ద్రుపద మహారాజు పాంచాల దేశాధీశుడు, అయోనిజుడు, భరద్వాజ మహర్షి కుమారుడైన ద్రోణుని బాల్యస్నేహితుడు. ఐశ్వర్య కారణదారుణ గర్వితుడై, నిండు సభలో భార్యా, శిష్యులముందు పేదరికాన్ని అపహసిస్తూ స్నేహితున్ని అవమానించాడు. దానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు.
కాని ప్రతీకారం తీర్చుకోవలసిన సుక్షత్రియుడైన ద్రోణశిష్యుడైన అర్జునుని కాళ్లు కడిగి కన్యాదానం చేయాలని సంకల్పించడం ఆయన క్షాత్రధర్మానికి పరాకాష్ఠ. ఈ కథ శ్రోతలను ఎంతో ఉత్తేజపరుస్తుంది.
ద్రుపదునిపై ద్రోణుని ప్రతీకారం తెలుసుకున్నాం గదా. కథ అక్కడ నుండి మొదలైందని చదివాం, అది ఎలాగా?
13 సంవత్సరాలు అస్త్రవిద్య నేర్చిన అర్జునుడు, గురువు ఆశీర్వాదబలంతో గురుదక్షిణగా ద్రుపదుణ్ణి రథాక్షముతో కట్టి, పేద బ్రాహ్మణుడైన ద్రోణుని కాళ్ల మీద పడవేయగా అపహాసం పాలైన ద్రుపద మహారాజు, తన జీవితాన్ని ఎలా గడిపాడు? యోచించారా ?
ఇంతటి అవమానానికి కారకుడు ద్రోణుడా? అర్జునుడా? మరి ప్రతీకారం ఎవరిపై ఎలా తీర్చుకొనాలి? ఆలోచించాడు ద్రుపదుడు.
ఇరువురూ క్షమార్హులు కారని నిర్ణయించుకొన్నాడు. ద్రోణుడు బ్రాహ్మణుడు, అస్త్రవిద్యాగురుడు. అతనిపై రాజుగా తాను ఎలా దండెత్తగలడు? అందుచేత అతనిని సాధించగల ఒక కుమారుడు కావాలనీ, అర్జునుని వంటి సుక్షత్రియునికి, కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యాలనీ, నిర్ణయించాడు. కాని తన వద్ద అర్జునునకు ఇవ్వగల కన్యలేదే! తపస్సు చేస్తే తప్ప సాధించలేనని గ్రహించి, యుద్ధరంగంలో ద్రోణుడిని చంపగల పుత్రుని, అర్జునునకు భార్యకాగల పుత్రికను పొందాలని ద్రుపదుడు బ్రహ్మజ్ఞానసంపన్నులైన బ్రాహ్మణులున్న ప్రదేశాలకు వెళ్లి ప్రతిదినం బ్రాహ్మణసేవ చేయసాగాడు.
తనను ఓడించి పట్టి తెచ్చిన అర్జునునిపై శాశ్వత క్రోధం పెట్టుకోకుండా అతని పరాక్రమాన్ని మనసారా మెచ్చుకున్న ద్రుపదుని సహృదయత, అంతటి వీరకిశోరుడిని తన అల్లుడుగా చేసుకొనాలన్న తలంపు ప్రశంసింపదగినదే, ఆశ్చర్యకరమైనదే.
ద్రుపదుడు గంగాతీరంలో వానప్రస్థాశ్రమజీవితం గడుపుతున్న కాశ్యపగోత్ర యాజఉపయాజులనే సోదరులను జూచాడు. వాళ్లకు నమస్కరించి తన కోర్కెను వెల్లడించి, ఒక్క సంవత్సరకాలం సేవించాడు. ఫలాపేక్ష లేని తమ్ముడు అన్నవద్దకు వెళ్లమన్నాడు.
యాజుడు (అన్న) వేదాధ్యయనం, మొదలైన పంచయజ్ఞాలు చేసేవాడు. పైరు కోసిన తర్వాత మళ్లలో జారిపడిన వెన్నులు, గింజలు మొదలైన వాటిని ఏరుకుని, జీవనోపాయం చేత, బిచ్చమెత్తి సంపాదించినదానిచేత, కుటుంబ భారాన్ని వహిస్తూ భయంకరమైన తపస్సు చేస్తున్నవాడు. ప్రసన్నుడై యజ్ఞం చేయించే యాజ్ఞికుడుగా ఉండటానికి అంగీకరించి, "నీ కోరికకు తగిన కొడుకు, కూతురు జన్మిస్తారు, భయపడవద్దు" అని యజ్ఞసాధనాలను, పదార్థాలను సిద్ధం చేసికొని, తమ్ముడు ఉపయాజుడు సహాయుడుగా, ద్రుపదుని భార్య కోకిలాదేవితో సహా ద్రుపదుని చేత శాస్త్రోక్తంగా యజ్ఞం చేయించాడు. మంత్రాలతో ఆహుతులుగా వ్రేల్చిన పదార్థాలతో తృప్తి పొందిన అగ్నిదేవుని వలన -
"జ్వాలాభీలాంగుడు, కరవాలబృహచ్చాపధరుండు వరవర్మకిరీటాలంకారుడు, వహ్నియపోలె రాథారూఢు డొక్క పుత్రుడు పుట్టెన్"
అగ్నిజ్వాల వలె భయంకరమైన శరీరం గలవాడు, ఖడ్గాన్నీ, పెద్ద ధనస్సును ధరించినవాడు, శ్రేష్ఠమైన కవచంతో, కిరీటంతో అలంకరింపబడినవాడు, రథాన్ని అధిరోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రుని వలె ఉదయించినాడు. ఇంకా,
"కులపవిత్ర, సితేతరోత్పల కోమలామలవర్ణ, యుత్పలసుగంధి, లసన్మహోత్పల పత్రనేత్ర, యరాళకుంతల విభాసిని, దివ్యతేజము దాల్చి యొక్క కుమారి తజ్జ్వలనకుండము నందు బుట్టె ప్రసన్న మూర్తి ముదంబుతోన్".
వంశాన్ని పావనం జేసేది, నల్ల కలువ వంటి శరీర వర్ణం గలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించింది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య సంతోషంతో ఆ అగ్నిగుండంలో ఉదయించింది.
ఈ విధంగా పుట్టిన కుమారునికి, కూతురికి, ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అని పేర్లను ప్రజలందరికి తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది. ఆ విధంగా ద్రుపదుడు సంతానం పొంది, సంతోషించి, యాజుని సహస్రగోదానాలతో సత్కరించి, బ్రాహ్మణులను పూజించాడు.
మరి ధృష్టద్యుమ్నునకు పగతుడైన ద్రుపదుని పుత్రుడని తెలిసి, అతడు తన్ను హతమార్చుటకే జన్మించెనని తెలిసి, ఆచార్యుడతనికి అస్త్రవిద్య నేర్పుట ఆశ్చర్యకరమైన విషయము. లోకమున ఒక్కొక్కరి స్వభావములో అంతుపట్టని ఆశ్చర్యకరములైన అంశములు ఒకటి రెండున్నట్లే ధృష్టద్యుమ్నునకు ధనుర్విద్య నేర్పుట కూడా. ఇది తన మృత్యువును తానే పోషించుట వంటిది.
అయినను విధి అవిలంఘ్యమని, ఆత్మకీర్తియైన దక్కునని, ద్రోణాచార్యుడా పని చేసినట్లు సంస్కృతభారతమున చెప్పబడినది. ఎందుచేతనో ఈ విషయము నన్నయ తెలుగు భారతమున చెప్పలేదు.
అందుకే భారతీయ సంప్రదాయాలలో జ్ఞానదాత గురువును -
"గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అన్నారు.
*****
No comments:
Post a Comment