Sunday, November 18, 2012

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం (Kaalunitho Kalasi Nadichina Sathee Savitriki Jeevaathma Darshanam)

 జీవాత్మ, పరమాత్మను ప్రత్యక్షంగా చూసిన వారెవరున్నారు? జీవుడెలా ఉంటాడు? ఆయన నివాసం ఎక్కడ - ఈ ప్రశ్నలకు సమాధానం ఎర్రన కృత సావితు్ర్యపాఖ్యానం చెబుతుంది. మహాసాధ్వియైన సావిత్రి ప్రత్యక్షంగా జీవాత్మను దర్శించి, యమ ధర్మరాజు ఆశీర్వాదంతో సౌభాగ్యాన్ని తిరిగి పొందగలిగింది.

నన్నయ సభాపర్వంలో శిశుపాలవధ ఘట్టాన్ని వివరించాడు. రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందపడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ బయటికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.

ఆత్మనివాసం....

జీవి (జీవాత్మ) నివాస స్థానం గురించి మంత్రపుష్పంలో ఇలా ఉంది-

'పద్మకోశ ప్రతీకాశగ్o  హృదయం చాప్యధోముఖం'

గొంతుకు కింద, నాభికి పైన ఉన్న ప్రదేశంలో 12 అంగుళాల ఎడంగా ఉండే హృదయ కమలమే జీవాత్మ-పరమాత్మ నివాసస్థానమని మంత్రపుష్పం తెలుపుతున్నది. సృష్టికి మూలమైన ఆ మహాశక్తి అగ్నిమాలికలా ప్రకాశిస్తున్నది. ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా  భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు.

ప్రత్యక్ష దర్శనం...

ఇంతకూ ఆ జీవున్ని ప్రత్యక్షంగా దర్శించిన వారెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. ఆ వ్యక్తే మహాసాధ్వి సావిత్రి, సత్యవంతుని భార్య. జీవున్ని యముణి్న దర్శించగలిగింది, కేవలం ఆమె పాతివ్రత్య మహిమ చేతనే.

నల్లని మేఘంలా శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారంతో, భయంకరమైన కోరలతో, మిలమిల మెరిసే నెత్తుటి రంగు నేత్రాలు కలిగి, ప్రళయకాలంలోని అగ్నిలా మండుతూ బంగారు రంగుతో వెలుగుతున్న వస్త్రాలు ధరించి, లోకంలోని జనులకు భీతిని కలిగించే విధంగా యమధర్మరాజు సావిత్రికి ప్రత్యక్షమవుతాడు. నిడివి ఎక్కువగా గల పాశాలను రాకుమారుడైన సత్యవంతుడి పైకి భయంకర రీతిలో ప్రయోగిస్తాడు. అతడి శరీరం నుంచి జుత్తిలి కొలత గల (చూపుడు వేలు, బొటనవేలు చాపగా, పైన నడిమ కొలతకు లోబడిన ఆకృతి) జీవుడిని బంధించి బయటకు లాగగా ఆ జీవుణి్న సావిత్రి ప్రత్యక్షంగా దర్శిస్తుంది.

కారణజన్మురాలు...

సావిత్రి ఉపాఖ్యానం మహాభారతంలో ఒక విశిష్ఠ రచన. వైధవ్యం తప్పదని తెలిసి వివాహం చేసుకున్న సాధ్వి సావిత్రి. ఆమె కారణజన్మురాలు, ధీరమాత కూతురు. ఆమె అంగీకారానికి ఆమోదముద్ర పలికిన ఆమె తండ్రి ధైర్యవంతుడు. 'పేర్కొనజాల పెంపునన్' అని కోరిన వరునితో వివాహం జరిపిస్తాడు. త్రిరాత్రోపవాసం చేసిన సావిత్రికి యమదర్శనం కలగడం విడ్డూరం కాదు. కాని ఆమె వివాహమైన తరువాత ఆ సంవత్సరకాలం కాలుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పుణ్యవతిగా గోచరిస్తుంది. అంటే ఆమె తన భర్త మరణకాలాన్ని కొలుస్తున్నందువల్లే ఆమె కాలుడిని చూడగలిగిందన్నమాట. సావిత్రి కాలుడితో చాలా దూరంగా నడిచి ఎన్నో మాటలు మాట్లాడింది. 'సఖ్యం - సాప్తపదీనం' అంటూ ఏడు అడుగులు నడిచి మాట్లాడితే  ఎవరైనా బంధువులవుతారని వివరించింది. ప్రసన్నుడైన యమధర్మరాజు పరిపూర్ణ ఫలాన్నిచ్చాడు సావిత్రికి. భర్త పరిపూర్ణ ఆయుస్సును, శతపుత్ర లాభాన్ని వరంగా పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహాపతివ్రతా శిరోమణి సావిత్రి. కొలిచిన దైవం ప్రత్యక్షం కాగా కలిసి నడిచిన ఏకైక భక్తురాలు సావిత్రి, ధన్యురాలు.


త్రిరాత్రోపవాస వ్రతం..

సావిత్రి ఉపాఖ్యానంలో సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, భర్త మరణాన్ని ఆమె ఎలా ఎదుర్కోపోతున్నది ? కథను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు స్వల్పం. సావిత్రి అందమైన ఆభరణాలు, వస్త్రాలు త్యజించి నారచీరలతో అడవిలో భర్తకు సపర్యలు చేసింది. నారద మహాముని చెప్పిన ప్రకారం తన భర్త ఆయువు ప్రమాణం లెక్కించుకుంటూ గడిపిన సావిత్రి అతని మరణానికి ఇంకా నాలుగురోజులే ఉన్నట్లు తెలుసుకుంది. అంటే అప్పటికి నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరకాలం గడిచిపోయిందన్నమాట. వెంటనే పరమనిష్ఠతో త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. పగళ్లతో కూడిన మూడురాత్రులు దీక్షతో ఉపవాసాలు చేసింది. నాలుగవ రోజున వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని, భక్తితో భర్త శుశ్రూష చేసి, అత్తమామలకు, పెద్దలకు ప్రత్యేకంగా నమస్కరించింది. వారు ప్రీతితో చిరకాలం మాంగల్యంతో వర్ధిల్లమని పలికిన దీవెనలను మనసారా గ్రహించింది. భర్త సమిధలు, దర్భలు తేవడానికి అడవికి పోతుండగా అత్తమామల అనుమతితో అతడిని అనుసరించింది. అడవిలో చెట్లు నరుకుతుండగా సత్యవంతుడు శిరోవేదనతో బాధపడుతూ సావిత్రి ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన యముడిని చూసి "ఆర్యా, మీరెవరు?" అని ప్రశ్నించింది సావిత్రి. ప్రతిగా యముడు నేను కాలుడను సుమా! నీవు మహాపతివ్రతవు, అందుకనే నన్ను చూడగలిగావు. నీ భర్త ఆయువు తీరింది. ఇతడు పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను అంటూనే సత్యవంతుడి శరీరం నుంచి జీవుడిని బయటకు లాగి బంధించి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయనను అనుసరిస్తూ సావిత్రి యముణి్న భక్తిపూర్వకంగా ఆరాధిస్తూ ఇలా సంబోధించింది.

"అంతకుండు, దండధరుడు, సంస్తుతగుణుడు, సమవర్తి, పితృపతి, ధర్మదేవత, యముడు, జలజాప్తసుతుడు, బ్రేతపతి, వైవస్వతుడు, ప్రథమ ధర్మాధ్యక్షుడు, ధర్మరాజు, ధర్మపదవీ పరిరక్షణుడు..."

గమనిస్తే ఆమె సంవత్సర కాలం త్రికరణశుద్ధిగా ఆరాధించి కొలిచిన దైవం ఎవరో కాదు...కాలుడే (కాలం) అని అర్థమవుతుంది. ఆ కాలాన్నే ఆమె లెక్కిస్తూ నిరంతరం కాలాన్ని కొలవడం వల్ల యముణి్న ఆరాధించిన ఫలం దక్కింది. దీక్షతో త్రిరాత్రోపవాసాలు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని భర్త ప్రాణం పొంది ఆదర్శనారిగా, పతివ్రతగా జీవించింది ధీరవనిత సతీసావిత్రి.


                                              ******

Tuesday, November 13, 2012

మహర్షులు ప్రసాదించిన అమృతం (Maharshulu Prasadinchina Amrutham)

 అపమృత్యువును జయించే శక్తి మనలోనే ఉన్నది. ఎటువంటి ధర్మాచరణవల్ల అన్ని భయాలకు దూరంగా అమృతప్రాయమైన జీవితాన్ని గడపవచ్చనే అంశంపై మహాభారతంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. 
జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు.

పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు.

ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమేమిటని వారు ప్రశ్నించారు మునిపుంగవుడిని.

అందుకు తార్క్షు్యడు...
ఆలస్యం బొక యింత లేదు
శుచి ఆహారంబు
నిత్యక్రియాజాలం బేమరము
అర్చనీయు లతిథుల్
సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము 
అట్లౌట నెక్కాలంబుం బటురోగమృత్యు భయశంకం బొంద మేమెన్నడున్
- అని చెప్పాడు.

ఆశ్రమజీవితంలో మృత్యుంజయసిద్ధికి అనుష్ఠించబడే నియమాలు...

కాలం విలువ గుర్తించడం, ఆహారం పరిశుభ్రంగా ఉంచడం, ప్రతిదినం జరపాల్సిన పనులు ఏమాత్రం మరువకపోవడం, అతిథులను పూజించడం, సదా సత్యవ్రతాన్ని పాటించడం, శాంతి, ఇంద్రియ నిగ్రహంతో కూడిన నిష్కామవ్రతాచరణ చేయడం.

ఈ విధమైన ధర్మాచరణ వల్ల మనం రోగమృత్యు భయాందోళనలు లేక నిశ్చింతగా జీవించవచ్చనేది మహర్షుల బోధనాసారం.

ఫలశ్రుతి: 
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు 
అర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు 
వినయార్థులకు మహావినయ 
మతియు పుత్రార్థులకు బహుపుత్రసమృద్ధియు 
సంపదర్థుల కిష్టసంపదలును 
గావించు నెప్పుడు భావించి 
వినుచుండువారికి నిమ్మహాభారతంబు

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధనలాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్రసంతానాన్ని కోరేవారికి పుత్రసంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం - వినయాల ప్రాధాన్యం ఏమిటి?

విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం, తతస్సుఖం ||

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాల నుంచారు మనవాళ్లు, అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబస్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుష్షు, ధనం, సంతతి, ఐశ్వర్యం, అన్నీ వ్యర్థాలే.


                                            ******

ఇంద్రద్యుమ్న మహారాజు (Indradyumna Maharaju)

 ప్రాణాయామ యోగ సాధనద్వారా జీవితకాలాన్ని ఎలా పెంచుకోగలమో తెలిపే విలక్షణమైన కథ ఇది.

ఇంద్రద్యుమ్నమహారాజు మరణించి పైలోకాలకు వెళ్లాక ఆయనకు నేరుగా స్వర్గలోకప్రవేశం లభిస్తుంది. కొంత కాలమైన తరువాత ఆయనకు పుణ్యలోకంలో గడువు పూర్తయిందని దేవతలు చెప్పేసరికి మహారాజుకు కోపం వస్తుంది. తను ఎన్నో పుణ్యకార్యాలు చేశానని ఇంకా భూలోకంలో తన గురించి చెప్పుకునేవారున్నారని వాదిస్తాడు. తన వాదాన్ని నిరూపించేందుకు భూలోకానికి వచ్చి తన రాజ్యంలో ఉన్న చిరంజీవియైన మార్కండేయ మహామునిని కలుసుకుని, తన గురించి ఆయనకేమైనా తెలుసునేమోనని ఆరా తీస్తాడు. అయితే మార్కండేయముని, మహారాజు గురించి తనకు వివరాలు తెలియవని చెప్పి, దగ్గరలో ఉన్న కొంగ, గుడ్లగూబ లాంటి పక్షుల వద్దకు తీసుకువెళ్లి, "మహారాజును గుర్తించారా?" అని వాటిని ప్రశ్నిస్తాడు. అయితే అవి కూడా ఆ మహారాజు గురించి తెలియదని చెబుతాయి. ఆ సరోవరం సమీపంలోనే ఉన్నఅకూపారుడనే తాబేలు మాత్రం కొంచెంసేపటికి జ్ఞాపకం తెచ్చుకుని, కన్నుల నుండి ఆనందబాష్పాలు రాలగా, గద్గదస్వరంతో ఇట్లన్నాడు.

"అయ్యో ఎంతమాట! ఆ ఇంద్రద్యుమ్న మహారాజునా నేను మరచిపోవటం, అతడు మహాత్ముడు. గొప్ప గుణాల చేత అలంకరింపబడినవాడు. పెక్కుమారులు ఆ మహనీయుడు నన్ను పెక్కు ఆపదల నుండి కాపాడినాడు. జనులలో శ్రేష్ఠుడై ఎంతో గొప్పతనాన్ని ఆర్జించిన ఆ ఇంద్రద్యుమ్నమహారాజుని నేను సదా కృతజ్ఞతతో స్మరించవలసివున్నది. మహానుభావుడైన ఆ రాజు ఎన్నో యజ్ఞాలు చేసి, దక్షిణగా అనేక గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ మహాత్ముడు దానం చేసిన వేలవేల ఆవుల గిట్టల రాపిడే కదా, లోకం పొగిడే ఈ మడుగు ఏర్పడటానికి కారణం!"
ఈ మాటలు వినగానే దేవతలు వచ్చి విమానం తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అతడి కీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచి ఉండేది, కాబట్టి స్వర్గలోకసౌఖ్యాలు శాశ్వతంగా అనుభవించవచ్చునన్నారు. అంటే, ఈ లోకంలో ఎవరి కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో, వారు అంతకాలం వరకు స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారన్నమాట!

ఈ కథను విన్నవారికి, సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రాణాయామం (ఉచా్ఛ్వసనిశా్శ్వసాల ప్రక్రియ) విలువ ఇందులో అంతర్లీనమై ఉంది. మనిషి నిమిషానికి 15-18 సార్లు గాలి పీల్చి వదులుతున్నందున 100 సంవత్సరాలు జీవిస్తున్నాడు. తాబేలు నిమిషానికి నాలుగైదు సార్లు గాలిపీల్చి వదలడం వలన 200 ఏళ్లు బతుకుతున్నది.

యోగశాస్త్రప్రకారం:

తాబేలు 4-5/ నిమిషానికి  - 200 సం||
పాము 7-8/ నిమిషానికి -  150 సం||
మనిషి 15-18/ నిమిషానికి - 100 సం||
గుఱ్ఱం 20-22/ నిమిషానికి - 40 సం||
కుక్క 28-30/ నిమిషానికి - 14 సం||

మనిషి సగటున ఒకరోజుకు 21,600 మార్లు గాలి పీల్చి వదులుతున్నాడు. కానీ, ప్రాణాయామ యోగసాధన ద్వారా 7200 మార్లు మాత్రమే గాలిని పీల్చి వదిలి, జీవితకాలాన్ని 30-50 ఏండ్ల వరకు పెంచుకోగలుగుతాడు.

                                                 *****



శివ సాక్షాత్కారం (Shiva Saakshaathkaram)

 అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ఇవ్వబోయే శివుని ప్రత్యక్ష వర్ణన చదవండి:
"జటామకుటేందురేఖయుం, గరమున శూలమున్, గరళ గాలగళంబు, బృహద్గజాజినాంబరము, తృతీయ లోచనము, పన్నగహారము నొప్పుచుండగన్" 

శివుడు జడలు గట్టిన శిరస్సుపైగల చంద్రవంకతో త్రిశూలం చేతితో ధరించి, విషం వల్ల నల్లనైన గొంతుకతో, గజచర్మధారియై, మూడవ కన్ను కలిగి, పాముల హారం ఆభరణంగా ధరించి అర్జునునకు దర్శనమిచ్చాడు. ప్రత్యక్షమైన శివుణ్ని అర్జునుడు స్తోత్రించటం: 

దండకము: 

     శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవాస్థాన సంహారకారీ, పురారీ, మురారీప్రియా, చంద్రధారీ, మహేంద్రాదిబృందారకానంద సందోహసంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్పప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మల జ్ఞానదీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారమాయంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యానపీయూషధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా, భవ్య సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గవాగస్త్యకుత్సాది నానా మునిస్తోత్రదత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణగంధర్వులున్,  సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా, నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః 

తాత్పర్యం

శ్రీ కంఠా! లోకాలకు పాలకుడా! సృష్టిస్థితిలయకారుడా! త్రిపురాలను విధ్వంసం చేసినవాడా! మురుడు అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుదేవుడికి ప్రియమైనవాడా! చంద్రవంకను ధరించినవాడా! దేవేంద్రుడు మున్నగు దేవతలకు ఆనందాలను చేకూర్చేవాడా! పుణ్యాలు ఆకృతిగొన్నవాడా! ముక్కంటీ! దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడా! దేవా! మేధావులు నీ దైవతత్త్వాన్ని ఆలోచించి వింగడించి కర్మం ప్రధానమైనదగు విజ్ఞానం అధ్యాత్మయోగం సర్వక్రియా కారణమని అనేకవిధాల విచారణలు చేస్తూ నిన్ను ధ్యానిస్తారు. సర్వేశ్వరుడవైన శర్వ! సర్వజ్ఞ! సమస్తసృష్టికి ఆత్మ వంటివాడా! మొక్కవోని మహిమ కలవాడా! పార్వతీపతీ! నీవు మూడు లోకాల ప్రవర్తనాన్ని భూమి, గాలి, ఆకాశం, ఆత్మ, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, నీళ్లు ఈ ఎనిమిదింటితో నిర్మించి, ఈ విశ్వసంసార చక్రబంధయంత్రాన్ని ధరించి నడుపుతున్నావు. ఆది దేవుడివి నీవు. మహాదేవుడివి నీవు. నిర్మలమైన జ్ఞానప్రదీప్తి చేత సంసార మాయాంధకారాన్ని నిర్మూలించి, వైరాగ్యసంపన్నులై జితేంద్రియులైన యతీంద్రులు నీ పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతాన్ని నిరంతరం గ్రోలుతూ సంత్రుప్తులై, నిత్యులై ఉన్నారు. నాశం లేనివాడా! పూజ్యుల చేత సేవించబడేవాడా! సర్వం నీవే అయినవాడా! భర్గా! విద్వాంసుడా! భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మున్నగు మహర్షులు చేసిన స్తోత్రాలను చెవియొగ్గి వినేవాడా! నుదుటి కంటి మంట చేత మన్మథుడిని బూడిద చేసినవాడా! భస్మం పూయబడిన దేహం కలవాడా! గంగను ధరించినవాడా! నీ దయవలన గీర్వాణులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఉరగశ్రేష్ఠులు, రాక్షస ప్రముఖులు మున్నగువారు ఎడతెగని సంపదలతో వర్దిల్లినారు. పరిపాలకుడివైనవాడా! విశ్వకర్తా! నాకు కోరికలు ఈడేర్చుము ఓ దయామయా! మూడులోకాలను పాలించే సార్వభౌముడా! సురాభ్యర్చితుడా! నీకు నా నమస్కృతులు.

శివార్చనపై నన్నయచే విరచితమైన ఇది తొలిదండకం. ఆంధ్రమహాభారతములో ఇది కామబాణవృత్తంలో రచించబడింది. రెండు గురువులు, ఒక లఘువు గల "తగణంతో" ధాటిగా ఎక్కడా ఆగకుండా నడుస్తుంది. ఈ స్తోత్రరచన మాటల్లో భావనాబలమే కాక శబ్దశక్తి రహస్యాన్ని గ్రహించి తద్వారా మంత్రాలను దర్శించారు ఋషులు. ఏ శబ్దాన్ని ఎలా కూర్చితే ఎటువంటి దివ్యశక్తి ఆవిర్భవిస్తుందో గమనించి ఆ విధంగా అనేకమంత్రాలను ఏర్పరచారు. అందుకే మాట ఆశీస్సుగాను, శాపంగాను పరిణమించగలదు. మానసికభావంతో పాటు శబ్దాల బలిమి వల్ల పలుకులకు ఆ పటిమ ప్రాప్తిస్తుంది. దేవతలను ఆహ్వానించే శక్తి మాటకే ఉంది.

శబ్దశాసనుడైన నన్నయ మహర్షి మనకందించిన ఈ స్తోత్రం ద్వారా అపూర్వ ఐశ్వర్యప్రదుడైన శివున్ని ధ్యానించి తరిస్తాం.


                                      ******

హనుమత్ ప్రార్థన (Hanumath Praarthana)

 అరణ్యపర్వ భాగంలోనే నన్నయ మహర్షి భీమసేనునకు సౌగంధిక పుష్పసమయంలో హనుమంతుని దర్శనభాగ్యం కలిగించాడు. ఆశ్చర్యకర విషయమేమంటే ఆ మూర్తిని ఆయన ఎలాగ తన మనః ఫలకంపై ముద్రించుకున్నాడో చదవండి. 

సీ: హ్రస్వపీనగ్రీవు నచలితాయతహను నతి చపలస్వభావాభిరాము
దనుమధ్యకటిచక్రు, దహనకణాకారతామో్రషు్ఠ, నతికృశదశనకరజు
బృథులవిద్యుత్ పింజ పింగాక్షు, నుత్తుంగదృఢవక్షు, నాజాను దీర్ఘబాహు నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజ లీల గ్రాలుచునుండ నేకాంతయోగ నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతు జూచి పాండురాజుసుతుడు వాని నిద్ర జెఱుప గడగి నిజసత్త్వమేర్పడ సింహనాద మొప్ప జేసే డాసి".

భీమసేనుడు దర్శించిన హనుమంతుని వర్ణన:

   "తదేకధ్యానయోగమనే గాఢనిద్రలో ఉన్నవాడు, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం గలవాడు, పొట్టిగా బలిష్ఠంగా ఉన్న కంఠభాగం గలవాడు, కదలని పొడుగాటి మీది దవడ గలవాడు, నిలుకడ లేని స్వభావం చేత ముచ్చట గొలిపేవాడు, సన్నని నడుముతో గుండ్రని మొలభాగం గలవాడు, నిప్పు కణంవలె ఎర్రనైన పెదవులు గలవాడు, మిక్కిలి కృశించిన దంతాలు, గోళ్లు గలవాడు, మెఱపు తీగల సముదాయం వంటి గోరోజనవర్ణంతో భాసించే కన్నులు గలవాడు, ఎత్తైన బలిష్ఠమైన రొమ్ము గలవాడు, మోకాళ్ల వరకు వ్యాపించిన నిడివైన చేతులు గలవాడు, ఎత్తుగా నిక్కబొడిచిన తోక మిక్కిలి ఎత్తుగా ఉన్న జండావలె ప్రకాశిస్తున్నవాడైన హనుమంతుని చూచి, తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా భీమసేనుడు సింహనాదం చేశాడు. 

                                                                *****

సూర్య స్తోత్రం (Soorya Sthotram)

 సంస్కృత వ్యాసభారతంలోని వేయి నామాలు కలిగిన సూర్యసహస్రనామస్తోత్రాన్ని నన్నయ గారు ఆంధ్రమహాభారతంలో కేవలం ఒక లయగ్రాహివృత్తంలో క్లుప్తీకరించి వ్రాసి, ఎల్లరూ నిత్యం పారాయణ చేసేందుకు వీలుగా, అరణ్యపర్వంలో నిక్షేపించారు. సూర్యపారాయణ వల్ల ఆయుర్ వృద్ధి కాగలదని ఆదిత్యహృదయం చెబుతున్నది.

లయగ్రాహి
"వారిరుహమిత్రు, నమరోరగ మునిద్యుచరచారణగణ ప్రణుత చారుగణు, లోకా 
ధారు, అఖిలశ్రుతిశరీరు హరి, శంకర సరోరుహభవ ప్రతిమున్ దారుణతమిస్రా 
వారణ మరీచి పరిపూరిత దిగంతరున్, భూరికరుణానిరతున్, సూరు, త్రిజగద్ర
క్షారతున్, సహస్రకరున్ కోరి భజియింపుము మనోరథఫలంబులగు భూరమణ నీకున్"

ధౌమ్యమహర్షి ధర్మరాజుతో, ఓ మహారాజా, పద్మాలకు మిత్రుడు, దేవతలు, పాములు, మునులు, ఆకాశంలో చరించేవారు, దేవ గాయకులైన చారణులు మొదలైనవారి చేత పూజింపబడేవాడు, సమస్త లోకాలకు ఆధారభూతుడు, సమస్తవేదరూపుడు, విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానుడు, ఘోరమైన చిమ్మచీకట్లను తన వేవెలుగులతో పోగొట్టి దిగంతరాలను ప్రకాశింపజేసేవాడు, గొప్ప దయాస్వరూపుడు, విజ్ఞాని, మూడులోకాలను రక్షించటానికి పూనిక గలవాడు, వేయికిరణాలు గలవాడైన సూర్యదేవుని, నీ మనోసిద్ధి కొరకై ప్రార్ధించుము అని చెబుతాడు. 

                                                                   *****

Sunday, November 11, 2012

మాయాద్యూతం (Mayaadyootham)


 శకుని, ధర్మరాజు మధ్య జరిగిన ఈ ద్యూత ప్రక్రియలో ధర్మరాజు చేతికి పాచికలు వేసేందుకు అవకాశమే రాలేదు. ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులు, ద్రౌపది ఏ సందర్భం వచ్చినా తమ పరాజయానికి శకుని మాయాజూదమే కారణమంటారు. ఆశ్చర్యమేమంటే భారతం మొత్తం కావ్యంలో ధర్మరాజు మాయాద్యూత పదంతో శకునిని నిందించలేదు, ఆశ్చర్యంగా లేదూ !

కవిత్రయ మహాభారతంలోని మాయాద్యూతాన్ని ఎరుగని పండితుడు గాని, పామరుడు గాని ఆంధ్రదేశంలో లేడనే చెప్పవచ్చు. ఇంతకూ ఈ మాట ఎవరి నోట మొట్టమొదట వచ్చింది? ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులూ, ద్రౌపదీ, ఏ సందర్భం వచ్చినా, తమ పరాజయానికి శకుని మాయాద్యూతమే కారణమని, ధర్మజుని ద్యూతవ్యసనాన్ని దుయ్యబడుతారు. ద్యూతవ్యసనుడైన ధర్మరాజు మాత్రం భారతం మొత్తంలో ఎక్కడ కూడా మాయాద్యూతమని శకునిని నిందించనే లేదు.

సభాపర్వంలోని ఆంధ్రమహాభారత గాధ విశ్లేషిస్తే...

అసూయాగ్నితో రగిలే దుర్యోధనుడు, మామ శకునితో (ఏకాంతంలో) ధర్మజుని రాజసూయ యాగానంతరం పాండవలక్ష్మి ఏ విధంగా అపహరింపనగునని ప్రశ్నిస్తాడు.  దీనికి శకుని, "భాను ప్రభుడగు పాండుమహీనాథాత్మజులక్ష్మి యెల్లను నీకున్ నేనపహరించి యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్" అంటాడు. లోకం కొనియాడే ఓ దుర్యోధనా! సూర్యునితో సమానమైన తేజస్సుగల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా "మోసపు జూదమనే" నెపంతో నీకు నేను అపహరించి ఇస్తాను. 

ఇంతకూ జూదంలో శకుని నైపుణ్యమేమని ఎవరికైనా స్ఫురించకమానదు. దీనికి సమాధానంగా శకుని, "ధర్మతనయుండు జూదంబునకుం బ్రియుండు గాని యందుల యుక్కివం బెరుగడు ఏ నక్షవిద్యయం దతిదక్షుండ" అంటాడు. ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం. కానీ అందులో ఎంత మోసం ఉంటుందో అతనికి తెలియదు. నేను ద్యూతవిద్యలో సులభంగా ఓడించి అతని రాజ్యసంపదనంతా నీకిస్తానన్నాడు. 

"అభిమతాక్షముల్ తొల్చి మాయావిదుండు సుబలాత్మజుడు ధర్మసుతు జయించె" తన కిష్టమైన పాచికల రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును ఓడించాడు. ఇక్కడ 'తొల్చి' అన్న పదానికి, 'యుక్తిగా దొర్లించి' అన్న అర్థం వున్నది. 

ధర్మరాజు, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం, ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడైన దేవలుని ప్రామాణికతతో జూదమాడాడు.

"బలవదూ్ద్యతార్థముగా బిలువంబడి మగుడనగునే" బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్లటమా ? అన్న శంక ధర్మరాజుకు కలిగింది. కానీ విధి బలీయం. 

సప్తవ్యసనాలు: 

"వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేతయనెడు సప్తవ్యసనముల జనదు తగుల"

- స్త్రీ, జూదం, తాగుడు, వేట, వాక్పారుష్యం, అతిక్రూరంగా దండించుట, డబ్బును వృథా చేయటం - అనే ఈ ఏడు వ్యసనాల యందు ఆసక్తి చూపరాదు. 

విదురుడు, ధృతరాష్ట్రునికి చెప్పిన నీతిబోధ ఇది. ఈనాటికీ పెద్దలు వీటి జోలికి పోరాదంటారు. ఫలితం దారుణమే!

జూదానికి ధర్మజుడే కాదు, నలమహారాజు కూడా బలయ్యాడు. ఆయన కూడా ధర్మజుని వలె అక్షప్రియుడే కానీ అక్షహృదయజ్ఞుడు కాడు (జూదంలో మెలకువలు తెలియనివాడు). 

"ద్యూతార్థము తత్కితవాహూతుడనై, జూదమాడకుండుట ధర్మాపేతంబని, యభిముఖుడై యాతనితో నలుడు జూదమాడ గడంగెన్". 

జూదమాడటానికై జూదరుల చేత పిలువబడినవాడై జూదమాడకుండుట అధర్మమని తలచి నలుడు సమ్మతించి పుష్కరునితో జూదమాడాడు. 

నలుడు పిలువబడి జూదమాడకుండుట అధర్మమని ఎంచాడు. 
ధర్మరాజు జూదం ధర్మంగా యుద్ధంలో గెలిచినంత పుణ్యఫలమని తలచాడు. 

ఇరువురి భావనలో ఎంత భేదమో చూడండి. 


                                                  *****