Sunday, November 11, 2012

మాయాద్యూతం (Mayaadyootham)


 శకుని, ధర్మరాజు మధ్య జరిగిన ఈ ద్యూత ప్రక్రియలో ధర్మరాజు చేతికి పాచికలు వేసేందుకు అవకాశమే రాలేదు. ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులు, ద్రౌపది ఏ సందర్భం వచ్చినా తమ పరాజయానికి శకుని మాయాజూదమే కారణమంటారు. ఆశ్చర్యమేమంటే భారతం మొత్తం కావ్యంలో ధర్మరాజు మాయాద్యూత పదంతో శకునిని నిందించలేదు, ఆశ్చర్యంగా లేదూ !

కవిత్రయ మహాభారతంలోని మాయాద్యూతాన్ని ఎరుగని పండితుడు గాని, పామరుడు గాని ఆంధ్రదేశంలో లేడనే చెప్పవచ్చు. ఇంతకూ ఈ మాట ఎవరి నోట మొట్టమొదట వచ్చింది? ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులూ, ద్రౌపదీ, ఏ సందర్భం వచ్చినా, తమ పరాజయానికి శకుని మాయాద్యూతమే కారణమని, ధర్మజుని ద్యూతవ్యసనాన్ని దుయ్యబడుతారు. ద్యూతవ్యసనుడైన ధర్మరాజు మాత్రం భారతం మొత్తంలో ఎక్కడ కూడా మాయాద్యూతమని శకునిని నిందించనే లేదు.

సభాపర్వంలోని ఆంధ్రమహాభారత గాధ విశ్లేషిస్తే...

అసూయాగ్నితో రగిలే దుర్యోధనుడు, మామ శకునితో (ఏకాంతంలో) ధర్మజుని రాజసూయ యాగానంతరం పాండవలక్ష్మి ఏ విధంగా అపహరింపనగునని ప్రశ్నిస్తాడు.  దీనికి శకుని, "భాను ప్రభుడగు పాండుమహీనాథాత్మజులక్ష్మి యెల్లను నీకున్ నేనపహరించి యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్" అంటాడు. లోకం కొనియాడే ఓ దుర్యోధనా! సూర్యునితో సమానమైన తేజస్సుగల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా "మోసపు జూదమనే" నెపంతో నీకు నేను అపహరించి ఇస్తాను. 

ఇంతకూ జూదంలో శకుని నైపుణ్యమేమని ఎవరికైనా స్ఫురించకమానదు. దీనికి సమాధానంగా శకుని, "ధర్మతనయుండు జూదంబునకుం బ్రియుండు గాని యందుల యుక్కివం బెరుగడు ఏ నక్షవిద్యయం దతిదక్షుండ" అంటాడు. ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం. కానీ అందులో ఎంత మోసం ఉంటుందో అతనికి తెలియదు. నేను ద్యూతవిద్యలో సులభంగా ఓడించి అతని రాజ్యసంపదనంతా నీకిస్తానన్నాడు. 

"అభిమతాక్షముల్ తొల్చి మాయావిదుండు సుబలాత్మజుడు ధర్మసుతు జయించె" తన కిష్టమైన పాచికల రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును ఓడించాడు. ఇక్కడ 'తొల్చి' అన్న పదానికి, 'యుక్తిగా దొర్లించి' అన్న అర్థం వున్నది. 

ధర్మరాజు, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం, ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడైన దేవలుని ప్రామాణికతతో జూదమాడాడు.

"బలవదూ్ద్యతార్థముగా బిలువంబడి మగుడనగునే" బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్లటమా ? అన్న శంక ధర్మరాజుకు కలిగింది. కానీ విధి బలీయం. 

సప్తవ్యసనాలు: 

"వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేతయనెడు సప్తవ్యసనముల జనదు తగుల"

- స్త్రీ, జూదం, తాగుడు, వేట, వాక్పారుష్యం, అతిక్రూరంగా దండించుట, డబ్బును వృథా చేయటం - అనే ఈ ఏడు వ్యసనాల యందు ఆసక్తి చూపరాదు. 

విదురుడు, ధృతరాష్ట్రునికి చెప్పిన నీతిబోధ ఇది. ఈనాటికీ పెద్దలు వీటి జోలికి పోరాదంటారు. ఫలితం దారుణమే!

జూదానికి ధర్మజుడే కాదు, నలమహారాజు కూడా బలయ్యాడు. ఆయన కూడా ధర్మజుని వలె అక్షప్రియుడే కానీ అక్షహృదయజ్ఞుడు కాడు (జూదంలో మెలకువలు తెలియనివాడు). 

"ద్యూతార్థము తత్కితవాహూతుడనై, జూదమాడకుండుట ధర్మాపేతంబని, యభిముఖుడై యాతనితో నలుడు జూదమాడ గడంగెన్". 

జూదమాడటానికై జూదరుల చేత పిలువబడినవాడై జూదమాడకుండుట అధర్మమని తలచి నలుడు సమ్మతించి పుష్కరునితో జూదమాడాడు. 

నలుడు పిలువబడి జూదమాడకుండుట అధర్మమని ఎంచాడు. 
ధర్మరాజు జూదం ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యఫలమని తలచాడు. 

ఇరువురి భావనలో ఎంత భేదమో చూడండి. 


                                                  *****




No comments:

Post a Comment