచుడు రాని విషయం తెలిపి, అడవిలో మృగరాక్షసపన్నగ బాధ పొందాడేమో అన్న ఆవేదనతో పలికింది. 

శుక్రుడు తన దివ్యదృష్టితో రాక్షసుల చేత చంపబడిన కచుని చూచి, అతడిని బ్రతికించి తెచ్చేందుకు మృతసంజీవని విద్యను పంపగా అది ప్రాణరహితుడైన కచుడిని తత్క్షణమే బ్రతికించి తన వెంట తీసుకొని రాగా చూచి శుక్రుడు, దేవయాని సంతోషించారు. 

కొన్నిరోజుల తర్వాత ఒకరోజున, రాక్షసులు పువ్వులు తెచ్చేందుకై అడవికి వెళ్లిన కచుడిని మళ్లీ చంపారు. అంతటితో ఆగక వాళ్లు అతడి రూపురేఖలు లేకుండా కాల్చి, ఆ బూడిదను మద్యంతో కలిపి గురువైన శుక్రాచార్యునకు త్రాపించారు. మత్తులో ఉన్న తండ్రిని లేపి దేవయాని, కచుడు ఇంకా ఇల్లు చేరలేదని, రాక్షసుల చేత చంపబడినవాడయ్యాడు కాబోలునని దుఃఖించింది. తండ్రి దానికి దుఃఖపడవలదని, ఉత్తమగతికి వెళ్లుగాక కచుడని ఒదార్చగా, 

"మతి లోకోత్తరుండైన అంగిరసు మన్మండు, ఆశ్రుతుండా బృహస్పతికిం బుత్రుడు మీకు శిష్యుడు సురూపబ్రహ్మచర్యశ్రుతవ్రతసంపన్నుడు, అకారణంబు దనుజవ్యాపాదితుండైన అచ్యుత, ధర్మజ్ఞ, మహాత్మ! అక్కచున కే శోకింపకెట్లుండుదున్". 

ధర్మమార్గం తప్పని ఓ తండ్రీ! మహానుభావా! బుద్ధియందు లోకాతీతుడైన అంగిరసుడనే మునికి మనుమడునూ, నిన్నాశ్రయించిన వాడునూ,  ప్రసిద్ధుడైన బృహస్పతికి కుమారుడునూ, మీకు శిష్యుడూ, మంచిరూపం గలవాడునూ, బ్రహ్మచర్యాశ్రమవ్రతంతో కూడినవాడునూ, అయినటువంటి కచుడు కారణం లేకుండానే రాక్షసుల చేత చంపబడినవాడు కాగా, అతడి కొరకు నేనెట్లా    దుఃఖించకుండా ఉంటాను?  ఆ కచున్ని చూచిన తర్వాత కాని అన్నం తినేందుకు అంగీకరించనని దేవయాని ఏడుస్తుండగా, చాలాసేపటికి అనుగ్రహం గలవాడై    శుక్రుడు, దివ్యదృష్టితో చూచి లోకాలోకపర్వతము వరకు విస్తరించిన ప్రపంచం మధ్యలో కచుడు కనిపించక, మద్యంలో కలిసిన బూడిద రూపాన తన కుక్షిలో ఉన్న ఆ కచుడిని చూచి, మద్యపానం చేసిన హానినీ, రాక్షసులు చేసిన కీడును తెలుసుకొని, మద్యపానదోషవిషయమై ఇలా ప్రజలను శుక్రాచార్యుడు శాసించాడు. 


"నేడు మొదలుకొని బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని పానం చేస్తే    పాపమందు తగులుకొని దుర్గతి పొందుతారు. పూర్వమందలి అనేకజన్మలలో పుణ్యకార్యాలు ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానాన్ని క్షణమాత్రంలోనే పోగొట్టే మద్యపానం జనులకు చేయదగదు. నేనీ కట్టడి చేసాను. మద్యం త్రాగటం గొప్ప పాపం!"

శుక్రాచార్యుడు తన పొట్టలో నున్న కచుడిని ఆ క్షణమందే మరల బ్రతికించగా కడుపులోనే ఉండి కచుడు శుక్రుడితో ఇట్లా పలికాడు - "ఓ మునిశ్రేషా్ఠ! నీ  అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని బలాన్ని పొందాను. నాకు దయతో నీ కడుపు నుండి బయటకు వచ్చే విధం తెలుపవలసింది".  దానికి శుక్రాచార్యుడు "నా కడుపు ఛేదిస్తే కాని నీవు బయటకు రాలేవు. కడుపు బ్రద్దలవటం చేత మూర్ఛపొందిన నన్ను నీవు మరల బ్రతికించాలి" అని కచుడికి సంజీవనివిద్యను ఉపదేశించగా, కచుడు శుక్రుడి కడుపు రంధ్రం నుండి బయటకు వచ్చాడు. 

ఆ తరువాత "విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై   వెలింగె దనుజమంత్రి యుచ్ఛారణ దక్షు చేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".
శుక్రుడు కచునిచే బ్రతికినవాడై ఉచ్ఛారణ సామర్ధ్యంగల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన శబ్దం ఎలా సజీవంగా వెలుగొందుతుందో అలా వేదశబ్దం వలె ప్రకాశించాడు. (ఈ పద్యంలోని ఉపమ అపూర్వం. శబ్దబ్రహ్మవేత్తలకే అది తెలుస్తుంది). అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు. 

ఈ విధంగా అధికమైన ప్రయత్నంతో కచుడు, శుక్రుడి నుండి మృతులను బ్రతికించే విద్యను పొంది స్వర్గలోకానికి తిరిగివెళ్తూ, దేవయానికి అతిప్రీతిపూర్వకంగా ఆ వార్త తెలుపగా ఆమె అతని ఎడబాటుకు దుఃఖించి తనను వివాహమాడుమని కోరింది. 

సంస్కృతభారతంలో వ్యాసుడు - స్వయానా నేను నీ తండ్రీ గర్భం నుండే జన్మించాను కాన నీవు నాకు భగినివి (సహోదరివి) అంటాడు. కాని ఆంధ్ర  మహాభారతంలో నన్నయగారు మార్చి "గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థము లోకధర్మ పథమిది, దీనిం బరికింపక, యీ పలుకులు తరుణీ గురుపుత్రి నీకు తగునే పలుకన్" అన్నాడు. 

గురువులకు శిష్యులు కొడుకులతో సమానులు. ఇది పరమసత్యం, లోకమనుసరించవలసిన ధర్మమార్గం. దీనిని ఆలోచింపక నన్ను వివాహమాడమని పలకటం నీకు తగినది కాదు అని పలుకగా, దేవయాని మిక్కిలి కోపించి, నీవు నా కోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీకు సంజీవనివిద్య ఉపయోగపడకుండు గాక అని శాపమిచ్చింది. కచుడు నేను ధర్మమార్గాన్ని అతిక్రమించనివాడను, నీ శాపవచనం చేత నాకు సంజీవనీవిద్య పనిచేయకపోయినా నా చేత ఉపదేశం గ్రహించినవారికి పనిచేస్తుందని, నీవు ధర్మం కాని పని (సోదరప్రాయుడైన నీ తండ్రియొక్క శిష్యుడిని పెళ్ళాడాలని) తలపోశావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడకుండు గాక అని ప్రతిశాపమిచ్చి స్వర్గానికి వెళ్లి దేవతలకు సంజీవనీవిద్య ఉపదేశించి దేవతలకు ఎనలేని మేలు చేశాడు. 

కచదేవయాని కథ భారతంలో చక్కని ప్రేమ కథ. ఆధునిక నవలాసాహిత్యంలో కనిపించే మలుపులన్నీ ఈ కథలో ప్రత్యక్షమవుతాయి. నన్నయ ఈ కచదేవయాని వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దాడు. ఈ కాలంలో యువతీయువకుల మధ్య ఏర్పడే ప్రేమానురాగాలకు దర్పణం కచదేవయానులు. చదువుకోవడానికి వచ్చాడు కచుడు. చూడచక్కనివాడైన కచుని దేవయాని ప్రణయానురాగాలతో చూచింది. తుదకు శుక్రాచార్యుడు అతనికి మృతసంజీవనివిద్య నేర్పి బ్రతికించే స్థితి కల్పించింది. నీవు బ్రహ్మచారివి, నిన్ను ప్రేమించానంటుంది. నీవు గురుపుత్రివి, సోదరతుల్యవని అతడు త్రోసిపుచ్చాడు. మాత్సర్యం, మమతానురాగాలు ఈ కథలో మలుపులు. ధర్మబద్ధుడు కచుడు. 

అవిరళ జపహోమతత్పరుడు నన్నయ. ధర్మనిగ్రహానికి ఈ కథ పరాకాష్ఠ.  


                                           *****