Sunday, October 21, 2012

పక్షీంద్రుడు గరుత్మంతుడు (Paksheendrudu Garuthmanthudu)

అనూరుడు, వినతా సుతుడు, అగ్రజుడు. తొడలు లేనివాడుగా జన్మించాడు. తాను వికలాంగుడగుటకు తల్లియే కారణమని నిందించి, సవతి కద్రువకు దాసివి కమ్మని శాపమిచ్చాడు. రెండవ గుడ్డు నుండి దాస్యవిముక్తి కావించే కుమారుడు జన్మిస్తాడని, 500 ఏండ్లు కళు్ల కాయలు కాచేటట్లు ఎదురుచూచింది వినత.  

రెండవ కుమారుడు గరుత్మంతుడు తల్లి దాస్యవిముక్తికై కద్రువ కుమారులు కోరిన అమృతాన్ని తెచ్చేందుకు స్వర్గంలో ఇంద్రాది దేవతలను ఎదిరించదలచాడు. 
దేవగణాల ఆయుధ సంపత్తి అపారము, సైన్యము విస్తారము. తన ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు, భగవద్ధత్తములు. అవే పక్ష తుండాగ్ర నఖములు (రెక్కలు, ముక్కుచివరలు, గోళ్లు).  గరుత్మంతుడు ఏకాకిగా ఇంద్రాది దేవతలతో పోరాడి ఎలా విజయం సాధించాడో చదవండి. 

ఎందరో రాక్షసులు వరగర్వితులై ఇంద్రునిపై దండెత్తినవారున్నారు. అధికసేనా బలంతో వారు ఇంద్రుని జయించి స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించారు. 
కాని ఒకే ఒక పక్షి - ఇంద్రసమానుడు స్వర్గంపై దండెత్తగా విన్నారా? మరి ఇతని సాహసం వెనుక దాగిన రహస్యమేమో చదివి తెలుసుకుందాం. 
ఈ సౌపర్ణ (గరుత్మంతుని) కథ ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వంలో నన్నయ చేత రచితమైనది. 

కశ్యప ప్రజాపతి భార్యలు కద్రూవినతలు. కద్రువ నాగమాత, వినత అనూరుడు, గరుత్మంతుల తల్లి. వీరు గర్భాండముల నుండి జన్మించినవారు. కద్రువ గర్భంలోని అండాలు ఒక దాని తర్వాత ఒకటిగా పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, మొదలైన వేయిమంది సర్పశ్రేష్ఠులు పుట్టారు.
వినత తన గర్భం నుండి పుట్టిన రెండు గుడ్లనుండి కుమారులు ఎంత కాలానికీ బయల్పడని కారణాన, కృంగినదై ఒక గుడ్డును బద్దలయ్యేట్లు చేసింది. 
ఆ గుడ్డు నుండి కింది సగదేహం లేని వాడున్నూ, మీది సగదేహంతో కూడినవాడైన అరుణుడనే కుమారుడు గొప్ప నీతిమంతుడు తల్లికి అప్రియంగా పుట్టాడు. 
తాను వికలాంగుడగుటకు తల్లి కారణమని నిందించి, అనూరుడు తల్లికి శాపమిచ్చాడు. 500 సంవత్సరాలు తన సవతికి దాసిగా ఉండుమని. రెండవ గుడ్డు నుండి పుట్టబోయే కుమారుడు గొప్ప బలపరాక్రమములు గలవాడని, తన దాసత్వాన్ని పోగొడతాడని తెలిపి, అనూరుడు సూర్యుడి రథసారథిగా వెళ్లాడు.
కద్రూవినతలు సముద్రతీరాన ఒకనాడు ఇంద్రుని అశ్వాన్ని చూచారు.
గుఱ్ఱాన్ని చూచిన కద్రువ వినతతో మిక్కిలి తెల్లదైన ఆ గుఱ్ఱంలో, నిండుచంద్రుడిలోని మచ్చవలె తోకభాగం నల్లగా ఉన్నది అనగా, వినత నవ్వి, మహాత్ముని కీర్తివలె మిక్కిలి తెల్లనిదైన ఈ గుఱ్ఱానికి మచ్చ ఎక్కడిదని ప్రశ్నించింది. 
గుఱ్ఱం తెల్లని దేహంలో మచ్చ ఉంటే నీవు నాకు దాసివి, లేకుంటే నేను నీకు దాసినౌతానని పందెం కాసి రేపు చూద్దామని గృహాలకు కద్రూవినతలు వెళ్లారు.
ఇంటికి వెళ్లిన నాగమాత తన పుత్రులకు ఈవిషయం తెల్పి, పుత్రులకు తన ఆజ్ఞగా ఆ తోకను నలుపు చేసే విధంగా వేలాడమని చెప్పింది. నాగులు ఇది అధర్మమని తల్లిమాట తిరస్కరించగా, జనమేజయ సర్పయాగంలో పాములు మరణం పొందుతాయని శాపమిచ్చింది. 
శాపభయానికి వెరచి, కర్కోటకుడు తల్లి ఆజ్ఞ పాటించి, గుఱ్ఱం తోకకు వేలాడగా పందెం నియమం ప్రకారం వినత ఓడి, కద్రువకు దాసిగా 500 ఏండ్ల పాటు ఆమె చెప్పిన పనులు చేస్తుండగా-
రెండవ గుడ్డు పగిలి విశాలమైన రెక్కల గాలుల వేగానికి కులపర్వతాలు, సముద్రాలు సంక్షోభించగా, సూర్యకాంతినే తిరస్కరించే తేజస్వియైన కుమారుడు పుట్టి తల్లికి ప్రియం చేస్తూ ఆకాశానికి ఎగిరాడు. ఆతడే పక్షీంద్రుడు గరుత్మంతుడు.

విస్తుపోయిన దేవతల సమూహం ఆ కాంతి, ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల సముదాయమేమోనని అగ్నిసూక్తాలతో స్తుతించింది. వజ్రాయుధం దెబ్బ నెరుగని పెద్ద రెక్కలతో కూడిన కులపర్వతం వలె గరుడుడు తల్లి వినతకు నమస్కరించాడు. సవతి తల్లియైన కద్రువ ఆజ్ఞననుసరించి, దాస్యానికి లోబడి పాములను వీపున మోస్తూ సేవ జేస్తున్నాడు.

తల్లి ద్వారా జరిగిన మోసాన్ని, అన్న (అనూరుడు) శాపకారణాన్ని గ్రహించినవాడై తల్లి దాసత్వాన్ని పోగొట్టేందుకు ఏమిచెయ్యాలని పాములను కోరగా, వారు స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి దాసత్వాన్ని పోగొట్టుకొనేట్లు వివరించగా, గరుడుడు  అమృతం తెచ్చేందుకు స్వర్గానికి పయనమయ్యాడు ఏకాకిగా, తల్లి ఆశీర్వాదబలంతో. 
పక్షీంద్రుడైన గరుడునితో ఇంద్రాదిదేవతల యుద్ధం గురించి విలక్షణమైన రచన నన్నయది. గరుడుని ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు. అవి పక్షతుండాగ్రనఖములు (రెక్కలు, ముక్కు చివరలు, గోళ్లు), భగవద్దత్తములు. వాటి బలం గరుడుని మాటలలోనే తెలుసుకుందాం. 

"ఆయతపక్షతుండ హతి అక్కులశైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును, ప్రసిద్ధియునుం గల నాకు" - కులశైలములన్నింటిని నా విశాలమైన రెక్కలతో, వాడియైన ముక్కు తోటి దెబ్బలతో, పొడిగా చేసే గొప్పబలమున్నూ ప్రసిద్ధియున్నూ నాకు గలదు. 

"స్థావరజంగమ ప్రవితతంబగు భూవలయంబు నెల్ల నా లావున బూని దాల్తు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్షసమీరణంబునన్ దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు త్రివిష్టపంబులన్". 

"దేవగణాధిపా, ఇంద్రా! చరాలు, ఆచరాలయిన పదార్థాలతో నిండినట్టి భూమండలాన్నంతటినీ నా బలంతో వంచి మోస్తాను. పెద్దవయిన నారెక్కల గాలితో, దాటశక్యం గాని సముద్రజలాన్నంతటినీ రత్నాల సమూహంతో పాటుగా వెదజల్లుతాను. మూడు లోకాలను క్షణంలో చుట్టివస్తాను."

ఇక దేవతల విషయానికి వస్తే, ఇంద్రుని సైన్యం...సిద్ద సాధ్య, సుర, యక్ష, కిన్నర, కింపురుషాదులు, అష్టదిక్పాలకులు, వసువులు, రుద్రులు మొదలైన దేవతాగణాలు.
వారి ఆయుధ సంపత్తి - పరశు (గొడ్డలి), కులిశ (వజ్రం), కుంత (బల్లెం), ప్రాస (ఈటెలు), బాణములు, ఉద్యత్పరిఘ (పైకెత్తబడిన గుదియ), చక్రాలు మొదలైన ఆయుధసమూహం, మరియు ఇంద్రుని వజ్రాయుధం. 
ఇంద్రాది దేవతలతో గరుత్మంతునకు జరిగే యుద్ధాన్ని వీక్షిస్తాం-

"పక్షతుండాగ్ర నఖక్షతదేహులై బోరన నవరక్తధార లొలుక 
విహగేంద్రునకు నోడి విహతులై సురవరుల్ సురరాజు మఱువు జొచ్చిరి కలంగి 
సాధ్యులనాయాససాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడిగి,
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల క్రియ దక్షిణాశ్రితులయిరి భీతి వంది
యపరదిక్కు బొందిరాదిత్యులు, అశ్విను లుత్తరమున కొనర బఱచి;
రనల వరుణ పవనధనదయమాసురుల్ వీకు దఱిగి కాందిశీకులైరి". 

గరుడుని రెక్కలచే, ముక్కు కొనచే, గోళ్లచే దెబ్బతిన్న శరీరం గలవారై, భోరుమని నెత్తుటి ధారలు కారుతుండగా గరుత్మంతుడి చేత విజితులై, హింసితులై, దేవశ్రేష్ఠులు ఇంద్రుడి చాటుకు చేరారు. సాధ్యులనే దేవతాగణం శ్రమ లేకుండా విజితులై గర్వం విడిచి తూర్పుదిక్కుకు పారిపోయారు. వసువులు, రుద్రులు, సంపదలేని బ్రాహ్మణుల వలె దక్షిణ దిక్కును ఆశ్రయించారు. (సంభావన, దక్షిణ). పండ్రెండుగురు సూర్యులు కలత చెంది పడమటి దిక్కును పొందారు. అశ్వినీదేవతలు ఉత్తరదిక్కుకు పారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయవు, కుబేరుడు, యముడు, అసురుడైన నైఋతి అనే దిక్పాలురు దిక్కు తెలియక చెల్లాచెదరై పారిపోయారు. దిక్కులు గల దిక్పాలకులు ఏ దిక్కులూ లేనివారు కాగా (కాందిశీకులు), ఏ దిక్కులేనివారు దిక్కులను ఆశ్రయించారు. 
ఎంత కమ్మటి రమణీయ అద్భుతభావన! అందుకే నన్నయగారు ఋషితుల్యులు, చదువరులు సుహృజ్జనులు. 

దిక్కులను చెప్పునప్పుడు ఒక క్రమం పాటించుట కవులకు పరిపాటి (ఆ పటీరాచల పశ్చిమాచల, హిమాచల పూర్వదిశాచలంబులన్) (మనుచరిత్ర). నన్నయగారు కావాలనే యిచట క్రమమును పాటించలేదు.  కారణం వారు చెల్లాచెదరైరని సూచించుటకు. అనల వరుణ పవన ధనద యమాసురుల్ అని సర్వలఘువులుగా ఆ దిక్పాలకులను చెప్పటం అల్పత్వమును సూచించుటయే.

సర్వదేవతాగణాలిలాగ పరాజితులు కాగా ఇంద్రుడు, దేవగురువు బృహస్పతి వారించినా వినక వజ్రాయుధాన్ని గరుత్మంతునిపై విసరగా, సుపర్ణుడు "మదీ యైకపర్ణ శకలచ్చేదము గావింపుమని (నాదైన ఒక్క ఈకముక్కను మాత్రము త్రుంచివేయుమని), నాపై నీ శక్తి ఇంత మాత్రమేనని, నీవు గొప్ప ముని (దధీచి) సంభవవు. నిన్నవమానించను" అని పలుకగా, సర్వభూత సమూహం అతని రెక్కల దృఢత్వానికి మెచ్చుకొని సుపర్ణుడని స్తుతించారు. 

ఆ విధంగా ఇంద్రాదిదేవతలను జయించి అమృతభాండాన్ని గ్రహించి, అమృతాన్ని రుచి చూడకుండా, అనాసక్తుడైన గరుత్మంతుని పరాక్రమానికి ముగ్ధుడై, విష్ణువు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. 

అప్పుడు విష్ణువునకు నమస్కరించి "అమృతం ఆస్వాదించకుండానే ముసలితనం చావు లేకుండటాన్నీ, అన్ని లోకాలకు అధిపతివైన నీ యెదుటను మిక్కిలి భక్తితో నిన్ను సేవించటాన్నీ కోరుతాను. దయతో ఇమ్ము" అని గరుత్మంతుడు కోరగా, సంతోషించినవాడై అతని కోర్కెలను మన్నించి, నీవు నాకు వాహనంగా గొప్ప జెండాగా ఉండుమని దీవించాడు. 

అమృతంతో వెళ్తున్న గరుడుని దేవేంద్రుడు ప్రస్తుతిస్తూ..
అమరుడవు - మరణం లేనివాడవు.
అజరుడవు - ముసలితనం లేనివాడవు.
అజితుడవు - పరాజయం లేనివాడవు. 
అమేయుడవు - కొలది (పరిమాణం) లేనివాడవు.
నీకు అమృతం ఎందుకు అని ప్రశ్నించగా, నా తల్లి వినతా దాస్యం తొలగించే నిమిత్తం కద్రువ కుమారులైన పాములు కోరిన అమృతం కొనిపోయి, వాళ్లకు ఇచ్చిన పిమ్మట వారలు ఈ అమృతం తాగకముందే నీవు తస్కరించుమన్న గరుడుని పలుకులకు సంతసించి నాతో నెప్పుడు బద్ధస్నేహం కలవాడవు కమ్మనగా, గరుడుడు అందుకు సమ్మతించి, అందుకు ప్రతిగా నా తల్లి అయిన వినతకు అపకారం చేసిన కొడుకులు తనకు ఆహారం కావాలని కోరగా, ఇంద్రుడు అంగీకరించాడు.

సురాసురులు సముద్రమథనం చేసి సాధించిన అమృతాన్ని పురుషయత్నంతో గరుడుడు సాధించాడు. అమృతాన్ని పంచిన విష్ణువునకు వాహనమైనాడు. అమృతం తాగకుండానే దాని మహిమలను అలౌల్య (అనాసక్తయోగ)మనే గుణంతో సాధించిన మహితాత్ముడు. అమృతత్వమంటే అనాసక్తియోగం, స్వేచ్ఛ (జీవన్ముక్తి) అని గరుడుడు ఈ కథ ద్వారా లోకానికి చాటుతున్నాడు.

ఫలశ్రుతి :- "ఈ సౌపర్ణాఖ్యానము భాసురముగ వినిన పుణ్యవరులకు నధికశ్రీసంపదలగు, దురిత నిరాసంబగు, బాయు నురగరక్షోభయముల్". 

గరుత్మంతుడికి సంబంధించిన ఈ కథను ఒప్పుగా వినిన పుణ్యాత్ములకు అధికమైన సిరిసంపదలు కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాముల నుండి, రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి. ఫలశ్రుతి అటుంచి, ఈ కథలోకానికి అందించే మహత్తరసందేశం ఏమిటో నన్నయ గారి వాక్కుల్లో విందాము. అదే సుపర్ణుని తల్లి మాటల్లో...

"కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల యిడుముల వాయుట యెందునుం గలయది గాబట్టి నీ యట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?"

కుమారులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగటం ఎచ్చటైనా ఉన్నదే (సహజమే) కావున నీవంటి యోగ్యుడైన కుమారుడిని పొంది నేను ఇంకా దాసినై ఉంటానా?
500 సంవత్సరాలు సవతికి దాసత్వం నెఱపిన వినత, రెండవ గుడ్డు పగిలేంతవరకు ఎప్పుడు తన కష్టాలు తీర్చే కుమారుడు (గరుత్మంతుడు) పుడతాడా యని ఎదురుచూసింది. మాట నిలుపుకున్న కుమారుడు ఎంత ధన్యుడో! ధన్యజీవి వినత! 

                                        ******

No comments:

Post a Comment