Monday, June 24, 2013

Arjunudu

నరనారాయణావతారములలో నరుడే అర్జునుడు. ఇంద్రానుగ్రహం వల్ల కుంతీ పాండురాజులకు జన్మించిన కుమారుడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో ధనుర్ధరుడై విష్ణువువలె నున్న అర్జునుని జూచి ప్రజలు ఈ విధంగా అనుకొన్నారు- "వీడె సర్వాస్త్ర విద్యలందు నేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వారిలో ఉత్తముడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజబలుడు అని".  

అర్జునుడు ఇంద్రానుగ్రహంతో కుంతీపాండురాజులకు జన్మించిన కుమారుడు. 

"స్థిరపౌరుషుండు లోకోత్తరు డుత్తర ఫల్గునీ ప్రథమపాదమునన్, సురరాజు వంశమున భాసురతేజు వంశకరుడు సుతు డుదయించెన్"-
స్థిరమైన, పౌరుషం గలవాడు, లోకంలోకెల్ల శ్రేష్ఠుడు,  ప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు అయిన కుమారుడు దేవేంద్రుని అంశతో ఉత్తరఫల్గునీ నక్షత్ర ప్రథమపాదంలో జన్మించాడు. 

పుట్టగానే ఆకాశవాణి ఉరుము వలె గంభీరంగా ఇలా పలికింది. ఇతడు అర్జుననామంతో వెలిగి, దేవతల నోడించి ఖాండవాన్ని దహిస్తాడని. ఎల్లరాజుల జయించి అన్నగారైన ధర్మజుచేత రాజసూయ యాగాన్ని చేయించి దేవతల వలన దివ్యాస్త్రాలు పొంది శత్రుంజయుడు కాగలడని భవిష్యత్తును చెప్పింది. పూలవాన కురిసింది. 

ధర్మజుడనే ధర్మశక్తికి, భీముడు భౌతికబలాన్ని కూర్చగా, అర్జునుడు దైవబలాన్ని అనుసంధించేవాడు అయ్యాడు. ఆభిజాత్యం గురించి తెలుసుకున్నాక, సంస్కారవంతుడెలా అయ్యాడో తెలుసుకుందాం.

విద్యాభ్యాసం: ద్రోణుడు కురుపాండవుల ఆస్థాన విలువిద్యాచార్యుడుగా నియుక్తుడయ్యాడు. నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చి నా కోరిక మీలో ఎవ్వడు తీర్చగలడని అడుగగా కౌరవులందరూ పెడమొగాలు పెట్టి మౌనం వహించగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. ఆచార్య హృదయము గెలుచుకున్నాడు. అర్జునుడు శస్త్రాస్త్రవిద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుని సంతోషపరచేవాడు. 

ద్రోణుని వలన గొప్ప శస్త్రాస్త్రవిద్యాబోధనను పొందటంలో రాకుమారులంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వ శ్రేష్ఠుడయ్యాడు. కుమారాస్త్ర విద్యాప్రదర్శన సమయమున ప్రజలందరూ, అర్జునుడు చూపిన అస్త్రవిశేషములకు ఆశ్చర్యచకితులై-

"వీడె కృతహస్తు డఖిలాస్త్రవిద్యలందు
వీడె అగ్రగణ్యుడు ధర్మవిదులలోన 
వీడె భరతవంశం బెల్ల వెలుగ గుంతి 
కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు"

ఈ అర్జునుడే అస్త్రవిద్యలన్నింటిలో నేర్పరి. ఇతడే ధర్మం తెలిసిన వాళ్లలో మొదట లెక్క పెట్టదగినవాడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజబలుడు. తల్లి కుంతీదేవి ధన్యురాలు గదా!

ద్రుపదావమానజనితమన్యు ఘూర్ణమాన మానసుండయిన ద్రోణుడు, 13 సంవత్సరాల తర్వాత తనంతటి శిష్యుడైన అర్జునుని వలన "ఐశ్వర్యకారణదారుణగర్వితుండైన" ద్రుపదుని, రథాక్షమునకు కట్టి తెచ్చి, తన పాదాలపై బడేట్లుగా గురుదక్షిణ పొందాడు. దీనితో ద్రోణార్జునుల సంబంధము సామాన్య గురుశిష్యస్థాయి ననుగమించి పుత్రస్థాయి నందుకొన్నది. ఆచార్యుడు అర్జునునకు బ్రహ్మాస్త్రము బోధించి అతిరథవీరుడుగా తీర్చిదిద్దాడు. 

ఇది మొదలు అర్జునుని అస్త్రవిద్యాకౌశలము అసాధారణమైన జయముల సాధించినది. అపారకీర్తి నార్జించినది. ద్రుపదపురమున మత్స్యయంత్రము ఛేదించి సకలరాజసమక్షమున ద్రౌపదిని గెలుచుకొన్నది. 

శ్రీకృష్ణుని ప్రశంసను, ప్రేమను పొందినది; సుభద్రా వివాహముతో శ్రీకృష్ణ సఖ్యము బాంధవ్యముగా పరిణమించింది. యాదవబలము కొనితెచ్చినది. అంతేగాక, అర్జునుని అస్త్రవిద్యాకౌశలము ఖాండవదహనమున అగ్నిహోత్రునికి సాయపడి గాండీవమును, అక్షయతూణీరమును దివ్యరథమును సాధించినది. 

రాజసూయపూర్వ దిగ్విజయము ఆయనను లోకైకవీరుడుగా చాటింది. అరణ్యవాససమయంలో పరమేశ్వరుని మెప్పించి పాశుపతము నార్జించుకొన్నాడు. దేవేంద్రుని అనుగ్రహమును, దేవతలందరి చేత దివ్యాస్త్రములు పొంది, సాటిలేని వీరుడుగా, గణుతికెక్కి క్షత్రియలోకమున అద్వితీయ ధనుర్ధరుడై అజేయుడనిపించుకొన్నాడు. ఇంత కీర్తిమంతుడైనను అర్జునుడు గురువు పట్ల గాని, అన్నల పట్ల గాని, పెద్దల పట్ల గాని, అవిధేయతను ఎన్నడు ప్రకటింపలేదు. ధర్మబద్దుడుగా, సౌశీల్యవంతుడుగా రాణించాడు. 
ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునుడు గురునికి ప్రదక్షిణముగా తేరు నడిపి ఆయన ఆశీర్వాదబలము పొంది విజయుడయ్యాడు.

అభిమన్యుని వధతో కుమిలిపోవుచు, పుత్రుని చంపిన సైంధవుని సూర్యాస్తమ సమయము కాక ముందే చంపుదునని, కాదేని గాండీవముతో పాటు అగ్నిలో ప్రవేశింతునని ప్రతినబూని, అర్జునుని శకటవ్యూహంలో అడ్డగించిన గురుని, అర్జునుడు పుణ్యాత్మా! నన్ను, అశ్వత్థామను సమానమైన ప్రేమతో పెంచావు. ద్రోహియైన సైంధవుడిని చంపటానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరేటట్లు చేయుము అని అర్ధించాడు. తన్ను జయించుటకు వెంటబడిన గురుని జూచి, నాకు గురుడవు కాక శత్రుడవా? యుద్ధంలో కోపగించిన నిన్నెదుర్కొనటానికి నాకు సాధ్యమా? అది శివుడి కొక్కడికే సాధ్యం అంటూ పొగడాడే తప్ప పరుషోక్తుల నిందింపలేదు.
చివరకు ద్రోణుని దారుణముగ వధించిన ద్రుష్టద్యుమ్నుని గూడ దూషించకుండ విడువలేదు. ఈ విధంగా అర్జునుని గురుభక్తి ఆద్యంతము అచంచలంగా నిలిచి ఆదర్శశిష్యప్రవృత్తికి ధ్వజప్రాయమై నిలిచింది. శాశ్వతకీర్తి ఇరువురినీ వరించింది. 

అర్జునుని భ్రాతృభక్తి అసమానం. ధర్మజుని భక్తి గౌరవములతో సేవించినాడు. అప్పుడప్పుడు ఆవేశముతో అన్న నెదిరించు భీమసేనుని అనునయించి సాంత్వవచనములతో ఓదార్చినాడు. అన్న ద్యూతవ్యసనమును, దాని దారుణ పరిణామములను, కష్టనష్టములను ఓపికతో భరించినాడు. భీమసేనుడు ఆవేశపడి జూదమాడిన అన్న చేతులు కాల్తునని విజ్రుంభించినపుడు, అర్జునుడు ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా ? స్నేహంగా ఆడుకునే జూదానికి, ధర్మం కొరకు చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్లు పిలిస్తే ప్రభువైనవాడు పూనుకోకుండ, పెడమొగం పెట్టి పోకూడదన్న శుభక్షత్రియధర్మాన్ని ఆయన లోకంలో నిలిపాడని సమర్థించాడు. ధర్మజుని ఆజ్ఞననుసరించి దుర్యోధనుని గంధర్వుల బారి నుండి రక్షించాడు. సైంధవుని భీముడు చంపబోవ, అన్న మాట గుర్తు చేసి వాని ప్రాణరక్ష కావించాడు. అర్జునుని భ్రాతృభక్తి, ధర్మరక్తి అనుపమానములు. 

గగుర్పాటు కలిగించే సన్నివేశమొకటి కర్ణపర్వంలో చూద్దాము. సమతాగుణశోభితుడైన ధర్మరాజు, కర్ణుని చేత చావుదెబ్బలు తిని సమతను కోల్పోయి, అర్జునుని నిందించి గాండీవము అన్యుల కిమ్మనుట, భ్రాతృభక్తికి పరాకాష్ఠగా నిల్చిన తమ్ముడు, అన్నను హత్య జేయబూనుట, ఊహింపరాని ఆశ్చర్యకర సంఘటన! శ్రీకృష్ణుని చొరవతో ఇది పరిష్కారం కావటం నిజంగా ముదావహం. లేకున్న పరిణామాలు మహాదారుణంగా ఉండేవి.

తన రెండవనాటి యుద్ధంలో కర్ణుడు, ధర్మరాజుపై విజ్రుంభించి పలుబాణాలతో బాధించాడు. అతడు భీముని వద్దకు పోయిదాక్కున్నాడు. కర్ణుడు అతడిని వెంటాడి వేధించాడు. ధర్మజుడు ఎదుర్కొనలేక విచారంతో నిజశిబిరానికి తిరిగి వెళ్లాడు. 

అర్జునుడానాడు రణం ప్రారంభించే ముందు కర్ణుని వధించిగాని తిరిగి రానని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజుకు కలిగిన బడలికలను గురించి పరామర్శించటానికై అర్జునుడూ, కృష్ణుడూ మధ్యాహ్నమే తిరిగి రావటం, ఆయనకు ఆశ్చర్యానందాలు కలిగించింది. 

కృష్ణార్జునులిరువురూ ధర్మరాజును కుశలప్రశ్నలతో పలుకరించారు. అర్జునుడు యుద్ధంలో కర్ణుడిని చంపివచ్చాడనే అభిప్రాయంతో అతడిని ధర్మరాజు అభినందించాడు. కర్ణుడిని చంపిన విధానాన్ని వివరించుమని ఆర్జునుడిని ఆసక్తిగా అడిగాడు. 

దీనికి అర్జునుడు తటపటాయిస్తూ, మీరు కర్ణుడిచేత బాధితులయి రణరంగం వదలివచ్చారని, శిబిరంలో ఉన్నారని భీమసేనుని వలన విని, మీ కుశలం తెలిసికొని తిరిగిపోయి కర్ణుడిని సంహరిద్దామని వచ్చానన్నాడు. 

అర్జునుడి మాటలు విని, ధర్మరాజు మండిపడ్డాడు. కర్ణుడింకా బ్రతికి ఉన్నాడన్న వార్త అతడికి ఉడుకెక్కించింది. కినుకతో, అర్జునా! దుర్యోధనాదులు చూస్తూ ఉండగా కర్ణుడు నన్ను యుద్ధంలో అవమానాలపాలు చేశాడు. భీముడు సదా నన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఈ రోజున అభిమన్యుడు గాని, ఘటోత్కచుడు గాని ఉన్నట్లయితే నా స్థితి ఇట్లా ఉండేదా?

అర్జునా, కృష్ణుడు అండగా ఉండగా భయపడి ఎందుకు వచ్చావు? నీవు గాండీవాన్ని కృష్ణున కిమ్ము, నీవు నొగలెక్కి కూర్చుండి రథచోదకుడవు కమ్ము. శ్రీకృష్ణుడే కార్యనిర్వాహకుడౌతాడు అని అన్నాడు. 

ధర్మరాజు మాటలకు ధనంజయుడు మండిపడ్డాడు. కత్తి పైకెత్తి ధర్మజుడిపై లంఘించాడు. కృష్ణుడు అడ్డుపడి పార్థా, మనం కౌరవుల మీద దాడి చేయడం లేదు. ధర్మరాజును పరామర్శిస్తున్నాం. ఇది సంతోషకాలం గాని, క్రోధసమయం కాదు. అన్నగారిని వధించరాదని హెచ్చరించాడు. కృష్ణా, నా గాండీవాన్ని ఇతరుల చేతికిమ్మని అన్నవాడితల పగులగొడుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. మా అన్న ధర్మాత్ముడైనా నా మాటను నేను నిలబెట్టుకుంటాను. దీనికి నీవేమి చెబుతావో చెప్పుము. సకల ధర్మసాకల్యవేదివి నీవు చెప్పినట్లు చేస్తానన్నాడు అర్జునుడు. 

అపుడు శ్రీకృష్ణుడు ధర్మసూక్ష్మంగా, పెద్దలను దూషించుట వారిని చంపటం వంటిదే. అందువలన నీ ప్రతిన తీరేటట్లుగా ధర్మరాజును వధించకుండా నోరార నిందించుము (తిట్టుము). ఆ మీద గురునిందా పాపం పోయేటట్లు మీ అన్నకు నమస్కరించి నిన్ను నీవు కీర్తించుకోమన్నాడు. అర్జునుడు గోవిందుడి హితవు పాటించాడు. 

"అపార బాహుబలసంపన్నుడు అయిన భీముడు నన్ను పరిహసించి మాట్లాడవచ్చు గాని, భుజబలప్రదర్శనంలో చాలక యుద్ధభూమిలో నిలిచిపోరాడలేని నీకు, ఇట్లా నొవ్వజేసి చెడ్డమాటలాడే యోగ్యత ఎక్కడున్నది? 
నా సంగతి బాగా తెలిసికూడా ఇట్లా మాట్లాడతగునా? ఇట్లన్న నీ నాలుక ఎందుకు పెక్కు ముక్కలుగా చీలిపోలేదో? ఇంతగా మాట్లాడేందుకు నీవేప్పుడైనా యుద్ధంలో ఏమైనా సాధించావా? కవలలు తమ బాహుబలంతో విరోధి సైన్యాలను బాణాఘాతాలతో అతలాకుతలం చేస్తారు కాని, నీ మాదిరిగా నోరు పారేసుకున్నారా? 
నీవు జూదమాడినందువలననే కౌరవపక్షంతో మనకు పగ కలిగింది. రాజ్యం పోవటం, అడవుల పాలవటం, సేవకవృత్తి నెరపటం మొదలైన భరించజాలని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంతైనప్పటికి, ఇసుమంత సిగ్గు నీ మనస్సులో పుట్టడం లేదు. పొగరుబోతువాడివలె ఎగసి మాట్లాడితే చులకనైపోతావు. ఇంతవరకు నీవు చేసినదేదో చేసావు. ఇకనైనా వక్రబుద్ధిమాని, తగిన మగబలిమి లేనందున, దుశ్చేష్టలు మాని ఊరకుండుము. ఇన్ని కష్టాలు అనుభవించిన మేము నీ చేష్టలు సహించి ఊరకుండలేము" అని ధర్మరాజును నిష్ఠురోక్తులతో నిందించి, మనస్సులో బాధపడి, నిట్టూర్చి కత్తిని తీసి తన తల నరకుకొనుటకు సిద్ధపడ్డాడు. 

అది చూసి, ఇది ఏమని ప్రశ్నించిన శ్రీకృష్ణునకు, ధర్మరాజును తూలనాడినందులకు ప్రాయశ్చిత్తమనగా, శ్రీకృష్ణుడు నిన్ను నీవు పొగడికొనుము, అది మరణంతో సమానమని చెప్పగా అర్జునుడు- 

"ముల్లోకాలలో శివుడు తప్ప ఇంకొక ధనుస్సు పట్టినవాడు, నాకు సాటిరాగలిగినవాడు లేడు. నీవు చేసిన రాజసూయయాగంలో దక్షిణలు ఇచ్చేందుకు దిగ్విజయాలు సాగించి అపారధనరాశులను తెచ్చి నీకు సంతోషం చేకూర్చాను. మహాపరాక్రమవంతులైన సంశప్తకులనే వీరుల సమూహాన్ని అణచాను. కౌరవసేన నాచేత నశించి ఎట్లా దీనంగా ఉన్నదో నీవు కళ్లారా చూడు" అని పలికి, అన్నగారికి పాదాభివందనం చేశాడు. ధర్మజుడు శ్రీకృష్ణుని, "కలత చెంది ఉన్న నన్ను మంచిమాటలతో తేరుకొనేటట్లు చేసి దయాపూర్ణమతితో హితాన్ని బోధించావు. లోకవృత్తం ఎరుగని మమ్ము ఆపదలనెడి సముద్రంలో మునిగిపోకుండా అభిమానంతో కాపాడావు. కృష్ణా, పుణ్యస్వరూపుడవు నీవు" అంటూ కీర్తిస్తాడు. 

ఆదిపర్వంలో గరుడోపాఖ్యానంలో అమృతభాండాన్ని గ్రహించి, అలోడుడై తీసుకువెళ్తున్న తరుణంలో తన బలపరాక్రమాలు ఎరుగగోరిన ఇంద్రునితో, గరుడుడు "పరనిందయు, ఆత్మగుణోత్కరపరికీర్తనము జేయగా నుచితమె సత్పురుషులకు" అంటాడు. 

ఇతరులను నిందించటం, తమ గుణాల సముదాయాన్ని మెచ్చుకోవటం సజ్జనులకు తగునా? (తగదు).  
సభాపర్వంలో ఈ విషయాన్నే శిశుపాలునితో ధర్మరాజు - 
"భూరిగుణోన్నతులనదగువారికి, ధీరులకు, ధరణివల్లభులకు, వాక్పారుష్యము చన్నె? మహాదారుణ మది, విషము కంటె దహనము కంటెన్" అంటాడు. 

గొప్పగుణాల చేత శ్రేష్ఠులని చెప్పదగినవాళ్లకు, పండితులకు, ప్రభువులకు కఠినంగా మాట్లాడటం తగునా? మాట కాఠిన్యం విషం కంటే, అగ్ని కంటే అతిభయంకరం కదా?

భీష్మపితామహుడంతటి వాడు, ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునునుద్దేశించి- 
"చిరకాలమునకు గంటిమి నరు నక్కట! వీడు సజ్జన ప్రియుడు, సుహృత్పరతంత్రుడు, బాంధవహితు, డరిభీకరుం డిట్టివార లవనింగలరే?"

ఎంతో కాలానికి అర్జునుడిని చూచాం. వీడు సజ్జనులకు ప్రియుడు, స్నేహశీలి, బంధుహితుడు, శత్రువులకు భీకరుడు. ఇట్లాంటివాళ్లు భూమిపై ఉన్నారా? (లేరని భావం). 

ద్రౌపది దృష్టిలో అర్జునుడు:
మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం గలవాడు, భయంకరమైన పరాక్రమం చేత శత్రువులను తరింపజేయగలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు గలవాడు, ఎవరికినీ జయింప శక్యం కానివాడు. "అవశగతి గామరోషాదివికారము లొందినను మదిని ధర్మపథప్రవిహతి గానీడు" అంటూ ప్రశంసిస్తుంది. 

పొందు కోరి విఫలమనోరథయైన ఊర్వశి శాపం తెలిసి దేవంద్రుడు, "నీయట్టి ధైర్యవంతుని నే యుగములనైన గాన మెన్నండును ధర్మాయత్తమతివి మునులకు నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రీ" అంటాడు. నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏ కాలంలోనైనా చూడలేము. నీవు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా ఉగ్గడించతగింది అంటూ కొడుకును శ్లాఘించాడు. 

అర్జునుని స్థిరవిజయసాధనకు కర్మకౌశలము, సౌశీల్యము ముఖ్యకారణములు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పార్థుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? అని అంటాడు. 

పురుషకారానికి దైవబలం తోడైతే విజయం తథ్యమని ఆంధ్రమహాభారతం పార్థుని చరిత్ర ద్వారా తెలియజేస్తున్నది. 

మహాప్రస్థాన సమయంలో అర్జునుడు యాత్ర సాగిస్తూ తన గాండీవాన్ని వదలక వెంట తీసుకుపోతున్నాడు. జీవితంలో గాండీవం అతనికంత కీర్తి నార్జించింది. అందుచేత దాని మీద అర్జునునకంత మమకారము! చివరకు అగ్నిదేవుడు హెచ్చరించిన గాని అర్జునుడు దానిని వదలలేదు. 

                                              *******

Tuesday, June 18, 2013

Dharmaraju

కుంతీ పాండురాజుల అగ్రనందనుడు, యమధర్మరాజు అంశమున జన్మించినవాడు. జూదవ్యసనానికి బలియై భార్యా తమ్ములతో అష్టకష్టాలనుభవించాడు. సమతాగుణశోభితుడు, అజాతశత్రుడు.

శ్రీకృష్ణుడు కర్ణునకు జన్మరహస్యం చాటుగా తెలిపి పాండవపక్షం చేరి పాండవ సామా్రజ్యానికి అభిషిక్తుడవు కమ్మనగా కర్ణుడు - 

ధర్మపుత్రుడు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహింపడు. కాని అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ పుడమినంతటికి రాజై పాలించుట న్యాయం కదా అని అంటాడు. ఎంత మధుర సత్యభావన. ధన్యజీవి కర్ణుడు. 

కుంతీ పాండురాజుల అగ్రనందనుడు, యమధర్మరాజు అంశమున జన్మించినవాడు. మానవస్వభావమందలి శ్రేష్ఠగుణమైన సమత (Balanced Mind) అంటే మనోనిగ్రహానికి కట్టుబడి ఆదర్శంగా జీవించిన ఒకే ఒక వ్యక్తి మనకు ఆంధ్రమహాభారతంలో కన్పిస్తాడు. సమతాగుణశోభితుడిని సమాజము అశక్తుడుగా భావిస్తుంది. అట్టివారిలో ప్రథముడు ధర్మరాజు.

పాండవుల ఉన్నతిని చూచి అసూయపడి, వారిని ద్వేషించి చాటుమాటుగా చంప ప్రయత్నించి, రాజ్యపదవి నందుకొనదలచిన వ్యక్తి దుర్యోధనుడు. 

కౌరవుల అసూయాక్రోధములు ఓర్పుతో సహించి దూరదృష్టితో, బలనైపుణ్యముతో వారు కల్పించిన ప్రమాదములన్నింటిని తప్పించుకొని, సమతను కోల్పోకుండా, సాధ్యమైనంతవరకు హింసకు తొలగి, అర్హతలను, వ్యక్తిత్వమును శ్రమించి పెంచుకొని, అందరి అభిమానమును, గౌరవమును పొంది, యౌవరాజ్యపదవి నందుకొని ఎదిగిన వ్యక్తి ధర్మరాజు. ఎట్టకేలకు ఇతని ఎదుగును సహింపలేకయే కౌరవులు క్రూరకృత్యములకు పాల్పడినారు. 

లాక్షాగృహ దహనసమయమున విదురుని తోడ్పాటుతో లక్కయింట భస్మము కాకుండా, తమ్ములతో, తల్లితో బయటపడినాడు. దీనికి తోడు, భీముని బలము బక, హిడింబుల ప్రమాదమును తప్పించినది. అర్జునుని అస్త్రవిద్యా నైపుణ్యము పాంచాలిని గెలిచి తెచ్చినది. శ్రీకృష్ణుని ప్రాపు, అదృష్టము నందించినది.

ఆంబికేయుడు అర్ధరాజ్యమిచ్చినను అంగీకరించి స్వీకరించినాడు. అభివృద్ధి చెందిన హస్తినను వదలి అరణ్యప్రాంతమైన ఖాండవప్రస్థమునకు పోయినాడు. తమ శక్తిసామర్థ్యములు నిరూపించుకొని, ఆనాటి రాజలోకమున తమ ఔన్నత్యమును స్థాపించుకొనవలసిన అవసరమును దర్శించినాడు. శ్రీకృష్ణుని సాయముతో, నలువురు తమ్ముల శక్తిసామర్థ్యములతో, తన వ్యవహారదక్షతతో, అనతికాలంలోనే నేల నాలుగు చెరగులు జయించి సార్వభౌమయోగ్యమైన రాజసూయ మహాయాగమును చేసినాడు. ఆనాటి రాజలోకమున తన ఔన్నత్యమును స్థాపించుకొన్నాడు. మున్ముందు కురుసార్వభౌముడితడె యని చెప్పకుండా సూచించినాడు. కౌరవులను ప్రాభవహీనుల గావించినాడు.

ధర్మజుని ద్యూతవ్యసనము కౌరవులకనుకూలించినది. కష్టపడి ఆర్జించుకొన్న రాజ్యసంపదనంతను ఒక్కపెట్టున జూదములో ఒడ్డి ఓడిపోయినాడు. వ్యసనపరత అంతటితో ఆగక, తమ్ములను, తన్ను, కట్టుకున్న భార్యను ఒడ్డి ఓడిపోయినాడు. 13 ఏండ్లు అరణ్య-అజ్ఞాతవాసములను సహనంతో గడిపాడు. 

ఈ వ్యసనపరతను దారుణఫలితములననుభవించిన భార్య, తమ్ములు గూడ సహించినారు. సమతాశోభితుడైన ధర్మజుని ధీరోదాత్త వ్యక్తిత్వమట్టిది. అరణ్యవాసమును మహర్షుల అనుగ్రహ సంపాదనకు, దివ్యాస్త్రసాధనకు అద్భుతముగా వాడుకొన్నాడు. 

ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వుల చేత చిక్కినప్పుడు, దుర్యోధనుని అమాత్యుల ప్రార్థనపై భీమార్జునులను పంపి, దుర్యోధనుని బంధవిముక్తుని చేసి, "ఎన్నడూ నిట్టి సాహసములింక నొనర్పకు"మని బుద్ధి చెప్పి పంపినాడు. వాని తేజోవధ గావించినాడు. దుర్యోధనుని ప్రాయోపవేశానికి పురికొల్పుటయే ధర్మజుని సమత సాధించిన విజయం! 

అట్లే ద్రౌపదిని బలాత్కరించిన సైంధవుని, భీముడు చంపబోవ, సమత అడ్డు తగిలినది. ఆడపడుచు పసుపుకుంకుమలను తలచి సైంధవుని ప్రాణాలతో విడిపించి, పుణ్యము కట్టుకొన్నది. 

యక్షప్రశ్నల సమయంలో ప్రత్యేకించి నకులుని బ్రతికించుటలోని ఔచిత్యం, ధర్మదేవతయైన సమవర్తే శ్లాఘించాల్సి వచ్చింది. 

ధర్మరాజు ప్రదర్శించిన ప్రాజ్ఞత, దూరదృష్టి, మాట నేర్పరితనం, సహనం మున్నగు గుణములు అజ్ఞాతవాససమయంలో తమ్ముల, పెద్దల, ప్రజల అభిమానములను పొందినవి. 

పాండవుల బలాధిక్యాన్ని తలచి భయపడు తండ్రితో దుర్యోధనుడు, తాను భీముని పడగొట్టగలనని ఇంత "ఎరిగి వెఱచి గాదె యేనూళ్లు నైనను తమకు చాలుననియె ధర్మసుతుడు" అని పలికినాడు. సమతాగుణశోభితుడైన ధర్మజుని అసమర్థుడుగా ఎంచాడు, దుర్యోధనుడు. దాని పర్యవసానం అందరకు తెలిసినదే. శ్రీకృష్ణరాయబారము విఫలమై మహాభారతసంగ్రామము నిర్ణాయకమైనది. 

పాండవుల వైపు రాదలచి కౌరవుల వైపు వత్తునని, మాట యిచ్చిన మామ శల్యునితో, ఇట్లేల చేసితిరని అడుగక, మీకు కర్ణసారథ్యంబు అవశ్యంబు, గాన సమరసమయంబున నిరాకరించి పలికి, కర్ణు చిత్తంబునకుం గలంగ బుట్టించి పార్థు రక్షింపవలయునని ప్రార్థించినాడు ధర్మజుడు. ఇక్కడ మనకు ధర్మజుని రాజనీతి, ప్రాజ్ఞత, దూరదృష్టి, మాట నేర్పరితనం గోచరిస్తాయి.

ఉభయసైన్యములు సమరసిద్ధములై కురుక్షేత్రమున మోహరించియున్న సమయమున ధర్మజుడు కవచమును విడిచి, ఆయుధముల నావల బెట్టి, రథము దిగి కరములు మొగిడ్చి, పాదచారియై శత్రుపక్షసేనాపతియైన శాంతనవుని సమీపించి, ఆయన పాదాలకు నమస్కరించి, "అనఘ నీ కెదిర్చి యని సేయువాడనై మున్ననుజ్ఞ గొనగ నిన్ను గాన నెమ్మి వచ్చినాడ, నీ చేత దీవెన వడసి చనిన నేను బగఱ గెలుతు". 

పుణ్యపురుషుడవైన ఓ భీష్మపితామహా! నీవు అన్నివిధాల పెద్దవాడవు. పూజనీయుడవు. దురదృష్టవశాత్తు నిన్ను యుద్ధంలో ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది మాకు. అయితే ముందుగా నీ అనుమతిని అర్థించి నీ దీవెనలు పొంది తదుపరి యుద్ధం చేయాలని నేను నీ దగ్గరకు ప్రాంజలినై వచ్చాను. నీ ఆశీర్వచనం లభిస్తే నేను శత్రువులను జయించగలను.

ఇది ధర్మరాజు శీలానికి గీటురాయి. పరాక్రమప్రాభవాలలో ధర్మరాజు కంటే అతడి తమ్ములే అధికులు. అయితే శక్తిసామరా్థ్య కంటే సౌశీల్యమే గొప్పదని అజాతశత్రువైన ధర్మరాజు మహాభారతంలో ప్రదర్శించి జీవిస్తున్నాడు. 

దానికి భీష్ముడు సంతసించి, నీకు నా ఆశీస్సులు. నీవు శత్రువులను జయిస్తావని దీవిస్తూ వరం కోరుకొమ్మన్నాడు. దానికి ధర్మరాజు వెంటనే "నిన్ను పోర గెలుచు విధము బోధింపు" మన్నాడు. మహానుభావా, భీష్మపితామహా! నిన్ను యుద్ధంలో మేము గెలిచే ఉపాయం దయచేసి చెప్పుమన్నాడు. (అంటే ధర్మజుడు కోరేది భీష్ముని మరణం). మందహాసంతో తాతగారు ధర్మరాజుతో నన్ను జయించే ఉపాయం చెప్పటానికి ఇది తగిన సమయం కాదని, "క్రమ్మరంగ ఏతెంచెదు గాక"- నీవు మరల నన్ను సందర్శించుమని చెప్పాడు. పిదప ధర్మరాజు ద్రోణుడు, కృపుడు, శల్యుల వద్దకు వెళ్లి, వారి పాదాలకు నమస్కారాలు చేసి, ఆశీర్వాదాలు పొందాడు. 

వధోపాయం తెలుపమని అడుగగా ద్రోణుడు, ఎంతో నమ్మదగినవాడు నా గుండె భరించలేని కీడు మాట వినిపిస్తే -అస్త్రసనా్న్యసం చేస్తానన్నాడు.  

భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు తాను యుద్ధం చేయనని ప్రతినబూనిన కర్ణుని, ప్రేక్షకుడుగా యుద్ధభూమిలో చూచిన శ్రీకృష్ణుడు, కర్ణా, ఆ భీష్ముడు మరణించే వరకు నీవు సరదాగా పాండవపక్షంలో చేరి యుద్ధం చేయవచ్చు గదా అనిపిలవటం అత్యాశ్చర్యకర సన్నివేశం. ఈ సన్నివేశంలో ధర్మరాజు చూపిన సమయజ్ఞత, వచోనైపుణ్యం, గురుభక్తి, తాతగారిపై గల అభిమానం, గౌరవం అసామాన్యాలు, ఆదర్శనీయాలు. సమత (దమము) ఎంత శక్తివంతమైనదో ఈ సన్నివేశంలో మనం గుర్తిస్తాము. యుద్దారంభముననే భీష్మద్రోణుల హృదయముల జయించినది. తరువాత సవ్యసాచి సాధించిన విజయము శారీరికమే. ధర్మజుని మాట నేర్పు తొమ్మిదవ నాటి రాత్రి భీష్ముని శిబిరమున...

"అకట తండ్రి సచ్చినంత నుండియు, మమ్ము నరసి, బ్రోచినట్టి, యనుగు తాత జంప మది దలంచు, తెంపు సూచితె, రాజధర్మ మింత క్రూరకర్మ మగునె"
-అయ్యయ్యో! తండ్రి చనిపోయింది మొదలు మమ్ములను ఎంతో గారాబంగా చూచుకొంటూ వచ్చినవాడు, మాకు చాలా ప్రియమైనవాడు అయిన తాతగారినే చంపాలనే తలంపు మనస్సులో పుట్టడం చూశావా? రాజధర్మం ఇంత ఘోరమైనదా? అని ఒకవైపు బాధను వ్యక్తీకరిస్తూ తాతను- 

"చిచ్చఱ కన్ను మూసికొని చేతి త్రిశూలము డాచి లీలమై
వచ్చిన రుద్రు చందమున వ్రాలుదు వీ వని లోన నోర్వగా
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీకృప నాశ్రయింపగా
వచ్చితి మెవ్విధిన్ గెలువవచ్చు మహాత్మా? ఎఱుగ జెప్పవే!"

ఓ మహానుభావా! భీష్మా! మూడో కన్ను మూసికొని చేతిలో ఉండే త్రిశూలాన్ని దాచిపెట్టి విలాసంగా యుద్ధం చేయడానికి వచ్చిన ఎంత ధీరుడైనా, శూరుడైనా నిన్నెదిరించగలడా? మేము నీ దయకు పాత్రులం కావటానికే వచ్చాము. నిన్ను ఏ విధంగానైతే గెల్వవచ్చునో మాకు తెలియజేయాలి. 

వధోపాయవిషయం తెలుసుకుని కార్యసాధకుడయ్యాడు అజాతశత్రువైన ధర్మరాజు. యుద్ధభూమిలో పరోక్షముగ అస్త్రగురుని ప్రాణము తీసినది గూడ ధర్మజుని మాట బలమే. పరిస్థితుల ప్రాబల్యముచే శ్రీకృష్ణుని నిర్బంధముచే అశ్వత్థామ చచ్చెనని బిగ్గరగా పలికి కుంజరమని మెల్లగా అన్నాడు. అది అబద్ధము కాని నిజము; నిజము కాని అబద్ధము. దాని దెబ్బకు అస్త్రగురుడంతటివాడు నేల కూలాడు. జీవితంలో ఎవ్వరైన ఆడక ఆడక ఆడిన అబద్ధమునకు అంత బలము! అది ఎంతవారినైన నమ్మించగలదు. 

చివరకు ద్వైపాయనహ్రదము నుండి దుర్యోధనుని వెలికి రప్పించుటలో ధర్మజుడు ప్రదర్శించిన వాక్చతురత అసమానము!

"తెంపు చేసి మామీద నుఱుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు, పురుషుండవైతేని దీని ననుష్ఠింపు మనిన"-

సాహసంతో మామీదికి యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీనిని ఆచరింపుము. మగటిమి కలవాడవైతే దీనిని చేయుము - అని గుండెలో సూది గ్రుచ్చినట్లు పలికి ధర్మరాజు, గదాయుద్ధమున నేనొక్కరుండనే "కొనియెద నీదు ప్రాణము కుంఠిత బాహు విలాసభాసినై" అన్నాడు.  

ధర్మరాజేంటి గదతో యుద్ధం చేసే సమర్థుడా అనుకుంటూ పెనుబాము బుసకొట్టే చందాన మడుగు వెడలి బయటకు వచ్చాడు దుర్యోధనుడు. తుదకు భీముని చేతిలో మరణించాడు. ధర్మజుని మాటనేర్పు దుర్యోధనుని మడుగు నుండి బయటకు లాగి చంపించినది. 

చివరకు పొలికలనిలో పుత్రశోకార్తయైన గాంధారీదేవి శాపమును తప్పించుకొన్న ధర్మజుని మాట నేర్పు, పరేంగితజ్ఞత అద్వితీయములు. 

"క్రోధపరుషాక్షరముల నమ్మహారా జెచ్చటనున్నా"డని గాంధారి పలుకగనే ఆమె మనస్సెరిగిన ధర్మరాజు- 

"భయకంపితగాత్రుం డగుచు, జేతులు మొగిచి, సవినయంబుగా, మెత్తని మాటల, నిదె వచ్చి దేవీ యేను పాండవాగ్రజుండ, ననుచు జేరంబోయి నీ పుత్రుల జంపించిన పాపాత్ముని క్రూరచిత్తు, బరివాదార్హున్ శాపంబున బొలియింపుము, భూపాలక వల్లభాభిపూజిత చరణా!"

కొడుకులు, మనమళ్లు క్రూరంగా చంపబడ్డారన్న వ్యథతో మిక్కిలిగా పీడించబడిన మనస్సు కలిగిన ఆ గాంధారి కోపంతోనూ, కాఠిన్యంతోనూ నిండిన కరకు ధ్వనితో ఎక్కడ ఆ మహారాజు అని అడుగగా, ధర్మరాజు భయపడి గడగడ వణుకుతూ, చేతులు ముడిచి నమస్కరించి వినయంతో నెమ్మదిగా, అమ్మా ఇదిగో నేను ధర్మరాజును వచ్చాను, చూడుము అంటూ ఆమెను సమీపించి, నానా రాజుల చేత ఆరాధింపబడే చరణసీమ కల్గిన ఓ మహారాణీ గాంధారీదేవి! నీ కొడుకులను చంపించిన పాపాత్ముడను నేను, అతి కఠిన చిత్తుడను, నిందించటానికి అన్నివిధాలా తగినవాడిని, అట్లాంటి నన్ను నీ శాపంతో చంపివేయుము- అంటూ ఆమె పాదాలపై వ్రాలాడు. ఇక ఆ తల్లి ఏమని శపించగలదు? అందుచేతనే ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకున్నది. 

మహాభారతయుద్ధానంతరము ధర్మజుని సమత చెదరినది. శ్రీకృష్ణుడతని మానసిక సంక్షోభమును మాన్పుటకు, చెదరిన సమతను చక్కదిద్దుటకు, ధర్మసామా్రజ్యపాలనాదక్షుని చేయుటకు అంపశయ్యపై నున్న భీష్ముని విజ్ఞాన సంపదనంతను సంక్రమింపజేసినాడు. 

శ్రీకృష్ణరాయబారము విఫలమైన తరువాత, ఏకాంతంలో కర్ణునితో జన్మరహస్యం తెలిపి శ్రీకృష్ణుడు పాండవపక్షం చేరి పాండవ సామా్రజ్యానికి అభిషిక్తుడవు కమ్మన్నప్పుడు, కర్ణుడు పలికిన మాటలు...

"ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట యెఱిగె నేనియు సామా్రజ్య మేల పూను?
నట్టి ధార్మికు డాధి పత్యంబు జేయవలవదే శాశ్వతంబుగ వసుధ కెల్ల?"

ధర్మపుత్రుడు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహించడు. కాని అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ పుడమి కంతటికీ రాజై పాలించటం న్యాయం కదా!
కృష్ణా! ధర్మజుడు యుద్ధయజ్ఞం చేసినపుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావంటి వారంతా ఉత్తమగతులు పొందుతా" రన్న దృఢనిశ్చయాన్ని, రాగల రోజుల్లో జరుగబోయే పరిణామాన్ని కర్ణుడు చక్కగా ఊహించాడనవచ్చు. ధన్యజీవులు అన్నదమ్ములైన కర్ణధర్మజులు!

                                       ******

Monday, June 17, 2013

శ్రీకృష్ణుడు (SriKrishnudu)


అవతార పురుషుడు. నరనారాయణులలో నారాయణుడు. లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు. శ్రీకృష్ణ భగవత్తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినవారు భీష్మాచార్యుడు, పాండవులు మాత్రమే. 

రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందబడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ  బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ  ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.

ఈయన అవతార పురుషుడు. 

"దైవం మానుష రూపేణా" అన్నట్లు దేవుడే మనుష్యరూపం ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కొరకు భూమిపై అవతరించినట్లుగా మహాభారతంలో ఎల్ల చోట్లా కనబడుతున్నది. 

ద్వాపరయుగమున మద్యపాన, స్త్రీలౌల్య, ద్యూతక్రీడాది వ్యసనములు సమాజమున స్వైరవిహారము చేసినవి. మద్రదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు.

అట్లే యాదవజాతి గూడ మితిమీరిన భోగాసక్తితో, అహంకారంతో ప్రవర్తిల్లినది. అక్కడి ప్రజలలోనే గాక ప్రభువులలో గూడ ఆనాడు స్వార్థభోగములు పెచ్చు పెరిగినవి. అహంకారాది స్వాతిశయములు మిన్ను ముట్టినవి. అంతేగాక బలవంతునిదే రాజ్యమన్న పాశవిక సిద్దాంతానుసారము జరాసంధాదులు రాజ్యపాలనకావించి, పాశవికంగా చెరబట్టిన రాజుల తలలు త్రెంచి భైరవపూజ కావించేవారు. నరకాసుర, బాణాసుర, శిశుపాల, సాల్వ, హంస-డింభకాదులు అట్టి రాక్షస ప్రవృత్తి గలవారే. సాధుజనులు, బలహీనులు సుఖశాంతులతో జీవించుట కష్టమైనది.

ఇట్టి స్థితిలో సమాజమున సంక్షోభము తొలగించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిపించి వేదధర్మసంస్థాపనకై ఒక మహోద్యమమును సాంఘికముగ చేపట్టిన మహాత్ముడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు సాంఘికముగ సాధించిన మహాకార్యమును కృష్ణద్వైపాయనుడు వాఙ్మయముఖమున సాధించినాడు. శ్రీకృష్ణవ్యాసులు అవతార పురుషులుగ ప్రపంచ మానవాళి ఆరాధనలందుకొన్నారు, అందుకొంటున్నారు.

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే" - అను గీతాశ్లోకమును శ్రీకృష్ణుని జన్మప్రయోజనమును, ఆ మహనీయుడు చేపట్టిన ఉద్యమపరమార్థమును లోకమునకు తెలియచెప్పినది.

శ్రీకృష్ణుడు మానవాతీత మహితశక్తులతో జన్మించినను, జన్మసిద్ధములైన ఆ శక్తులకు తోడు గంధమాదనమున 10 వేల ఏండ్లు దుంపలు, పండ్లు మాత్రమే ఆహారంగా, పుష్కరంలో 11 వేల ఏండ్లు నీళ్లు మాత్రమే ఆహారంగా, ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటికాలిపై నిలిచి, గాలి మాత్రమే పీల్చి, బదరీవనంలో పెక్కేండ్లు కఠోరతపస్సు చేశాడు. అపారశక్తిసంపద నార్జించాడు. అధికనిష్ఠతో బ్రహ్మచర్యవ్రతము పూని రుక్మిణీసహితముగా హిమాద్రిపై తపస్సు చేసి చక్రాయుధము పొందినాడు. ఇన్ని శక్తులు తనలో నింపుకుని, ఆత్మసాక్షాత్కారము పొంది యోగేశ్వరేశ్వరుడయ్యాడు. తాను సంపాదించిన అలౌకిక శక్తులను సమాజముఖము గావించినాడు. ధర్మసంస్థాపనరూపమైన ఒక మహోద్యమమును ప్రారంభించినాడు. మానవాతీతుడుగ దర్శనమిచ్చినాడు. ఈయనకు నరుని సహకారం లభించింది. కారణజన్ముడైన అర్జునుడే నరుడు.

అరణ్యవాస సమయంలో శ్రీకృష్ణుడే ఈ మాట అర్జునునితో అంటాడు. మన మిరువురం నరనారాయణులనబడే ఆదిఋషులం.  మనం గొప్ప శక్తి కలిగి మనుజలోకంలో అవతరించామని చెప్పాడు.

కురుపాండవ కలహమునకు శ్రీకృష్ణుడు తానుగా బీజము నాటలేదు. వ్యక్తుల ప్రవృత్తుల, పరిస్థితుల ప్రభావములే ఆ కలహమునకు దారి తీసినవి. కురుపాండవ కక్షలు పెరిగినవి. పాండవులు కడకు లక్క యింట భస్మము కాకుండ తప్పించుకున్నారు. హిడింబ, బకాసురులను తుద ముట్టించారు. అర్జునుడు సర్వరాజసమక్షమున మత్స్యయంత్రమును ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. అది చూచి ఓర్వలేక తమ మీదకూ, ద్రుపదుని మీదకూ దండెత్తి వచ్చిన కౌరవులను ఓడించి మించినారు. శ్రీకృష్ణుడు పాండవుల ప్రయోజకత్వమును చూచినాడు. భీమార్జునుల మీదకు విజృంభించు రాకుమారులను వారించాడు. బలరామసహితుడై పాండవనివాసమున కేగినాడు. పాండవతేజమును ప్రశంసించి, కౌరవుల దుర్మార్గము గర్హించి, మున్ముందు మేలు కలుగునని ధైర్యము చెప్పి, పాండవ హృదయములు గెల్చుకొన్నాడు. వారికి కొండంత ఆప్తుడుగా నిలిచాడు. కురుపాండవరాజకీయములలో గణనీయపాత్ర వహించటం మొదలుపెట్టాడు.

అర్ధరాజ్యమిచ్చి ధృతరాష్ట్రడు పాండవులను ఖాండవప్రస్థము పంపినపుడు శ్రీకృష్ణుడు వారి వెంట వెళ్లినాడు. మయునిచే ఇంద్రప్రస్థమును నిర్మింపజేసి పాండవపురప్రవేశోత్సవమును జరిపించి ద్వారక కేగినాడు. సుభద్రార్జునుల వివాహము చతురముగ నిర్వహించినాడు. యదుపాండవసఖ్యమును సుదృఢము గావించినాడు.

రాజసూయము ఎంతో రాజకీయప్రాధాన్యమున్న మహాయాగము. దీనిని శ్రీకృష్ణుడు తన ఆశయసిద్ధికి అనుగుణముగ వాడుకొన్నాడు. ధర్మజుని అన్ని విధముల ప్రోత్సహించినాడు. పార్థురక్షాబలము, భీముని బాహుబలము, నా నిర్మలనీతిబలము నీకుండ అసాధ్య మేమున్నదని ధైర్యము చెప్పినాడు. జరాసంధుడు, మల్లయుద్ధమున భీమునే వరించునట్లు చేసి శత్రుసంహారము కావించినాడు. జరాసంధవధతో శ్రీకృష్ణునకు స్వకార్యము, స్వామికార్యము సిద్ధించినవి. (కంసుని భార్య జరాసంధుని కుమార్తె కావున, జరాసంధుడు మధురపై 10 మార్లు దండెత్తాడు, కారణం అల్లుడైన కంసుని శ్రీకృష్ణుడు సంహరించటమే). 

శ్రీకృష్ణభగవత్తత్త్వం బాగా ఎరిగినవారు పాండవులు. తాత భీష్మపితామహుడు రాజసూయయాగసమయంలో అర్ఘ్య ప్రదానానికి శ్రీకృష్ణుని సకలరాజసమక్షంలో అర్హుడుగా ప్రకటించడం, దీనిని వ్యతిరేకించి ద్వేషించిన శిశుపాలుడు, ఆ సకలరాజసమక్షంలోనే శ్రీకృష్ణుని సుదర్శన చక్రానికి ప్రాణాలర్పించడం జరిగింది.

రాజులంతా ఆశ్చర్యంతో కళ్లంతా పెద్దవి చేసికొని చూస్తుండగా, శిశుపాలుని శరీరం వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందబడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి, ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చి, శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవరూపంలోని దైవంగా కీర్తించారు.

కౌరవపాండవ ద్యూతపునరూ్ద్యతసమయంలో  శ్రీకృష్ణుడు పక్కకు తొలగుట ఆయన రాజనీతిలో ఒక భాగము కావచ్చును.  ఆయన అరణ్యవాస సమయంలో పాండవులను చేరి యోగక్షేమాలు విచారించి, చెప్పిన కారణం- తాను పదినెలలు సముద్రతీరంలో సాల్వుడితో యుద్ధం చేయవలసివచ్చినందువలన దుష్టద్యూతసమయంలో వారికి దూరంగా ఉండిపోయానన్నాడు.

ద్రౌపదీవస్త్రాపహరణ సమయంలో యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు, తన మానవాతీత శక్తిచే ద్రౌపదికి అక్షయవస్త్ర ప్రదానము చేయుట అసాధారణము, ఆశ్చర్యకరము. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్ట పడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక, పట్టు విడిచి సిగ్గు చెంది ఊరకుండిపోయాడు. ఆర్తరక్షణపరాయణుడయిన భగవంతుడున్నాడనటానికి ఇంత కంటే ఏమి సాక్ష్యం కావలెను?

శ్రీకృష్ణుని మహోద్యమసంకల్పము దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన. అది పూర్తియగుటకు మహాభారతసంగ్రామము మంచిసాధనము. ఆ సంగ్రామము మూలముగ సంఘము నందలి దుష్టశక్తులన్నియు ఒక్కచోటికి చేరగలవు. ఒక్కసారిగ నాశమొందగలవు. విశేషించి ఈ నాశము వెంటనే ధర్మరాజు చేత ధర్మసామ్రాజ్యమును స్థాపింపజేయవచ్చును. ఈ దృష్టితో చూచిన,  శ్రీకృష్ణుని అభీష్టము సమరముఖముగనే చూపట్టును. మరి సంధి ప్రయత్నమెందులకన్న ప్రశ్న ఉదయించకమానదు.

అరణ్యవాస సమయంలో దుఃఖిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు, నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడైన అర్జునుడి కఠోర బాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరకతప్పదు. సప్తసాగరాలు ఇంకిపోయినప్పటికి, పగలు, రాత్రి తారుమారైనప్పటికీ, నా మాట నిజంగా జరిగితీరుతుందన్నాడు.

అరణ్యాజ్ఞాతవాస సమాప్తి అనంతరం, రాయబారానికి ముందు, "పూని పలికెద వినుము రిపుక్షయంబు జేసి యుజ్జ్వల పుణ్యలక్ష్మీసమేతులైన పాండుకుమారుల యధికవిభవ మీవు సూచెదు తడవు లేదిది నిజంబు" అంటాడు.

ద్రుపదుపుత్రీ, శపథం చేసి చెపుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులను విధ్వంసం చేసి ప్రకాశమానమైన పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం అని పలికి మహాభారతయుద్ధం ఎంతో ముందుగానే జరుగగలదని నిర్ణయించాడు.

రాయబారము చేయవచ్చిన సంజయునితో "వీరికి బోరు మేలు నాకుం జూడన్" నాకు చూడగా ఎట్లా అయినా వీరికి యుద్ధమే మంచిది అని యుద్ధమువైపే మొగ్గినాడు.

రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణునితో విదురుడు, దుర్యోధనుడు దురాత్ముడు, నీచుడు, దురహంకారపూరితుడు; అతడు నీ మాట వింటాడా అనగా, నాకు దుర్యోధనుడి దౌష్ట్యమంతా తెలుసు; అతడితో చేరిన రాజులందరు పాండవుల మీద పగగొని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారనీ తెలుసు; సంధి సమకూరదనీ తెలుసు అంటూ, మానవుడు తన శక్తిలోపం లేకుండా ధర్మకార్యాన్ని చేయటానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతడు దానిని పూర్తి చేయలేక ఫలం పొందలేకపోయినా దాని పుణ్యాన్ని తప్పక పొందుతాడు. అందులో నాకు సంశయం లేదు.

"చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు డడ్డపడి వారితోన గొట్లాడియైన దాని నుడుపంగజొరకున్న వాని గ్రూరకర్ముడని చెప్పుదురు కర్మకాండవిదులు".

బంధువులలో పరస్పరం వైరమేర్పడితే అడ్డం వచ్చి, వారితో తగవులాడి అయినా పగను మాన్పకుంటే అలాంటివాడిని క్రూరకర్ముడని కర్మకాండతత్త్వం తెలిసిన పెద్దలు చెపుతారు. కురుపాండవుల పొత్తు కొరకు ప్రయత్నం చేస్తాను. ధర్మార్థయుక్తంగా ఒద్దిక మాటలు మంత్రి సహితుడైన దుర్యోధనునకు చెపుతాను. అతడికీ, పాండుకుమారులకూ, సర్వజనులకూ మేలు కలిగించే మార్గమేదో మోసం లేకుండా తెలుపుతాను. ఇట్లా చెబుతున్న నన్ను పాండవపక్షపాతి అని దుర్యోధనుడు సందేహపడి నా మాటలు వినకపోతే పోనీ, అదీ ఒకందుకు మంచిదే. ఇట్లా నేను ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం కల్పించుకొనకుంటే అన్నదమ్ములు తమలో తాము పోట్లాడుకుంటుంటే కృష్ణుడు వారించక తనకేమీ పట్టనట్లు ఊరక ఉండిపోయాడు; తాను అనుకుంటే కార్యం చక్కదిద్దలేడా? అని అవివేకులు నన్ను ఆడిపోసుకుంటారు. అందుచేత పెద్దలు సమ్మతించేటట్లు అన్ని విధాలా కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైన మాటలు వారికి చెబుతాను. దుర్యోధనాదులు తాము బ్రతకటానికి దారి కల్పించే నా మాటలు మన్నిస్తే బాగుపడతారు. అట్లా నా మాటలు ఆదరించక నీవు భావించినట్లు కుత్సితులై తిరుగబడితే, వారు నా ముందు నిలువగలరా? అన్నాడు.

రాయబారమునకు ముందుగనే పాండవుల అభిప్రాయం తెలుసుకోగోరి ధర్మజునితో, శ్రీకృష్ణుడు సంధియా, సమరమా అన్నదానికి ధర్మజుడు - మహానుభావా శ్రీకృష్ణా! కష్టాలను తొలగించటానికి శుభాన్ని సమకూర్చటానికి సమర్థుడవైన నిన్ను ఈ జన్మకు మాకు దిక్కుగా జూపి మా తండ్రి పాండుమహారాజు గతించాడు. పాండవులూ, కౌరవులెట్లాంటివారో నీవెరుగుదువు. కూర్మి అంటే ఎట్టిదో నీవెరుగుదువు. కార్యసాధన విధానమెట్టిదో ఎరుగుదువు. మాటలాడు తెరగెట్టిదో ఎరుగుదువు. నీకు ఉపాయాలు చెప్ప నేనేపాటివాడిని? హస్తినకు వెళ్లిరమ్మన్నాడు. (సర్వజ్ఞుడవైన నీకు ధర్మనీతులు చెప్పటానికి నేనెంతవాడను? నీకు ఉపాయాలు చెప్పేటంతవాడినా నేను? )

దీనికి శ్రీకృష్ణుడు, నేనా కురుసభకు వెళ్లి నీ వినయ గుణాన్ని అందరకు తేటపడేటట్లు లెస్సగా వర్ణిస్తాను. మిత్రులు, బంధువులు నానా దేశాల రాజులు ఆలకించగా నీ పావనమైన ప్రవర్తనను, నీవు ధర్మమార్గం అవలంబించే తీరూ, కౌరవుల సభలో అందరకు తెలిసేటట్లు మాటలాడుతానన్నాడు. కురుసభలో సంధికార్యం ఫలించినా, ఫలించకపోయినా, సభ్యులైన, బంధుమిత్రులైన రాజులందరూ పాండవుల ధర్మనీతి వర్తనాన్ని మెచ్చుకుని కౌరవులను నిందించి నిరసించేటట్లు చేయటమే ధర్మజవ్యూహం; దానిని సఫలంగా నిర్వహిస్తానని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.

ఇక భీముడు తన మాటగా శ్రీకృష్ణునితో, మనం అన్నదమ్ములమై ఉండి కూడా లోకులు తలయెత్తి చూచి పరిహసించగా మనలో మనం ఒకరితో నొకరు పోట్లాడుకొనటం మంచిదికాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దలమాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించటం ఎంతో మేలు కదా? అన్నాడు.

శ్రీకృష్ణుడు అతడిని యుద్ధానికి రెచ్చగొట్టవలెనని మనసులో సంకల్పించి, భయమంటే ఏమిటో ఎప్పుడూ తెలియని నీవంటి ధీరునికి, ఈ పిరికితనం ఇంతగా అలవాటయ్యేటట్లు చేసినవారెవరో అంటూ పకపక నవ్వాడు. దీనికి భీముడు, బావా నా శక్తిసామరా్థ్యలు ఏ పాటివో ఆలోచింపక ఇట్లా నీవు మాట్లాడటం న్యాయం కాదు. నేలా నింగి తలక్రిందులైనప్పటికీ వెనుదీయక, నేను ముంజేతులు ఒడ్డి వాటిని పట్టుకు తోస్తాను సుమా! అన్నాడు.

ఇంక అర్జునుడు ఇలా అన్నాడు: శ్రీకృష్ణా నీవు చేయనెంచిన పనికి హాని ఎప్పుడూ కలుగదు. కొన్ని పనులు ఫలించనట్లే ముందు కనిపించినా చివరకు ఫలిస్తాయి. కాబట్టి కార్యానికి పూనుకొనటం పురుషలక్షణం. కార్యఫలం తమకు సమకూరటంలో దైవసహాయం అవసరం. కాబట్టి పురుష యత్నం, దైవానుకూలం కావాలి. కార్యం అనుకూలించటం, అనుకూలించకపోవటం రెండూ నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. ఈ మాట వాస్తవం.

సహదేవుడు శ్రీకృష్ణునితో ధర్మపుత్రుడు, అతని సహచరులు తగని పల్కులు పల్కుతున్నారు. వాటిలో ఒక మాటనైన తిరస్కరించక అన్నిటికీ నీవు "ఊ" కొట్టడం అంతకన్నా బాగుంది. రాక్షసులను విధ్వంసం చేసిన నీవు కురుసభకు బిచ్చమడగటానికి సైతం పోతావన్నమాట! దుష్టచిత్తుడైన దుర్యోధనుడెక్కడ? రాజ్యంలో మనకు సగం పంచి ఇవ్వటం ఎక్కడ? అది కల్ల, జరుగదు! అని అన్నాడు.

ద్రౌపది అవమానబాధను, ఆగ్రహాగ్నిని పూర్తిగా అవగాహన చేసికొన్నాడు. కృష్ణుడు పరిపూర్ణ సానుభూతితో ఆమెను ఓదార్చాడు. సంధి చేయ కౌరవ సభ కేగాడు.

దుర్యోధనుని ఆతిథ్యము తిరస్కరించి, విదురుని ఇంట విడిది చేయుట శ్రీకృష్ణుని చతురనీతియే. విదురునిది భక్తితో కూడిన విందు, కౌరవులది భక్తిలేని కూడు.

మరునాడు కౌరవసభలో శ్రీకృష్ణుడు ఉపన్యసించిన విధము అద్భుతము. ఆయన ప్రదర్శించిన పరేంగితజ్ఞత, వాక్చాతురి అనన్య సామాన్యములు. ఆ పీతాంబరధారి జలదస్య గంభీరతతో పలుకొప్పగ, దంతదీప్తు లెసగ, మొదట ధృతరాషు్ట్రని, తర్వాత దుర్యోధనుని సంబోధించి, పాండుకుమారుల నయవర్తనమును, ధార్తరాషు్ట్రల దౌష్ట్యమును, ఉభయపక్ష శ్రేయోమార్గమును పదిమంది వినునట్లు, పదను తగ్గకుండా పాకము చెడకుండా చెప్పినాడు. కౌరవులు మహర్షుల సానుభూతి కోల్పోవునట్లు చేసినాడు. వారు నీతిమాలి తన్ను బంధింప పాల్పడినప్పుడు యోగేశ్వరేశ్వరుడు తన విశ్వరూపమును ప్రదర్శించినాడు. కౌరవపక్షమునకు నైతికసానుభూతి (మోరల్ సింపతీ) లేకుండా చేసినాడు.

కర్ణుని పాండవపక్షమునకు లాగి కౌరవపక్షమును బలహీనము చేయ యత్నించి, ఏకాంతమున అతని జన్మరహస్యము చెప్పినాడు. "పాంచాలపుత్రియు నంచితముగ నిన్ను బొందు ఆర్వుర వరుసన్" అని ఆశ పెట్టాడు. మానవుని ప్రలోభపెట్టు విషయములలో స్త్రీసౌఖ్యము చాలా బలవత్తరము. కాని కర్ణుడు పాండవపక్షము చేరలేదు.

సంధి సంధాతగా వెళ్లిన శ్రీకృష్ణుడు, సమర నిర్ణేతగా తిరిగి వచ్చినాడు. ధర్మజునకు ధైర్యము గొలిపి నిజనివాసమేగినాడు మరునాడు.

"వక్షః స్థలంబున వనమాల గ్రాలంగ
వెలిమావు గెడల వాగులు ధరించి"

శ్రీకృష్ణుడు తన వక్షఃస్థలంలో వనమాల విరాజిల్లుతుండగా తెల్లని గుఱ్ఱాల నోటి కళ్లెములకు తగిలించిన పగ్గాలను చేత ధరించి రథం నొగల మీద కూర్చొని ఉన్నాడు. రథం మీద హనుమద్ధ్వజం రెపరెపలాడుతోంది. అక్షయతూణీరద్వయం తన కుడి ఎడమ భుజాలకు క్రొత్త సొమ్ములు కాగా, వికసించిన ముఖంతో ఫల్గుణుడు మెల్లగా వచ్చి ఒక ప్రక్కగా నిలిచాడు.

యోగేశ్వరేశ్వరుడు, రాజనీతిచతురుడైన శ్రీకృష్ణుడు పాండవపక్ష యుద్ధప్రణాళికా రచయిత. అమ్మహాత్ముని ప్రణాళికను కార్యరూపము నొందించు యోధాగ్రేసరుడు అర్జునుడు. అతని సాహాయ్యులు భీముడు, తక్కిన వీరులు. వీరి కృషి పురుషకారము, శ్రీకృష్ణుని ప్రణాళికా రచన దైవబలము.

పాండవపక్ష వీరుల కాత్మవిశ్వాసము గూర్చుటలో, అడుగడుగునా వారి కర్తవ్యము నిర్దేశించుటలో, అప్పుడప్పుడేర్పడు అంతః కలహములను నివారించుటలో, ప్రతిపక్ష వీరులను బలహీనుల గావించుటలో, ధర్మదృష్టితో చూచినపుడు అనభిలషణీయులను పైకొన్నవారిని స్వపరభేదము లేకుండ హతమార్చుటలో, పాండవేయులను రక్షించి గెలిపించుటలో, గెలిపించి రక్షించుటలో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర అద్భుతము, అసమానము.

అర్జునుడు యుద్దారంభమున స్వజనసంహారము శంకించి మోహావిష్టుడై ఆయుధముల విడిచి, నిర్విణు్ణడయ్యాడు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునునకు తత్వోపదేశము చేసి, తాను పరమాత్మగా సాక్షాత్కరించి అర్జునుని మోహమును పారద్రోలి దృఢమనస్కుని గావించినాడు, స్థిరకల్పుని గావించినాడు. కౌరవసంహార మవశ్యకర్తవ్యమని ఉత్సాహము గొల్పినాడు.

వీపు దట్టి అర్జునుని కృష్ణుడే ముందుకు నడిపించినాడు. కౌరవపతనమునకు పాండవ విజయమునకు చక్కని రాచబాట వేసినాడు. "నా చేతన జచ్చిన వీరి నెల్లను జయించినవాడ వగుటకు నిమిత్తమాత్రమ్ము గమ్ము లెమ్ము, రాజ్యమ్ము గైకొను" మన్నాడు.

నేను చంపే వీరిని అందరినీ నీవు చంపినట్లుగా కనిపించి విజయం గైకొని రాజ్యాన్ని ఏలుకొమ్ము. నీవు నిమిత్తమాత్రుడవు సుమా, లే, ఇక యుద్ధం చేయుము అన్నాడు.

ఓ ధర్మరాజా నాకు అర్జునుడు,
"సఖుడు, సంబంధి, శిష్యుండు, సవ్యసాచి, నాకు నతనికినై యేను నరవరేణ్య, కూర్మియై నిత్తు గండలు గోసియైన, నరయ నాతండు నా యెడ నట్టివాడ". 
స్నేహితుడు, సంబంధి (మా సోదరి సుభద్రకు భర్త), అంతేకాదు నాకు శిష్యుడు కూడా, అతని మేలు కోసం సంతోషంతో నా శరీరంలోని కండలైనా కోసి ఇస్తాను. ఆలోచించి చూడగా అర్జునుడు కూడా నా పట్ల అంత ప్రేమగలవాడే. మా ఇద్దరి కలయిక అంత దృఢమైనది.

ద్వాపరయుగము నాటికి వ్యక్తుల ప్రవృత్తులు, సాంఘిక పరిస్థితులు చాల మారినవి. మహోన్నతాదర్శ సాధనకు మార్గమించుక వక్రమైనను దోషము లేదని, ద్వాపరయుగమున శ్రీకృష్ణుడు చాటినాడు.

"మాయలు గల్గు దుష్టులకు మాయపు భంగులే మందు గాక, నిర్మాయత నుల్లసిల్లెడు పరాక్రమలీలలు గొల్చుటెట్లు?"
మాయాత్మకులైన దుర్మార్గులకు మోసపు పద్ధతులే మందు. మాయతో కాకుండ విరోధులను జయించటం ఏ విధంగా సాధ్యం అవుతుంది? మిక్కిలి బలవంతులైన దైత్యులను విష్ణువు, ఇంద్రుడు మాయోపాయాలతో జయించలేదా?

యుద్ధసమయమున శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత, మానవాతీత మహితశక్తి, పాండవ పక్షమునకు చేసిన సహాయము, అమోఘములు. మూడవనాటి యుద్ధమున భీష్ముని భయంకరవీర విజ్రుంభణము చూచి శ్రీకృష్ణుడు, తన ప్రతిజ్ఞను గూడ మరచి, చక్రమును చేపట్టి పగ్గములను నొగల ముడిచి, రథము నుండి దూకి ఆ మహావీరుని పైకి ఎగసినాడు. శ్రీకృష్ణుని ఈ విజృంభణము, గాంగేయుని ఉత్సాహమునకు గొడ్డలి పెట్టు! కిరీటి అభిమానమునకు కొరడా దెబ్బ! 9వ నాటి యుద్ధమున గూడ ఇట్లే జరిగింది. భీష్మ విజృంభణము చూచి బెండుపడిన ధర్మజునకు ధైర్యము గొలిపినాడు శ్రీకృష్ణుడు.

తాత మరణోపాయమును తెలిసికొనదలచిన ధర్మజుని, "నీతలంపు లెస్స" యని వీపు దట్టి ప్రోత్సహించినాడు. తాను గూడ పాండవుల వెంట పాదచారియై భీష్ముని శిబిరమున కేగినాడు, వారి ప్రయత్నమునకు బలము చేకూర్చినాడు. ఒక్కమాట కూడా భీష్మునితో మాట్లాడలేదు. అట్టి పట్టుల, మాట కన్న మౌనమున కెక్కువ బలము. పైగా మహాత్ముల మౌనము వారి మాట కంటే గొప్పగ మాట్లాడగలదు.

శ్రీకృష్ణుని రాక, ఆయన మౌనము భీష్మునిపై ఎంత ప్రభావమును బరపినవో, పాండవ ప్రయత్నమున కెంత బలము చేకూర్చినదో...తరువాతి రోజు యుద్ధములో ఆ తాతగారు,

"కృష్ణు దోడుగ గొని కీడ్పడి వీరలు వచ్చిన చెప్పితి వధ విధంబు సమర ముపేక్షించి శాంతియై నుండెద నడిచి పాటేటికి"
ఈ పాండవులందరూ లొచ్చు పడి, చచ్చు దేలి కృష్ణుడిని సహాయంగా తీసికొని నా దగ్గరకు వచ్చారు. నా మరణానికి ఉపాయాన్ని వీరికి చెప్పాను. ఇకమీద యుద్ధంలో శ్రద్ధ చూపకుండా ప్రశాంతంగా ఉంటాను. వేగిరపాటెందుకు? అని చల్లబడుటలో తెలియగలదు.

పితామహుని పతనమొనరించుటకు సంకోచించిన సవ్యసాచికి, శ్రీకృష్ణుడు కర్తవ్యోపదేశము చేసినాడు. భీష్మపతనమునకు పరోక్షముగ దోహదము చేసినాడు.

భగదత్తుడు అంకుశమును అభిమంత్రించి ప్రయోగింపగా, పార్థుని కడ్డముగా తన మేనమర్చి, మానవాతీతశక్తితో అమ్మహాస్త్రమును ధరించి పార్థుని రక్షించినాడు శ్రీకృష్ణుడు.

ప్రియపుత్రుడైన అభిమన్యుని వధకు కారణభూతుడైన సైంధవుని, సూర్యుడు క్రుంగకమున్న వధింతునని లేకున్న గాండీవముతో అగ్నిలో ప్రవేశింతునని అర్జునుడు ప్రతినబూనాడు. తనతో సంప్రదించకుండా పార్థుడెంత ప్రమాదము గొనితెచ్చుకున్నాడని, సూర్యాస్తమయము లోపల శత్రుమస్తకమును దునుమాడుట చాల దుర్ఘటమని, ప్రతిన విఫలమైనదో పార్థుడు దక్కడని, పరిణామములు విపరీతములగునని, ఆ రాత్రి నిద్ర లేని కలవరపాటు నొందినాడు. ఎట్టకేలకు ఎల్ల భూతములకు తన నేర్పును, బలము, పాండవ ప్రేమ వ్యక్తమగునట్లు యుద్ధభూమిలో విజృంభింతునని పలికినాడు.

సమయ సందర్భములను బట్టి తన యోగశక్తులను వినియోగించియైన పార్థుని ప్రతిజ్ఞను సఫలము చేయక తప్పలేదు. ఆ పూనిక తోడనే తాను సారథ్య సామర్థ్యమును ప్రదర్శించి, పార్థుని రథమును ద్రోణాచార్యుని దాటించి శకటవ్యూహమున ప్రవేశపెట్టాడు. తనయోగశక్తిచే కృత్రిమసూర్యాస్తమయమును కల్పించినాడు. సమయస్ఫూర్తిని చూపి సైంధవుని తల క్రింద పడకుండ అతని తండ్రి ఒడిలో పడునట్లు, పాశుపతాస్త్రముచే కొట్టుమని హెచ్చరించి, పార్థుని ప్రాణాలు కాపాడాడు. కృతప్రతిజ్ఞుని గావించినాడు.

కర్ణుడు ఎంతోకాలం నుండి పార్థునిపై ప్రయోగింపవలెనని దాచియుంచిన శక్తిని, పరిస్థితుల ప్రాబల్యముచే ఘటోత్కచునిపై ప్రయోగించి, అతడు మృతి నొందినపుడు, పాండవులు మిక్కిలి దైన్యంతో కన్నీరుమున్నీరుగా దుఃఖించారు. కాని కృష్ణుడు సంతోషంతో సింహనాదం చేసి తన పాంచజన్యాన్ని పూరించాడు. తన చేతిలోని పగ్గాలను రథం నొగలుకు కట్టి వేసి నృత్యం చేయనారంభించాడు. శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటే, మందార వృక్షం మందమారుతానికి అల్లనల్లన కదలి ఆడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. కృష్ణుడలా నృత్యం చేస్తూ రథం నడిమి భాగంలో ఉన్న అర్జునుడిని చేరి ఆలింగనం చేసుకున్నాడు. వెన్ను చరిచాడు. మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు, అందరూ దుఃఖిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అంతగా సంతోషించటానికి కారణం అర్థం గాక మీ నడవడిలోని రహస్యమేమిటో చెప్పుమన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునునితో శక్తి అనే ఆయుధం కర్ణుని వద్ద ఉన్నంతకాలం నాకు నిన్ను బ్రతికించుకొనటం అసాధ్యంగా భావించేవాడిని. ఇప్పుడా శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించటంతో కర్ణుడికి అది లేకుండా పోవటం నాకు సంతోషంగా ఉంది. ఆ శక్తి కర్ణుడి వద్ద ఉన్నట్లయితే నేను సుదర్శనచక్రాన్ని, నీవు గాండీవధనుస్సును ధరించి ఏకమై ఎదిరించినా, ఆ కర్ణుడు మననిద్దరిని కూడా జయిస్తాడు. ఈ ఘటోత్కచుడు రావణాసురుని వంటివాడు. ఈ సమయంలో వీడు మరణించకున్న, తరువాత నేనే స్వయంగా చంపాల్సి వచ్చేది. అందుకే నాకిది సంతోషసమయమన్నాడు.

పాండవసేనపై ద్రోణాచార్యుడు, దావాగ్ని వలె విజృంభించినపుడు, మహా దార్శనికుడు, మేటి రాజనీతి కోవిదుడైన శ్రీకృష్ణుడు, రానున్న ప్రమాదము నూహించి ఆచార్యుని ఆయువుపట్టు కనిపెట్టినాడు. ప్రాణరక్షణకై అబద్ధమాడుట వలన పాపమంటదని ప్రవచించినాడు, ధర్మజుని బలవంతపెట్టి అబద్ధమాడించినాడు. ద్రోణపతన మొనరించి పాండవపక్షము కాపాడినాడు.

అట్లే తండ్రి మరణానికి ఆగ్రహోదగ్రుడైన అశ్వత్థామ ప్రళయభీకర నారాయణాస్త్రమును ప్రయోగించినపుడు అమ్మహాస్త్ర ప్రభావము నెరిగిన శ్రీకృష్ణుడు బిగ్గరగా, సైనికులందరితో మీరందరూ తొందరగా మీ మీ వాహనాలైన గజాశ్వరథాల నుండి దిగండి, ఊరకే నేలపై నిలవండి, అట్లాగైతే ఆ దివ్యాస్త్రం ఎవరినీ ఏమీ చేయదు. దీనికి విరుగుడు ఇదేనన్నాడు. దీనికి భీముడు సమ్మతించకపోవడంతో కృష్ణార్జునులు భీమున్ని సమీపించి, అతడిని రథంపై నుండి క్రిందపడేటట్లు త్రోసి బ్రతికించారు.

ధర్మరాజు, అర్జునుల మధ్య అంతఃకలహము చెలరేగినపుడు శ్రీకృష్ణుడు, ధర్మసూక్ష్మం ద్వారా వారి వారి శపథాలు చెల్లేటట్లుగా పలికి, భ్రాతృహత్యా, ఆత్మహత్యా ప్రమాదము నుండి ఆ అన్నదమ్ములను కాపాడాడు. అప్పుడు శ్రీకృష్ణుడే లేకున్న ఆ కలహము ధర్మజుని హత్యతోనో, అర్జునుని ఆత్మహత్యతోనో, సమాప్తమై యుండెడిది.

కర్ణార్జునుల ద్వంద్వయుద్ధములో ఒక ఘట్టమున "చక్రమిచ్చెద నతని మస్తకము దునుము" మని సవ్యసాచిని రెచ్చగొట్టినాడు. తన సారథ్యనైపుణ్యమునంతను చూపి రథమును ఐదంగుళములు భూమికి క్రుంగనదమి, కర్ణుని నాగాస్త్రమును గురితప్పించినాడు. పార్థుని ప్రాణాలు రక్షించినాడు. కడకు కృంగిన రథచక్రము నెత్తుకొనుచు రణధర్మములు వల్లించు రాధేయుని చూచి "అన్ని యెడలను నీ పాడియెందు బోయె"నని అతని దుశ్చేష్టల వివరించి అర్జునుని కవ్వించి అవ్వీరుని (కర్ణుని) తల నరికించినాడు.

చివరిరోజున శల్యుడు సర్వసైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైనాడు. ఆ రోజున ధర్మజుని పాండవపక్షమున సైన్యాధ్యక్షుడుగా నిల్పుట, శ్రీకృష్ణుని చతురనీతికి, పరేంగితజ్ఞతకు చక్కని తార్కాణం. శల్యునికి పాండవపక్షమున ఎదురు నిలువగల వీరు డెవరు? కృష్ణార్జునులు కంటబడిన, వారిని చీల్చి చెండాడగలడు. భీమసేనుడెదురైనను ప్రమాదమే.  కారణం ఇరువురూ మల్లయోధులు, ప్రతిద్వంద్వులు. ఇక ఎదుర్కొనవలసినవాడు ధర్మజుడు. ధర్మజుడన్న శల్యునకు అపారప్రేమ, గౌరవాభిమానములున్నవి. కౌరవుల జయించి, సార్వభౌముడవు కాగలవని ధర్మజుని ఆశీర్వదించియున్నాడు. ధర్మజుడు కనబడగానే శల్యుని ఉత్సాహము సగము చచ్చినది. ధర్మజుని శక్తికి మామ శల్యుడు తనువు చాలించాడు.

మడుగున దాగి యున్న దుర్యోధనుని బయటకు రప్పించుటకు శ్రీకృష్ణుడు ధర్మజుని పురికొల్పిన విధము, సవ్యసాచిచే సంజ్ఞ చేయించి భీముని చేత రారాజు తొడలు విరుగగొట్టి చంపిన విధానము, అన్నింటిని మించి, ఆగ్రహోదగ్రుడై హలాయుధమును చేపట్టి భీముని మీదికి విక్రమించిన బలరాముని అనునయించిన విధము,  శ్రీకృష్ణుని రాజనీతిచతురతకు ప్రబలనిదర్శనము.  అశ్వత్థామ సౌప్తికవధ నాడు ఎంతో దూరదృష్టితో శ్రీకృష్ణుడు, పాండవులను దూరముగ తొలగించుటతో వారు బ్రతికినారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రముచే ఉత్తరగర్భము దగ్ధము కాకుండా పాండవ వంశమును నిలిపినాడు.

అశ్వత్థామ నీచతకు రోసి, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టే రక్తంతో శరీరం కాలిపోతుండగా, ౩౦౦౦ సంవత్సరాలు అరణ్యంలో తిరుగాడుమని శపించాడు.

అంతేగాక పొలకలనిలో భీమసేనుడు, ధృతరాషు్ట్రని బాహుబంధమునకు బలి కాకుండా కాపాడినాడు. ధృతరాషు్ట్రని హృదయమును కృష్ణుడెలా కనిపెట్టగలిగి ఇనుపభీముని ఆ సమయాన అక్కడ పెట్టగలిగాడో... ఊహ కందని మాయాజాలంగా కనపడుతుంది.

గాంధారి తన కిచ్చిన ఘోరశాపమును ఒక్క చిరునవ్వుతో స్వీకరించి "మీ అపరాధమున వచ్చినట్టి కీడునకు నన్నింత నొవ్వ పల్కదగునె ?" అని మెత్తగా ఆమె అవివేకమును ఎత్తిచూపినాడు. (మీ తప్పు వలన వచ్చిన చేటుకు బాధ్యుడు నేనని, నన్ను నొప్పించేటట్లు ఇట్లా మాట్లాడడం న్యాయమా? ఇకనైనా ధైర్యం అవలంబించి నీ శోకాన్ని దూరం చేసుకో. కీడుకూ, చావుకూ ఏ మానవులు శోకిస్తారో వారి దుఃఖం రెండింతలవుతుందే తప్ప ఉపశమించదు).

ధర్మజుని పట్టాభిషేక సమయమున శ్రీకృష్ణుడు పూరించిన శంఖము పాండవవిజయ సూచకమే గాక, ఆ మహాత్ముడు ప్రారంభించిన ఉద్యమ సఫలతాసూచకము కూడా. హృదయమున పరిపూర్ణశాంతి ఏర్పడని ధర్మజునకు సమగ్రధర్మపరిజ్ఞాన ప్రబోధము గావింప నెంచి ధర్మబోధ చేయ భీష్ముని ఆదేశించినాడు. అందుకవసరమైన శక్తి సామర్థ్యముల ఆ పితామహునకు అనుగ్రహించినాడు. దీనితో భీష్ముని అపారజ్ఞాన సంపద వ్యర్థము కాకుండా సద్వినియోగమైనది. ధరనేలవలసిన ధర్మజునకు మనశ్శాంతి, ధర్మజ్ఞానము లభించినవి.

శ్రీకృష్ణుడు తన అతిమానుషశక్తి చేత పరీక్షితునకు ప్రాణదానము చేసినాడు. అద్వితీయరాజనీతిదక్షుడుగ ధర్మజునిచే అశ్వమేధ యాగము చేయించినాడు. శ్రీకృష్ణుని మహోద్యమము సఫలమైనది.

చివరకు యాదవనాశము మిగిలినది. ఆనాడు యాదవులు స్వభావము చేత అహంకారపూరితులు, మద్యపానమదోన్మత్తులు, ధర్మదూరులు. వారి తత్త్వము శ్రీకృష్ణునకెంతో మనోవ్యథ కల్గించినది. యాదవుల అడ్డు తొలగిననే తన ఉద్యమము సఫలము కాగలదు. దీనికి మునిశాపము, గాంధారి శాపములు తోడైనవి. యాదవుల అంతఃకలహములకు తాను కొంత తోడ్పడినాడు. పరస్పరము చంపుకొనుచుండ తానూరకున్నాడు. చివరకు తీవ్రకోపాగ్నితో హతశేషులను తానే తుంగలతో మోది నిరవశేషము గావించినాడు. దీనితో తన అవతార పరిసమాప్తి దగ్గరైనది.

శ్రీకృష్ణుడు ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని పూశాడు. కాని, అరికాలిలో మాత్రం పూయటం మరచిపోయాడు. ఫలితంగా ఆ ఋషి ఆ అరికాలిలోనే నీకు ప్రాణాపాయం జరుగుతుందని చెప్పిన విషయం గుర్తుకు రాగా, శరీరత్యాగం కోసం మనసును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణచిపెట్టి సమాధిని పొందాడు.

ఆ సమయంలో 'జర' నేలను కాలితో రాస్తూ అడవిలో ప్రవేశించింది. 'జర' ముసలితనానికి అధి
షా్ఠనదేవత. కాలం (మరణం) ఆసన్నమైనదని సూచించేది జర. ఆమెను కాలకన్య అని అంటారు. ఆమె వేటగాడిని భ్రాంతి ఆవహించేటట్లు చేసింది. ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి దృఢమైన రీతిలో నారిని సంధించి జింక అని భ్రమించి బాణం వదిలాడు. బాణం పాదంలో దూరి బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు మానవీయమైన దేహాన్ని విడిచి, పెంపొందిన తేజస్సు గలవాడై స్వర్గలోకానికి వెళ్లాడు. 

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:

భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట  నుండునో విజయ మచటనుండునని పలుకుట అక్షరసత్యం! "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే!

సకల సంస్కృత వాంగ్మయమునకును తలమానికమై విరాజిల్లెడు ఈ మహాభారతము ఇంతయై, అంతయై పెరిగి పెరిగి లక్షశ్లోకాత్మకమైన ఒక మహాగ్రంథముగా ప్రపంచ విఖ్యాతి వడసినది. నిఖిల భారతీయ జ్ఞాన విజ్ఞాన సర్వస్వమైనది.

                    "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ 
                      యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్" 


భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు.

భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును.

ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది.

ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు. కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివాడు.

అల్పజలాలు చేపను ఎట్లా చెరుస్తాయో కామం అట్లే అతడికి హానిని కలిగిస్తుంది. మరి అర్థధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్రజలాలు ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తాయి. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పరపోషకాలు. ఈ విధంగా త్రివర్గ విజ్ఞానం సాధించినవాడు సర్వశ్రేష్ఠుడు.

ప్రపంచమానవాళికి శ్రీకృష్ణుడు కౌరవసభలో రాయబార సందర్భంలో పలికిన వాక్కులు చూద్దాం.

"సారపు ధర్మమున్ విమలసత్యము బాపము చేత బొంకు చే
బారము బొంద లేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మని
స్తారకమయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్"

ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం, పాపం చేతను, అబద్ధం చేతను దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు - అని తిక్కనగారు చెప్పారు.

సంస్కృతమూలంలో వ్యాసమహర్షి ధర్మం అధర్మం చేతా, సత్యం అసత్యం చేతా నశిస్తున్నప్పుడు చూస్తూ ఊరకుంటే, సభాసదులకే చెడు మూడుతుంది. అటువంటివారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్లుగా ధర్మం వారిని ఉన్మూలించేస్తుంది. కాబట్టి ధర్మాన్ని సదా పరిశీలిస్తూ పరిరక్షిస్తూ దానినే ధ్యానిస్తూ కాలం గడిపేవారు, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్నీ మాత్రమే పలుకుతారు.

భీష్ముడు ధర్మజునకు శాంతిపర్వంలో ఈ విధంగా బోధించాడు.

వేదాలపై భక్తి, సృ్మతులపై గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ, ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం ధర్మానికి నాలుగవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి అసత్యం పలికి ధనాన్ని సంపాదించటం పాపాలన్నింటిలోనికి ఎక్కువ పాపం. అసత్యం పలుకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండటం, అన్ని ధర్మాలలోను మేలైన ధర్మాలు. శాస్త్రవిరుద్ధమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తిన విత్తనంవలె 
నిష్ర్పయోజనం అవుతుంది. ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఇహలోకపరలోకాలలో సుఖం లభిస్తుంది.

అన్ని ధర్మాలకు సారభూతమైన ధర్మనిజస్వరూపజ్ఞానాన్ని మహాభారతంలో వ్యాసుడు నిక్షేపించాడు.

"ఒరు లేయవి యొనర్చిన నరవర! యప్రియము తన మనంబున కగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథముల కెల్లన్"

రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా ఉన్నది.

ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, తమ దినపత్రికలో యావద్భారతావనిలోని మానవులకు సందేశంగా ఒక శతాబ్ది కాలం తమ పత్రికలో ప్రతిదినం ఈ పద్యాన్ని ప్రచురించి ఆంధ్రులకు మహోపకార సందేశాన్ని గుర్తు చేశారు. త్రికరణశుద్ధిగా ఆచరించి, తరించమన్నారు.


                                                              ******

Sunday, December 9, 2012

కుంతిదేవి (KunthiDevi)

నలుగురు వీరకుమారుల కన్నతల్లి, వివాహం కాకమునుపు సూర్యవర ప్రసాదంగా కర్ణుణ్ణి కన్నది. కన్నతోడనే కుమారున్ని గంగపాలు కావించింది. వివాహానంతరం పాండురాజు అనుమతితో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయు అంశాన ధర్మజ, భీమార్జునులను కన్నది.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పదవీ స్వీకారం చేసి మహారాజు అయినా వారివద్ద రాజమాతగా అష్టైశ్వర్యాలు అనుభవించక ఆశ్రమవాసానికి వెళ్లుతున్న ధృతరాష్ట్ర దంపతులతో పయనమై వెళ్లిన సాధ్వి కుంతి.


"యదుకుల విమల పయఃపయోనిధి సుధాకరరేఖ, కమనీయకాంతినిలయ, అనవరతాన్నదానాభితర్పిత మునివిప్రజనాశీః పవిత్రమూర్తి వినయాభిమానవివేక సౌజన్యాది సదమల గుణరత్నజన్మభూమి పరమపతివ్రతాభరణాభిశోభిత, తామరసేక్షణ, దాల్మి యందు పృథివి బోనిదాని, బృథ యను కన్యక".  

యదువంశమనే నిర్మల సముద్రానికి, చంద్రరేఖ వంటిది, మనోహరమైన తేజస్సుకు స్థానమైనది, ఎడ తెగని అన్నదానం చేత మునులను, బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ల ఆశీర్వచనం చేత పవిత్రమైన ఆకారంగలది, వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమ గుణాలచే రత్నాలకు జన్మ భూమి అయినది, పరమపతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేది, కమలాల వంటి కన్నులు గలది, ఓర్పులో భూమితో పోల్చదగింది, అయిన పృథ (కుంతి)ని పాండురాజు స్వయంవరంలో వరించి, వివాహం చేసుకున్నాడు.

సురల వరప్రసాదం చేత ఈమె నలుగురు బిడ్డల కన్నతల్లి అయింది. వారే కర్ణ-ధర్మజ-భీమార్జునులు.

ఈమె పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా, ఆదర్శమాతృమూర్తిగా మనకు మహాభారతకావ్యంలో దర్శనమిస్తుంది.

కుంతిభోజుని యింట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి, వడ్డించి భక్తితో సేవించింది కుంతి. ఆ ముని సంతోషించి, ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించాడామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే, అతడు కోరిన పుత్రుని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే.

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగ ఒడ్డుకేగి కుంతి, సూర్యుడిని స్మరించి అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు దివ్యతేజస్సుతో ఆమె వద్దకు దిగి వచ్చాడు. సహజకవచకుండలశోభితుడైన బిడ్డనిచ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు సూర్యుడు. కుంతి సూర్యప్రేరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదిలింది. సూతుడొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన కుమారుడుగా పెంచుకున్నాడు. కుంతి కర్ణుని జన్మరహస్యము బైటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది.

కుంతి, మాద్రులను పాండురాజు వివాహమాడాడు. ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. ఒకచోట రెండు మృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడనే ముని తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ, శాపంబెట్టాడు. నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపొతావు అని శపించి ఆ ముని దంపతులు కన్నుమూశారు. పాండురాజు విషణు్ణడు, విరక్తుడు కూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగపర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లే దారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే, పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని వారు "అపుత్రస్య గతిర్నాస్తి" అని, నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ కృంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహితచిత్తంతో మంత్రాన్ని జపించింది. సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైన ధర్ముని స్మరించి ఉత్తమధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకున్నది. ధర్ముని అంశాన, కురుకులదీపకుడైన యుధిష్ఠిరకుమారుడు అగ్రజుడుగా జన్మించాడు.

యుధిష్ఠిరుడు పుట్టినట్లుగా హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని పొందలేకపోయి, అసూయతో కడుపుపై బాదుకొన్నది. గర్భపాతమై పోయింది.  వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను 101 లెక్కించి వేరు వేరు తైలభాండాలలో భద్రపరచాడు. వందమంది కుమారులు, ఒక్క కూతురు పుడతారని చెప్పివెళ్లాడు.

అక్కడ శతశృంగపర్వతం మీద పాండురాజు, కుంతిని వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్వుడైన కుమారుని పొందమన్నాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన, విక్రమోన్నతుడైన భీమసేనబలుడు పుట్టాడు.

అదేరోజున హస్తినలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్ని, లోకాన్ని నాశనం చేయగల దుశ్శకునాలు పొడసూపాయి. దుశ్శాసనుడు మొదలైన 99 మంది సోదరులు, సోదరి దుస్సల జన్మించారు. కులనాశకుడైన దుర్యోధనుని వెలివెయ్యలేక పుత్రవ్యామోహంతో ధృతరాషు్ట్రడు పెంచుకున్నాడు.

పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు ఒక సంవత్సరకాలం ఎకపాదంపై తపస్సు చేసి ఇంద్రుని వరం వల్ల  లోకోత్తరుడు, స్థిరపౌరుషుడు, వంశకరుడైన అర్జునుని మూడవ కుమారుడుగా పొందాడు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడు లోకాలు జయించినట్లు పొంగిపోయేవాడు.

రెండవ భార్య మాద్రి కూడా భర్త కోరికపై అశ్వినీ దేవతల వరప్రసాదంతో కవలపిల్లలను పొందింది. వారే నకులసహదేవులు. ఇలా పంచపాండవులు పుట్టి, దినదినప్రవర్ధమానులగుచున్నారు.

వసంతమాసం వచ్చింది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలైంది. మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం వసంతప్రభావంతో అతని మనస్సు ఆకర్షించింది. మాద్రియొక్క పొందు కోరిన పాండురాజు మునిశాపం చేత మరణించాడు. మాద్రి పాండురాజుతో సహగమనం చేసింది. కుమారరక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది.

మాద్రీపాండురాజుల అంత్యక్రియల తర్వాత, వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు.

వీళ్లు దైవశక్తి వలన పుట్టిన వాళ్లనటంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతి, పోల్చి చూస్తే వీరు దేవతలే, ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా? అని పౌరులు, పాండవులను కొనియాడుతూ సింహకిశోరులైన వారిని చూచారు.

రాజ్యమొకప్పుడు తన భర్తదే. ప్రస్తుతం అది బావగారి చేతిలో ఉన్నది. బావగారికి పుత్రులున్నారు. అందుచేత ఆ రాజ్యము తన కొడుకులకు వచ్చుటెట్లు? ఇది ఒక పెద్ద సమస్య. కాలము పరిస్థితులలో పెద్ద మార్పు తేగలదు. పాండవులు పెద్దవారైనారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పదిమంది ప్రశంసలందుకున్నారు.

కుమారాస్త్ర విద్యాప్రదర్శన మొక మలుపు. అర్జునుని అస్త్రవిద్యాకౌశలము జూచి అశేషప్రేక్షకలోకం ప్రశంసించుచుండగా ఆ తల్లి అనంత హర్షవిస్ఫారితలోచనయై రాకుమారులలో తన కుమారుని చూచుకొని ఎంతో పొంగిపోయింది. ఇంతలో పిడుగువలె కర్ణుడు రణరంగమున దూకినాడు. భుజ మప్పళించి పార్థునితో తలపడినాడు. ఎప్పుడో ఏటిలో పారవేయబడిన మొదటి కుమారుడింత ఘనుడై, కవచకుండలశోభితుడైన వాడిని గుర్తించి, ఆనందాశ్చర్యములు పెనుకొనగా, పుత్రులిద్దరు ప్రత్యర్ధులై సలుపు పోరులో ఎవ్వరేమగుదురో యన్న భయము ఆమెను క్రుంగదీసినది, అది చూసి తట్టుకొనలేక కుంతీదేవి మూరి్ఛల్లినది. 

సేద తీరిన కుంతి గాంచిన దృశ్యము, ఆమెను నిలువునా దహించివేసింది. కర్ణుడందరి చేత కులము తక్కువవాడుగా అవమానింపబడినాడు. ఆ విషమసమయమున కర్ణుడు నిస్సహాయుడై, నింగినున్న సూర్యుని సాక్షిగా నిలువబడినాడు. ప్రత్యక్షసాక్షిగా నిలిచిన తాను ఆ పరిస్థితిలో ఎలా బయటపడగలదు? తోడికోడళ్ల ముందు, బావగారి ముందు, భీష్మ ద్రోణ కృపాది పూజ్యవృద్ధుల ముందు, కౌరవులముందు, కన్న కుమారుల ముందు, అశేష ప్రజానీకము ముందు తాను కన్యగానున్నప్పుడు జరిపిన అనుచిత శృంగార ఫలమీ కర్ణుడని కుంతియే గాదు, లోకమున ఏ స్త్రీయైనా ఎట్లు చెప్పగలదు?  అందుచేత ఆమె ప్రథమ పుత్రస్నేహ మెరుక పడకుండనున్నది. కర్ణుడిని విధికి వదిలివేసింది.

కర్ణుడు కౌరవపక్షం చేరినాడు. పాండవులకు ప్రబల ప్రత్యర్థియైనాడు. పాండవుల కొరకు కర్ణుని వదలుకొనవలెను లేదా కర్ణుని కొరకు పాండవుల పరిత్యజింపవలెను, లేదా ఇరువురకు సంధి గూర్చవలెను. స్త్రీమూర్తి కుంతికది అసాధ్య విషయము. అప్పటి పరిస్థితులట్టివి. వ్యక్తుల ప్రవృత్తులట్టివి. పైగా ఆమెది బయటపడలేని మానసికస్థితి, ఎన్నో విషమసన్నివేశముల సహించి తల వంచి ఊరకున్నది.

యుధిష్ఠిర యౌవరాజ్యపట్టాభిషేకము, ద్రౌపదీ స్వయంవరము, రాజసూయ మహాయాగము, కుంతిదేవి జీవితంలో కొండంత ఆనందము నొసగు ఘట్టములు. తన జన్మచరితార్థమయ్యెనన్నంత తృప్తి నిచ్చు అంశములు. కాని ఈ ఆనందము గూడ ఆమెకెంతో కాలము నిలువలేదు. ద్యూతపునరూ్ద్యతములు, పాండవపరాజయ, ద్రౌపదీపరాభవములు, అరణ్యాజ్ఞాతవాసములు ఆ తల్లి హృదయమును మరల కల్లోలపరచినవి.

కానీ కొడుకుల తోడిదే లోకమని, కొడుకుల కొరకే జీవించి, వారి అభ్యుదయమునకే తన సర్వశక్తులు ధారబోసిన కుంతివంటి మాతృమూర్తి అడవుల పాలైన కొడుకులను విడిచి హస్తినలో ఉండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించు విషయమే. వనవాసక్లేశమునకు ఒర్వలేదన్నది, ఒక కారణం కావచ్చును, కాని కుంతి మనోభావంలో పాండవులు 13 ఏండ్లు పదవికి, ప్రజలకు దూరమగుచున్నారు. పాండవులు మరల వత్తురన్న విశ్వాసము ప్రబలముగ ప్రజలలో నెలకొనుటకు, పాండవ ప్రతినిధిగా ఒక ప్రముఖ వ్యక్తి హస్తినాపురమున వుండటం, ఎంతో ముదావహం. అందుకు తగిన వ్యక్తి కుంతిదేవియే. ఆమె ఉండదగిన ఇల్లు పాండవుల హితైషియైన విదురుని గృహమే. ఆమె కురుపాండవ రాజ్యవ్యవహారము తెగిపోలేదని తెలుపు దృఢతంతువుగా నిలిచింది.

కుంతి, పాండవుల అరణ్యాజ్ఞాతవాసముల తరువాత, ద్రుపద పురోహితు రాయబారము, సంజయరాయబారము విఫలమగుట గుర్తించినది. సామా్రజ్య మేలవలసిన సుతులు దిక్కులేనివారై ఊరకుండుటకు, వీరమాతగా, రాజమాతగా, విరాజిల్లవలసిన తాను పరుల పంచన పొట్టపోసికొనుటకు ఆమె హృదయము కుమిలిపోయినది. రాయబారమునకు వచ్చిన కృష్ణునితో తన హృదయవేదనను తెలియపరచింది. స్త్రీ స్వభావ సహజముగా మేనల్లుని కౌగిలించుకుని ఎలుగెత్తి రోదించింది.

కొడుకుల దుఃస్థితిని, కోడలి ఘోరావమానమును గుర్తు చేసినది. 13 ఏండ్లు బావ కొడుకు పెట్టే దయమాలిన తిండి తినటం ఒక ఎత్తుగా ఉన్నది. నేనేమి చెప్పగలను అంటూ, ఇట్లాంటి కఠినచిత్తుల ఇంటికి నన్ను కోడలిని చేసిన నా పుట్టింటి వారినే దూషించాలి. అట్లా దూషించటం కూడా సమంజసం ఔతుందా అని ప్రశ్నించింది.

ఆమె వీరమాతగా కొడుకులకు పౌరుషము కూర్చుట అవసరమని భావించి, శ్రీకృష్ణునితో "కొడుకు గాంచు రాచకూతురెద్దానికి? నట్టి పనికి నుచితమైన సమయ మొదవె దడయు టింక నొప్పుడు, జనములు, నట్లు గాని పురుషు లనరు మిమ్ము" 
-క్షత్రియకన్య పెండ్లాడి కొడుకును ఏ కార్యానికై కంటుందో అట్టి ప్రతాపప్రదర్శనకు తగిన అదను సంప్రాప్తించింది. ఇక ఆలసించటం తగదు. అప్పుడు గాని మిమ్మల్ని ప్రజలు మగవారిని అనరు సుమా!
ఆకలి తెలిసి అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేది, అనువుగా మందలించేది, ఆదర్శంతో తీర్చిదిద్దే తల్లి కుంతి. వీరమాతగా శ్రీకృష్ణుని ద్వారా కుమారులకు పంపిన సందేశం కొరడాతో జళిపించేదిగా ఉంది.

"భుజబలమున జీవించుట నిజధర్మము మెత్తబడుట నింద్యము, మాద్రీప్రజలకు జెప్పుము ద్రుపదాత్మజకార్యం బడుగు మనుము తగ నందరతోన్"
మాద్రీనందనులైన నకులసహదేవులతో, బాహుబలంతో బ్రతకటం క్షత్రియధర్మమనీ, అణగిమణగి ఉండటం దూషింపదగిన  విషయమనీ చెప్పుము. తన కర్తవ్యమేమిటో ద్రౌపది నడిగి తెలిసికొండని పాండవులందరితో చెప్పుము - అంటూ కన్న కొడుకులకు కర్తవ్యబోధ చేసింది మాతృమూర్తి కుంతీదేవి.

కురుపాండవ రాజ్యసమస్యను పరిష్కరించుటకు, మహాభారత సంగ్రామమును నివారించుటకు, కొడుకులందరు సుఖముగా జీవించుటకు, కుంతీదేవి ఎంతో సాహసంతో ఏకాంతమున కర్ణుని కలిసినది. అతని జన్మరహస్యమును చెప్పినది. పాండవపక్షమునకు రమ్మని కోరినది. పరిస్థితులను చక్కదిద్ద ప్రయత్నించినది. కాని ప్రయోజనము లేకపోయినది. ప్రయత్నమాలస్యమైనది. పరిష్టితులు పాకము దప్పినవి. కర్ణుడు పాండవపక్షమునకు ససేమిరా రానన్నాడు. కర్ణుని కుంతి వరము కోరినది. దీని వలన కర్ణుని కాళ్లకు బంధము పడినది. కాని కర్ణుడు వరమిచ్చాడు. పాండవులు ఐదుగురే కాని, ఆరుగురు కారన్నాడు. కర్ణపార్థులలో ఒక్కరే దక్కుతారని సెలవిచ్చాడు. తల్లి మాటకు కట్టుబడ్డాడు.

మహాభారత సంగ్రామానంతరం మృతవీరులకు ధృతరాష్ట్ర ధర్మజులు తిలోదకములు వదులుచున్నారు. కర్ణుడు సూతుడని ఇద్దరూ ఉదకములు వదలలేదు. కుంతి గుండెలో అగ్నిపర్వతం బ్రద్దలైనది. కర్ణునికి జీవితములో తానెంతో అన్యాయము చేసినది. అతని మృతికి గూడ తాను పరోక్షకారణమైనది. ఇప్పుడింకను అతని జన్మరహస్యమును దాచి, తిలోదకములు కూడా ఆ కుమారునకు దక్కకుండా జేయుచున్నది. కుంతి దుఃఖావేశమిక ఆగలేదు. అది ఉప్పెన వలె పైకి పొంగినది. స్త్రీ సహజమైన లోకాపవాదభీతిని దాటినది. తెగించి ధర్మజునితో "మీకు అగ్రజుండు నాకు భాస్కరు దయ లలిత కవచకుండలముల తోడ బుట్టినాడు గాన, బోయంగ వలయు దిలోదకంబులమ్మహోన్నతునకు" 
"మీ ఐదుగురికీ ఆయన అన్నగారు. సూర్యుడి వరప్రసాదంగా నాకు సుందరమైన కవచకుండలాలతో పుట్టాడు. అందువలన ఆ మహానుభావుడికి తిలోదకప్రదానం మీరు చేయాలి" అని కర్ణ జన్మరహస్యము వెళ్లగ్రక్కి తిలోదకములు వదలమని కోరినది.

జీవితంలో ఎంతో శ్రమపడి, ఎన్నో కష్టములకు ఓర్చి పాండవులను పెంచి పెద్దచేసి, వారు ప్రత్యర్థులను గెల్చి పట్టాభిషిక్తులైన సమయమున, రాజమాతగా భోగభాగ్యములనుభవింపకుండ, పుత్రశోకపరితాత్ములైన గాంధారీధృతరాషు్ట్ర వెంట మనశ్శాంతికై తాను గూడ ఆశ్రమవాసమునకు ఏగినది.

ఆశ్రమవాసమేగు కుంతితో వెళ్లవద్దని వారించిన కుమారుడు ధర్మజునితో, "నేను గాంధారీ ద్రుతరాషు్ట్రకు సేవ చేయటానికి మాత్రమే సమర్థురాలిని, వారు అడవులకు పోగా ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పదు. కర్ణుని మనస్సులో స్మరిస్తూ దేవుడు వంటి ఆ కర్ణుడు నాకు జన్మించిన సంగతి వంచనతో మరుగు పరచాను. ఆ కర్ణుడి జననాన్ని గురించి తెలియకుండా చేయటం పాపం. అందుకు నా మనస్సులో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. నిర్మల హృదయుడివైన ధర్మరాజా! ఆ పాపం తొలగిపోయేటట్లు నీవు గొప్ప గొప్ప వస్తువులు దానాలు చేయుము. కర్ణుడావిధంగా మరణించటం తెలిసి కూడా నా మనస్సు నూరు ముక్కలైపోలేదు. చూడగా ఈ మనసును ఎంతో బలమైన రాయితో తయారు చేసి ఉంటాడు ఆ దేవుడు. నీవు, నీ తమ్ములూ మహాత్ముడైన ఆ కర్ణున్ని భక్తితో స్మరిస్తూ ఉండండి. ద్రౌపదిని సగౌరవంగా ఎప్పుడూ ఆదరించండి. సహదేవుణ్ణి ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా చూచుకో" అంటూ తుదిపలుకులు పలికింది తల్లి కుంతీదేవి.

కర్ణుడు బ్రతికి ఉన్నన్నాళూ్ల అగ్రజుడు అని తెలియక ఆదరించలేకపోయారు పాండవులు. అందుకే ఇప్పుడు ఎలాగూ మరణించాడు కాబట్టి గతకాలవైరం మనసులో ఉంచుకోకుండా భక్తిభావంతో తలచుకొమ్మంటుంది కుంతి. ఆమె హృదయవ్యథ ఎంత తీవ్రమో తెలియగలదు.

ఆశ్రమవాస సమయమున తన కడుపుకోతను మామయైన వ్యాసమహర్షితో తెలుపుకొన్నది. ఆయన ఓదార్పు మాటలతో, ఆయన యోగమహిమచే కూర్చిన కర్ణస్వర్గసుఖానుభవదర్శనముతో కుంతి కొంత ఊరట చెందింది. గాంధారీ ధృతరాషు్ట్రల సేవతో గంగాద్వారమున వారితోపాటు ప్రశాంతచిత్తయై దావాగ్నిమధ్యమున తనువు చాలించినది. ధన్యజీవి  పాండవ రాజమాత కుంతీదేవి!


                                           ******

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi)

అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.

త||     "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
           త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
           తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి 
           తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"

వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, తు్రః"  అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

రాజసూయ మహాధ్వరసమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.

"ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి,  తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు".

రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు" అంటాడు.

ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని-
"అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"
బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటికాంతి ఏ  యితర కాంతల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది. 

విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది.

దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం.

జగద్రక్షకుడైన నారాయణుని మహిమవల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.
అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -
"నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంటు్రకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు?" అన్నది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు "నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది" అని ఓదార్చాడు.

అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంటు్రకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.

అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికావేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది.
పురజనులు, సైరంధ్రీవేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు.

దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాతవ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.

సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళూ్లరటం ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు?
భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు.

అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది.

కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది. సుధేష్ణ కోరికపై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.

మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా? అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.

ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడనుండి కదలలేదు.

అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.

ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయభంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు. కీచకుణి్న ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేతస్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతానన్నాడు.

మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు.

భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్నవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుమని భీముడు పలికాడు. భీముని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.

అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.

"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు 
పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి, 
నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్, సహజన్ముల 
ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"

(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).

"ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ, మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై"
ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.

ఈ నా తల వెంటు్రకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?

అచ్చతెనుగు పదములలో తిక్కనగారు ఏడ్చుచున్న ద్రౌపదిని, పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపాన్ని పఠితల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేసినారు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్పు!

దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో అని రోదించింది ద్రౌపది.

దీనికి సమాధానంగా  శ్రీకృష్ణుడు ద్రౌపదితో, అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.

కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.

కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -
"నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి, న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను, నక్కౌరవ్యు జూచుం బొరిన్" 
నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు.

భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.

చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!


                                           *******