Monday, June 17, 2013

శ్రీకృష్ణుడు (SriKrishnudu)


అవతార పురుషుడు. నరనారాయణులలో నారాయణుడు. లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు. శ్రీకృష్ణ భగవత్తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినవారు భీష్మాచార్యుడు, పాండవులు మాత్రమే. 

రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందబడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ  బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ  ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.

ఈయన అవతార పురుషుడు. 

"దైవం మానుష రూపేణా" అన్నట్లు దేవుడే మనుష్యరూపం ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కొరకు భూమిపై అవతరించినట్లుగా మహాభారతంలో ఎల్ల చోట్లా కనబడుతున్నది. 

ద్వాపరయుగమున మద్యపాన, స్త్రీలౌల్య, ద్యూతక్రీడాది వ్యసనములు సమాజమున స్వైరవిహారము చేసినవి. మద్రదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు.

అట్లే యాదవజాతి గూడ మితిమీరిన భోగాసక్తితో, అహంకారంతో ప్రవర్తిల్లినది. అక్కడి ప్రజలలోనే గాక ప్రభువులలో గూడ ఆనాడు స్వార్థభోగములు పెచ్చు పెరిగినవి. అహంకారాది స్వాతిశయములు మిన్ను ముట్టినవి. అంతేగాక బలవంతునిదే రాజ్యమన్న పాశవిక సిద్దాంతానుసారము జరాసంధాదులు రాజ్యపాలనకావించి, పాశవికంగా చెరబట్టిన రాజుల తలలు త్రెంచి భైరవపూజ కావించేవారు. నరకాసుర, బాణాసుర, శిశుపాల, సాల్వ, హంస-డింభకాదులు అట్టి రాక్షస ప్రవృత్తి గలవారే. సాధుజనులు, బలహీనులు సుఖశాంతులతో జీవించుట కష్టమైనది.

ఇట్టి స్థితిలో సమాజమున సంక్షోభము తొలగించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిపించి వేదధర్మసంస్థాపనకై ఒక మహోద్యమమును సాంఘికముగ చేపట్టిన మహాత్ముడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు సాంఘికముగ సాధించిన మహాకార్యమును కృష్ణద్వైపాయనుడు వాఙ్మయముఖమున సాధించినాడు. శ్రీకృష్ణవ్యాసులు అవతార పురుషులుగ ప్రపంచ మానవాళి ఆరాధనలందుకొన్నారు, అందుకొంటున్నారు.

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే" - అను గీతాశ్లోకమును శ్రీకృష్ణుని జన్మప్రయోజనమును, ఆ మహనీయుడు చేపట్టిన ఉద్యమపరమార్థమును లోకమునకు తెలియచెప్పినది.

శ్రీకృష్ణుడు మానవాతీత మహితశక్తులతో జన్మించినను, జన్మసిద్ధములైన ఆ శక్తులకు తోడు గంధమాదనమున 10 వేల ఏండ్లు దుంపలు, పండ్లు మాత్రమే ఆహారంగా, పుష్కరంలో 11 వేల ఏండ్లు నీళ్లు మాత్రమే ఆహారంగా, ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటికాలిపై నిలిచి, గాలి మాత్రమే పీల్చి, బదరీవనంలో పెక్కేండ్లు కఠోరతపస్సు చేశాడు. అపారశక్తిసంపద నార్జించాడు. అధికనిష్ఠతో బ్రహ్మచర్యవ్రతము పూని రుక్మిణీసహితముగా హిమాద్రిపై తపస్సు చేసి చక్రాయుధము పొందినాడు. ఇన్ని శక్తులు తనలో నింపుకుని, ఆత్మసాక్షాత్కారము పొంది యోగేశ్వరేశ్వరుడయ్యాడు. తాను సంపాదించిన అలౌకిక శక్తులను సమాజముఖము గావించినాడు. ధర్మసంస్థాపనరూపమైన ఒక మహోద్యమమును ప్రారంభించినాడు. మానవాతీతుడుగ దర్శనమిచ్చినాడు. ఈయనకు నరుని సహకారం లభించింది. కారణజన్ముడైన అర్జునుడే నరుడు.

అరణ్యవాస సమయంలో శ్రీకృష్ణుడే ఈ మాట అర్జునునితో అంటాడు. మన మిరువురం నరనారాయణులనబడే ఆదిఋషులం.  మనం గొప్ప శక్తి కలిగి మనుజలోకంలో అవతరించామని చెప్పాడు.

కురుపాండవ కలహమునకు శ్రీకృష్ణుడు తానుగా బీజము నాటలేదు. వ్యక్తుల ప్రవృత్తుల, పరిస్థితుల ప్రభావములే ఆ కలహమునకు దారి తీసినవి. కురుపాండవ కక్షలు పెరిగినవి. పాండవులు కడకు లక్క యింట భస్మము కాకుండ తప్పించుకున్నారు. హిడింబ, బకాసురులను తుద ముట్టించారు. అర్జునుడు సర్వరాజసమక్షమున మత్స్యయంత్రమును ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. అది చూచి ఓర్వలేక తమ మీదకూ, ద్రుపదుని మీదకూ దండెత్తి వచ్చిన కౌరవులను ఓడించి మించినారు. శ్రీకృష్ణుడు పాండవుల ప్రయోజకత్వమును చూచినాడు. భీమార్జునుల మీదకు విజృంభించు రాకుమారులను వారించాడు. బలరామసహితుడై పాండవనివాసమున కేగినాడు. పాండవతేజమును ప్రశంసించి, కౌరవుల దుర్మార్గము గర్హించి, మున్ముందు మేలు కలుగునని ధైర్యము చెప్పి, పాండవ హృదయములు గెల్చుకొన్నాడు. వారికి కొండంత ఆప్తుడుగా నిలిచాడు. కురుపాండవరాజకీయములలో గణనీయపాత్ర వహించటం మొదలుపెట్టాడు.

అర్ధరాజ్యమిచ్చి ధృతరాష్ట్రడు పాండవులను ఖాండవప్రస్థము పంపినపుడు శ్రీకృష్ణుడు వారి వెంట వెళ్లినాడు. మయునిచే ఇంద్రప్రస్థమును నిర్మింపజేసి పాండవపురప్రవేశోత్సవమును జరిపించి ద్వారక కేగినాడు. సుభద్రార్జునుల వివాహము చతురముగ నిర్వహించినాడు. యదుపాండవసఖ్యమును సుదృఢము గావించినాడు.

రాజసూయము ఎంతో రాజకీయప్రాధాన్యమున్న మహాయాగము. దీనిని శ్రీకృష్ణుడు తన ఆశయసిద్ధికి అనుగుణముగ వాడుకొన్నాడు. ధర్మజుని అన్ని విధముల ప్రోత్సహించినాడు. పార్థురక్షాబలము, భీముని బాహుబలము, నా నిర్మలనీతిబలము నీకుండ అసాధ్య మేమున్నదని ధైర్యము చెప్పినాడు. జరాసంధుడు, మల్లయుద్ధమున భీమునే వరించునట్లు చేసి శత్రుసంహారము కావించినాడు. జరాసంధవధతో శ్రీకృష్ణునకు స్వకార్యము, స్వామికార్యము సిద్ధించినవి. (కంసుని భార్య జరాసంధుని కుమార్తె కావున, జరాసంధుడు మధురపై 10 మార్లు దండెత్తాడు, కారణం అల్లుడైన కంసుని శ్రీకృష్ణుడు సంహరించటమే). 

శ్రీకృష్ణభగవత్తత్త్వం బాగా ఎరిగినవారు పాండవులు. తాత భీష్మపితామహుడు రాజసూయయాగసమయంలో అర్ఘ్య ప్రదానానికి శ్రీకృష్ణుని సకలరాజసమక్షంలో అర్హుడుగా ప్రకటించడం, దీనిని వ్యతిరేకించి ద్వేషించిన శిశుపాలుడు, ఆ సకలరాజసమక్షంలోనే శ్రీకృష్ణుని సుదర్శన చక్రానికి ప్రాణాలర్పించడం జరిగింది.

రాజులంతా ఆశ్చర్యంతో కళ్లంతా పెద్దవి చేసికొని చూస్తుండగా, శిశుపాలుని శరీరం వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందబడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి, ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చి, శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవరూపంలోని దైవంగా కీర్తించారు.

కౌరవపాండవ ద్యూతపునరూ్ద్యతసమయంలో  శ్రీకృష్ణుడు పక్కకు తొలగుట ఆయన రాజనీతిలో ఒక భాగము కావచ్చును.  ఆయన అరణ్యవాస సమయంలో పాండవులను చేరి యోగక్షేమాలు విచారించి, చెప్పిన కారణం- తాను పదినెలలు సముద్రతీరంలో సాల్వుడితో యుద్ధం చేయవలసివచ్చినందువలన దుష్టద్యూతసమయంలో వారికి దూరంగా ఉండిపోయానన్నాడు.

ద్రౌపదీవస్త్రాపహరణ సమయంలో యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు, తన మానవాతీత శక్తిచే ద్రౌపదికి అక్షయవస్త్ర ప్రదానము చేయుట అసాధారణము, ఆశ్చర్యకరము. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్ట పడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక, పట్టు విడిచి సిగ్గు చెంది ఊరకుండిపోయాడు. ఆర్తరక్షణపరాయణుడయిన భగవంతుడున్నాడనటానికి ఇంత కంటే ఏమి సాక్ష్యం కావలెను?

శ్రీకృష్ణుని మహోద్యమసంకల్పము దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన. అది పూర్తియగుటకు మహాభారతసంగ్రామము మంచిసాధనము. ఆ సంగ్రామము మూలముగ సంఘము నందలి దుష్టశక్తులన్నియు ఒక్కచోటికి చేరగలవు. ఒక్కసారిగ నాశమొందగలవు. విశేషించి ఈ నాశము వెంటనే ధర్మరాజు చేత ధర్మసామ్రాజ్యమును స్థాపింపజేయవచ్చును. ఈ దృష్టితో చూచిన,  శ్రీకృష్ణుని అభీష్టము సమరముఖముగనే చూపట్టును. మరి సంధి ప్రయత్నమెందులకన్న ప్రశ్న ఉదయించకమానదు.

అరణ్యవాస సమయంలో దుఃఖిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు, నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడైన అర్జునుడి కఠోర బాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరకతప్పదు. సప్తసాగరాలు ఇంకిపోయినప్పటికి, పగలు, రాత్రి తారుమారైనప్పటికీ, నా మాట నిజంగా జరిగితీరుతుందన్నాడు.

అరణ్యాజ్ఞాతవాస సమాప్తి అనంతరం, రాయబారానికి ముందు, "పూని పలికెద వినుము రిపుక్షయంబు జేసి యుజ్జ్వల పుణ్యలక్ష్మీసమేతులైన పాండుకుమారుల యధికవిభవ మీవు సూచెదు తడవు లేదిది నిజంబు" అంటాడు.

ద్రుపదుపుత్రీ, శపథం చేసి చెపుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులను విధ్వంసం చేసి ప్రకాశమానమైన పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం అని పలికి మహాభారతయుద్ధం ఎంతో ముందుగానే జరుగగలదని నిర్ణయించాడు.

రాయబారము చేయవచ్చిన సంజయునితో "వీరికి బోరు మేలు నాకుం జూడన్" నాకు చూడగా ఎట్లా అయినా వీరికి యుద్ధమే మంచిది అని యుద్ధమువైపే మొగ్గినాడు.

రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణునితో విదురుడు, దుర్యోధనుడు దురాత్ముడు, నీచుడు, దురహంకారపూరితుడు; అతడు నీ మాట వింటాడా అనగా, నాకు దుర్యోధనుడి దౌష్ట్యమంతా తెలుసు; అతడితో చేరిన రాజులందరు పాండవుల మీద పగగొని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారనీ తెలుసు; సంధి సమకూరదనీ తెలుసు అంటూ, మానవుడు తన శక్తిలోపం లేకుండా ధర్మకార్యాన్ని చేయటానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతడు దానిని పూర్తి చేయలేక ఫలం పొందలేకపోయినా దాని పుణ్యాన్ని తప్పక పొందుతాడు. అందులో నాకు సంశయం లేదు.

"చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు డడ్డపడి వారితోన గొట్లాడియైన దాని నుడుపంగజొరకున్న వాని గ్రూరకర్ముడని చెప్పుదురు కర్మకాండవిదులు".

బంధువులలో పరస్పరం వైరమేర్పడితే అడ్డం వచ్చి, వారితో తగవులాడి అయినా పగను మాన్పకుంటే అలాంటివాడిని క్రూరకర్ముడని కర్మకాండతత్త్వం తెలిసిన పెద్దలు చెపుతారు. కురుపాండవుల పొత్తు కొరకు ప్రయత్నం చేస్తాను. ధర్మార్థయుక్తంగా ఒద్దిక మాటలు మంత్రి సహితుడైన దుర్యోధనునకు చెపుతాను. అతడికీ, పాండుకుమారులకూ, సర్వజనులకూ మేలు కలిగించే మార్గమేదో మోసం లేకుండా తెలుపుతాను. ఇట్లా చెబుతున్న నన్ను పాండవపక్షపాతి అని దుర్యోధనుడు సందేహపడి నా మాటలు వినకపోతే పోనీ, అదీ ఒకందుకు మంచిదే. ఇట్లా నేను ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం కల్పించుకొనకుంటే అన్నదమ్ములు తమలో తాము పోట్లాడుకుంటుంటే కృష్ణుడు వారించక తనకేమీ పట్టనట్లు ఊరక ఉండిపోయాడు; తాను అనుకుంటే కార్యం చక్కదిద్దలేడా? అని అవివేకులు నన్ను ఆడిపోసుకుంటారు. అందుచేత పెద్దలు సమ్మతించేటట్లు అన్ని విధాలా కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైన మాటలు వారికి చెబుతాను. దుర్యోధనాదులు తాము బ్రతకటానికి దారి కల్పించే నా మాటలు మన్నిస్తే బాగుపడతారు. అట్లా నా మాటలు ఆదరించక నీవు భావించినట్లు కుత్సితులై తిరుగబడితే, వారు నా ముందు నిలువగలరా? అన్నాడు.

రాయబారమునకు ముందుగనే పాండవుల అభిప్రాయం తెలుసుకోగోరి ధర్మజునితో, శ్రీకృష్ణుడు సంధియా, సమరమా అన్నదానికి ధర్మజుడు - మహానుభావా శ్రీకృష్ణా! కష్టాలను తొలగించటానికి శుభాన్ని సమకూర్చటానికి సమర్థుడవైన నిన్ను ఈ జన్మకు మాకు దిక్కుగా జూపి మా తండ్రి పాండుమహారాజు గతించాడు. పాండవులూ, కౌరవులెట్లాంటివారో నీవెరుగుదువు. కూర్మి అంటే ఎట్టిదో నీవెరుగుదువు. కార్యసాధన విధానమెట్టిదో ఎరుగుదువు. మాటలాడు తెరగెట్టిదో ఎరుగుదువు. నీకు ఉపాయాలు చెప్ప నేనేపాటివాడిని? హస్తినకు వెళ్లిరమ్మన్నాడు. (సర్వజ్ఞుడవైన నీకు ధర్మనీతులు చెప్పటానికి నేనెంతవాడను? నీకు ఉపాయాలు చెప్పేటంతవాడినా నేను? )

దీనికి శ్రీకృష్ణుడు, నేనా కురుసభకు వెళ్లి నీ వినయ గుణాన్ని అందరకు తేటపడేటట్లు లెస్సగా వర్ణిస్తాను. మిత్రులు, బంధువులు నానా దేశాల రాజులు ఆలకించగా నీ పావనమైన ప్రవర్తనను, నీవు ధర్మమార్గం అవలంబించే తీరూ, కౌరవుల సభలో అందరకు తెలిసేటట్లు మాటలాడుతానన్నాడు. కురుసభలో సంధికార్యం ఫలించినా, ఫలించకపోయినా, సభ్యులైన, బంధుమిత్రులైన రాజులందరూ పాండవుల ధర్మనీతి వర్తనాన్ని మెచ్చుకుని కౌరవులను నిందించి నిరసించేటట్లు చేయటమే ధర్మజవ్యూహం; దానిని సఫలంగా నిర్వహిస్తానని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.

ఇక భీముడు తన మాటగా శ్రీకృష్ణునితో, మనం అన్నదమ్ములమై ఉండి కూడా లోకులు తలయెత్తి చూచి పరిహసించగా మనలో మనం ఒకరితో నొకరు పోట్లాడుకొనటం మంచిదికాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దలమాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించటం ఎంతో మేలు కదా? అన్నాడు.

శ్రీకృష్ణుడు అతడిని యుద్ధానికి రెచ్చగొట్టవలెనని మనసులో సంకల్పించి, భయమంటే ఏమిటో ఎప్పుడూ తెలియని నీవంటి ధీరునికి, ఈ పిరికితనం ఇంతగా అలవాటయ్యేటట్లు చేసినవారెవరో అంటూ పకపక నవ్వాడు. దీనికి భీముడు, బావా నా శక్తిసామరా్థ్యలు ఏ పాటివో ఆలోచింపక ఇట్లా నీవు మాట్లాడటం న్యాయం కాదు. నేలా నింగి తలక్రిందులైనప్పటికీ వెనుదీయక, నేను ముంజేతులు ఒడ్డి వాటిని పట్టుకు తోస్తాను సుమా! అన్నాడు.

ఇంక అర్జునుడు ఇలా అన్నాడు: శ్రీకృష్ణా నీవు చేయనెంచిన పనికి హాని ఎప్పుడూ కలుగదు. కొన్ని పనులు ఫలించనట్లే ముందు కనిపించినా చివరకు ఫలిస్తాయి. కాబట్టి కార్యానికి పూనుకొనటం పురుషలక్షణం. కార్యఫలం తమకు సమకూరటంలో దైవసహాయం అవసరం. కాబట్టి పురుష యత్నం, దైవానుకూలం కావాలి. కార్యం అనుకూలించటం, అనుకూలించకపోవటం రెండూ నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. ఈ మాట వాస్తవం.

సహదేవుడు శ్రీకృష్ణునితో ధర్మపుత్రుడు, అతని సహచరులు తగని పల్కులు పల్కుతున్నారు. వాటిలో ఒక మాటనైన తిరస్కరించక అన్నిటికీ నీవు "ఊ" కొట్టడం అంతకన్నా బాగుంది. రాక్షసులను విధ్వంసం చేసిన నీవు కురుసభకు బిచ్చమడగటానికి సైతం పోతావన్నమాట! దుష్టచిత్తుడైన దుర్యోధనుడెక్కడ? రాజ్యంలో మనకు సగం పంచి ఇవ్వటం ఎక్కడ? అది కల్ల, జరుగదు! అని అన్నాడు.

ద్రౌపది అవమానబాధను, ఆగ్రహాగ్నిని పూర్తిగా అవగాహన చేసికొన్నాడు. కృష్ణుడు పరిపూర్ణ సానుభూతితో ఆమెను ఓదార్చాడు. సంధి చేయ కౌరవ సభ కేగాడు.

దుర్యోధనుని ఆతిథ్యము తిరస్కరించి, విదురుని ఇంట విడిది చేయుట శ్రీకృష్ణుని చతురనీతియే. విదురునిది భక్తితో కూడిన విందు, కౌరవులది భక్తిలేని కూడు.

మరునాడు కౌరవసభలో శ్రీకృష్ణుడు ఉపన్యసించిన విధము అద్భుతము. ఆయన ప్రదర్శించిన పరేంగితజ్ఞత, వాక్చాతురి అనన్య సామాన్యములు. ఆ పీతాంబరధారి జలదస్య గంభీరతతో పలుకొప్పగ, దంతదీప్తు లెసగ, మొదట ధృతరాషు్ట్రని, తర్వాత దుర్యోధనుని సంబోధించి, పాండుకుమారుల నయవర్తనమును, ధార్తరాషు్ట్రల దౌష్ట్యమును, ఉభయపక్ష శ్రేయోమార్గమును పదిమంది వినునట్లు, పదను తగ్గకుండా పాకము చెడకుండా చెప్పినాడు. కౌరవులు మహర్షుల సానుభూతి కోల్పోవునట్లు చేసినాడు. వారు నీతిమాలి తన్ను బంధింప పాల్పడినప్పుడు యోగేశ్వరేశ్వరుడు తన విశ్వరూపమును ప్రదర్శించినాడు. కౌరవపక్షమునకు నైతికసానుభూతి (మోరల్ సింపతీ) లేకుండా చేసినాడు.

కర్ణుని పాండవపక్షమునకు లాగి కౌరవపక్షమును బలహీనము చేయ యత్నించి, ఏకాంతమున అతని జన్మరహస్యము చెప్పినాడు. "పాంచాలపుత్రియు నంచితముగ నిన్ను బొందు ఆర్వుర వరుసన్" అని ఆశ పెట్టాడు. మానవుని ప్రలోభపెట్టు విషయములలో స్త్రీసౌఖ్యము చాలా బలవత్తరము. కాని కర్ణుడు పాండవపక్షము చేరలేదు.

సంధి సంధాతగా వెళ్లిన శ్రీకృష్ణుడు, సమర నిర్ణేతగా తిరిగి వచ్చినాడు. ధర్మజునకు ధైర్యము గొలిపి నిజనివాసమేగినాడు మరునాడు.

"వక్షః స్థలంబున వనమాల గ్రాలంగ
వెలిమావు గెడల వాగులు ధరించి"

శ్రీకృష్ణుడు తన వక్షఃస్థలంలో వనమాల విరాజిల్లుతుండగా తెల్లని గుఱ్ఱాల నోటి కళ్లెములకు తగిలించిన పగ్గాలను చేత ధరించి రథం నొగల మీద కూర్చొని ఉన్నాడు. రథం మీద హనుమద్ధ్వజం రెపరెపలాడుతోంది. అక్షయతూణీరద్వయం తన కుడి ఎడమ భుజాలకు క్రొత్త సొమ్ములు కాగా, వికసించిన ముఖంతో ఫల్గుణుడు మెల్లగా వచ్చి ఒక ప్రక్కగా నిలిచాడు.

యోగేశ్వరేశ్వరుడు, రాజనీతిచతురుడైన శ్రీకృష్ణుడు పాండవపక్ష యుద్ధప్రణాళికా రచయిత. అమ్మహాత్ముని ప్రణాళికను కార్యరూపము నొందించు యోధాగ్రేసరుడు అర్జునుడు. అతని సాహాయ్యులు భీముడు, తక్కిన వీరులు. వీరి కృషి పురుషకారము, శ్రీకృష్ణుని ప్రణాళికా రచన దైవబలము.

పాండవపక్ష వీరుల కాత్మవిశ్వాసము గూర్చుటలో, అడుగడుగునా వారి కర్తవ్యము నిర్దేశించుటలో, అప్పుడప్పుడేర్పడు అంతః కలహములను నివారించుటలో, ప్రతిపక్ష వీరులను బలహీనుల గావించుటలో, ధర్మదృష్టితో చూచినపుడు అనభిలషణీయులను పైకొన్నవారిని స్వపరభేదము లేకుండ హతమార్చుటలో, పాండవేయులను రక్షించి గెలిపించుటలో, గెలిపించి రక్షించుటలో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర అద్భుతము, అసమానము.

అర్జునుడు యుద్దారంభమున స్వజనసంహారము శంకించి మోహావిష్టుడై ఆయుధముల విడిచి, నిర్విణు్ణడయ్యాడు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునునకు తత్వోపదేశము చేసి, తాను పరమాత్మగా సాక్షాత్కరించి అర్జునుని మోహమును పారద్రోలి దృఢమనస్కుని గావించినాడు, స్థిరకల్పుని గావించినాడు. కౌరవసంహార మవశ్యకర్తవ్యమని ఉత్సాహము గొల్పినాడు.

వీపు దట్టి అర్జునుని కృష్ణుడే ముందుకు నడిపించినాడు. కౌరవపతనమునకు పాండవ విజయమునకు చక్కని రాచబాట వేసినాడు. "నా చేతన జచ్చిన వీరి నెల్లను జయించినవాడ వగుటకు నిమిత్తమాత్రమ్ము గమ్ము లెమ్ము, రాజ్యమ్ము గైకొను" మన్నాడు.

నేను చంపే వీరిని అందరినీ నీవు చంపినట్లుగా కనిపించి విజయం గైకొని రాజ్యాన్ని ఏలుకొమ్ము. నీవు నిమిత్తమాత్రుడవు సుమా, లే, ఇక యుద్ధం చేయుము అన్నాడు.

ఓ ధర్మరాజా నాకు అర్జునుడు,
"సఖుడు, సంబంధి, శిష్యుండు, సవ్యసాచి, నాకు నతనికినై యేను నరవరేణ్య, కూర్మియై నిత్తు గండలు గోసియైన, నరయ నాతండు నా యెడ నట్టివాడ". 
స్నేహితుడు, సంబంధి (మా సోదరి సుభద్రకు భర్త), అంతేకాదు నాకు శిష్యుడు కూడా, అతని మేలు కోసం సంతోషంతో నా శరీరంలోని కండలైనా కోసి ఇస్తాను. ఆలోచించి చూడగా అర్జునుడు కూడా నా పట్ల అంత ప్రేమగలవాడే. మా ఇద్దరి కలయిక అంత దృఢమైనది.

ద్వాపరయుగము నాటికి వ్యక్తుల ప్రవృత్తులు, సాంఘిక పరిస్థితులు చాల మారినవి. మహోన్నతాదర్శ సాధనకు మార్గమించుక వక్రమైనను దోషము లేదని, ద్వాపరయుగమున శ్రీకృష్ణుడు చాటినాడు.

"మాయలు గల్గు దుష్టులకు మాయపు భంగులే మందు గాక, నిర్మాయత నుల్లసిల్లెడు పరాక్రమలీలలు గొల్చుటెట్లు?"
మాయాత్మకులైన దుర్మార్గులకు మోసపు పద్ధతులే మందు. మాయతో కాకుండ విరోధులను జయించటం ఏ విధంగా సాధ్యం అవుతుంది? మిక్కిలి బలవంతులైన దైత్యులను విష్ణువు, ఇంద్రుడు మాయోపాయాలతో జయించలేదా?

యుద్ధసమయమున శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత, మానవాతీత మహితశక్తి, పాండవ పక్షమునకు చేసిన సహాయము, అమోఘములు. మూడవనాటి యుద్ధమున భీష్ముని భయంకరవీర విజ్రుంభణము చూచి శ్రీకృష్ణుడు, తన ప్రతిజ్ఞను గూడ మరచి, చక్రమును చేపట్టి పగ్గములను నొగల ముడిచి, రథము నుండి దూకి ఆ మహావీరుని పైకి ఎగసినాడు. శ్రీకృష్ణుని ఈ విజృంభణము, గాంగేయుని ఉత్సాహమునకు గొడ్డలి పెట్టు! కిరీటి అభిమానమునకు కొరడా దెబ్బ! 9వ నాటి యుద్ధమున గూడ ఇట్లే జరిగింది. భీష్మ విజృంభణము చూచి బెండుపడిన ధర్మజునకు ధైర్యము గొలిపినాడు శ్రీకృష్ణుడు.

తాత మరణోపాయమును తెలిసికొనదలచిన ధర్మజుని, "నీతలంపు లెస్స" యని వీపు దట్టి ప్రోత్సహించినాడు. తాను గూడ పాండవుల వెంట పాదచారియై భీష్ముని శిబిరమున కేగినాడు, వారి ప్రయత్నమునకు బలము చేకూర్చినాడు. ఒక్కమాట కూడా భీష్మునితో మాట్లాడలేదు. అట్టి పట్టుల, మాట కన్న మౌనమున కెక్కువ బలము. పైగా మహాత్ముల మౌనము వారి మాట కంటే గొప్పగ మాట్లాడగలదు.

శ్రీకృష్ణుని రాక, ఆయన మౌనము భీష్మునిపై ఎంత ప్రభావమును బరపినవో, పాండవ ప్రయత్నమున కెంత బలము చేకూర్చినదో...తరువాతి రోజు యుద్ధములో ఆ తాతగారు,

"కృష్ణు దోడుగ గొని కీడ్పడి వీరలు వచ్చిన చెప్పితి వధ విధంబు సమర ముపేక్షించి శాంతియై నుండెద నడిచి పాటేటికి"
ఈ పాండవులందరూ లొచ్చు పడి, చచ్చు దేలి కృష్ణుడిని సహాయంగా తీసికొని నా దగ్గరకు వచ్చారు. నా మరణానికి ఉపాయాన్ని వీరికి చెప్పాను. ఇకమీద యుద్ధంలో శ్రద్ధ చూపకుండా ప్రశాంతంగా ఉంటాను. వేగిరపాటెందుకు? అని చల్లబడుటలో తెలియగలదు.

పితామహుని పతనమొనరించుటకు సంకోచించిన సవ్యసాచికి, శ్రీకృష్ణుడు కర్తవ్యోపదేశము చేసినాడు. భీష్మపతనమునకు పరోక్షముగ దోహదము చేసినాడు.

భగదత్తుడు అంకుశమును అభిమంత్రించి ప్రయోగింపగా, పార్థుని కడ్డముగా తన మేనమర్చి, మానవాతీతశక్తితో అమ్మహాస్త్రమును ధరించి పార్థుని రక్షించినాడు శ్రీకృష్ణుడు.

ప్రియపుత్రుడైన అభిమన్యుని వధకు కారణభూతుడైన సైంధవుని, సూర్యుడు క్రుంగకమున్న వధింతునని లేకున్న గాండీవముతో అగ్నిలో ప్రవేశింతునని అర్జునుడు ప్రతినబూనాడు. తనతో సంప్రదించకుండా పార్థుడెంత ప్రమాదము గొనితెచ్చుకున్నాడని, సూర్యాస్తమయము లోపల శత్రుమస్తకమును దునుమాడుట చాల దుర్ఘటమని, ప్రతిన విఫలమైనదో పార్థుడు దక్కడని, పరిణామములు విపరీతములగునని, ఆ రాత్రి నిద్ర లేని కలవరపాటు నొందినాడు. ఎట్టకేలకు ఎల్ల భూతములకు తన నేర్పును, బలము, పాండవ ప్రేమ వ్యక్తమగునట్లు యుద్ధభూమిలో విజృంభింతునని పలికినాడు.

సమయ సందర్భములను బట్టి తన యోగశక్తులను వినియోగించియైన పార్థుని ప్రతిజ్ఞను సఫలము చేయక తప్పలేదు. ఆ పూనిక తోడనే తాను సారథ్య సామర్థ్యమును ప్రదర్శించి, పార్థుని రథమును ద్రోణాచార్యుని దాటించి శకటవ్యూహమున ప్రవేశపెట్టాడు. తనయోగశక్తిచే కృత్రిమసూర్యాస్తమయమును కల్పించినాడు. సమయస్ఫూర్తిని చూపి సైంధవుని తల క్రింద పడకుండ అతని తండ్రి ఒడిలో పడునట్లు, పాశుపతాస్త్రముచే కొట్టుమని హెచ్చరించి, పార్థుని ప్రాణాలు కాపాడాడు. కృతప్రతిజ్ఞుని గావించినాడు.

కర్ణుడు ఎంతోకాలం నుండి పార్థునిపై ప్రయోగింపవలెనని దాచియుంచిన శక్తిని, పరిస్థితుల ప్రాబల్యముచే ఘటోత్కచునిపై ప్రయోగించి, అతడు మృతి నొందినపుడు, పాండవులు మిక్కిలి దైన్యంతో కన్నీరుమున్నీరుగా దుఃఖించారు. కాని కృష్ణుడు సంతోషంతో సింహనాదం చేసి తన పాంచజన్యాన్ని పూరించాడు. తన చేతిలోని పగ్గాలను రథం నొగలుకు కట్టి వేసి నృత్యం చేయనారంభించాడు. శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటే, మందార వృక్షం మందమారుతానికి అల్లనల్లన కదలి ఆడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. కృష్ణుడలా నృత్యం చేస్తూ రథం నడిమి భాగంలో ఉన్న అర్జునుడిని చేరి ఆలింగనం చేసుకున్నాడు. వెన్ను చరిచాడు. మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు, అందరూ దుఃఖిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అంతగా సంతోషించటానికి కారణం అర్థం గాక మీ నడవడిలోని రహస్యమేమిటో చెప్పుమన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునునితో శక్తి అనే ఆయుధం కర్ణుని వద్ద ఉన్నంతకాలం నాకు నిన్ను బ్రతికించుకొనటం అసాధ్యంగా భావించేవాడిని. ఇప్పుడా శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించటంతో కర్ణుడికి అది లేకుండా పోవటం నాకు సంతోషంగా ఉంది. ఆ శక్తి కర్ణుడి వద్ద ఉన్నట్లయితే నేను సుదర్శనచక్రాన్ని, నీవు గాండీవధనుస్సును ధరించి ఏకమై ఎదిరించినా, ఆ కర్ణుడు మననిద్దరిని కూడా జయిస్తాడు. ఈ ఘటోత్కచుడు రావణాసురుని వంటివాడు. ఈ సమయంలో వీడు మరణించకున్న, తరువాత నేనే స్వయంగా చంపాల్సి వచ్చేది. అందుకే నాకిది సంతోషసమయమన్నాడు.

పాండవసేనపై ద్రోణాచార్యుడు, దావాగ్ని వలె విజృంభించినపుడు, మహా దార్శనికుడు, మేటి రాజనీతి కోవిదుడైన శ్రీకృష్ణుడు, రానున్న ప్రమాదము నూహించి ఆచార్యుని ఆయువుపట్టు కనిపెట్టినాడు. ప్రాణరక్షణకై అబద్ధమాడుట వలన పాపమంటదని ప్రవచించినాడు, ధర్మజుని బలవంతపెట్టి అబద్ధమాడించినాడు. ద్రోణపతన మొనరించి పాండవపక్షము కాపాడినాడు.

అట్లే తండ్రి మరణానికి ఆగ్రహోదగ్రుడైన అశ్వత్థామ ప్రళయభీకర నారాయణాస్త్రమును ప్రయోగించినపుడు అమ్మహాస్త్ర ప్రభావము నెరిగిన శ్రీకృష్ణుడు బిగ్గరగా, సైనికులందరితో మీరందరూ తొందరగా మీ మీ వాహనాలైన గజాశ్వరథాల నుండి దిగండి, ఊరకే నేలపై నిలవండి, అట్లాగైతే ఆ దివ్యాస్త్రం ఎవరినీ ఏమీ చేయదు. దీనికి విరుగుడు ఇదేనన్నాడు. దీనికి భీముడు సమ్మతించకపోవడంతో కృష్ణార్జునులు భీమున్ని సమీపించి, అతడిని రథంపై నుండి క్రిందపడేటట్లు త్రోసి బ్రతికించారు.

ధర్మరాజు, అర్జునుల మధ్య అంతఃకలహము చెలరేగినపుడు శ్రీకృష్ణుడు, ధర్మసూక్ష్మం ద్వారా వారి వారి శపథాలు చెల్లేటట్లుగా పలికి, భ్రాతృహత్యా, ఆత్మహత్యా ప్రమాదము నుండి ఆ అన్నదమ్ములను కాపాడాడు. అప్పుడు శ్రీకృష్ణుడే లేకున్న ఆ కలహము ధర్మజుని హత్యతోనో, అర్జునుని ఆత్మహత్యతోనో, సమాప్తమై యుండెడిది.

కర్ణార్జునుల ద్వంద్వయుద్ధములో ఒక ఘట్టమున "చక్రమిచ్చెద నతని మస్తకము దునుము" మని సవ్యసాచిని రెచ్చగొట్టినాడు. తన సారథ్యనైపుణ్యమునంతను చూపి రథమును ఐదంగుళములు భూమికి క్రుంగనదమి, కర్ణుని నాగాస్త్రమును గురితప్పించినాడు. పార్థుని ప్రాణాలు రక్షించినాడు. కడకు కృంగిన రథచక్రము నెత్తుకొనుచు రణధర్మములు వల్లించు రాధేయుని చూచి "అన్ని యెడలను నీ పాడియెందు బోయె"నని అతని దుశ్చేష్టల వివరించి అర్జునుని కవ్వించి అవ్వీరుని (కర్ణుని) తల నరికించినాడు.

చివరిరోజున శల్యుడు సర్వసైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైనాడు. ఆ రోజున ధర్మజుని పాండవపక్షమున సైన్యాధ్యక్షుడుగా నిల్పుట, శ్రీకృష్ణుని చతురనీతికి, పరేంగితజ్ఞతకు చక్కని తార్కాణం. శల్యునికి పాండవపక్షమున ఎదురు నిలువగల వీరు డెవరు? కృష్ణార్జునులు కంటబడిన, వారిని చీల్చి చెండాడగలడు. భీమసేనుడెదురైనను ప్రమాదమే.  కారణం ఇరువురూ మల్లయోధులు, ప్రతిద్వంద్వులు. ఇక ఎదుర్కొనవలసినవాడు ధర్మజుడు. ధర్మజుడన్న శల్యునకు అపారప్రేమ, గౌరవాభిమానములున్నవి. కౌరవుల జయించి, సార్వభౌముడవు కాగలవని ధర్మజుని ఆశీర్వదించియున్నాడు. ధర్మజుడు కనబడగానే శల్యుని ఉత్సాహము సగము చచ్చినది. ధర్మజుని శక్తికి మామ శల్యుడు తనువు చాలించాడు.

మడుగున దాగి యున్న దుర్యోధనుని బయటకు రప్పించుటకు శ్రీకృష్ణుడు ధర్మజుని పురికొల్పిన విధము, సవ్యసాచిచే సంజ్ఞ చేయించి భీముని చేత రారాజు తొడలు విరుగగొట్టి చంపిన విధానము, అన్నింటిని మించి, ఆగ్రహోదగ్రుడై హలాయుధమును చేపట్టి భీముని మీదికి విక్రమించిన బలరాముని అనునయించిన విధము,  శ్రీకృష్ణుని రాజనీతిచతురతకు ప్రబలనిదర్శనము.  అశ్వత్థామ సౌప్తికవధ నాడు ఎంతో దూరదృష్టితో శ్రీకృష్ణుడు, పాండవులను దూరముగ తొలగించుటతో వారు బ్రతికినారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రముచే ఉత్తరగర్భము దగ్ధము కాకుండా పాండవ వంశమును నిలిపినాడు.

అశ్వత్థామ నీచతకు రోసి, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టే రక్తంతో శరీరం కాలిపోతుండగా, ౩౦౦౦ సంవత్సరాలు అరణ్యంలో తిరుగాడుమని శపించాడు.

అంతేగాక పొలకలనిలో భీమసేనుడు, ధృతరాషు్ట్రని బాహుబంధమునకు బలి కాకుండా కాపాడినాడు. ధృతరాషు్ట్రని హృదయమును కృష్ణుడెలా కనిపెట్టగలిగి ఇనుపభీముని ఆ సమయాన అక్కడ పెట్టగలిగాడో... ఊహ కందని మాయాజాలంగా కనపడుతుంది.

గాంధారి తన కిచ్చిన ఘోరశాపమును ఒక్క చిరునవ్వుతో స్వీకరించి "మీ అపరాధమున వచ్చినట్టి కీడునకు నన్నింత నొవ్వ పల్కదగునె ?" అని మెత్తగా ఆమె అవివేకమును ఎత్తిచూపినాడు. (మీ తప్పు వలన వచ్చిన చేటుకు బాధ్యుడు నేనని, నన్ను నొప్పించేటట్లు ఇట్లా మాట్లాడడం న్యాయమా? ఇకనైనా ధైర్యం అవలంబించి నీ శోకాన్ని దూరం చేసుకో. కీడుకూ, చావుకూ ఏ మానవులు శోకిస్తారో వారి దుఃఖం రెండింతలవుతుందే తప్ప ఉపశమించదు).

ధర్మజుని పట్టాభిషేక సమయమున శ్రీకృష్ణుడు పూరించిన శంఖము పాండవవిజయ సూచకమే గాక, ఆ మహాత్ముడు ప్రారంభించిన ఉద్యమ సఫలతాసూచకము కూడా. హృదయమున పరిపూర్ణశాంతి ఏర్పడని ధర్మజునకు సమగ్రధర్మపరిజ్ఞాన ప్రబోధము గావింప నెంచి ధర్మబోధ చేయ భీష్ముని ఆదేశించినాడు. అందుకవసరమైన శక్తి సామర్థ్యముల ఆ పితామహునకు అనుగ్రహించినాడు. దీనితో భీష్ముని అపారజ్ఞాన సంపద వ్యర్థము కాకుండా సద్వినియోగమైనది. ధరనేలవలసిన ధర్మజునకు మనశ్శాంతి, ధర్మజ్ఞానము లభించినవి.

శ్రీకృష్ణుడు తన అతిమానుషశక్తి చేత పరీక్షితునకు ప్రాణదానము చేసినాడు. అద్వితీయరాజనీతిదక్షుడుగ ధర్మజునిచే అశ్వమేధ యాగము చేయించినాడు. శ్రీకృష్ణుని మహోద్యమము సఫలమైనది.

చివరకు యాదవనాశము మిగిలినది. ఆనాడు యాదవులు స్వభావము చేత అహంకారపూరితులు, మద్యపానమదోన్మత్తులు, ధర్మదూరులు. వారి తత్త్వము శ్రీకృష్ణునకెంతో మనోవ్యథ కల్గించినది. యాదవుల అడ్డు తొలగిననే తన ఉద్యమము సఫలము కాగలదు. దీనికి మునిశాపము, గాంధారి శాపములు తోడైనవి. యాదవుల అంతఃకలహములకు తాను కొంత తోడ్పడినాడు. పరస్పరము చంపుకొనుచుండ తానూరకున్నాడు. చివరకు తీవ్రకోపాగ్నితో హతశేషులను తానే తుంగలతో మోది నిరవశేషము గావించినాడు. దీనితో తన అవతార పరిసమాప్తి దగ్గరైనది.

శ్రీకృష్ణుడు ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని పూశాడు. కాని, అరికాలిలో మాత్రం పూయటం మరచిపోయాడు. ఫలితంగా ఆ ఋషి ఆ అరికాలిలోనే నీకు ప్రాణాపాయం జరుగుతుందని చెప్పిన విషయం గుర్తుకు రాగా, శరీరత్యాగం కోసం మనసును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణచిపెట్టి సమాధిని పొందాడు.

ఆ సమయంలో 'జర' నేలను కాలితో రాస్తూ అడవిలో ప్రవేశించింది. 'జర' ముసలితనానికి అధి
షా్ఠనదేవత. కాలం (మరణం) ఆసన్నమైనదని సూచించేది జర. ఆమెను కాలకన్య అని అంటారు. ఆమె వేటగాడిని భ్రాంతి ఆవహించేటట్లు చేసింది. ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి దృఢమైన రీతిలో నారిని సంధించి జింక అని భ్రమించి బాణం వదిలాడు. బాణం పాదంలో దూరి బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు మానవీయమైన దేహాన్ని విడిచి, పెంపొందిన తేజస్సు గలవాడై స్వర్గలోకానికి వెళ్లాడు. 

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:

భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట  నుండునో విజయ మచటనుండునని పలుకుట అక్షరసత్యం! "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే!

సకల సంస్కృత వాంగ్మయమునకును తలమానికమై విరాజిల్లెడు ఈ మహాభారతము ఇంతయై, అంతయై పెరిగి పెరిగి లక్షశ్లోకాత్మకమైన ఒక మహాగ్రంథముగా ప్రపంచ విఖ్యాతి వడసినది. నిఖిల భారతీయ జ్ఞాన విజ్ఞాన సర్వస్వమైనది.

                    "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ 
                      యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్" 


భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు.

భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును.

ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది.

ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు. కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివాడు.

అల్పజలాలు చేపను ఎట్లా చెరుస్తాయో కామం అట్లే అతడికి హానిని కలిగిస్తుంది. మరి అర్థధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్రజలాలు ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తాయి. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పరపోషకాలు. ఈ విధంగా త్రివర్గ విజ్ఞానం సాధించినవాడు సర్వశ్రేష్ఠుడు.

ప్రపంచమానవాళికి శ్రీకృష్ణుడు కౌరవసభలో రాయబార సందర్భంలో పలికిన వాక్కులు చూద్దాం.

"సారపు ధర్మమున్ విమలసత్యము బాపము చేత బొంకు చే
బారము బొంద లేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మని
స్తారకమయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్"

ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం, పాపం చేతను, అబద్ధం చేతను దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు - అని తిక్కనగారు చెప్పారు.

సంస్కృతమూలంలో వ్యాసమహర్షి ధర్మం అధర్మం చేతా, సత్యం అసత్యం చేతా నశిస్తున్నప్పుడు చూస్తూ ఊరకుంటే, సభాసదులకే చెడు మూడుతుంది. అటువంటివారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్లుగా ధర్మం వారిని ఉన్మూలించేస్తుంది. కాబట్టి ధర్మాన్ని సదా పరిశీలిస్తూ పరిరక్షిస్తూ దానినే ధ్యానిస్తూ కాలం గడిపేవారు, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్నీ మాత్రమే పలుకుతారు.

భీష్ముడు ధర్మజునకు శాంతిపర్వంలో ఈ విధంగా బోధించాడు.

వేదాలపై భక్తి, సృ్మతులపై గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ, ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం ధర్మానికి నాలుగవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి అసత్యం పలికి ధనాన్ని సంపాదించటం పాపాలన్నింటిలోనికి ఎక్కువ పాపం. అసత్యం పలుకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండటం, అన్ని ధర్మాలలోను మేలైన ధర్మాలు. శాస్త్రవిరుద్ధమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తిన విత్తనంవలె 
నిష్ర్పయోజనం అవుతుంది. ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఇహలోకపరలోకాలలో సుఖం లభిస్తుంది.

అన్ని ధర్మాలకు సారభూతమైన ధర్మనిజస్వరూపజ్ఞానాన్ని మహాభారతంలో వ్యాసుడు నిక్షేపించాడు.

"ఒరు లేయవి యొనర్చిన నరవర! యప్రియము తన మనంబున కగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథముల కెల్లన్"

రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా ఉన్నది.

ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, తమ దినపత్రికలో యావద్భారతావనిలోని మానవులకు సందేశంగా ఒక శతాబ్ది కాలం తమ పత్రికలో ప్రతిదినం ఈ పద్యాన్ని ప్రచురించి ఆంధ్రులకు మహోపకార సందేశాన్ని గుర్తు చేశారు. త్రికరణశుద్ధిగా ఆచరించి, తరించమన్నారు.


                                                              ******

No comments:

Post a Comment