Sunday, November 11, 2012

ఇద్దరు తల్లులకు ఒక కుమారుడు (Iddaru Thallulaku Oka Kumaarudu)

 ఒక శిశువు ఇద్దరు తల్లులకు ఏకకాలంలో అర్ధశరీరంతో పుట్టడం ఎలా సాధ్యం? వైద్య విజ్ఞానశాస్త్రంలో ఎవరూ  ఇలాంటి సంఘటన జరిగినట్లుగా చదువలేదు, వినలేదు, కనలేదు. 

విశ్వసాహిత్యంలో ఇలాంటి ఆశ్చర్యకర కథను ఎవరైనా విన్నారా? చదివారా? ఆశ్చర్యం గొలిపే అంశం. 

ఆంధ్ర మహాభారతంలో ఇలాంటి కథలెన్నో పరిశోధించి, సమగ్ర పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలను విజ్ఞానపరంగా, వైద్యవిద్యాపరంగా కూడా విచారించాల్సి ఉన్నది. 

మచ్చుకి కొన్ని :

1. సద్యోగర్భమున సత్యవతీ పరాశరులకు వ్యాసుడు జన్మించాడు. అంటే తల్లిగర్భంలో 10 నెలలు పెరగకుండా భార్యాభర్తల సమాగమము అయిన వెంటనే జన్మించడం. అలాంటిదే కర్ణ జననం కూడ. 

2. వసురాజు వీర్యంతో చేప గర్భందాల్చి సత్యవతి జన్మించడం (చేప అప్సర వనిత - శాపకారణం). 

3. అగ్నిగుండంలో (యాగాగ్ని) ద్రౌపది అయోనిజగా పుట్టడం. 

4. కృపుడు రెల్లుగడ్డి గంటలో, ద్రోణుడు కుండలో పుట్టడం అందరికీ తెలిసినదే. 

5. తండ్రి గర్భ జననం. 

పై వృత్తాంతాలకు సమాధానంగా ఆంధ్రమహాభారతం ఆదిపర్వంలో 

"శూరుల జన్మము, సురల జన్మము, ఏరుల జన్మము ఎరుగనగునె ?" (శూరాణాంచ, నదీనాంచ, దుర్విదాః ప్రభవాః కిలా)
శూరుల, దేవతల, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? 

అలాంటిదే ఈ జరాసంధుని జన్మవృత్తాంతం. మగధరాజయిన బృహద్రధునకు ఇద్దరు భార్యలు, కాశీరాజు పుత్రికలు, కవలలు. బృహద్రధుడు సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. కాని ఫలితం కన్పించలేదు. పుత్రులు లేని సంపదలు వ్యర్థమని అడవికి వెళ్లి మునిశ్రేష్ఠుడైన చండ కౌశికుడిని భక్తితో నియమ నిష్ఠతో సేవించాడు. 

కౌశికుడు రాజుసేవలను మెచ్చి వరమేదయినా కోరుకోమన్నాడు. అందుకు బృహద్రధుడు సంతానాన్ని ప్రసాదించమన్నాడు. ముని ధ్యానంతో కళ్లు మూసుకోగా మామిడిపండు ఒకటి ఆయన ఒడిలో పడింది. దానిని మంత్రించి ముని బృహద్రధునకిస్తూ తప్పక కుమారుడు కలుగుతాడని దీవించాడు. 

రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ మహాప్రసాదాన్ని భార్యలిద్దరికి సమానంగా పంచియిచ్చాడు. కొద్దికాలానికి భార్యలిద్దరకు సగం బిడ్డలు జన్మించారు. వారు ఒక కన్ను, ఒక చెవి, అర్ధముఖము, కడుపు ఇలా సగం అవయవాలతో జీవం పోసుకున్నారు. 

ఈ మానవాకార ముక్కలను రాజుకు చూపేందుకు సిగ్గుపడి కాన్పు చేసిన దాదులు రాణుల అనుమతితో రాజభవనం వెలుపలికి విసిరేశారు. 

జర అనే రాక్షసి ఆ ముక్కలను చూసి, బలి ఇచ్చిన ప్రాణ శరీరాలని తలచి, రెండు ముక్కలను కలిపి గట్టిగా పట్టుకోగానే అవి రెండూ కలిసి ఒక శిశురూపాన్ని పొందాయి.  వజ్రకఠిన శరీరంతో రూపం పొందిన ఆ బాలుడు గట్టిగా ఏడుపు అందుకున్నాడు. వెంటనే రాణులు చెలికత్తెలతో అక్కడకు పరుగున వచ్చి బాలున్ని తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బృహద్రధుడు సంతోషంతో జరనుద్దేశించి నీవు రాక్షసివి కావు. నీవు మా వంశాన్ని ఉద్ధరించటానికి వచ్చిన దేవతవని శ్లాఘించాడు. 

జర కలిపినంతనే మానవరూపం దాల్చాడు కనుక ఆ శిశువుకు "జరాసంధుడు" అని నామకరణం చేశాడు రాజు. ఇద్దరు తల్లుల గారాల బిడ్డగా, బృహద్రధుని కలల పంటగా పెరిగాడు జరాసంధుడు. ఆయుధాలతో మరణం లేనివాడుగా, ముని ఆశీర్వాదబలంతో ఓటమిని ఎరుగని పరాక్రముడిగా రాజ్యమేలుతున్నాడు. 

జరాసంధుడి కుమార్తె కంసుడి భార్య. శ్రీకృష్ణుడు కంసుని సంహరించడం వల్ల కుమార్తె ప్రేరణ వల్ల జరాసంధుడు మథురపై పదిమారులు దండెత్తాడు. ఆయుధ నిహతుడు గాని జరాసంధుడిని జయించలేమని తెలిసి శ్రీకృష్ణుడు మథుర నగరం నుంచి పారిపోయి చివరకు ద్వారక సముద్రతీరాన రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు. దుర్మార్గుడైన జరాసంధుడు లోకంలోని రాజులందరిని జయించి బంధించి కసాయిగా రోజుకొక్కరిని వధించి భైరవ పూజలు కావిస్తున్నాడు. 

రాజసూయాధ్వర ప్రవర్తకుడైన ధర్మరాజు ఆజ్ఞమేరకు శ్రీకృష్ణుడు జరాసంధుడిని వధించేందుకు భీమార్జునులతో బ్రాహ్మణుల వేషధారులై అర్ధరాత్రమున గిరివ్రజము వెళ్లారు. శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు భీముడు ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడిని వధించి బందీలుగా ఉన్న వేలాదిమంది భూపతులను విడుదల చేశాడు. ఔత్తరాహిక సంస్కృత భారతప్రతితో నన్నయ ఏకీభవించి జరాసంధుని 13 రోజుల ద్వంద్వ యుద్ధంలో చంపినట్లు పేర్కొన్నాడు. 

సంస్కృత భారత దాక్షిణాత్య ప్రతిలో అధ్యాహారంగా 

"తత స్తుభగవాన్ కృష్ణో జరాసన్ధ జిఘాంసయా! 
భీమసేనం సమాలోక్య నలం జగ్రాహ పాణినా ||
ద్విధా చిఛ్చేద వై తత్తు జరాసన్ధవధం ప్రతి ||
తత సా్త్వజ్ఞాయ తస్యైవ పాద ముతిక్షిప్య మారుతి: ||
ద్విధా బభజ్ఞ తద్గాత్రం ప్రాక్షిపద్ననాదచ  ||
పున స్సనా్ధయ తు తదా జరాసన్ధః ప్రతాపవాన్ ! ....

"జరాసంధుని సంహరించవలెనన్న తలంపుతో శ్రీకృష్ణుడు భీమున్ని వీక్షించి ఒకగడ్డి పోచను చేతితో గ్రహించి రెండుగా చీల్చాడు. భీముడు శ్రీకృష్ణుని అభిప్రాయము గ్రహించి జరాసంధుని పాదము పట్టుకుని, రెండుగా చీల్చి రెండువైపుల విసరివేయగా, మరల అవి రెండు ఒకటిగా చేరి పునః జరాసంధుడు పునర్జీవితుడయ్యాడు. అంతట శ్రీకృష్ణుడు మరల గడ్డిపోచను రెండుగా చీల్చి వ్యత్యాసము చేసి విసరగా, కృష్ణుని ఇంగితము గ్రహించిన భీముడు జరాసంధుని దేహము మరల చీల్చి అదేవిధంగా విసరివైచి, వధ గావించి, సింహనాదము చేశాడు. 

దాక్షిణాత్యుడైన నన్నయ, ప్రసిద్ధమైన జరాసంధ వధ - రెండుగా చీల్చి వ్యత్యాసం గావించి, విసిరేసి సంహరించటం అన్న విషయానికి మారుగా ఔత్తరాహిక సంస్కృత ప్రతిననుసరించి ద్వంద్వయుద్ధంలో సంహరించడం వెనుకగల అంతర్యమేమి తెలియకున్నది. 

వైద్యవిజ్ఞానపరంగా కడుపులు రెండు ఒకటిగా కలిసిన కవలలు జన్మించడం చూస్తూనే ఉన్నాము. వాటిని శస్త్ర చికిత్స ద్వారా శస్త్ర నిపుణులు వేరు చేస్తున్నారు కూడా. కాని ఒక శిశువు ఇద్దరు తల్లులకు ఏకకాలంలో అర్ధశరీరంతో పుట్టడం వింతలో వింత. కాని ఆ తల్లులిద్దరు కవలలు కావటం సాధ్యమేమో, వైద్యవిజ్ఞానం ఇంకా పురోగతి సాధిస్తే సాధ్యాసాధ్యాలను విశ్లేషించవచ్చు. 

                                               *****

గురుదక్షిణ (Gurudakshina)

 ఇది విలక్షణమైన భారతీయ సంప్రదాయం. జ్ఞానప్రదాత అయిన గురువును శిష్యుడు విద్యార్జన తర్వాత సత్కరింపదగిన విధి. దీనికి సంబంధించిన కథలు ఆదిపర్వంలో మూడు కనబడతాయి. 

1. ఉదంకోపాఖ్యానం
2. కూమార అస్త్ర విద్యాప్రదర్శన - గురుదక్షిణ
3. ఏకలవ్య చరిత్ర 

కటిక దారిద్ర్యంతో సతమతమై కుమారుని పాల కొరకు నాలుగు పాడి ఆవులు ఇవ్వకపోలేడా అని, భేదం లేని స్నేహితుడైన ద్రుపద మహారాజు చేత అవమానింపబడిన ద్రోణుడు 13 సంవత్సరాలు జీవచ్ఛవంగా బ్రతికి ఎలా ప్రత్యర్ధిపై పగతీర్చుకున్నాడో శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే సన్నివేశము ఈ కథ. 

ఇది ద్రోణవృత్తాంతం మహాభారతంలో విలక్షణమైన కథావృత్తాంతం. ఆదిపర్వంలో నన్నయ కృతం ఈ కథ. 
ద్రుపదద్రోణులు బాల్య స్నేహితులు, పాంచాలదేశాధీశుని కుమారుడు ద్రుపదుడు, భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణుడు. విచిత్రమేమంటే ఇరువురు అయోనిజులు, కారణజన్ములు. వేదాభ్యాసం, భరద్వాజ మున్యాశ్రమంలో, ధనుర్విద్య అగ్నివేశుని వద్ద అభ్యసించారు. 

గృహస్థాశ్రమంలో స్థిరపడవలసిన  మిత్రులు విడిపోతున్న సమయంలో, తన రాజ్యభోగముల ననుభవింపరమ్మని ద్రుపదుడు ద్రోణున్ని కోరతాడు. దానికి ఆమోదిస్తాడు ద్రోణుడు. 

కాలాంతరంలో ద్రోణుడు, కృపాచార్యుని చెల్లెలిని వివాహమాడి, అశ్వత్థామకు తండ్రి అవుతాడు. మున్యాశ్రమంలో విద్యార్జనే ధ్యేయంగా జీవిస్తూ అమితదారిద్ర్య దుఃఖాన్ని అనుభవిస్తాడు. పరిస్థితి ఎంత దారుణానికి వస్తుందంటే పిల్లవానికి ఆవుపాలను కూడా ఇవ్వలేని స్థితి దాపురిస్తుంది ద్రోణాచార్యునకు. 

అలాంటి సమయంలో సమయస్ఫూర్తితో, తల్లి పిల్లవానికి బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇస్తుంది. దానికి ఆ పిల్లవాడు సంతోషంతో, తాను కూడా ధనవంతుల బాలకుల వలె పాలు తాగుతున్నానని గంతులు వేస్తున్నట్లు వ్యాసుడు సంస్కృతంలో వ్రాశాడు. 
నిజం తెలుసుకున్న ద్రోణుడు దారుణదారిద్ర్య పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి ధనేక్షతో పరశురాముణ్ని ఆశ్రయిస్తాడు. అప్పటికే ఆయన ద్రవ్యాన్నంతా బ్రాహ్మణులకు దానం చేసేశాడు. విధి లేని పరిస్థితిలో ఆచార్యుని నుంచి శస్త్రాలు, సంపద మాత్రం గ్రహిస్తాడు. దీనివలన పరిస్థితి తిరిగి మొదటికే వచ్చింది. బ్రాహ్మణుడు దానపరిగ్రహణం కోసం రాజులను ఆశ్రయించవచ్చుగా? ద్రోణునివాక్కులో విందాం - "పురుష విశేషవివేకాపరిచయు లగు ధరణిపతుల పాలికి బోవం, బరులందు దుష్ప్రతిగ్రహభర మెదలో రోసి ధర్మపథముననున్నన్". 
వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గరికి వెళ్లటానికి, ఇతరుల నుండి చెడు దానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలోనే జీవితం గడుపుతుండగా...అప్పుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. మరి అతడు రాజు గదా? అలాగే తలచడా? కాదు, కానేకాదు. 
యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదంలేని మిత్రుని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోడా  అని,
పుత్రకళత్ర అగ్నిహోత్రశిష్యగణంతో నిండు సభలో కొలువు దీరిన ద్రుపదుని చూచి,
"ఏను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ, నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా పలికిన"- నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకొన్నవాడిని, తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపించి, ద్రోణునితో, ఇద్దరి అంతరం తెలియకుండా, నాతో ఈ విధంగా మాట్లాడతగునా కూడదా అని తలచక, నన్ను నీ స్నేహితుడినని చెప్పటం న్యాయంగా ఉందా? పేద బ్రాహ్మణులకూ, మహారాజులకూ స్నేహం ఎలా సాధ్యపడుతుంది? నోరు మూసుకుని పొమ్ము. అయ్యో, అసలు బ్రాహ్మణుడు రాజుకు ఎక్కడైనా స్నేహితుడు అవుతాడా ?
ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది ?
(మొదటి పద్యభాగంలో ద్రుపదుడు ద్రోణుని మనసును పుండు చేయగా, రెండవ పద్యంలోని మాటలు ఆ పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి.)
సమానమైన శీలం (స్వభావం), విద్య, సంపద, మంచి నడవడి గలవాళ్లకు
స్నేహం, వివాహం ఏర్పడతాయి కాని, సమానులు కాని వాళ్లకు ఏర్పడవు (కయ్యానికి వియ్యానికి సామ్యం ఉండాలి). 
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వశత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. అందుచేత మా వంటి రాజులకు మీవంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీలేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు - అని ద్రుపదరాజు ఐశ్వర్య గర్వంతో తిరస్కరించి మాట్లాడగా, ద్రోణుడు అవమానం చేత కలిగిన కోపం వలన కలత చెందిన మనసు కలవాడై, ఏం చేయటానికి తోచక, కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడా పట్టణం బయట కౌరవపాండు కుమారులు బంతి ఆట ఆడగా, బంగారు బంతి బావిలో పడింది. దానిని వెలికి ఎలా తీయాలో తెలియని బాలురను సమీపించి ద్రోణుడు, తన అస్త్రప్రావీణ్యంతో వరుస బాణాలను ప్రయోగించి బంతిని పైకి తీసి ఇచ్చాడు. 

వెంటనే బాలురు సంతోషించి ద్రోణుని, తాతగారైన భీష్మునకు పరిచయం చేస్తారు. అన్ని విషయాలను కూలంకషంగా విచారించి భీష్ముడు, ద్రోణుని వృత్తాంతం విని "రోయు తీగ గాళ్లం బెనగె దాననుచు బొంగి" - వెదుకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునకు ధనధాన్యాలిచ్చి సంతృప్తిపరచి కురుపాండు కుమారులకు గురువుగా నియమించాడు. 
"నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చి నాకోరిక మీలో ఎవ్వడు తీర్చగలడని అడుగగా కౌరవులందరూ మౌనం వహించగా, అర్జునుడు "నేను తీరుస్తా" నని ముందుకు వచ్చాడు. 
అంత, గురుడు అర్జునుని అపారప్రేమతో కౌగిలించుకొని ఎంతో సంతోషించి కుమారులందరికీ విలువిద్య నేర్పుతున్నాడు. 
"భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్ర 
విద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱ యందు 
విద్యోపదేశము తుల్యమైనను నుత్తమోత్తముడయ్యె 
విద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్"
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప శస్త్రాస్త్రవిద్యా బోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేషు్ఠడయ్యాడు

అస్త్రశస్త్రవిద్యలలో నిష్ణాతులైన కురుపాండుకుమారుల అస్త్రవిద్యానైపుణ్యాన్ని పెద్దల ముందు, ప్రజలముందు తెలియబరచేందుకు ధృతరాష్ట్రుడు అనుమతించాడు. 
తొలుతగా భీమదుర్యోధనులు తమ గదా పాటవాన్ని ప్రదర్శించారు. వారిద్దరి గదా కౌశలం రాబోయే కురుపాండవ మహాసంగ్రామాన్ని సూచించే విధంగా, ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకోగా, రంగస్థలం రణభూమిగా మారే ప్రమాదం గుర్తించి ఆచార్యుడు ఆ ప్రదర్శనను ఆపించాడు. 
వెంటనే అర్జునుడు రంగప్రవేశం చేసి తన విలువిద్యాప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 
అర్జునుని అస్త్రవిశేషాలు అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తిలకిస్తూ 
"వీడె కృతహస్తు డఖిలాస్త్రవిద్యలందు 
వీడె యగ్రగణ్యుడు ధర్మవిదులలోన 
వీడె భరతవంశం బెల్ల వెలుగ కుంతి 
కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు" - ఈ అర్జునుడే అస్త్రవిద్యలన్నింటిలో నేర్పరి, ఇతడే ధర్మం తెలిసినవాళ్లలో మొదట లెక్కపెట్టతగినవాడు. ఇతడే భరతవంశానికంతటికి కీర్తివచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజశాలి -అనుకున్నారట. 
ఆ తరుణంలో ప్రజలంతా ఎంతో భయపడేటట్లు భుజం చరచటం వలన పుట్టిన 
శబ్దం పర్వత సమూహంపై బడే మహావజ్రాయుధ శబ్దమా అనేటట్లు రాగా, అందరు సాలవృక్షం వలె ఎత్తైనవాడు, సహజ కవచకుండలాలతో ప్రకాశించేవాడు, బాలసూర్యుని పోలిన కర్ణుని చూచి ఆశ్చర్యపడ్డారు. 
అర్జునుడు చూపిన అస్త్రవిశేషములన్నింటిని శ్రమ లేకుండా చూపించి అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు కర్ణుడు.  
కర్ణుని ప్రవేశంతో దుర్యోధనునకు కొండంత ధైర్యం కలిగింది. అంగరాజ్యమిచ్చి ఆదరించాడు. శాశ్వత స్నేహాన్ని మహీనుతముగ పాటించేటట్లు కృతజ్ఞతాబద్ధుని గావించుకొన్నాడు. అర్జునుని వలన భయం తొలగి ఆనాటి నుండి రొమ్ముపై చేయుంచి నిశ్చింతగా నిద్రించాడు దుర్యోధనుడు. 

కుమారాస్త్ర విద్యా ప్రదర్శనానంతరం ద్రోణుడు, పాండుకుమారుల రాబనిచి, తనకు గురుదక్షిణ ఇవ్వవలసినదని ఆజ్ఞాపించాడు. 
13 సంవత్సరాల విద్యాభ్యాసానంతరం ద్రుపదుని విషయం జ్ఞాపకం చేసుకుని, అత్యధికసంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రుపదుడిని ఓడించి తీసుకురమ్మని, ఇదే తనకిష్టమైన గురుదక్షిణ అని పలికాడు. 
అడగటమే తరువాయి, కౌరవులంతా సేనాసమేతులై ద్రుపదరాజపురాన్ని ముట్టడించారు. ద్రుపదుని బాణపరంపరలకు ఓర్వజాలక రణభూమి నుండి నిష్క్రమించారు. 
అర్జునుడు మాత్రం గురువుతో సమాన శౌర్యపరాక్రమాలు గల ద్రుపదుని ఎదుర్కొనేందుకు వ్యూహం రచించి, భీమసేనుడు తన సైన్యానికి ముందు నడువగా నకుల సహదేవులు తన చక్రరక్షకులు కాగా ద్రుపదుడి సైన్యమనే సముద్రాన్ని తాకాడు. 
ద్రుపదుని ఏనుగుల సమూహమనే చీకటిని, అశ్వసమూహమనే మంచును, సైనిక సమూహమనే నక్షత్రసముదాయాన్ని తన బాణాల కిరణసంపద చేత అణగేటట్లు చేసి యుద్ధమనే ఆకాశవీధిలో సూర్యుడివలె ప్రకాశించాడు. 
కొండమీదకు దూకే కొదమసింహం వలె అర్జునుడు ద్రుపదుని రథం మీదికి ఎగిరిదూకి, అతడిని పట్టుకుని కార్యసాధకుడై రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుడిని సంతోషపెట్టాడు. 

అప్పుడు ద్రోణాచార్యులు ద్రుపదునితో - 
"వీరెవ్వరయ్య ? ద్రుపదమహారాజులె ! ఇట్లు 
కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె ? యహహ !
మహారాజ్యమదాంధకార మది వాసెనొకో "
వీరేవ్వరయ్యా ద్రుపద మహారాజులేనా ? ఈ విధంగా దిక్కులేక పట్టుపడవలసిన పరిస్థితి ఏర్పడిందే ? ఆహాహా ! మహారాజ్యమదం చేత కలిగిన కన్నుగానని తనం తొలగిపోయిందా? 
ఈ మాటలలో వింత వెటకారం ధ్వనిస్తున్నది. ద్రుపదా, నీ ఐశ్వర్యం, పరాక్రమం, నా శిష్యుల అధీనం, నా దయాభిక్ష అని తలపింపజేసి తన ఔన్నత్యాన్ని, అదృష్టాన్ని వ్యంగ్యంగా ద్రోణుడు ధ్వనింపజేస్తున్నాడు. 
"ఇంకనైన మమ్ము నెఱుగంగ నొక్కొ యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు విడిచి పుచ్చె గురుడు, విప్రుల అలుకయు దృణ హుతాశనంబు దీర్ఘమగునె?"
ఇక నుంచైనా, మమ్మల్ని గుర్తుంచుకోగలరా ? అని ఎగతాళి చేసి ద్రోణుడు, ద్రుపదుడిని విడిచిపెట్టాడు. బ్రాహ్మణుని కోపం, గడ్డినిప్పు ఎక్కువ కాలం ఉంటాయా? 
చేసిన స్నేహాన్ని మరిచేవారికి తగిన గుణపాఠం ద్రోణుడు, తన శిష్యుని ద్వారా సాధించి, లోకానికే ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా ఆచంద్రార్కంగా నిలిచే కీర్తిని గడించాడు. 
కథ ఇక్కడితో ముగిసిందా ? లేదు. లేనేలేదు. ఇక్కడి నుండే మొదలైంది. ఎలాగా?
ద్రోణుడికి జరిగిన అవమానం ద్రుపదుని నిండు సభలో - ఎవరి ముందు? పుత్రకళత్ర అగ్నిహోత్ర శిష్యగణం ముందు. 13 సంవత్సరాల మౌనం వహించాడు. కారణం పేదవానికోపం పెదవికి చేటన్న సామెత నెరిగిన బ్రాహ్మణోత్తముడు. మరి కార్యమెలా సాధించాడు? జరిగిన అవమానాన్ని భరిస్తూ, జీవచ్ఛవంగా బ్రతుకు ఈడ్చాడు. కాని అర్జునుడొక్కడే నేనున్నానని భరోసా ఇచ్చినప్పుడు, మనసులోని కోర్కెను దాచుకుని తనంతటి శిష్యుణి్న 13 సంవత్సరాలు శ్రమించి తయారు చేసుకున్నాడు. గురుదక్షిణతో కార్యసాధకుడయ్యాడు. 
కాని ద్రుపదుడు, ద్రోణుని పేదరికాన్ని ఎగతాలి చేసి స్నేహధర్మాన్ని కాలరాచాడు. 
కథకంతకూ ప్రాణప్రదమైన ద్రోణుని కోరిక ఏమిటో తెలిస్తే, ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. నన్నయగారి వాక్కుల్లో -
"వేడుటెంతయు కష్టమైనను వేఱు లేని సుహృజ్జనున్
వేడికో లుచితంబ కావున వేడ్కతో జనిసోమకున్ 
వేడినన్ ధన మోపడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాడికుఱ్ఱుల నీడె వీనికి బాలు ద్రావుచు నుండగన్" 

యాచించటం ఎంతో కష్టమైన పని, అయినప్పటికి భేదం లేని స్నేహితుణ్ని యాచించటం ఉచితమే అంచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా అశ్వత్థామ పాలు త్రాగటానికి నాలుగు పాడి ఆవులు ఇవ్వకపోడా? 

ఊహించండి, ఆనాడే ద్రుపదుడు ద్రోణున్ని ఆదరించి, బాల్యస్నేహానికి చిహ్నంగా నాలుగు పాడిఆవులు ఇచ్చి వుంటే, సంతోషంగా తీసుకువెళ్లగలిగిన ద్రోణుడు, మహాభారత సంగ్రామంలో ద్రోణపర్వానికి శ్రీకారం చుట్టగలిగేవాడేనా? 

"చిలికి చిలికి గాలివానలాగా" అన్న సామెతకు సాక్షిగా కథలో ప్రతి సన్నివేశం పాఠకుల హృదయాలను రంజింపచేస్తూ అజరామరంగా నేటికి నిత్యనూతనత్వాన్ని సంతరించుకుని కవిత్రయ ఆంధ్రమహాభారతం పండితపామరులను రంజింపచేస్తున్నది. 
ధన్యజీవులు ఆంధ్రులు !  


                                             ******

Sunday, November 4, 2012

ధన్యుడైన పూరుడు (Dhanyudaina Poorudu)

 పూరుడు పాండవ వంశకర్త, శర్మిష్ఠ యయాతుల కుమారుడు. తన యౌవనాన్ని తండ్రికి ఒసగి వెయ్యేళ్లు వృద్ధాప్యాన్ని తండ్రి నుండి గ్రహించిన త్యాగధనుడు. 
ఈ కథ లోకానికి అందించే మహత్తర సందేశం: 
"తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెదలో జేకొనడేని వాడు తనయుం డనబడునే?  పితృధనమున కర్హుండగునే?"

చంద్రుడు మొదలుకొని పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు అనేవారు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించిన వారి చరిత్ర వృత్తాంతం వివరంగా తెలుపవలసినదని కోరుతాడు ఆంధ్రమహాభారత పీఠికలో రాజరాజు నన్నయగారిని. పాండవులు, కౌరవులనీ, భరతవంశీయులనీ అనిపించుకున్నారు. పాండవులు గార్హస్థ్యధర్మాన్నీ, క్షత్రియ ధర్మాన్నీ, మానవ ధర్మాన్నీ పరిరక్షించిన మహనీయులు. వారి గార్హస్థ్యధర్మానికి త్యాగం, సత్యం అనేవి రెండు చక్రాలు. ఒకటి పూరుమహారాజు నిల్పిన వంశధర్మం. మరొకటి భరత చక్రవర్తి నిల్పిన వంశధర్మం. ఆ రెండూ పాండవులలో పరిపూర్ణత చెందాయి. కురుమహారాజు, పాండుమహారాజు చంద్రవంశంలో ప్రసిద్ధి చెందిన మహావీరులు. 

కథా భాగానికి వస్తే, పూరుడు నహుష చక్రవర్తి మనుమడు. యయాతి శర్మిష్ఠల  చిన్నకుమారుడు. యయాతి మహారాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య శుక్రాచార్యుని కూతురు దేవయాని (బ్రాహ్మణ కన్య). రెండవ భార్య శర్మిష్ఠ, వృషపర్వ రాక్షసరాజు కుమార్తె. దేవయాని సంతానం యదు, తుర్వసులు. శర్మిష్ఠ సంతానం ద్రుహ్యుడు, అనువు, పూరుడు. 

దేవయానికి ప్రాణస్నేహితురాలు శర్మిష్ఠ. వాళ్లిద్దరు స్నేహానురాగాలతో విహరిస్తూ ఉండేవారు. ఒకనాడు వేయిమంది కన్యలతో కలిసి శర్మిష్ఠ దేవయానిని కలుపుకుని ఒక సరోవరంలో స్నానం చేశారు. కన్యలందరు తమ తమ చీరలను ఒడ్డుపై నుంచి నీటిలో దిగి జలక్రీడలాడారు. సుడిగాలికి చీరలన్నీ కలిసిపోయాయి. ఒడ్డుకు చేరిన కన్యలు వారి వారి దుస్తులు గుర్తించి కట్టుకోగా, శర్మిష్ఠ తొందరలో దేవయాని చీరను కట్టుకొన్నది. దేవయానికి శర్మిష్ఠ చీరదక్కింది. ఆ చీర కట్టుకోవటానికి దేవయానికి ఇష్టం లేదు. లోకోత్తర చరిత్రుడైన శుక్రాచార్యుని కుమార్తెను, నీకు పూజ్యురాలిని, పైగా బ్రాహ్మణ స్త్రీని, నేను నీవు విడిచిన బట్టను కట్టుకోవచ్చునా చెప్పు అని శర్మిష్ఠను నిలదీసింది. 
దానికి ప్రతిగా శర్మిష్ఠ దేవయానితో "మా అయ్యకు బాయక పని సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్ మీయయ్య! వెండి మహిమలు నా యొద్దన పలుకనీకు నానయు లేదే?"
"మీ తండ్రి అయిన శుక్రుడు మా తండ్రి అయిన వృషపర్వుడిని విడువక సేవిస్తూ, ఆశీర్వదించి ప్రియవాక్యాలు పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్పతనాలు నా దగ్గర పలికేందుకు నీకు సిగ్గులేదా? నేను కట్టుకొన్న వస్త్రం నీవు కట్టుకోరాదా ఏమిటి" అని గర్వంతో దేవయానిని ఆ ప్రక్కనే ఉన్న పాడుబావిలో త్రోసి, వేయిమంది కన్యలతో ఇంటికి తిరిగిపోయింది శర్మిష్ఠ

అదే సమయంలో నహుష పుత్రుడు అయిన యయాతి వేటకై ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సరోవరంలో నీరు త్రాగటానికి ఆ తీరానికి చేరుకొన్నాడు. ప్రక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో దేవయాని ఆర్తనాదం విన్నాడు. వరుణదేవుని భార్యయే భర్తమీద అలిగి జలనివాసం విడిచి భూస్థలానికి వచ్చిందా అన్నట్లు ఆర్తమూర్తి అయిన దేవయానిని కళ్లారా చూశాడు. ఎవరు నీవని ప్రశ్నించాడు. తాను శుక్రాచార్యుని కూతురునని, ప్రమాదవశాత్తు బావిలో పడ్డానని చెప్పి, రక్షించుమని వేడుకొన్నది. 
ఆమె దయనీయ స్థితి చూచి, యయాతి తన కుడిచేతిని చాచి దేవయాని కుడిచేయి పట్టిలాగి, ఆమెను బావినుండి పైకితీసి యయాతి తన నగరానికి తిరిగి వెళ్లాడు
దేవయానిని వెతుక్కుంటూ ఘూర్ణిక అనే చెలికత్తె అక్కడకు వచ్చింది. ఇంటికి రమ్మని దేవయానిని కోరింది. కోపంతో మండిపడుతూ శర్మిష్ఠ చేసిన అవమానానికి ప్రతీకారం చేయదలచి తండ్రి శుక్రాచార్యులను పిలిపించమని ఆజ్ఞాపించింది. 

తండ్రి శుక్రాచార్యుడు ఆత్రుతతో వచ్చాడు. బిడ్డను ఓదారుస్తూ క్రోధం వలన కలిగే అనర్థాలను బోధించాడు. శర్మిష్ఠ రాచకూతురు. చిన్నపిల్ల. ఆమెతో నీకు పంతమెందుకు ఇంటికి రమ్మని అనునయించాడు. 

ఈ వృషపర్వ నగరంలో నేను ప్రవేశించనని, ఎక్కడికైన వెళతానని బెదిరించింది. శుక్రుడికి ఎలా సముదాయించాలో తోచక కుమార్తె మాటను కాదనలేకపోయాడు. ఈ విషయం రాక్షసరాజు వృషపర్వుడు గూఢచారుల వల్ల తెలిసికొన్నాడు. శుక్రాచార్యులవద్దకు వచ్చి వినయంతో నమస్కరించాడు. శుక్రాచార్యుల మృతసంజీవని విద్యాప్రభావంతో దేవతలను మించే సంపదను దైత్యులు పొందారని, ప్రాణాలతో బ్రతుకగలిగారని, దేవయాని మనసుకు ఏది ఇష్టమైతే దానిని తప్పక ఇస్తానని వృషపర్వుడు అన్నాడు. దానికి దేవయాని సంతోషించింది. వేయిమంది చెలికత్తెలతో కూడిన శర్మిష్ఠ తనకు దాసిగా ఉండాలని కోరింది. 
ఆ మాటను కాదనలేక వృషపర్వుడు అంగీకరించాడు. శుక్రుడు సంతోషించాడు. శర్మిష్ఠ కన్యకాసహస్రంతో ప్రతిరోజూ దేవయానిని సేవిస్తున్నది. 

ఒకనాడు అందరూ కలిసి ఉద్యానవనం వెళ్లారు. ఆ సమయంలో యయాతి వేటకై వచ్చి వనంలో ప్రవేశించాడు. దేవయానిని చూచి అతిథి సత్కారాలను పొందాడు. ఆమె ప్రక్కనే ఉన్న "అతిశయ రూపలావణ్య గుణసుందరి" అయిన శర్మిష్ఠ ఎవరని ప్రశ్నించాడు. దానికి దేవయాని శర్మిష్ఠ తనకు దాసియని, వృషపర్వుని కూతురని చెబుతుంది. 
దేవయాని యయాతియందు అనురక్తురాలై తనను వివాహం చేసుకోమంటుంది. నూతినుండి బయటకు తీసిననాడే సూర్యుడే సాక్షిగా నీ కుడిచేతితో నా కుడి ముంజేతిని గ్రహించావు కాబట్టి ఇంతకుముందే నన్ను వివాహం చేసికొన్నావు. నీవు మరవటం న్యాయమా అని నిలదీస్తుంది. 
దేవయాని మాటలకు యయాతి అభ్యంతరం, ఆశ్చర్యం ప్రకటిస్తూ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడటం ధర్మవిరుద్ధమని పేర్కొన్నాడు. దేవయాని తన వాదన వీడక, సకలలోక పూజ్యుడైన శుక్రాచార్యుడు ఈ వివాహాన్ని అంగీకరిస్తే నన్ను నీదానిగా స్వీకరిస్తావా? అని అడుగుతుంది. తనకు అభ్యంతరం లేదంటాడు యయాతి. తండ్రిని పిలిపిస్తుంది దేవయాని. విషయం వివరిస్తుంది. 
పుత్రికా వ్యామోహంతో ఆమె వివాహాన్నిసమర్థిస్తాడు శుక్రాచార్యుడు. అపక్రమదోషం లేకుండా వరమిచ్చాడు. వైభవంగా వివాహం ఇద్దరకూ చేసాడు. దేవయానితో పాటు సహస్ర కన్యా పరివృత అయిన శర్మిష్ఠను అరణంగా ఇచ్చాడు. వారందరికీ అన్నపాన, భూషణాది సౌకర్యాలను యయాతి కల్పించాలని, కాని శర్మిష్ఠతో కలసి శయనించడం పరిహరించాలని ఆజ్ఞాపించాడు. 

యయాతి దేవయానిని, శర్మిష్ఠను, కన్యాసహస్రాన్నీ వెంట తీసుకొని నగరానికి వెళ్లాడు. దేవయానిని మహారాణివాసంలో ఉంచాడు. శర్మిష్ఠను అశోకవనంలో ఒక గృహంలో ఉంచాడు. దేవయానికి యదుతుర్వసులనే ఇద్దరు కుమారులను సంతతిగా పొందాడు. 
దేవయాని స్వార్థపరురాలైన అహంకారిణి. చేయి చేయి కలిసింది కాబట్టి తనకు యయాతితో పెళ్లైపోయిందని వితండవాదంతో (సమయానుకూల వాదం) వివాహమాడింది.  తండ్రిని తన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడేటట్లు చేసింది. భర్తకు తనకు తాను సమర్పించుకోవటానికి బదులు భర్తయే తనకు సమర్పితం కావాలని కోరుకున్నది. అతని గార్హస్థ్యధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్జ్వలించింది. 

మృతి చెందుతున్న మానసిక గార్హస్థ్యధర్మం యయాతిలో మరలా పునర్జీవింపజేసి అనన్యసామాన్యమైన సౌందర్యంతో, యౌవనంతో పతిని పొంది సుఖించాలని, సుతుల బడయాలని శర్మిష్ఠ ఉవ్విళ్లూరింది
దేవయాని ఏ విధంగా యయాతిని కోరి వరించి సాధించుకొన్నదో ఆ విధంగానే తాను మహారాజు మనసు దోచాలని ఆశపడింది. అదృష్టవశాత్తు ఒకనాడు యయాతి అశోకవనం వైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను చూచాడు. సంభ్రమాశ్చర్యాలతో రాజుకు నమస్కరించింది శర్మిష్ఠ
ఆ దేవయానిని పరిగ్రహించినపుడే ఆమెతో అరణంగా వచ్చిన నేను కూడా నీకు పరిగ్రహయోగ్యురాలనే, కాబట్టి నీవు కరుణించి నన్ను కూడా నీ సతిగా స్వీకరించుమని ప్రార్థించింది.
ఈ లోకంలో భార్య, దాసి (సేవకురాలు), సంతానం అనేటువంటివి పరస్పరం విడదీయరాని ధర్మాలు (విధులు) అంటూ లోకధర్మంతో సమర్థించింది. 
యజమానురాలైన దేవయానికి భర్తవు అయినట్లే దాసికి కూడా భర్తవౌతావని సూచించింది. ఈ ధర్మం వలన దేవయాని నియమానికి భంగం రాదు అన్నది. 

యయాతి, శుక్రాచార్యుడు విధించిన నియమాన్ని కాదనలేనని వివరిస్తాడు. శర్మిష్ఠ ఆపద్ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రాణం మీదకు వచ్చినప్పుడు, సర్వసంపద అపహరింపబడేటప్పుడు, విప్రవధ జరిగే సమయంలో బ్రాహ్మణరక్షణ కొరకు, స్త్రీజన సమాగమవిషయాన, పెళ్లివేళలందు అసత్యమాడవచ్చును - అని మునివచన ప్రమాణం ప్రస్తావించి వధూజనసంగమ విషయం కాబట్టి, పెళ్లి సమయాన యయాతి ఒడబడిన కారణాన బొంకవచ్చునని నచ్చచెబుతూ, నీకు అసత్యదోషం కలుగదంటుంది. 

యయాతి శర్మిష్ఠకు అనుకూలుడై ఆమె అభిమతాన్ని అంగీకరించాడు. అతని వలన ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. దేవయానికి ఆ సంగతి తెలిసి శర్మిష్ఠను, పుత్రుడెలా కలిగాడని ప్రశ్నిస్తుంది. శర్మిష్ఠ ఒక మహాముని వరం వలన పుత్రుడు జన్మించాడని పేర్కొన్నది. అటు పిమ్మట శర్మిష్ఠకు ముగ్గురు కుమారులు పుట్టారు. ముగ్గురు కలిసి త్రేతాగ్నుల వలె ఆడుకుంటున్న సమయంలో దేవయాని ఆ ప్రదేశానికి వస్తుంది. యయాతి ప్రతిరూపాలుగా ఉన్న ఆ కుమారులను చూచి యయాతిని వారెవ్వరని అడిగింది. ఆయన నిరుత్తరుడు కాగా, బిడ్డలను ప్రశ్నించగా, వారు యయాతి - శర్మిష్ఠలను తండ్రి, తల్లిగా గుర్తించారు. 

తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠ వలన సంతానాన్ని పొందటం తెలిసికొని, కోప దుఃఖంతో తండ్రి వద్దకు శీఘ్రంగా చేరి తండ్రి పాదాలపై బడి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. యయాతి కూడా దేవయానిని అనునయిస్తూ శుక్రాచార్యుని ఆశ్రమం చేరాడు. కథనంతా వివరించి యయాతి తనకు తీరని అన్యాయం చేశాడని విన్నవించింది. 
శుక్రాచార్యుడు యయాతి పలుకులను ఆలకించక, తన ప్రియకుమార్తెకు యౌవనగర్వంతో రాగాంధుడై అప్రియం చేశాడు కాబట్టి జరాభార పీడితుడుగా కావాలని శపించాడు. 
యయాతి వినయంతో ఋతుమతి అయి పుత్రార్థం పతిని కోరితే, భార్యకు ప్రతికూలుడై ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యాదోషం వస్తుందని తెలిసి శర్మిష్ఠ ప్రార్థనను అంగీకరించి ఆమె యందు సంతానం పొందానని, దానికి కోపించి శపించటం న్యాయం కాదని శాపాన్ని నివారించాలి అని వేడుకున్నాడు. నాకు నీ కుమార్తె యందు విషయోపభోగవిరక్తి కలుగలేదని శాపనివారణ కోరాడు. 

శుక్రుడు శాంతించి శాపసంహారాన్ని సూచించాడు. శాపం వలన కలిగిన జరాభారాన్ని యయాతి కొడుకుల్లో ఎవరైనా ధరిస్తే, అతని యౌవనాన్ని గ్రహించి యయాతి విషయోపభోగాలను పొందవచ్చని, భోగతృప్తి తరువాత యయాతి జరాభారాన్ని తీసుకొన్న కుమారునకు యౌవనాన్ని తిరిగి ఇవ్వవచ్చుననీ ఆ విధంగా ఆ యౌవనాన్ని ఒసగిన పుత్రుడే రాజ్యర్హుడౌతాడని, శుక్రుడు ఆదేశించాడు. 

రాజధానికి తిరిగివచ్చిన యయాతిని శాపం కాటేసింది. జరాభారం దాల్చాడు. తల వణకటం మొదలు పెట్టింది. ఇంద్రియాలమదం అణగింది. అవయవాలు సడలినాయి. శరీరాన ముడతలు ఏర్పడ్డాయి. వెంత్రుకలు నెరిశాయి. ఉబ్బసం, తలనొప్పి, పొడిదగ్గు (ముసలితనపు లక్షణాలు) కలిగాయి. 

కొడుకులను పిలిపించి క్రమంగా అందరినీ జరాభారాన్ని తీసికొని యౌవనాన్ని ఇమ్మని అడిగాడు. పూరుడు తప్ప మిగతా వారంతా ముక్తకంఠంతో "తగిలి జరయు రుజయు దైవనశంబున నయ్యెనేని వాని ననుభవింత్రు గాక, యెరిగి యెరిగి, కడగి యా రెంటి జేకొందురయ్య ఎట్టి కుమతులైన"- ముసలితనము, రోగము విధివశాన ఎవరికైన కలిగితే వారు వాటిని అనుభవిస్తారు కాని, తెలిసి తెలిసి మరొకరి నుండి కావాలని ఆ రెండింటిని ఎంత బుద్ధిహీనులైనా గ్రహిస్తారా?

"నరలు గల కామునైనను తరుణులు రోయుదురు డాయ ధనసతి యుయ్యుం బురుషుడు దుర్వార జరాపరిభూతి నభీష్టభోగబాహ్యుడ కాడే"
నెరసిన వెంట్రుకలు కలిగిన మన్మథుడినైనా యౌవన వతులు సమీపించటానికి అసహ్యించుకొంటారు. పురుషుడు ధనవంతుడైనా కూడా (కుచేలుడైనా) వారించ శక్యం కాని ముసలితనం కలిగే రోతచేత ఇష్టములైన భోగాలు పొంద వీలులేనివాడు కాడా? - అంటూ నలుగురు కొడుకులు తండ్రి మాటను తిరస్కరించారు. 

కోపం చెందిన యయాతి, యదువంశం వారిని (యాదవులను) రాజ్యానికి అయోగ్యులని శపించాడు. తుర్వసువంశం వారు కిరాతకులకు రాజులవుతారని, ద్రుహ్యవంశం వారిని జలప్రాయమైన అరణ్యదేశాలకు రాజులయ్యేట్లు, అనువంశం వారిని అల్పాయుష్కులుగా శపించాడు. 

చిన్నకుమారుడు పూరుడు మాత్రం, ప్రత్యక్షదైవాలుగా తల్లిదండ్రులను కీర్తిస్తూ తనువిచ్చిన తల్లిదండ్రులకు తనువిచ్చుకోవటం తనయుల సుకృతమని కొనియాడాడు. తన యౌవనాన్ని తండ్రికి దానం చేశాడు. వేయి సంవత్సరాలు అభిమతసుఖాలను అనుభవించి తృప్తుడై, పూరుని యౌవనాన్ని తిరిగి ఇచ్చి తన జరాభారాన్ని స్వీకరించి యయాతి పూరునకు పట్టాభిషేకం చేసి, వంశకర్తగా నిలిపాడు. పూరుని ధర్మం త్యాగం. త్యాగమే యయాతి గార్హస్థ్యధర్మానికి అమృతత్వసిద్ధిని ఇచ్చింది. 

తండ్రి ఆస్తికి వారసుడు అగ్రజుడు కాడు, తల్లిదండ్రుల మాట గౌరవించినవాడు అని యయాతి ప్రజలకు ధర్మం వివరిస్తాడు. పెద్ద కుమారుడైన యాదవుని కాదని చిన్నకుమారుడైన పూరునకు రాజ్యమిచ్చినందుకు ప్రశ్నించిన ప్రజలకు రాజు జవాబు, 
"తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెదలో జేకొనడేని వాడు తనయుం డనబడునే?  పితృధనమున కర్హుండగునే ?"
కొడుకు తల్లిదండ్రులాజ్ఞాపించిన పని చేయకపోతే, వారిమాట పట్టించుకోకపోతే (జవదాటితే) అట్టివాడు కొడుకు అనబడతాడా? తండ్రి ఆస్తికి యోగ్యుడు అవుతాడా? కాదు. 
ఈ కథాభాగం ఆదిపర్వంలో నన్నయ కృతం. విలక్షణమైన కథ.  

                                              *****

                         

Sunday, October 21, 2012

పక్షీంద్రుడు గరుత్మంతుడు (Paksheendrudu Garuthmanthudu)

అనూరుడు, వినతా సుతుడు, అగ్రజుడు. తొడలు లేనివాడుగా జన్మించాడు. తాను వికలాంగుడగుటకు తల్లియే కారణమని నిందించి, సవతి కద్రువకు దాసివి కమ్మని శాపమిచ్చాడు. రెండవ గుడ్డు నుండి దాస్యవిముక్తి కావించే కుమారుడు జన్మిస్తాడని, 500 ఏండ్లు కళు్ల కాయలు కాచేటట్లు ఎదురుచూచింది వినత.  

రెండవ కుమారుడు గరుత్మంతుడు తల్లి దాస్యవిముక్తికై కద్రువ కుమారులు కోరిన అమృతాన్ని తెచ్చేందుకు స్వర్గంలో ఇంద్రాది దేవతలను ఎదిరించదలచాడు. 
దేవగణాల ఆయుధ సంపత్తి అపారము, సైన్యము విస్తారము. తన ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు, భగవద్ధత్తములు. అవే పక్ష తుండాగ్ర నఖములు (రెక్కలు, ముక్కుచివరలు, గోళ్లు).  గరుత్మంతుడు ఏకాకిగా ఇంద్రాది దేవతలతో పోరాడి ఎలా విజయం సాధించాడో చదవండి. 

ఎందరో రాక్షసులు వరగర్వితులై ఇంద్రునిపై దండెత్తినవారున్నారు. అధికసేనా బలంతో వారు ఇంద్రుని జయించి స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించారు. 
కాని ఒకే ఒక పక్షి - ఇంద్రసమానుడు స్వర్గంపై దండెత్తగా విన్నారా? మరి ఇతని సాహసం వెనుక దాగిన రహస్యమేమో చదివి తెలుసుకుందాం. 
ఈ సౌపర్ణ (గరుత్మంతుని) కథ ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వంలో నన్నయ చేత రచితమైనది. 

కశ్యప ప్రజాపతి భార్యలు కద్రూవినతలు. కద్రువ నాగమాత, వినత అనూరుడు, గరుత్మంతుల తల్లి. వీరు గర్భాండముల నుండి జన్మించినవారు. కద్రువ గర్భంలోని అండాలు ఒక దాని తర్వాత ఒకటిగా పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, మొదలైన వేయిమంది సర్పశ్రేష్ఠులు పుట్టారు.
వినత తన గర్భం నుండి పుట్టిన రెండు గుడ్లనుండి కుమారులు ఎంత కాలానికీ బయల్పడని కారణాన, కృంగినదై ఒక గుడ్డును బద్దలయ్యేట్లు చేసింది. 
ఆ గుడ్డు నుండి కింది సగదేహం లేని వాడున్నూ, మీది సగదేహంతో కూడినవాడైన అరుణుడనే కుమారుడు గొప్ప నీతిమంతుడు తల్లికి అప్రియంగా పుట్టాడు. 
తాను వికలాంగుడగుటకు తల్లి కారణమని నిందించి, అనూరుడు తల్లికి శాపమిచ్చాడు. 500 సంవత్సరాలు తన సవతికి దాసిగా ఉండుమని. రెండవ గుడ్డు నుండి పుట్టబోయే కుమారుడు గొప్ప బలపరాక్రమములు గలవాడని, తన దాసత్వాన్ని పోగొడతాడని తెలిపి, అనూరుడు సూర్యుడి రథసారథిగా వెళ్లాడు.
కద్రూవినతలు సముద్రతీరాన ఒకనాడు ఇంద్రుని అశ్వాన్ని చూచారు.
గుఱ్ఱాన్ని చూచిన కద్రువ వినతతో మిక్కిలి తెల్లదైన ఆ గుఱ్ఱంలో, నిండుచంద్రుడిలోని మచ్చవలె తోకభాగం నల్లగా ఉన్నది అనగా, వినత నవ్వి, మహాత్ముని కీర్తివలె మిక్కిలి తెల్లనిదైన ఈ గుఱ్ఱానికి మచ్చ ఎక్కడిదని ప్రశ్నించింది. 
గుఱ్ఱం తెల్లని దేహంలో మచ్చ ఉంటే నీవు నాకు దాసివి, లేకుంటే నేను నీకు దాసినౌతానని పందెం కాసి రేపు చూద్దామని గృహాలకు కద్రూవినతలు వెళ్లారు.
ఇంటికి వెళ్లిన నాగమాత తన పుత్రులకు ఈవిషయం తెల్పి, పుత్రులకు తన ఆజ్ఞగా ఆ తోకను నలుపు చేసే విధంగా వేలాడమని చెప్పింది. నాగులు ఇది అధర్మమని తల్లిమాట తిరస్కరించగా, జనమేజయ సర్పయాగంలో పాములు మరణం పొందుతాయని శాపమిచ్చింది. 
శాపభయానికి వెరచి, కర్కోటకుడు తల్లి ఆజ్ఞ పాటించి, గుఱ్ఱం తోకకు వేలాడగా పందెం నియమం ప్రకారం వినత ఓడి, కద్రువకు దాసిగా 500 ఏండ్ల పాటు ఆమె చెప్పిన పనులు చేస్తుండగా-
రెండవ గుడ్డు పగిలి విశాలమైన రెక్కల గాలుల వేగానికి కులపర్వతాలు, సముద్రాలు సంక్షోభించగా, సూర్యకాంతినే తిరస్కరించే తేజస్వియైన కుమారుడు పుట్టి తల్లికి ప్రియం చేస్తూ ఆకాశానికి ఎగిరాడు. ఆతడే పక్షీంద్రుడు గరుత్మంతుడు.

విస్తుపోయిన దేవతల సమూహం ఆ కాంతి, ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల సముదాయమేమోనని అగ్నిసూక్తాలతో స్తుతించింది. వజ్రాయుధం దెబ్బ నెరుగని పెద్ద రెక్కలతో కూడిన కులపర్వతం వలె గరుడుడు తల్లి వినతకు నమస్కరించాడు. సవతి తల్లియైన కద్రువ ఆజ్ఞననుసరించి, దాస్యానికి లోబడి పాములను వీపున మోస్తూ సేవ జేస్తున్నాడు.

తల్లి ద్వారా జరిగిన మోసాన్ని, అన్న (అనూరుడు) శాపకారణాన్ని గ్రహించినవాడై తల్లి దాసత్వాన్ని పోగొట్టేందుకు ఏమిచెయ్యాలని పాములను కోరగా, వారు స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి దాసత్వాన్ని పోగొట్టుకొనేట్లు వివరించగా, గరుడుడు  అమృతం తెచ్చేందుకు స్వర్గానికి పయనమయ్యాడు ఏకాకిగా, తల్లి ఆశీర్వాదబలంతో. 
పక్షీంద్రుడైన గరుడునితో ఇంద్రాదిదేవతల యుద్ధం గురించి విలక్షణమైన రచన నన్నయది. గరుడుని ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు. అవి పక్షతుండాగ్రనఖములు (రెక్కలు, ముక్కు చివరలు, గోళ్లు), భగవద్దత్తములు. వాటి బలం గరుడుని మాటలలోనే తెలుసుకుందాం. 

"ఆయతపక్షతుండ హతి అక్కులశైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును, ప్రసిద్ధియునుం గల నాకు" - కులశైలములన్నింటిని నా విశాలమైన రెక్కలతో, వాడియైన ముక్కు తోటి దెబ్బలతో, పొడిగా చేసే గొప్పబలమున్నూ ప్రసిద్ధియున్నూ నాకు గలదు. 

"స్థావరజంగమ ప్రవితతంబగు భూవలయంబు నెల్ల నా లావున బూని దాల్తు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్షసమీరణంబునన్ దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు త్రివిష్టపంబులన్". 

"దేవగణాధిపా, ఇంద్రా! చరాలు, ఆచరాలయిన పదార్థాలతో నిండినట్టి భూమండలాన్నంతటినీ నా బలంతో వంచి మోస్తాను. పెద్దవయిన నారెక్కల గాలితో, దాటశక్యం గాని సముద్రజలాన్నంతటినీ రత్నాల సమూహంతో పాటుగా వెదజల్లుతాను. మూడు లోకాలను క్షణంలో చుట్టివస్తాను."

ఇక దేవతల విషయానికి వస్తే, ఇంద్రుని సైన్యం...సిద్ద సాధ్య, సుర, యక్ష, కిన్నర, కింపురుషాదులు, అష్టదిక్పాలకులు, వసువులు, రుద్రులు మొదలైన దేవతాగణాలు.
వారి ఆయుధ సంపత్తి - పరశు (గొడ్డలి), కులిశ (వజ్రం), కుంత (బల్లెం), ప్రాస (ఈటెలు), బాణములు, ఉద్యత్పరిఘ (పైకెత్తబడిన గుదియ), చక్రాలు మొదలైన ఆయుధసమూహం, మరియు ఇంద్రుని వజ్రాయుధం. 
ఇంద్రాది దేవతలతో గరుత్మంతునకు జరిగే యుద్ధాన్ని వీక్షిస్తాం-

"పక్షతుండాగ్ర నఖక్షతదేహులై బోరన నవరక్తధార లొలుక 
విహగేంద్రునకు నోడి విహతులై సురవరుల్ సురరాజు మఱువు జొచ్చిరి కలంగి 
సాధ్యులనాయాససాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడిగి,
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల క్రియ దక్షిణాశ్రితులయిరి భీతి వంది
యపరదిక్కు బొందిరాదిత్యులు, అశ్విను లుత్తరమున కొనర బఱచి;
రనల వరుణ పవనధనదయమాసురుల్ వీకు దఱిగి కాందిశీకులైరి". 

గరుడుని రెక్కలచే, ముక్కు కొనచే, గోళ్లచే దెబ్బతిన్న శరీరం గలవారై, భోరుమని నెత్తుటి ధారలు కారుతుండగా గరుత్మంతుడి చేత విజితులై, హింసితులై, దేవశ్రేష్ఠులు ఇంద్రుడి చాటుకు చేరారు. సాధ్యులనే దేవతాగణం శ్రమ లేకుండా విజితులై గర్వం విడిచి తూర్పుదిక్కుకు పారిపోయారు. వసువులు, రుద్రులు, సంపదలేని బ్రాహ్మణుల వలె దక్షిణ దిక్కును ఆశ్రయించారు. (సంభావన, దక్షిణ). పండ్రెండుగురు సూర్యులు కలత చెంది పడమటి దిక్కును పొందారు. అశ్వినీదేవతలు ఉత్తరదిక్కుకు పారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయవు, కుబేరుడు, యముడు, అసురుడైన నైఋతి అనే దిక్పాలురు దిక్కు తెలియక చెల్లాచెదరై పారిపోయారు. దిక్కులు గల దిక్పాలకులు ఏ దిక్కులూ లేనివారు కాగా (కాందిశీకులు), ఏ దిక్కులేనివారు దిక్కులను ఆశ్రయించారు. 
ఎంత కమ్మటి రమణీయ అద్భుతభావన! అందుకే నన్నయగారు ఋషితుల్యులు, చదువరులు సుహృజ్జనులు. 

దిక్కులను చెప్పునప్పుడు ఒక క్రమం పాటించుట కవులకు పరిపాటి (ఆ పటీరాచల పశ్చిమాచల, హిమాచల పూర్వదిశాచలంబులన్) (మనుచరిత్ర). నన్నయగారు కావాలనే యిచట క్రమమును పాటించలేదు.  కారణం వారు చెల్లాచెదరైరని సూచించుటకు. అనల వరుణ పవన ధనద యమాసురుల్ అని సర్వలఘువులుగా ఆ దిక్పాలకులను చెప్పటం అల్పత్వమును సూచించుటయే.

సర్వదేవతాగణాలిలాగ పరాజితులు కాగా ఇంద్రుడు, దేవగురువు బృహస్పతి వారించినా వినక వజ్రాయుధాన్ని గరుత్మంతునిపై విసరగా, సుపర్ణుడు "మదీ యైకపర్ణ శకలచ్చేదము గావింపుమని (నాదైన ఒక్క ఈకముక్కను మాత్రము త్రుంచివేయుమని), నాపై నీ శక్తి ఇంత మాత్రమేనని, నీవు గొప్ప ముని (దధీచి) సంభవవు. నిన్నవమానించను" అని పలుకగా, సర్వభూత సమూహం అతని రెక్కల దృఢత్వానికి మెచ్చుకొని సుపర్ణుడని స్తుతించారు. 

ఆ విధంగా ఇంద్రాదిదేవతలను జయించి అమృతభాండాన్ని గ్రహించి, అమృతాన్ని రుచి చూడకుండా, అనాసక్తుడైన గరుత్మంతుని పరాక్రమానికి ముగ్ధుడై, విష్ణువు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. 

అప్పుడు విష్ణువునకు నమస్కరించి "అమృతం ఆస్వాదించకుండానే ముసలితనం చావు లేకుండటాన్నీ, అన్ని లోకాలకు అధిపతివైన నీ యెదుటను మిక్కిలి భక్తితో నిన్ను సేవించటాన్నీ కోరుతాను. దయతో ఇమ్ము" అని గరుత్మంతుడు కోరగా, సంతోషించినవాడై అతని కోర్కెలను మన్నించి, నీవు నాకు వాహనంగా గొప్ప జెండాగా ఉండుమని దీవించాడు. 

అమృతంతో వెళ్తున్న గరుడుని దేవేంద్రుడు ప్రస్తుతిస్తూ..
అమరుడవు - మరణం లేనివాడవు.
అజరుడవు - ముసలితనం లేనివాడవు.
అజితుడవు - పరాజయం లేనివాడవు. 
అమేయుడవు - కొలది (పరిమాణం) లేనివాడవు.
నీకు అమృతం ఎందుకు అని ప్రశ్నించగా, నా తల్లి వినతా దాస్యం తొలగించే నిమిత్తం కద్రువ కుమారులైన పాములు కోరిన అమృతం కొనిపోయి, వాళ్లకు ఇచ్చిన పిమ్మట వారలు ఈ అమృతం తాగకముందే నీవు తస్కరించుమన్న గరుడుని పలుకులకు సంతసించి నాతో నెప్పుడు బద్ధస్నేహం కలవాడవు కమ్మనగా, గరుడుడు అందుకు సమ్మతించి, అందుకు ప్రతిగా నా తల్లి అయిన వినతకు అపకారం చేసిన కొడుకులు తనకు ఆహారం కావాలని కోరగా, ఇంద్రుడు అంగీకరించాడు.

సురాసురులు సముద్రమథనం చేసి సాధించిన అమృతాన్ని పురుషయత్నంతో గరుడుడు సాధించాడు. అమృతాన్ని పంచిన విష్ణువునకు వాహనమైనాడు. అమృతం తాగకుండానే దాని మహిమలను అలౌల్య (అనాసక్తయోగ)మనే గుణంతో సాధించిన మహితాత్ముడు. అమృతత్వమంటే అనాసక్తియోగం, స్వేచ్ఛ (జీవన్ముక్తి) అని గరుడుడు ఈ కథ ద్వారా లోకానికి చాటుతున్నాడు.

ఫలశ్రుతి :- "ఈ సౌపర్ణాఖ్యానము భాసురముగ వినిన పుణ్యవరులకు నధికశ్రీసంపదలగు, దురిత నిరాసంబగు, బాయు నురగరక్షోభయముల్". 

గరుత్మంతుడికి సంబంధించిన ఈ కథను ఒప్పుగా వినిన పుణ్యాత్ములకు అధికమైన సిరిసంపదలు కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాముల నుండి, రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి. ఫలశ్రుతి అటుంచి, ఈ కథలోకానికి అందించే మహత్తరసందేశం ఏమిటో నన్నయ గారి వాక్కుల్లో విందాము. అదే సుపర్ణుని తల్లి మాటల్లో...

"కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల యిడుముల వాయుట యెందునుం గలయది గాబట్టి నీ యట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?"

కుమారులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగటం ఎచ్చటైనా ఉన్నదే (సహజమే) కావున నీవంటి యోగ్యుడైన కుమారుడిని పొంది నేను ఇంకా దాసినై ఉంటానా?
500 సంవత్సరాలు సవతికి దాసత్వం నెఱపిన వినత, రెండవ గుడ్డు పగిలేంతవరకు ఎప్పుడు తన కష్టాలు తీర్చే కుమారుడు (గరుత్మంతుడు) పుడతాడా యని ఎదురుచూసింది. మాట నిలుపుకున్న కుమారుడు ఎంత ధన్యుడో! ధన్యజీవి వినత! 

                                        ******

Monday, October 8, 2012

తన పేరున్న కన్యతో పెండ్లి! (Thana Perunna Kanyatho Pendli)

తన పేరున్న అమ్మాయినే జరత్కారు మహర్షి ఎందుకు వివాహమాడ దలచాడు? అన్న ప్రశ్నకు పండితులే సమాధానం చెప్పాలి. తపస్సే ధ్యేయంగా శరీరాన్ని కృశింపజేసి, సంసార పునర్భవ భీతి చేత కఠోర బ్రహ్మచర్య వ్రతావలంబి జరత్కారువు. పితృపితామహుల కోరికపై సనామధేయ యగు నాగకన్యను వివాహమాడి, నియమం పాటించని భార్యను వదిలి తపశ్చర్యకే పునరంకితమైన మహా మనీషి. 
కారణజన్ముడైన ఆస్తీక మహర్షి (జరత్కారు తనయుడు) సర్పసంహార యాగాన్ని తల్లి, మేనమామల కోరికపై నిలుపగలిగాడు. 
లోకానికి ఈ కథ అందించే మహత్తర సందేశం: 
"పుత్రవంతులగు వారు పొందునట్టి లోకములను గొప్పతపస్సు, గొప్ప యాగములు చేసియు, పుత్రులు లేనివారు పొందజాలరు. (అపుత్రస్య గతిర్నాస్తి)"

ఇలాంటి కథ ఎప్పుడైనా, ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? 
ఆంధ్రమహాభారత, ఆదిపర్వంలో సర్పసంహారయాగ సందర్భంగా ఇందుకు సంబంధించిన కథ మనకు కనబడుతుంది. వివరాలలోకి వెళితే..
జరత్కారుడనే ముని సంసారపునర్భవభీతి చేత (సంసారము నందు మళ్లీ జన్మ కలుగుతాదనే భయం వలన) తపస్సు, వేదాధ్యయనము, బ్రహ్మచర్యవ్రత దీక్షలతో శరీరాన్ని కృశింపచేసిన మహనీయుడు. ఒకనాడు అడవిలో ఒక నీటి పడియను చూచి, అందు ఎలుకలచే కొరకబడి ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉన్న అవురుగడ్డి దుబ్బును పట్టుకొని తలక్రిందులుగా సూర్యుని కిరణాలే ఆహారంగా వ్రేలాడుతున్న కొందరు ఋషులను చూచి, "ఇది తపోవిశేషమా? నాకు వివరించండి" అని ప్రశ్నించాడు. 

అప్పుడా ఋషులు, "అదృష్టహీనులమైన మా వంశంలో జరత్కారుడనే పాపాత్ముడు పుట్టి, పెండ్లి చేసుకొనటానికి, సంతానం పొందటానికి అంగీకరించకున్నాడు.  మేమాతని తండ్రితాతలం. మేము పట్టుకు వేలాడుతున్న అవురుగడ్డి దుబ్బు వ్రేళ్లనన్నింటిని యముడు ఎలుకల మిషతో కొరికేస్తే ఒక్కవేరు మాత్రం మిగిలి ఉన్నది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాలలో పడతాం. అతడు సంతానం పొందితే పైలోకాలకు వెళతాం. నీవు ఎవరో మాకు బంధువువలె ప్రీతితో ఏకాగ్రచిత్తుడవై మా మాటలు విని మన్నించావు. ఆ జరత్కారుడిని ఎరుగుదువేని మేం పొందే ఈ దురవస్థ వానికి తెలియజెప్పుము" అన్నారు. 

పితృదేవతలిట్లు పలుకగా జరత్కారుడు మిక్కిలి దయతో కూడిన హృదయం గలవాడై, "నేనే ఆ జరత్కారుడను, మీ కుమారుడను, నేను తప్పక మీరు కోరినట్లుగా వివాహం చేసుకుంటా" నని మాట ఇచ్చాడు. ఆ మహామునులు సంతోషించి జరత్కారునితో - 
"తగియెడు బుత్రులం బడసి ధర్మము తప్పక తమ్మునుత్తముల్ 
పొగడగ, మన్మహామతులు పొందు గతుల్ గడు ఘోరనిష్ఠతో
దగిలి తపంబు సేసియును దక్షిణలిమ్ముగ నిచ్చి యజ్ఞముల్ 
నెగడగ జేసియుం, బడయనేర రపుత్త్రకులైన దుర్మతుల్" అన్నారు. 

యోగ్యులైన కొడుకులను పొంది, ధర్మమార్గం తొలగకుండ తమ్ము, సజ్జనులు పొగడేటట్లుగా జీవించి, గొప్ప బుద్ధిమంతులు పొందే ఉత్తమలోకాలను, మిక్కిలి కఠినమైన నిష్ఠతో విడువక తపస్సు చేసినప్పటికీ, ఒప్పుగా దక్షిణలిచ్చి యజ్ఞాలు అధికంగా చేసినప్పటికీ పుత్రహీనులైన దుర్జనులు (అట్టిగతులు) పొందజాలరు". 

జరత్కారుడు పితృదేవతలకు, తాను తనతో సమానమైన పేరు గల కన్యను పెండ్లాడవలెనను తలంపుతో నున్నాడనని చెప్పి, వారి వద్ద సెలవు తీసుకొని అట్టి కన్యను భూవలయమంతా తిరిగి వెదికినా లభించలేదు, కాని ముసలితనం మాత్రం సంప్రాప్తించింది. 

సర్పరాజైన వాసుకి తన సేవకుల వలన విషయాన్ని తెలుసుకుని, తన తోబుట్టువయిన (నాగకన్య), జరత్కారువును వెంటతీసుకొని జరత్కారుని చెంతకు వెళ్లి, "లోకపూజ్యుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం పుణ్యవంతమయింది. మా వంశం ధన్యమయింది. నీకూ, మా చెల్లెలికిని ఉండే ఒండొరులకు తగిన గుణాల చేత, పేర్ల చేత హృదయంలో ఆనందం కలిగింది. నా చెల్లెలైన ఈ జరత్కారువును వివాహార్థమై కన్యారూపమైన భిక్షగా ప్రీతితో గ్రహించండి" అని పలుకగా, జరత్కారు మహాముని ఆ కన్యను పెండ్లాడి మొదటి సమాగమము నాడే భార్యకు, "నాకు నీవు ఎప్పుడు అగౌరవం తలపోస్తావో ఆ రోజుననే నిన్ను విడిచిపోతాను" అని నియమం చేసాడు. 

ఆనాటి నుండి "వాలుపయి నడచునట్లబ్బాలిక నడునడ నడుంగి భయమున నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును నేమఱక  పరిచరించుచునుండెన్".  

కన్య అయిన ఆ జరత్కారువు కత్తిపై నడుస్తున్నట్లు వడవడ వణికి భయంతో నియమం చేత భయంకరుడైన భర్తకు పగళ్లు రాత్రులు పొరపాటు పడకుండ శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేది. 
"అనవరతభక్తి బాయక తన పతికిం బ్రియము సేసి తద్దయు గర్భం బనురక్తి దాల్చి, యొప్పెను, దినకరగర్భయగు పూర్వదిక్సతి వోలెన్". 
ఎడతెగని భక్తితో విడువక తన భర్తకు మిక్కిలి ప్రీతి ఒనరించి, అనురాగంతో గర్భం ధరించి, సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంతవలె ప్రకాశించింది. 

ఒకనాడు జరత్కారుముని, తన భార్య తొడనే తలగడగా కృష్ణమృగచర్మపు పక్కపై నిద్రిస్తున్న సమయంలో సూర్యుడు అస్తమించుటకు సిద్ధంగా ఉండగా, ఆశ్రమంలో నివసించే ఋషులు సంధ్యాకాలంలో చేయదగిన సంధ్యావందనాదికర్మలు చేయటానికి పూనగా చూచి సంధ్యాకాలంలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగమవుతుందని, ఒకవేళ మేల్కొల్పినందుకు కోపిస్తే కోపాన్ని భరించవచ్చునని తలచి భర్తను నిద్ర నుండి లేపింది. కోపించిన భర్తకు కారణం తెలుపగా,

"నా మేల్కను నంతకు నుండక యిను డొనరగ నస్తాద్రి కేగ నోడడె చెప్పుమా". నేను మేల్కొనేంతవరకు అస్తమించకుండ ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్లటానికి భయపడడా అంటూ భార్యను మందలించాడు. తన శపథాన్ని భార్యకు గుర్తు చేస్తూ, గర్భాన ఉన్న కుమారుడు సూర్యాగ్ని తేజస్వి అని, ఇరువురి కులాల దుఃఖ నివారకుడని ఓదారుస్తూ తన అన్న చెంతకు వెళ్లుమని జరత్కారముని తపస్సు నిమిత్తం అడవికి వెళ్ళాడు.
కొంత కాలానికి:
ఆపూర్ణతేజుడు - అంతటను నిండిన తేజస్సు గలవాడు. 
అపగతపాపుడు - పాపం లేనివాడు
అపాకృతభవానుబంధుడు - తిరస్కరింపబడిన సంసార బంధం గలవాడు. 

నిజ మాతృ, పితృ పక్ష ప్రబల భయాపహుడు - తల్లిదండ్రుల ఉభయపక్షాలకు చెందినవారి అధికమైన భయాన్ని పోగొట్టేవాడున్ను అయిన ఆస్తీకుడు కాంతితో పుట్టి పెరిగాడు. ఆయన చ్యవనకుమారుడైన ప్రమతి వద్ద వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను అధ్యయనం చేసాడు.

కారణజన్ముడైన ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని నివారించగలడని తెలిసి వాసుకి, చెల్లెలి వివాహం జరత్కారువుతో జరిపించాడు.
సర్పసంహార యాగాన్ని చేయ సంకల్పించిన రాజు జనమేజయుడు. దానికి కారణం - తన తండ్రియైన పరీక్షిత్తును తక్షకుడు కాటు వేసి సంహరించడమే.
ఉదంకమహర్షి, గురుపత్ని నియోగుడై, పౌష్యకమహారాజు భార్య కుండలములను తీసుకువస్తుండగా వానిని తక్షకుడు మార్గమధ్యంలో హరిస్తాడు. తన తపోబలం చేత ఉదంకుడు నాగలోకం ప్రవేశించి, నాగులను ప్రసన్నం చేసుకుని, పాతాళలోకంలో బడబాగ్ని ప్రజ్జ్వలింపచేసి తక్షకుని చేత కుండలాలను తిరిగి పొంది, వాటిని గురుదక్షిణగా గురుపత్నికి అందజేస్తాడు.

తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారంగా, తండ్రియైన పరీక్షిత్తు మరణానికి కారకుడైన తక్షకసంహారనిమిత్తం సర్పయాగము చెయ్యమని జనమేజయ మహారాజును ప్రేరేపిస్తాడు.

అందుకు జనమేజయుడు విప్రులను సంప్రదించగా పురాణజ్ఞుడైన ఒక బ్రాహ్మణుడు, రాజా నీవు చేయబోయే ఈ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా  చేసే క్రియాకలాపం చేత సమగ్రమైనప్పటికి చివరి దాకా సాగదని, ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అని భావిని గురించి తెలిపాడు.
అయినప్పటికీ అతని మాట పెడిచెవిన బెట్టి జనమేజయుడు సర్పయాగం చేయడం మొదలెట్టాడు.

బ్రాహ్మణుల మంత్రాల, అగ్నిలో వ్రేల్చే పదార్థాల ప్రభావం చేత వశం తప్పినవారై గొప్ప సర్పములు పెక్కు తలలు గలవి, కోరల్లో విషరూపమైన అగ్నిగలవి, అధికమైన వేగంతో అగ్నిలో పడి భస్మమవజొచ్చాయి.

"తడబడబడియెడు రవమును, బడి కాలెడు రవము, గాలి పలుదెరగుల ప్రస్సెడురవమును, దిగ్వలయము గడుకొని మ్రోయించే నురగకాయోత్థితమై".  

తొట్రుపాటు పడుతూ, అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్ను పడి కాలే ధ్వనియున్నూ, కాలి పెక్కువిధాల బ్రద్దలయ్యేప్పుడు కలిగే ధ్వనియున్ను, పాముల దేహాల నుండి బయల్వెడినవై దిక్చక్రాన్ని అతిశయంగా మ్రోగేటట్లు చేశాయి. 

ఆ సమయంలో వాసుకి, చెల్లెలి వద్దకు వెళ్లి మేనల్లుడైన ఆస్తీకున్ని జనమేజయమహారాజు వద్దకు వెళ్లి సర్పయాగం మాన్పించి పాములను రక్షించేలా చేయమని కోరగా తల్లి కుమారుని పిలిచి నీ మేనమామ వాసుకి చెప్పిన పని నిర్వర్తించుమని ఆజ్ఞాపించింది. 

ఆస్తీకుడు వేదవేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణశ్రేష్ఠులతో జనమేజయుడు సర్పయాగం చేసే యాగశాలకు వచ్చి "స్వదేహకాంతి సభాంతరంబెల్ల బర్వ" తన మేనికాంతిచే సభామధ్యమంతా ప్రకాశిస్తుండగా (మహాతేజస్సంపన్నుడైన మహర్షి) మంగళవాక్య పూర్వకంబుగా జనమేజయుడిని ఈ విధంగా కీర్తించాడు. 

చంద్రవంశానికి అలంకారపురుషుడవై, రాజర్షివై ధర్మంతో కూడిన ప్రవర్తనతో భూమిని పాలిస్తూ ప్రసిద్ధులైన సూర్యచంద్రవంశ పూర్వరాజుల నడవడిలో ఉత్తముడవు నీవు. 
ఇంతవరకు దేవతలు, భూపతులు చేయని ఆది యజ్ఞమైన ఈ సర్పయజ్ఞం ధర్మరాజు రాజసూయం, బ్రహ్మ చేసిన ప్రయాగ యజ్ఞం, వరుణ, కృష్ణుల యజ్ఞాల కంటే ఎంతో గొప్పది సుమా!

ఈ యజ్ఞ ఋత్విక్కులు బుద్ధిసంపన్నులు, తపస్సే ధనంగా కలవారు, బ్రహ్మతో సమానులు, ఇంద్రుడి యగ్నంలోని ఉత్తమ ఋత్విజుల కంటె ప్రసిద్ధులు. 
విద్వాంసులలో శ్రేష్ఠుడు, మూర్తీభవించిన ధర్మమూర్తి, ముల్లోకాలలో ప్రసిద్ధ తేజస్వి, సుజనుడైన వ్యాసమహర్షి స్వయంగా కుమారుడితోను, శిష్యులతోను, ఋత్విజుల సముదాయంతోను యజ్ఞంలో పాల్గొన్నాడంటే, రాజులలో నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే.

అగ్నిహోత్రుడే స్వయంగా సాక్షాత్కరించి తన చేతులతో బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబడిన అన్నాదిహవ్యాలను గ్రహించి పుణ్యఫలితాలను నీకు ప్రసాదిస్తున్నాడు. ధన్యుడవు రాజా!" అని ఈ విధంగా ఆస్తీకుడు జనమేజయ మహారాజును, అతని యజ్ఞ మహత్యాన్ని, యజ్ఞం చేయించే ఋత్విక్కులను, యజ్ఞానికి వచ్చిన సదస్యులను, పూజ్యుడైన అగ్నిని మంగళవాక్కులతో మాటలో కరకుతనం లేకుండా, గట్టిదనం స్ఫురించకుండా, మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్లు నివేదించుకొన్నాడు. 

అంతట మహారాజు ఆస్తీకుని చూచి, "మునిశ్రేష్ఠా! నీకేది ప్రియమో దానిని నేనిస్తాను. అడుగుమనగా ఆస్తీకుడు, అభిమన్యు వంశోద్ధారకా! జనమేజయ మహారాజా! నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మాని, పాముల సమూహాన్ని కాపాడుమని కోరాడు. 
అప్పుడు యాగం వీక్షిస్తున్న సభ్యులందరూ ఏకకంఠంతో అర్హుడు, తపోధనుడైన ఉత్తమబ్రాహ్మణోత్తమునకు ప్రీతితో కోరినది ఇవ్వటం సముచితమని పలుకగా, అందరికి సమ్మతమయ్యేటట్లుగా జనమేజయుడు అతని కోరిక మన్నించి సర్పయాగం మానాడు!
ఈ కథలోని చిక్కు ప్రశ్న తన పేరున్న అమ్మాయినే జరత్కారుడు వివాహమాడడంలోని ఆంతర్యం పండితులే వివరించాలి. (సనామధేయయగు కన్యతో వివాహము). 


                                                            ******

మహాభారతం - ఫలశ్రుతి (Mahabharatham - Phalasruthi)

        "ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు, అర్థార్థులకు విపులార్ధములను 
         ధర్మార్థులకు నిత్య ధర్మసంప్రాప్తియు వినయార్థులకు మహావినయ మతియు 
         పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకిష్ట సంపదలను 
         గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమ్మహాభారతంబు"

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు, ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతత ధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్ర సంతానం కోరేవారికి పుత్ర సంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. 

ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం, వినయం ప్రాధాన్యం ఏమిటి? 

        "విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
         పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం" 

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాలనుంచారు మనవాళ్లు. అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్ధించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అన్నీ వ్యర్థాలే.


                                                                  ******

Sunday, September 23, 2012

ద్రుపద మహారాజు (Drupada Maharaju)

 ద్రుపద మహారాజు పాంచాల దేశాధీశుడు, అయోనిజుడు, భరద్వాజ మహర్షి కుమారుడైన ద్రోణుని బాల్యస్నేహితుడు. ఐశ్వర్య కారణదారుణ గర్వితుడై, నిండు సభలో భార్యా, శిష్యులముందు పేదరికాన్ని అపహసిస్తూ  స్నేహితున్ని అవమానించాడు. దానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. 

కాని ప్రతీకారం తీర్చుకోవలసిన సుక్షత్రియుడైన ద్రోణశిష్యుడైన అర్జునుని కాళ్లు కడిగి కన్యాదానం చేయాలని సంకల్పించడం ఆయన క్షాత్రధర్మానికి పరాకాష్ఠ. ఈ కథ శ్రోతలను ఎంతో ఉత్తేజపరుస్తుంది.

ద్రుపదునిపై ద్రోణుని ప్రతీకారం తెలుసుకున్నాం గదా. కథ అక్కడ నుండి మొదలైందని చదివాం, అది ఎలాగా? 

13 సంవత్సరాలు అస్త్రవిద్య నేర్చిన అర్జునుడు, గురువు ఆశీర్వాదబలంతో గురుదక్షిణగా ద్రుపదుణ్ణి రథాక్షముతో కట్టి, పేద బ్రాహ్మణుడైన ద్రోణుని కాళ్ల మీద పడవేయగా అపహాసం పాలైన ద్రుపద మహారాజు, తన జీవితాన్ని ఎలా గడిపాడు? యోచించారా ?

ఇంతటి అవమానానికి కారకుడు ద్రోణుడా? అర్జునుడా? మరి ప్రతీకారం ఎవరిపై ఎలా తీర్చుకొనాలి? ఆలోచించాడు ద్రుపదుడు. 

ఇరువురూ క్షమార్హులు కారని నిర్ణయించుకొన్నాడు. ద్రోణుడు బ్రాహ్మణుడు, అస్త్రవిద్యాగురుడు. అతనిపై రాజుగా తాను ఎలా దండెత్తగలడు? అందుచేత అతనిని సాధించగల ఒక కుమారుడు కావాలనీ, అర్జునుని వంటి సుక్షత్రియునికి, కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యాలనీ, నిర్ణయించాడు. కాని తన వద్ద అర్జునునకు ఇవ్వగల కన్యలేదే! తపస్సు చేస్తే తప్ప సాధించలేనని గ్రహించి, యుద్ధరంగంలో ద్రోణుడిని చంపగల పుత్రుని, అర్జునునకు భార్యకాగల పుత్రికను పొందాలని ద్రుపదుడు బ్రహ్మజ్ఞానసంపన్నులైన బ్రాహ్మణులున్న ప్రదేశాలకు వెళ్లి ప్రతిదినం బ్రాహ్మణసేవ చేయసాగాడు. 

తనను ఓడించి పట్టి తెచ్చిన అర్జునునిపై శాశ్వత క్రోధం పెట్టుకోకుండా అతని పరాక్రమాన్ని మనసారా మెచ్చుకున్న ద్రుపదుని సహృదయత, అంతటి వీరకిశోరుడిని తన అల్లుడుగా చేసుకొనాలన్న తలంపు ప్రశంసింపదగినదే, ఆశ్చర్యకరమైనదే. 

ద్రుపదుడు గంగాతీరంలో వానప్రస్థాశ్రమజీవితం గడుపుతున్న కాశ్యపగోత్ర యాజఉపయాజులనే సోదరులను జూచాడు. వాళ్లకు నమస్కరించి తన కోర్కెను వెల్లడించి, ఒక్క సంవత్సరకాలం సేవించాడు. ఫలాపేక్ష లేని తమ్ముడు అన్నవద్దకు వెళ్లమన్నాడు. 

యాజుడు (అన్న) వేదాధ్యయనం, మొదలైన పంచయజ్ఞాలు చేసేవాడు. పైరు కోసిన తర్వాత మళ్లలో జారిపడిన వెన్నులు, గింజలు మొదలైన వాటిని ఏరుకుని, జీవనోపాయం చేత, బిచ్చమెత్తి సంపాదించినదానిచేత, కుటుంబ భారాన్ని వహిస్తూ భయంకరమైన తపస్సు చేస్తున్నవాడు. ప్రసన్నుడై యజ్ఞం చేయించే యాజ్ఞికుడుగా ఉండటానికి అంగీకరించి, "నీ కోరికకు తగిన కొడుకు, కూతురు జన్మిస్తారు, భయపడవద్దు" అని యజ్ఞసాధనాలను, పదార్థాలను సిద్ధం చేసికొని, తమ్ముడు ఉపయాజుడు సహాయుడుగా, ద్రుపదుని భార్య కోకిలాదేవితో సహా ద్రుపదుని చేత శాస్త్రోక్తంగా యజ్ఞం చేయించాడు. మంత్రాలతో ఆహుతులుగా వ్రేల్చిన పదార్థాలతో తృప్తి పొందిన అగ్నిదేవుని వలన - 

"జ్వాలాభీలాంగుడు, కరవాలబృహచ్చాపధరుండు వరవర్మకిరీటాలంకారుడు, వహ్నియపోలె రాథారూఢు డొక్క పుత్రుడు పుట్టెన్" 

అగ్నిజ్వాల వలె భయంకరమైన శరీరం గలవాడు, ఖడ్గాన్నీ, పెద్ద ధనస్సును ధరించినవాడు, శ్రేష్ఠమైన కవచంతో, కిరీటంతో అలంకరింపబడినవాడు, రథాన్ని అధిరోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రుని వలె ఉదయించినాడు. ఇంకా, 

"కులపవిత్ర, సితేతరోత్పల కోమలామలవర్ణ, యుత్పలసుగంధి, లసన్మహోత్పల పత్రనేత్ర, యరాళకుంతల విభాసిని, దివ్యతేజము దాల్చి యొక్క కుమారి తజ్జ్వలనకుండము నందు బుట్టె ప్రసన్న మూర్తి ముదంబుతోన్".

వంశాన్ని పావనం జేసేది, నల్ల కలువ వంటి శరీర వర్ణం గలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించింది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య సంతోషంతో ఆ అగ్నిగుండంలో ఉదయించింది.

ఈ విధంగా పుట్టిన కుమారునికి, కూతురికి, ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అని పేర్లను ప్రజలందరికి తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది. ఆ విధంగా ద్రుపదుడు సంతానం పొంది, సంతోషించి, యాజుని సహస్రగోదానాలతో సత్కరించి, బ్రాహ్మణులను పూజించాడు. 

మరి ధృష్టద్యుమ్నునకు పగతుడైన ద్రుపదుని పుత్రుడని తెలిసి, అతడు తన్ను హతమార్చుటకే జన్మించెనని తెలిసి, ఆచార్యుడతనికి అస్త్రవిద్య నేర్పుట ఆశ్చర్యకరమైన విషయము. లోకమున ఒక్కొక్కరి స్వభావములో అంతుపట్టని ఆశ్చర్యకరములైన అంశములు ఒకటి రెండున్నట్లే ధృష్టద్యుమ్నునకు ధనుర్విద్య నేర్పుట కూడా. ఇది తన మృత్యువును తానే పోషించుట వంటిది. 

అయినను విధి అవిలంఘ్యమని, ఆత్మకీర్తియైన దక్కునని, ద్రోణాచార్యుడా పని చేసినట్లు సంస్కృతభారతమున చెప్పబడినది. ఎందుచేతనో ఈ విషయము నన్నయ తెలుగు భారతమున చెప్పలేదు. 

అందుకే భారతీయ సంప్రదాయాలలో జ్ఞానదాత గురువును - 
"గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అన్నారు.  


                                              *****