Sunday, January 29, 2012

NalaDamayanthi Charithra (నలదమయంతి చరిత్ర)

బృహదశ్వ మహామునిని ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు- "మాయట్లు ఇడుముల బడిన నృపులు" అంటే మావలె కష్టాలు అనుభవించిన రాజులెవరున్నారు అని. దీనికి సమాధానంగా నలదమయంతి ఉపాఖ్యానంలో నలుని గుణాలు పాండవులందరకు ఆపాదిస్తూ  కథ అద్భుతంగా సాగుతుంది.

భారతకథలన్నింటిలో తలమానికము వంటిది నలోపాఖ్యానము. ఈ కథ అరణ్యపర్వములో పాండవ వనవాససమయంలో బృహదశ్వమహాముని చేత ధర్మరాజునకు, అనుజులకు ఉపమానంగా చెప్పబడింది. "పుడమియు, రాజ్యము, బంధుల విడిచి మృగావళుల గలసి విపినంబులో గడుకొని మా యట్లు ఇడుముల బడిన నృపులు గలరే? ఒరులు పరమ మునీంద్రా?"

నలుని చరిత్ర, పాండవుల చరిత్ర జరుగుచుండిన కాలమునకు మిక్కిలి సన్నిహితపూర్వకాలముననే జరిగియుండవలెను. అరణ్యపర్వమందలి కథలలో పాండవుల జీవితముతో ఇంతగా సంవదించు కథ వేరొకటి లేదు.

నలుడు, ధర్మజుడు సత్యవ్రతులు, ధర్మనిరతులు. అక్షప్రియులే కాని అక్షహృదయజ్ఞులు కారు.

ఇరువురూ ద్యూతవ్యసనపరులు, నిర్వాసితులు. రెండింటను ద్యూతము దాయాదులకే జరిగినది. బ్రాహ్మణ వేషమున కలి, పుష్కరునకు తోడ్పడెను. ద్వాపరాంశమున పుట్టిన శకుని, కల్యంశమున పుట్టిన దుర్యోధనునకు తోడ్పడెను. కలి ద్వేషమే ఉభయత్రా కారణము.

దమయంతి తన్ను వరించలేదని కలికి ద్వేషము. ద్రౌపది తన్ను జూచి నవ్వెనని దుర్యోధనునకు కోపము. రెండును కపటద్యూతములే. రెండింటను పునరూ్ద్యతము కలదు. రెండింటను స్వయంవరము కలదు. అర్జునుని ఉద్దేశించి ద్రుపదుడు, నలుని ఉద్దేశించి భీముడు స్వయంవరము చాటించిరి. రెండును వ్యాజ స్వయంవరములే. దాంపత్యములు పూర్వజన్మ నియతములే. రెండింటను అరణ్యవాసము, అజ్ఞాతవాసము కలవు. అజ్ఞాతవాస సమయమున ధర్మజుని వలె నలుడును మాట చమత్కారముచే సత్యవ్రతమును ఎట్లో నిలుపుకొనును. నలునివలె అర్జునుడు వికృతరూపము (పేడి) ఊర్వశి శాపం వలన పొందెను. నలుడు ఋతుపర్ణునకు చేసినట్లు అర్జునుడు ఉత్తరునకు సారథ్యము చేయును. పాండవులు విరాటుని వద్ద, నలుడు ఋతుపర్ణునెడ అజ్ఞాతవాస సమయములు పూర్తి చేయుదురు. నలభీములు వంటలవారు (నలభీమపాకము), నలుని వలె నకులుడు అశ్వశిక్షకుడు. దమయంతి కిరాతపీడితయైనట్లు ద్రౌపది కీచకపీడిత యగును.

దమయంతి నలుడు చింపుకుని పోగా మిగిలిన మలినార్ధ వస్త్రము ధరించి సునందాదేవి కడ సైరంధ్రీ వృత్తము నడుపును. ద్రౌపది దుశ్శాసనుడు ఆకర్షించి తెంపగా మిగిలిన కురులను ముడువక సుధేష్ణ కడ సైరంధ్రిగా గడుపును, రెండింటను వస్త్రాపహరణము గలదు.

అక్షములు పక్షుల రూపమున వచ్చి నలుని వస్త్రమపహరించెను, దుశ్శాసనుడు సభలో ద్రౌపదీవస్త్రములు హరించెను. రెండింటను ఏకవస్త్రధారణ గలదు. విజయ సాధనముగా నలుడు అక్షహృదయము, అర్జునుడు పాశుపతము సంపాదింతురు. 

పాండవుల అజ్ఞాతవాసములు సమయబద్ధములు. నలునివి చి్ఛకములు. అభిమానవశమున ఆయన కొనితెచ్చుకున్నవి. పాండవులు అరణ్య-అజ్ఞాతవాసములు ద్రౌపదీ సహితులై గడిపిరి. నలదమయంతులు వియుక్తులైరి. ద్రౌపదికి పతుల రక్ష కలదు. దమయంతి నిరాశ్రయ.

తమ కంటె మహిమాన్వితులైన వ్యక్తులే కఠోరములైన కష్టములను అనుభవించిరి అని ఉపదేశించి తన్మూలమున పాండవులకు, ద్రౌపదికి చిత్తోపశాంతిని, ధైర్యమును కలిగించుచున్నదీ కథ.

పాతివ్రత్య ధర్మాన్ని నన్నయ నలదమయంతి కథలో కాంతా సమ్మితంగా చెప్పాడు. త్రికరణశుద్ధిగా భర్తను స్త్రీ వరిస్తుంది. ఇక్కడ మనసా, వాచా, కర్మణా దమయంతి నలుని గుణగణాలను, స్వభావాన్ని కొలిచింది. ఆపత్కాలంలో ఆ పాతివ్రత్య ధర్మమే ఆమెకు అండగా నిలిచి, కష్టాల నుంచి కాపాడింది. 

"ఏను పతివ్రతనైతినేని యిద్దురాత్ముండైన కిరాతుండిప్పుడె మృత్యుండయ్యెడు"మని శాపం బిచ్చిన వాడపుడా యగ్నిదగ్ధం బైన వృక్షంబును బోలె విగతజీవుడై పడియె".

-నేను పతివ్రతనే అయితే దుష్టుడైన ఈ కిరాతకుడు ఇప్పుడే చనిపోవుగాక అని శపించగా, ఆ కిరాతకుడు నిప్పు చేత దహించబడిన చెట్టువలె నేలపై కూలి మరణించాడు.

"అగ్నిశిఖ వోలె అంటను, డాయను, చూడరాని యట్టి శుభచరిత్ర" నలుడి భార్య దమయంతి.

ఆమె అగ్నిజ్వాల వలె ముట్టుకొనటానికి గాని, సమీపించటానికి గాని, వీలు కానట్టిది. తేరిపారచూడను వీలు లేనట్టిది.
నిర్జనారణ్యంలో భర్త నలుడు విగతకరుణుడై కలిప్రభావంచేత విడిచి చనగా కొండచిలువ దమయంతిని మి్రంగగా ఆ కిరాతకుడు దాన్ని ముక్కలుగా తరిగి దమయంతిని కాపాడాడు. అట్టి అనింద్యచరిత్రను కామించి కోరుకుని ప్రాణాలు కోల్పోయాడు వాడు.
పతివ్రతగా దమయంతి ఎలా జీవించింది? అని స్ఫురించకమానదు. కావ్యాన్ని పరిశీలిస్తే ఆమె త్రికరణశుద్ధిగా అంటే మనసా వాచా కర్మణా భర్త నలుణ్ణి సేవించి, లోకానికే 'ఆరాధ్య'గా, పతివ్రతా శిరోమణిగా మన్ననలందుకొన్నది.

మనసా...

నలుడి సద్గుణాలను దమయంతికి, దమయంతి గుణగణాలను నలునకు ప్రీతితో ప్రజలు అభివర్ణించి చెప్పటం చేత, వారిరువురిలో శృంగారభావాలు వెల్లివిరిశాయి.

మనుష్యవాక్కుతో హంస దమయంతితో నలుని గూర్చి "అపార పారావార పర్యంతానంత మహీతలంబు నందు నా చూడని రాజులు లేరు సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుం బోలరు".

అంతం, దరీ లేని సముద్రం వరకు విస్తరించి ఉన్న ఈ అపారభూమండలంలో సౌందర్య సౌశీల్యాలలో నలుడికి సాటివారు లేరు.

నీవు నలుడికి దేవేరివి అయితే తప్ప నీకు గల గొప్ప లక్షణాలు, సౌందర్యం, లావణ్య సంపద, ఐశ్వర్యం, నిత్యసౌభాగ్యం, అదృష్టం, వంశగౌరవం మొదలైనవి రాణించవు. "నీవు నారీరత్నంబవు, అతడు పురుషరత్నంబు, మీ ఇద్దరి సమాగమం బతి రమణీయము, అనన్య శోభాకరము".

ఎల్లప్పుడు నలమహారాజునే స్మరిస్తూ క్రుంగి కృశించిన దమయంతి మన్మథతాపం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న తండ్రి, దమయంతికి స్వయంవరం ప్రకటించాడు.

దిక్పాలకులు, దేవేంద్రుడు వలచి స్వయంవరానికి వచ్చినప్పటికీ దేవదూతగా నలుడు సల్పిన రాయబారం తిరస్కరించి దమయంతి, తన మనోభవనిభుడు (మన్మథునితో సమానుడు) దేవేంద్రసదృశుడు, సూర్యతేజస్వి, చంద్రసముడు, వరుణనిభుడు, పుణ్యశ్లోకుండైన నిషధ పతిని భర్తగా, దేవతల సన్నిధిలో వారి ఆశీర్వాదంతో చేపట్టింది.

వాచా...

ద్యూతంలో నలుడు రాజ్యం సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో, భార్య దమయంతితో కానల కేగడానికి కలిద్వేషమే కారణం.
అరణ్యంలో కష్టాలు భరించలేవు, పుట్టింటికి వెళ్లుమన్న భర్తతో దమయంతి, గొప్ప దుఃఖమనే రోగంతో పీడితుడైన వాడికి భార్య చెంత ఉంటే ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లనిపించవు. విసిగి ఉన్న సమయాలలో, బడలిన సమయాలలో, ఆకలి అయిన వేళలలో, దాహం వేసినప్పుడు మగవాడికి ప్రీతితో వుండే తోడు భార్యయే. అతడి మనస్సులోని పరితాపాలను పోగొట్టుతుంది. సాంత్వన వచనాలతో ఓదారుస్తుంది అని అంటుంది.

కలిపురుషుడి ప్రేరణచే, విగతకరుణుడై దమయంతిని నలుడు నిర్జనారణ్యంలో విడిచాడు. నలుని జాడకోసం ఆమె అరణ్యరోదన హృదయవిదారకం. ఆమె తన ఒంటరితనానికి, ఆడదిగా తన బలహీనతకు, అడుగులు మోపితే ముండ్లవలన, క్రూరజంతువుల వలన, పాములవలన దాపురించే భయానికి చింతించలేదు. కాని, తన ప్రాణనాథుడైన నలుడికి ఎటువంటి తోడూ లేదని అతడికి భరించరాని ఆకలిదప్పికల మూలంగా, బడలిక వలన, కలిగే వేదన అనుభవించవలసి వస్తుందనే విచారించింది.

ఋష్యాశ్రమవాసులు, అమ్మా! నీ వెవ్వరవని ప్రశ్నించినపుడా సాధ్వి, "వినుడే బుణ్యశ్లోకుం డనగ సదాయజ్ఞనిరతుడనగ ధరిత్రిం దనరిన నలు భార్యను! సజ్జననుత దమయంతి యన నెసంగినదానన్" అంటుంది.

పుణ్యచరితుడుగా కీర్తిని ఆర్జించినవాడును, ఎల్లప్పుడు యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ప్రీతి గలవాడున్నూ అయి భూమండలంపై  విలసిల్లిన నలుడి భార్యను నేను. పెద్దలచేత మన్నన పొందిన నాపేరు దమయంతి అని, మెట్టినింటి ప్రస్తావనే గాని, విదర్భ రాజపుత్రికనని ఎక్కడా పుట్టింటి గొప్పదనం చెప్పకపోవటం ఇంకా ఆశ్చర్యకరం! భర్త తన చీర చెంగు చించుకుపోయిన మహానుభావుడు, అయినా దైవంగా భావించి ఆరాధించింది.

భర్తవియోగం ఎలా కలిగిందని ప్రశ్నించిన వారలకు ఆమె సమాధానం- "విధివశంబున నన్నుం బాసి హృదయేశ్వరుండెట యేనియుం బోయెననియు, దైవానుమతి జేసి వంచిత నైతి నొక్కచో మరచి నిద్రించితి"నని నింద తనపైన, విధివ్రాత ఇలాంటిదని వాపోయింది. తప్ప భర్తను నిందించలేదు. చివరకు కొండచిలువ మింగే సమయములో కూడా "ఇకనైన నన్ను ఏల ఆలింపవు నాకు శరణమగుము నాథ"-
ఇప్పుడు ఆపదలో చిక్కిన మీదటనైన నన్ను సంరక్షించేవాడవు కమ్మని భర్తనే శరణువేడింది సాధ్వి దమయంతి.

కర్మణా...

చివరకు ఎలాగో పుట్టినిల్లు చేరింది దమయంతి.
"భామ విదర్భ కేగి తన బంధుజనంబుల యొద్ద నుండియుం కోమలి దేహసౌఖ్యములకున్ వెలియై మలినార్ద్రవస్త్రమున్ భూమి రజంబు నంగమున బొల్పగుచుండగ నుండె, జీవితస్వామి నిజేశు చూచు దివసంబుల కోరుచు సువ్రతంబుతోన్" అన్నాడు నన్నయ.
దమయంతి విదర్భకు వెళ్లి బంధువుల వద్ద ఉన్నప్పటికిని శరీరసౌఖ్యాలు త్యజించి మాసిన సగం చీరనే ధరించింది. దుమ్ము పేరుకుని పోయినా ఒప్పుతున్న శరీరంతో తన జీవితానికి అధినేత అయిన భర్తను చూచే దృఢదీక్షతో బ్రతికింది. చివరకు పుట్టినింట్లో నలుడు దమయంతిని చూస్తాడు.

"చనుదెంచి యందు దీనానన, నవిరళ పంకమలిననతగాత్ర, తపస్విని, నతిక్రుశ దమయంతిం గనియె నలుం దుదితబాష్పకణ కలితముఖిన్"


దైన్యం ఉట్టిపడే ముఖం కలదీ, ఎల్లప్పుడు దుమ్ముతో మాసి కృంగిన దేహం కలిగినదీ, చూపరులకు జాలిగొలిపేదీ, చిక్కి క్రుశించినదీ, జారే కన్నీటి బొట్టులతో కూడిన మొగం కలదీ అయిన దమయంతిని చూచాడు. 

ఎంతమంది స్త్రీలు కష్టాల కడలిలో దొరగి పుట్టినిల్లు చేరలేదు? వారు దమయంతి లాగా చిక్కి శల్యమైనారా? మీరే  ఊహించండి. 
త్రికరణశుద్ధిగా భర్తనే దైవంగా భావించి సేవించిన దమయంతి, ఆపద సమయంలో తన మానాన్ని తన పాతివ్రత్యం చేతనే కాపాడుకోగలిగింది. 

ధన్యజీవి - దమయంతి, మహిళా లోకానికే ఆదర్శం. 

"అనపహార్యంబు తేజోమయంబు సర్వగుణములకు అలంకారంబు గురుతరంబు భామలకు పతిభక్తియ పరమైన భూషణం బిట్టివే పెఱభూషణములు?"

ఆడువారికి పతిభక్తియే భూషణాలలో గొప్ప భూషణం. పాతివ్రత్యానికి సరిపోలే ఆభరణం ఆడువారికి వేరొకటి లేదు కదా! పతిభక్తియే వారి నుండి హరించటానికి వీలు లేనిది. ప్రకాశమానమైనది. మిక్కిలి గొప్పదైనది. సమస్త సద్గుణాలలో కెల్ల ఎన్నదగినది అయిన అలంకారవిశేషం. 

షడ్చక్రవర్తులలో నలుడు ప్రసిద్ధుడు. నలుడు సామాన్య మానవుడికి ప్రతీక. అతడు జీవితంలోని వొడిదుడుకుల్ని సమప్రాతిపదికపై ఎదుర్కొన్నాడు. కష్టాలకు క్రుంగిపోలేదు. సుఖాలకు పొంగిపోలేదు. అలాగే దమయంతి మధ్యతరగతి స్త్రీకి మారురూపు. పెరిగింది అష్టైశ్వర్యాల మధ్య. కాని భర్తకు దూరమై తాను ప్రేమించిన నలుని ప్రేమకు, ఆస్పదురాలైంది. పదాలను వాడడంలో నన్నయ ఋషిత్వం ఇక్కడ గోచరిస్తుంది. 

"నిత్యసత్యుండవు, నీ సతి వంచించి దాని వస్త్రార్ధంబు దఱిగి నీకు పరిధానముగ  జేసి పాడియే పోవంగ? భార్య భర్తవ్య నా బరగు ధర్మమది మిథ్యయయ్యె నీయందు, నీకిట్టి నిర్దయ బుద్ధి జేకొనదగునె? యట్టి సాధ్వికి గరుణ పసన్నుండవగుమని యెల్లచో బలికిన" 

నీవు నిత్యసత్యవ్రతుడివి. నీ భార్యను మోసం చేసి ఆమె చీరను సగం చింపి నీవు కట్టుబట్టగా చేసికొని పోవటం న్యాయమా? భరించబడేది భార్య అని కదా ధర్మం. ఆ ధర్మం నీపట్ల అసత్యమైనది గదా? నీవు ఇటువంటి దయలేని కఠినమైన బుద్ధిని అవలంబించతగునా? అటువంటి పతివ్రతాశిరోమణి పట్ల అనుగ్రహం చూపండి. 

ఋతుపర్ణుడి సభలో పర్ణాదుడనే విప్రుడిచే దమయంతి చెప్పించిన పైమాటలకు స్పందిస్తూ, బాహుకుడనే అశ్వశిక్షకుడిలా మాట్లాడాడు. "పురుషునందు దోషపుంజంబు గలిగిన నెఱిగి నెద సహించునేని భార్య/ పురుషునం దభీష్టభోగంబు, దేహాంతరంబునందు ధర్మరతియు బడయు".

మగడియందు తప్పులుంటే తెలిసి ఉండి కూడ, సైరించే భార్య ఎప్పటికైనా ఇహలోకంలో భర్తనుండి తాను కోరిన సౌఖ్యం పొందుతుంది. అట్లాగే ఆ పుణ్యం వలన మరుజన్మలో ధర్మంపట్ల ప్రీతిని పొందగలదు. 

బాహుకుని లక్షణాలు చూస్తే....

కుఱుచ చేతులవాడు (పొట్టి చేతులు గలవాడు, కురూపి), ఋతుపర్ణు నొద్ద నూరు గద్యాణంబుల జీవితంబు వాడు. (ఋతుపర్ణుడి దగ్గర వంద గద్యాణాల వేతనంతో పని జేసేవాడు). 

శీఘ్రయానకుశలుడు - వేగంగా ప్రయాణం చేయటంలో నేర్పరి. 
సూదక్రియా నిపుణుడు - వంటలు చేయటంలో నేర్పు గలవాడు.
విరూపాంగుడు - వికృతమైన ఆకారం గలవాడు.
అశ్వశిక్షకుడు - గుఱ్ఱాలకు శిక్షణ ఇచ్చేవాడు.

ఈ విషయం తెలుసుకున్న దమయంతి, అతడు నలుడుకాని పక్షంలో ఎందుకు ఎదురు సమాధానం చెపుతాడని ఊహించి, బాహుకుడే తన భర్త అయిన పక్షంలో కురూపి ఎలా అయ్యాడని నిర్ధారించలేక, ఆయన సమక్షంలో నిజానిజాలు తెలుసుకోగోరి, రప్పించే మార్గం కోసం మరునాడే విదర్భానగరంలో దమయంతి ద్వితీయస్వయంవరమని ఋతుపర్ణునకు కబురు పంపుతుంది.

ఋతుపర్ణుడు బాహుకుడిని పిలిచి, నాకు దమయంతీ స్వయంవరం చూడాలని ఉన్నది. అయితే ఒక్కదినంలో మనం విదర్భ చేరవలసి ఉన్నది. నీ అశ్వశిక్షాచాతుర్యం నెఱపుమని ఆజ్ఞాపిస్తాడు.

రథవేగ గమనాన్ని నన్నయ ఇలా చెప్పాడు. "ఎదురను దవ్వుల చూచిన పొడవు లెల్ల తత్క్షణమె కదియగా, నవ్వి యెంతయును దవ్వయి కనబడ!" - ఎదురుగా సుదూరంలో కనిపించిన రూపాలు ఆ క్షణంలోనే దగ్గరగా కనిపించి వెనువెంటనే వెనుకగా మిక్కిలి దూరంగా కనిపించేవి.

సూర్యుని రథమా అన్నట్లు పొద్దు క్రుంకే లోపల రథం విదర్భచేరింది. దమయంతి ఆ రథఘోష వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టి, అనురక్తి చెందింది. చెలికత్తె కేశినిని బాహుకుని వద్దకు పంపి యోగక్షేమాలను అరయ పుత్తెంచగా బాహుకుడు, ఋతుపర్ణ రథసారథిగా తనను పరిచయం చేసుకుంటూ, నూరు ఆమడల మేర దూరాన్ని ఒక దినంలో వచ్చి చేరిన విషయం వివరిస్తాడు.
యావత్ ప్రపంచంలో ఒక్కదినంలో నూరు ఆమడల దూరానికి రథాన్ని నడపగలవాడు ఎవడు? ఒక్క నలుడే గదా? ఆ విషయం దమయంతికి మాత్రమే అవగతం.

సహధర్మచారిణి, పరమపతివ్రతా తిలకమైన దమయంతిని, నలుడు ఎట్లా విడిచి, విస్మరించగలిగాడో కదా అని కేశిని నిందిస్తుంటే, నలుడి కన్నుల నుండి ఎడతెగని కన్నీటి వెల్లువ పెల్లుబికింది. అతడు తన కన్నులు కేశినికి కనిపించకుండ తన వదన పద్మం నుంచి వేరొకవైపు చూడసాగాడు. ఇది కేశిని గమనించి దమయంతికి చేరవేసింది!
పిదప ఆయన వంటల నేర్పరితనం, పంచభూతాల స్నేహప్రవృత్తి ప్రత్యక్షంగా చూచి తనకు వివరించిన కేశిని చేత, దమయంతి బాహుకుడు వండిన మంసాహారాలు (నలపాకం) తెప్పించి రుచి చూచి బాహుకుడిలో నలుడి లక్షణాలు ఉండటం గమనించింది. అంతటితో తృప్తి చెందక అతడి దగ్గరకు కేశిని తోడిచ్చి తన కొడుకును, కూతురిని పంపించింది దమయంతి.

తన వశం తప్పి కన్నీరు కారుతుండగా, నలుడు కొడుకు, కూతురిని వాత్సల్యంతో ఎత్తుకున్నాడు. సంతోషంతో గగురుపాటు పొంది, తన ఒడిలో వారిని ఉంచుకొని ఆదరించాడు.

పిదప చెలికత్తెతో బాహుకుడు, నీవు ఇచ్చటికి పలుమారులు వస్తూ పోతూ ఉంటే చూచేవారు వారి మనస్సులలో నన్ను వేరే విధంగా భావించవచ్చును సుమా అని వారించాడు.
దమయంతి అద్వితీయమేధ బాహుకుడి మాటున అణగిమణగిన నలుడి వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగింది. దమయంతి చెప్పగా విని ఆమె తల్లి, భర్త అనుమతి పొంది, దమయంతి దగ్గరకే బాహుకుడిని రప్పించింది.

నలుడి దేహం వికారంగా కనిపించినప్పటికీ అతడిని పరుడుగా ఎంచక, స్నేహంతోను, సిగ్గుతోను, మిక్కుటమైన తత్తరపాటుతోను, తనను తాను అదుపులో  పెట్టుకొనలేకుండా భర్తతో ఇట్లా మాట్లాడింది.

"జనులు లేని అడవిలో అలసి, నిదురపోయినదానిని, బలహీనురాలైన ఆడుదానిని, సహధర్మచారిణి అయి తన వెంట అడవికి వచ్చినదానిని, సౌమ్యమైన ప్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పధ్ధతిలో పెండ్లి చేసికొని చేపట్టినదానిని, నలుని వలె కఠినాత్ములై విడిచిపెట్టి వెళ్లినవారు ఇతరులు మరెవ్వరూ లేరు.
దేవతాశ్రేష్ఠులను విడిచిపెట్టి, తననే భర్తగా ఎన్నుకొన్నాను కదా! అటువంటి నన్ను సంతానవతినైన దానిని శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు? నాపట్ల కనికరం లేకపోవటానికి అతడికి నేను ఎటువంటి అపచారం చేయలేదే!"

దీనికి సమాధానంగా నలుడు, దమయంతితో "నన్ను కలి ఆవహించటం చేత ఆవిధంగా బుద్ధి చెడి అన్ని కష్టాలపాలు కావలసివచ్చింది. ఆ అగచాట్లు అన్నీ నా తపశ్శక్తి చేత, నీ పరితాపమనే నిప్పు వలన తొలగిపోయాయి. ఇప్పుడు నన్ను కలి విడిచిపోయాడు. నేను ఇచ్చటికి వచ్చింది నీ విషయం తెలిసికొనటం కొరకే. నేను నీపట్ల ప్రేమ గలవాడిని, సహధర్మచారుడను, నన్ను విస్మరించి పరపురుషవాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచటం అంటే అది కులిపాలికకు తగిన న్యాయం కాదు" అని అధిక్షేపించగా, దమయంతి నలునకు నమస్కరించి, "నరశ్రేష్ఠుడైన  నలమహారాజు తప్ప మానవమాత్రులలో మరెవ్వరు ఒక్కదినంలో నూరు ఆమడలమేర దూరం రాగలరు అని ఆలోచించి ఈ విధమైన వార్త చేరవేశానే తప్ప, స్వయంవరం కాదని" నలుని పాదాల సాక్షిగా సూర్యచంద్రాది దిక్పాలకుల సాక్షిగా ప్రమాణం చేయగా, ఆకాశవాణి దమయంతిని పతివ్రతగా స్వీకరించమని ఆదేశిస్తుంది.

నలుడు నిజరూపంలో సూర్యతేజస్సుతో వెలుగొందుతూ, లక్ష్మీయుతమైన దమయంతిని చేకొన్నాడు.

ఫలశ్రుతి: 

ఈ నలుడి గాధ శ్రద్ధతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు, కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి. అటువంటి వారికి బహుపుత్రలాభం, పౌత్రవృద్ధి, ఆయురారోగ్యధనసంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు! వారు ధర్మాత్ములు కాగలరు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణశ్చ రాజర్షే కీర్తనం కలినాశనం ||

కర్కోటకుడనే నాగుడిని, దమయంతిని, పుణ్యశ్లోకుడైన నలుడిని, ఋజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని ధ్యానించి కీర్తించిన, కలిభయాలు తొలగగలవు.

                                               ******

No comments:

Post a Comment