Sunday, December 9, 2012

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi)

అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.

త||     "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
           త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
           తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి 
           తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"

వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, శతు్రః"  అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

రాజసూయ మహాధ్వరసమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.

"ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి,  తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు".

రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు" అంటాడు.

ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని-
"అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"
బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటికాంతి ఏ  యితర కాంతల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది. 

విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది.

దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం.

జగద్రక్షకుడైన నారాయణుని మహిమవల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.
అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -
"నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంటు్రకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు?" అన్నది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు "నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది" అని ఓదార్చాడు.

అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంటు్రకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.

అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికావేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది.
పురజనులు, సైరంధ్రీవేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు.

దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాతవ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.

సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళూ్లరటం ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు?
భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు.

అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది.

కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది. సుధేష్ణ కోరికపై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.

మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా? అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.

ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడనుండి కదలలేదు.

అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.

ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయభంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు. కీచకుణి్న ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేతస్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతానన్నాడు.

మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు.

భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్నవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుమని భీముడు పలికాడు. భీముని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.

అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.

"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు 
పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి, 
నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్, సహజన్ముల 
ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"

(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).

"ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ, మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై"
ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.

ఈ నా తల వెంటు్రకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?

అచ్చతెనుగు పదములలో తిక్కనగారు ఏడ్చుచున్న ద్రౌపదిని, పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపాన్ని పఠితల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేసినారు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్పు!

దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో అని రోదించింది ద్రౌపది.

దీనికి సమాధానంగా  శ్రీకృష్ణుడు ద్రౌపదితో, అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.

కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.

కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -
"నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి, న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను, నక్కౌరవ్యు జూచుం బొరిన్" 
నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు.

భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.

చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!


                                           *******  

శల్యసారథ్యం (ShalyaSaarathyam)

నకులసహదేవుల మేనమామ, పాండవ పక్షమున నిలిచి కౌరవసేనను చీల్చి చెండాడవలసిన మహాయోధుడు. కాని విధివైపరీత్యం వల్ల కౌరవసేనకు సైన్యాధ్యక్షుడిగా నిలిచి, పాండవసేనను దునుమాడవలసి రావడం దురదృష్టకరం. ముఖస్తుతి అంత ముప్పు తెచ్చిపెట్టింది. శల్య సారథ్యం, పార్థుసారథ్యానికి ఉన్న భేదం కొట్టొచ్చినట్లు మనకు కావ్యం పరిశీలిస్తే తెలుస్తుంది. 

శల్యసారథ్యం గురించి తెలియనివాడంటూ తెలుగుదేశంలో ఉండడంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అతిరథవీరులలో శల్యుడొకడు. ఇతడు మద్రదేశాధిపతి. నకులసహదేవులకు మేనమామ. అంచేత ఈయన పాండవపక్షాన మహాభారతయుద్ధంలో కౌరవులను చీల్చిచెండాడవలసిన యోధాగ్రేసరుడు. 

దుర్యోధనుడు విరాటపర్వంలో కీచకవధానంతరం పాండవుల ఉనికి ప్రస్తావిస్తూ...
"సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమానబలము వార, లొండరులను గెలుచునుత్సాహమును గల రుద్ధతులును బాహుయుద్ధపరులు" అంటాడు. కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు- ఈ నలుగురు సమానబలం కలవారు. ఒకరి నొకరు జయించుకొనవలెనని ఉత్సాహపడే గర్విష్టులు. మల్లయుద్ధ ప్రియులు. ఈ నలుగురి భుజబలాలతో సరితూగజాలే భుజబలం మరెక్కడా కనబడదు అని స్వయంగా గదాయుద్ధ, మల్లయుద్ధ నిపుణుడు దుర్యోధనుడు అన్నమాటలు. 

పాండవుల అజ్ఞాతవాస పరిసమాప్తి తెలిసికొన్న శల్యుడు, పుత్రమిత్ర సమేతముగా నానాసేనాపతిసంకులంబుగా పాండవుల కడకు బయలుదేరాడు. అతని ముఖస్తుతి, మర్యాదకు ఉబ్బిపోవు స్వభావం తెలిసిన దుర్యోధనుడు, తాను చాటున నిలిచి ఆయన ప్రయాణించే మార్గమంతట చలువ పందిళ్లు వేయించినాడు. తీయని నీరు గల నడబావులు త్రవ్వించాడు. ఏనుగులు, గుర్రాలకు చావళ్లు, ఆస్థానమండపాలు ఏర్పాటు చేయడమే కాక, రుచికరపదార్థాలను సేనలకు అందివ్వడము, సకల మర్యాదలనూ అమాత్యుల ద్వారా జరిగేటట్లు ఏర్పరచి రహస్యంగా తను వెంట నడిచాడు. శల్యుడవి చూచి మార్గమధ్యముననే తన ఘనత కింతటి మర్యాదలు జరిగెనని ఉబ్బిపోయి, ఇవి జరిపించినది ధర్మజుడేయని భ్రమించి పరిజనంబు చూచి, "ఇట్లు చతురంబుగా మనకు వలయువాని సమకూర్చటానికి కారకులైన ధర్మరాజు మంత్రులెవరు? వారిని తీసుకొని రండి. వారు మా అనుగ్రహానికి పాత్రులు" అని పలుకగానే, దాగి ఉన్న దుర్యోధనుడు ఇదే అదనని నమ్రతతో బయల్పడగా, శల్యుడు గౌరవంతో గట్టిగా కౌగలించుకుని బంగారు పీఠం మీద కూర్చుండబెట్టి "నీకేమి కావాలో కొరుకొ"మ్మనగా దుర్యోధనుడు- 

నీవు నాకు మంత్రివయి, పూని నా సైన్యాన్ని నడుపింపుమని భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లాడు. శల్యుడు చేసేది లేక, "పాండవులు, మీరు ఒక్కటే కాబట్టి ముందుగా నన్ను సాదరంగా చూడటానికి వచ్చిన నిన్ను ప్రీతితో చేరతాను" అని సత్యవచనుడయ్యాడు. నీవు హస్తినాపురం వెళ్లుమని చెప్పి, తాను పాండవులను కలసివస్తానని చెప్పాడు. ఇచ్చిన వరం మాట మరువవద్దని జ్ఞాపకం చేశాడు దుర్యోధనుడు. సందేహపడవద్దని శల్యుడు భరోసా ఇచ్చాడు. శల్యుడు చేయదలచుకొన్నదొకటి, చేసిన దింకొకటి. దుర్యోధనుని మర్యాద అతని కంత మత్తెక్కించినది. 

శల్యుడు, ధర్మనందనుని నివాసమున కేగాడు. ఆయన సమస్త బంధుగణంతో ఎదురేగి ప్రణమిల్లాడు. బంగారు గద్దియపై కూర్చుండబెట్టగానే, శల్యుడు, స్వాగతసత్కారములకు పొంగిపోయాడు. ధర్మజుని కౌగిలించుకుని కుశల ప్రశ్నానంతరం మార్గమధ్యమున తాను దుర్యోధనున కిచ్చిన మాటలను చెప్పాడు. ధర్మరాజు వెంటనే మంచిపని చేశారని ప్రస్తుతిస్తూ మామను ఒక్కవరం అనుగ్రహించమని వేడుకున్నాడు. 

"అర్జునునకు కృష్ణుడు రథసారథ్యం చేయనున్నాడు. ప్రతివీరుడైన కర్ణునకు సారథ్యం చేయటానికి మీరు తప్ప అక్కడ ఇంకొకడు లేడు. యుద్ధ సమయంలో మీరు అనాదరించి పలికి, కర్ణుడి మనస్సుకు కలత పుట్టించి అర్జునుడిని రక్షించాలి. ఇది అకార్యమని సందేహించక నా ప్రార్థనపై ఏ విధంగానైనా సరే, దీన్ని చేయాలి" అని ప్రాధేయపడిన ధర్మజుని కోర్కెకు శల్యుడు సమ్మతించాడు.

ధర్మజుని దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఇక్కడ ప్రశంసార్హం. దుర్యోధనుడి ఎత్తుకు పై ఎత్తు వేసి ధర్మరాజు అతడిని చిత్తు చేశాడు. తన కోరిక అకృత్యమని తెలిసినా రాజకీయాలలో సమర్థనీయం. ఈ కోరిక వలన శల్యుడు తన పక్షంలో ఉన్న దానికంటే పరపక్షంలో ఉండటమే ధర్మరాజుకు అధికతరమైన మేలు చేకూర్చింది. 

ధర్మజుడు తన్ను పెద్ద చేసి నహుషోపాఖ్యానము చెప్పుమని అడుగుసరికి, శల్యుడుబ్బిపోయి ఆ కథ చెప్పి, ఏ నాలుకతో అంతకు ముందు సాయము చేయుదునని సుయోధనునకు మాట ఇచ్చాడో, ఇప్పుడు అదే నాలుకతో, "కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందు వాసవీ శ్రీరమణుడై, జయము సేకొని, ధర్మజు డంబురాశి వేలారశనా సముజ్జ్వల విలాస మనోహరమేదినీ వధూసార సమగ్ర భోగముల నన్నుతి కెక్కెడు తాను తమ్ములున్"
దుర్యోధనుడు ఆ నహుషుడి వలె నశిస్తాడు. ధర్మరాజు ఇంద్రవైభవంతో విజయం సాధించి, తమ్ములతో సముద్రతీరమనే మొలనూలి సముజ్జ్వల విలాసం చేత, అందమైన భూమి అనే స్త్రీయొక్క సారవంతాలైన సర్వభోగాలూ పొంది పొగడ్తకెక్కుతాడు, అని అన్నాడు. సాదరసత్కారాల పిమ్మట ధర్మరాజు శల్యుని "యుద్ధంలో మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కర్ణుడిని నిరుత్సాహ పరుస్తూ మాట్లాడటం మరచిపోగూడదు" అని మళ్లీ జ్ఞాపకం చేశాడు. 

శల్యసారథ్యము ప్రపంచదృష్టినాకర్షించు ఒక విశేషాంశము. ఇది ఆయనకొక విలాసవిద్య (హాబీ). ఈ విద్యలో శల్యశ్రీకృష్ణులు సిద్ధహస్తులు. ఒకరితో నొకరు లోలోపల పోటీ పడువారు.

భీష్ముడు దుర్యోధనునితో యుద్ధవీరుల సామర్థ్య నిర్ణయసమయంలో శల్యుడు అతిరథుడనీ, శ్రీకృష్ణుడిపై గల ఈర్ష్య వల్ల మేనల్లుళ్లయిన పాండవులను విడిచి నిన్ను చేరాడని పలికాడు.

శల్యశ్రీకృష్ణుల సారథ్య సామర్థ్య ప్రదర్శనకు మహాభారత సంగ్రామము మంచి అవకాశము. పాండవపక్షమున వీరోత్తముడు పార్థుడు. విశేషించి అతడు శ్రీకృష్ణున కాత్మీయుడు. అందుచేతనే ఆయన పార్థసారథి అయ్యాడు. ఇక శల్యుని సారథ్యమునకీ పక్షమున చోటులేదు. కౌరవపక్షమున కర్ణుడొక్కడే పార్థునికి ప్రతివీరుడు, సర్వసమర్థుడు. కాని కర్ణుడన్న శల్యునికి గిట్టదు. కారణం అతడు తన కంటే తక్కువవాడని శల్యుని భావన (సూతసుతుడు). 

ఈ విషయం గ్రహించిన దుర్యోధనుడు సభాముఖమున శల్యుడి వద్దకు కర్ణుని గొనిపోయి, భక్తితో ప్రణమిల్లి, కర్ణునకు రథసారథ్యం వహించి తనకు జయం చేకూర్చుమని వేడుకొన్నాడు. 

దీనికి శల్యుడు దుర్యోధనునితో, నన్ను అంత నికృష్టపు పని చేయమనటం నీకు తగదు అంతూ మూర్ధాభిషిక్తుడు, సుక్షత్రియుడైన తాను సూతపుత్రునకు రథచోదకుడను గాలేనని వర్ణధర్మా లెటువంటివో వివరించాడు. 
(నేటి లౌకికదృష్టిలో ప్రభుత్వంలోని నాలుగవ తరగతి ఉద్యోగి క్రింద, రెండవ తరగతి ఉద్యోగిని పనిచేయమంటే ఒప్పుకోడు గదా). 

కార్యసాధకుడైన దుర్యోధనుడు, శల్యుని మనస్సెరిగినవాడు, ఇంక ముఖస్తుతి ప్రారంభించాడు. మామా! నీవు గొప్ప శత్రువుల గుండెల్లో శల్యం (బాణం) వంటివాడవైనందువలన గదా నీకు శల్యుడనే పేరు వచ్చింది. రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు. గుఱ్ఱాల మనస్సు తెలిసికొనటంలో కృష్ణుడి కంటే గొప్పవాడవు నీవు. 

అర్జునుడికి ప్రతివీరుడుగా మనం కర్ణుడిని తగినవాడిని చేశాము. మన ఈ నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి నిరుపయోగం చేస్తున్నాడు. దానికి తగిన ప్రతిక్రియ చేయాలంటే కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు పడాలంటే అందుకు సర్వసమర్థుడవు నీవొక్కడివే. ఇంత మహాకార్యం నీ వలననే జరగాలి కాని ఇతరుల వలన కాదు. 

దీనికి శల్యుడు-
"నను కృష్ణు కంటె అధికుండని యి మ్మనుజేంద్రకోటి యాకర్ణింపం గొనియాడితి విమలయశోఘనుడగు కర్ణునకు రథము నడిపెద నధిపా!" రాజా! ఇంతమంది రాజులు వింటూ వుండగా నీవు నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడివి అని ప్రశంసించినావు. దాతృత్వం మొదలైన కారణాలతో మంచిపేరు గల కర్ణునకు నేను రథం తప్పక తోలుతాను అన్నాడు.

ఎవరి నెట్లా పడగొట్టాలో దుర్యోధనునకు బాగా తెలుసు. శల్యుడి మాటలలో లోకరీతి బాగా తెలుస్తుంది. ఒకడి రథం నేను తోలటమేమనుకున్నప్పుడు, కర్ణుడు సూతజుడుగా, రాథేయుడుగా కనిపించాడు. నీవు కృష్ణుని కంటే గొప్పవాడవనేసరికి అదే కర్ణుడు విమలయశోఘనుడయ్యాడు. ఎంత ఆశ్చర్యం!

కాని మానవహృదయము మీద పొగడ్త ప్రభావము తాత్కాలికమే. దుర్యోధనుని పొగడ్తకు పొంగి శల్యుడు కర్ణసారథ్యం స్వీకరించినను తన కంటే తక్కువవాడన్నదే అతని హృదయమున స్థిరముగ నిలిచిన అభిప్రాయము. నొగలెక్కి కూర్చున్న శల్యుని ఏదో గొప్పవాడవని పొగడుచు, కర్ణుడు తన పని చక్కబెట్టుకొనలేదు. శల్యుడెంత స్వాతిశయపరాయణుడో కర్ణుడంత కంటే నాలుగాకులెక్కువ చదివినవాడు. శల్యుడు నొగలెక్కినది మొదలు కర్ణుడు ఆత్మస్తుతి ప్రారంభించినాడు. శల్యుడు పరస్తుతి (అర్జున ప్రశంస) ప్రారంభించినాడు. కర్ణుడి ఆత్మస్తుతికీ, శల్యుని పరస్తుతికీ ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణయే శల్యసారథ్యమునకు నాంది. పార్థుని బాణముల కంటే శల్యుని మాటలు కర్ణుని హృదయమును క్రూరముగ గాయపరచినవి. ఈ శల్యసారథ్యమే కర్ణుని యుత్సాహమును క్రుంగదీసినది. నాగాస్త్రమును గురి తప్పించినది. ప్రత్యర్థియైన పార్థునకు మేలు చేసినది. 

అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందని ప్రశ్నించిన కర్ణునితో, శల్యుడు నేను ఆ ఇద్దరినీ, అంటే కృష్ణార్జునులను చుట్టుముట్టి, పైకొని వారిని పదునైన అనేక బాణపరంపరల పాల్జేతునని చెప్పాడు. 

ఇదే విధమైన ప్రశ్నను అర్జునుడు అడుగగా, కృష్ణుడు హాస దీప్తవదనారవిందుడై, సూర్యుడు గగనము నుండి క్రింద పడినా, భూమి బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక ప్రక్కకు వొరిగిపోయినా, కర్ణుడి చేతిలో నీవు ఓడిపోవటం జరుగదు అంటాడు. 

పై వాక్యాలలోని భావాలు లోకానికి శల్య శ్రీకృష్ణులు మానవజాతికి ఇచ్చే శాశ్వత సందేశాలు. తాను చేయు పని స్థాయికి తగనిదని తలపోయువానికి తనపై అధికారి కంటే తానెంతో గొప్పవాడినని బాధపడువానికి, ఆయువుపట్టు వంటి పని అప్పగించరాదు. అతడు మనఃపూర్వకంగా ఆ పని చేయలేడు. పైవాని విజయమును కోరలేడు. విశేషించి అతని పతనమే ఇతని అభిమతము. అతని స్థానమే ఇతని ఆకాంక్షితము. పార్థసారథ్యమును శ్రీకృష్ణుడు ఆత్మీయముగా వరించినాడు. కర్ణసారథ్యమును శల్యుడు పరిస్థితుల ప్రాబల్యమునకు, ప్రలోభముల ప్రభావమునకులోనై చేపట్టినాడు. శ్రీకృష్ణుడు విజయసారథియైనాడు. శల్యుడు మాత్రం కర్ణసారథిగానే నిలిచినాడు. 

ధర్మజుని అంచనా ప్రకారం శల్యుడు సారథిగా నొగలెక్కిననాడే కర్ణుని మృత్యువు తప్పదనేది తేటతెల్లమైంది. ఈ రహస్యం దుర్యోధనునకు తెలియదు. కర్ణుడెంత గూఢవర్తనుడో, శల్యుడు కూడా అంత గూఢవర్తనుడయ్యాడు. ఇద్దరూ రథిక సారథులుగా కుదరటం విధినిర్ణయం. 

శల్యుడెంత కుటిలసారథ్యం నెరపినను కడకు కర్ణుని పరాక్రమాతిశయము నతడు గుర్తింపకపోలేదు. కర్ణుడు హతుడైన తరువాత కంట తడిపెట్టిన కౌరవపతి కడకేగి శల్యుడు, ప్రభూ! మనం ఎన్నో యుద్ధాలు చూచాము కానీ క్రౌర్యంతో కర్ణార్జునుల యుద్ధం వంటిదానిని ఎన్నడూ చూడలేదు. దేవతలు కూడా ఆ యుద్ధాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కర్ణుడి విక్రమానికి కృష్ణార్జునులే భయపడ్డారు. ఇది విధి విలాసం. దీనికి దుఃఖించి ప్రయోజనం లేదు. "విను చెప్పెద, నెంతయు భీతి నొంది రా హరియు నరుండు కర్ణు వడి, కంత విధాత్రుడు తప్పె వానికిన్" అంటాడు. 

సర్వసైన్యాధ్యక్షుడుగ నుండి శక్తి సామర్థ్యములు గలవాడనని భావించుకొనుచు తక్కువ స్థితిలో సామాన్య వీరుడిగ 17 దినములు పోరి, ఒక్కసారిగా ప్రభువుచే సర్వసైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన శల్యుడు, యుద్ధభూమిలో సామాన్యుడుగా విజృంభించునా? కర్ణ పతనానంతరము కౌరవులచే అభిషిక్తుడై సమరభూమిలో సేనల నడిపించు శల్యుని విజృంభణమెంత మహోగ్రమో,  శ్రీకృష్ణుడు ఊహించినాడు. శల్యుని మనస్తత్వమును, పరిస్థితుల ప్రభావమును పాండవులకు తెలియజెప్పి, ధర్మజుని పాండవ పక్షసైన్యాధ్యక్షుడుగ నిలిపినాడు.

శల్యునికి సమరభూమిలో కృష్ణార్జునులు గాని, భీమసాత్యకులు గాని ఎదురైయున్నచో బహుశః వారు తుత్తునియలయ్యెడువారు. అతని విజృంభణమట్టిది. వారన్న అతని కోపమంతటిది. కాని ధర్మజుడెదురైనాడు. దానితో శల్యుని విజృంభణము సగము చచ్చినది. ధర్మజుడన్న శల్యునికి తగని గౌరవము, అవ్యాజప్రేమ, అంతేగాదు, వారిద్దరి మధ్యా ఒక రహస్యపు ఒప్పందము గూడ జరిగినది. శల్యుడు తన నోటిమీదుగా కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందునని, తమ్ములతో గలసి నీవు సర్వంసహాచక్రవర్తిసముడవై పరిపాలింపగలవని ధర్మజుని ఆశీర్వదించియున్నాడు. ఇప్పుడు ధర్మజునిపై ఎలా విజృంభింపగలడు? ఆయన మనస్సు వెనుకాడదా? అదే జరిగింది. ఒకసారి ధర్మజుని మూరి్ఛతుని గావించి, శక్తికి బలియైనాడు.

"భూమి మీద నిట్లు బోరగిలం బడి మద్రనాథు డొప్పె మానవేంద్ర, లేమ యురము నందు లీలమై వ్రాలిన ప్రాణనాథు బోల్ప బట్టు గాగ" ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారంగా నేల మీద బోరగిలబడిన శల్యుడు యౌవనవతి అయిన మగువ వక్షస్థలం మీద విలాసంతో ఒరిగిన ప్రియునితో పోల్చటానికి తగినట్లుగా ప్రకాశించాడు అని సంజయుడు, తను చూచిన యుద్ధాన్ని ధృతరాషు్ట్రనికి  వర్ణించాడు. 

శల్యుని పవిత్రమూర్తిత్వం, ధర్మస్వరూపం, వ్యక్తిత్వ సత్యం ఈ పద్యంలో మనకు తిక్కనగారు వివరించారు. రెండు ధర్మాలకు పరస్పర సంఘర్షణము, శల్యధర్మరాజుల యుద్ధంలోని అంతరార్థం. ధర్మరాజు చేతిలో మరణించడమే శల్యుని ఉత్తమత్యాగానికి నిదర్శనం. అతడు యుద్ధం చేసింది సగం దినం, మరి కొన్ని ఘడియలు మాత్రమే. పాండవులను సంహరించే ప్రతాపాన్ని ప్రదర్శించి మెఱపు వలె మెరసి ఆరిపోయాడు. ధర్మరాజు చేసిన ధర్మయుద్ధంలో చనిపోయిన శల్యుడు, శాస్త్రోక్తంగా సమర్పించిన హవిస్సులను స్వీకరించి చల్లారిన హోమాగ్ని వలె భాసించాడు. 

లోకమున ముఖస్తుతులు, మర్యాదలు, మానవస్వభావముపై ఎంతటి ప్రభావము చూపగలవో, ఈ ముఖస్తుతులకు, మర్యాదలకు లొంగిపోవువారు, శక్తిసామర్థ్యములు గలిగి చిత్తశుద్ధి లేక ఉభయపక్షములకు మాట ఇచ్చి చావుతో పాటు చెడ్డ పేరెట్లు తెచ్చుకొందురో, శల్యుని పాత్రలో మహాభారతము ప్రదర్శించినది. పాండవధర్మపక్షాన నిలిచి పోరాడవలసిన మేనమామ అధర్మపక్షాన నిలిచి ఎంత అపకీర్తిని మూట గట్టుకొన్నాడో విజ్ఞులు గ్రహిస్తారనీ, దీనినే విధివైపరీత్యమని కవిత్రయభారతం దేశమానవాళికి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. 

                                         ******

Saturday, December 8, 2012

సైంధవుడు (Saindhavudu)

సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త.

స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు. 

ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు.

పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం.

సైంధవుడు సింధుదేశాధిపతి. దుర్యోధనునకు బావమరిది. నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సలకు భర్త.
సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు.

ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యుమ్నుని, పెక్కుమంది సైనికులను అడ్డుకొనగలుగుట ఎవరికైన ఆశ్చర్యము కలిగించు అంశమే. అంతకు ముందతడు పాండవులచే పొందిన అవమానము, పరమేశ్వరుని ప్రార్థించి సాధించిన విశేషములతని చేత అంత పని చేయించినవి.

ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి, వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపు నుండి ససైన్యుడై తరలి వెళ్తున్నాడు. ఆశ్రమద్వారంలో నిలిచి ఉన్న ద్రౌపదిని చూశాడు.

"నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగ జేయుచుం గ్రాలెడు వాలు గ్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలితదేహకాంతి పటలంబున జేసి వెలుంగ జేయు నబ్బాల వినీలకుంతవిభాసిని జూచి సవిస్మయాత్ముడై"

-నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లతవలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.

సైంధవుడు మదనాతురుడై రథం దిగి ద్రౌపది ఆశ్రమంలో ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె అతిథిమర్యాదలు చేసింది. సైంధవుడామెను వలపుగొన్న మాటలతో పలుకరించి తన వెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడి, ఆమెను బలాత్కారంగా ఎత్తుకుని రథం మీద బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుని పిలుస్తూ ఆక్రోశించింది.

అడవి నుండి తిరిగి వచ్చిన పాండవులు, ధౌమ్యుని వల్ల విషయం తెలుసుకుని సైంధవుడి మీదకు లంఘించారు. సంకుల సమరం సాగింది.
సైంధవుడు ద్రౌపదిని నేల దిగవిడిచి రథం తోలుకుని పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుని విడిచిపెట్టదలచలేదు. వారతనిని వెన్నంటి తరిమిపట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని,

"ఒడలెల్ల బిండి కూడుగ బొడిచి యెగయనెత్తి త్రిప్పి భూస్థలి మీదన్ 
బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలప్రహార కుశలుడై"

భీముడు జయద్రథుడిని (సైంధవుడిని) లొంగదీసి శరీరాన్నంతటినీ మెత్తగా అయ్యేటట్లు దెబ్బలు కొట్టి పైకి లేవనెత్తి గిరగిర తిప్పి, తిరిగి భూమిపై పడవేసి అరచేతితో వక్షాన్ని, ముఖాన్ని మోదాడు.

"వాడియైన కత్తి వాతియమ్మున గొని పగతు శిరము చెక్క లెగయగొరిగి నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా గలయ నైదు గూకటులనొనర్చె"

-పదనుగల కత్తి అంచుగల బాణంతో భీముడు జయద్రథుడి తల పీతోలు లేచిపోయేటట్లుగా గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదు శిఖలుగా నిలిపాడు.

సైంధవుడి చేతులు వెనుకకు విరిచికట్టి తెచ్చి ధర్మజు సమక్షంలో ఉంచి, ఇతడే పాండవు దాసుడు అని నివేదించాడు. పిదప ధర్మరాజు సైంధవునితో-

"ఎట్టి కష్టుడైన నిట్టి పాపముసేయ నెత్తికొనునే ధరణి నీవు దక్క నరుగు మింక నేమి యందుము నిన్ను, నింద్రియ విలోలు, నల్పు, ధృతివిహీనున్"

-ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపు పనికి (పరదారను అపహరించేందుకు) పూనుకొంటాడా? నీవంటి అల్పుడు మాత్రమె అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీవంటి అల్పుడిని, ఇంద్రియవివశుడిని, ధైర్యవిహీనుడిని ఏమని నిందించలం. ఇక నీవు ఇచ్ఛవచ్చినట్లు పొమ్ము అని విడిచి పుచ్చారు పాండవులు.

పాండవులు అతడి తేజోవధ చేసి వదిలారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా జయద్రథుడు దీనుడైనాడు. అతడు సిగ్గుతో తల దించుకుని, గంగానది సముద్రాన్ని కలిసే పుణ్యతీర్థం వద్దకు వెళ్లి, ఏకదీక్షతో తన పాదం బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి, పార్వతీపతిని మనస్సులో ధ్యానిస్తూ ఘోరతపం చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. సైంధవుడు పాండవులైదుగురను ససైన్యంగా ఓడించే వరం కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుని జయించడం తనకే కష్టతరమని పేర్కొన్నాడు. పార్థుడులేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి, అంతర్థానమైనాడు. సైంధవుడు తిరిగి సింధుదేశానికి వెళ్లాడు. ఆ సమయము కొరకు వేయికన్నులతో వేచి ఉన్నాడు.

కురుసంగ్రామం ప్రారంభమైంది. ద్రోణపర్వంలో ద్రోణుని చేత పద్మవ్యూహరచన జరిగింది. ఆ దినం తన అవమానం తీరు తరుణము, శత్రువుల ప్రియపుత్రుడు, పరాక్రమవంతుడైన అభిమన్యుకుమారుడు అంతమొందు సమయము, తన బలము, పరమేశ్వరవరము సఫలత నొందనున్న క్షణము, అన్నింటిని మించి పాండవులను జయించానన్న పేరువచ్చు ముహూర్తము, ఆనాటి సైంధవ విజృంభణము వెనుక అంత మనస్తత్వము దాగియున్నది.

పాండవులలో పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించే నేర్పు అర్జునునకు, శ్రీకృష్ణునకే ఉన్నది. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించటం తెలుసు గాని, విజయవంతంగా తిరిగి రావటం తెలియదు. వ్యూహంలో ప్రవేశించటం పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, భీమాదులను వెంటబెట్టుకుని అభిమన్యుడి వద్దకు వెళ్లి, పార్థగోవిందుల ప్రశంసలు పొందుమని కోరాడు. భీమాదులందరూ వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశం వినియోగించదలచాడు.

పద్మవ్యూహం ఛేదించిన అభిమన్యుడి వెంట, భీమాదులు మోహరంలో ప్రవేశించి, సైన్యాన్ని ఉరుమాడటం మొదలుపెట్టారు. వారికి సైంధవుడు అడ్డం పడ్డాడు. శివుడి వరం ఆనాడు సైంధవునికి అనుకూలమైనది.

పాండవులెంతో  భయంకరంగా పోరాడినా సైంధవుని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకుపోయే కొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో ఒంటరివాడయ్యాడు. అతని చేతిలో విల్లమ్ములుండగా జయించటం కష్టమని ద్రోణాచార్యుడు చెప్పగా, సుయోధనుడు, కౌరవవీరులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి, అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు.

లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు దయమాలి కొట్టి చంపినట్లు, వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు.

అరివీరభయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు.
రక్తసిక్తమైన ఆ నేల మీద పడివున్న అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వలె వెలుగొందాడు. "పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని జంపుట అధర్మ మోహో" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూతసమూహాలు కేకలు వేశాయి.

అభిమన్యుడి మరణానికి శోకించని మనిషి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు తెగిపోయింది.
సాయంకాలం సవ్యసాచి శిబిరానికి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకుని ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి కారణం తెలుసుకోగోరాడు.
ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడు అడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు సైంధవకృత్యానికి మండిపడి అతనిని చంపుతానని భయంకర శపథం చేశాడు.

"అనిమిషదైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం, దునుముదు నెల్లి సైంధవుని, దోయజమిత్రుడు గ్రుంకకుండుమున్న, నరవరేణ్య, యిత్తెరగు నాకొనరింపగరాక యున్న నే ననలము సొచ్చువాడ నృపులందరు జూడగ గాండీవంబుతోన్"

ధర్మరాజా! దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలైన ఎవరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే గాండీవంతో సహా అగ్నిలోకి దూకుతాను.

అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. పాండవ శిబిరంలో, కౌరవస్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తనకెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు.

అర్జునుడు తన ప్రతిజ్ఞ ఏ విధంగానైనా సఫలమయ్యేట్లు వరమిమ్మని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. గోవిందుడు విజయం తథ్యమని అభయమిచ్చాడు.

యుద్ధం భీకరంగా సాగింది. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు, కృష్ణుడు అర్జునునితో జాగ్రత్త వహించుమని మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని కౌరవవీరులు ఉప్పొంగిపోయారు. సైంధవుడు తల ఎత్తి పడమర వైపు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు.  శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ అదనెరిగి వాడి బాణంతో సైంధవుడి తలను తెగ నరికాడు. దానిని క్రింద పడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్రబాణ విద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయాతిమిరం తొలగించాడు. సూర్యుడస్తమించకుండానే సైంధవుడిని చంపి, అర్జునుడు తన శపథాన్ని నిలుపుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవశిరాన్ని అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్లో పడేటట్లు చేశాడు. అతడా శిరస్సును నేల మీద పడవేశాడు. వెంటనే వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి ముక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో, అతడి శిరస్సు వేయి ముక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు.

స్త్రీపర్వంలో సైంధవుని భార్య దుస్సల హృదయవిదారక రోదన రణభూమి శ్మశానంలో కనబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు, కన్నీరుమున్నీరౌతూ, వారి వారి భర్తలను, అన్నదమ్ములను గుర్తిస్తూ కాకులు పొడచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. ముక్కలైన దేహభాగాలను కలిపి తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి దారుణ దృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో అని గాంధారి బావురుమన్నది. (వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టి ప్రసాదించాడు).

వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు, ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోక ముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె శ్మశాన రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.


                                             ******


అశ్వత్థామ (Ashwatthama)


ద్రోణాచార్యుని కుమారుడు, కారణజన్ముడు. 
భీష్మద్రోణకర్ణ శల్యులు కౌరవుల సైన్యాధ్యక్షులుగా పాండవులతో 18 రోజులు యుద్ధం చేసి ఆయువులు బాసిన యోధాగ్రేసరులు. 18 నాటి రాత్రి యుద్ధానికి కౌరవ సైన్యాధ్యక్షుడుగా, మరణానికి చేరువైన సుయోధనుని చేత అభిషేకింపబడి, అశ్వత్థామ కావించిన మారణహోమమే సౌప్తికపర్వం (నిద్రాపర్వం). ఈ మారణకాండను ఆయన ఎలా సమర్థిస్తున్నాడో చూడండి.

దండెత్తినప్పుడు, విడిది చేసినప్పుడు, ఇరుకైన దారిలోను, గతిలేక తిరుగబడినప్పుడూ, నిద్రించేటప్పుడూ  శత్రువులను క్రూరంగా మీదబడి చంపాలి, క్షత్రియధర్మం అవలంబించినవాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి.

యుద్ధ షట్కమని పేరొందిన ఆరు పర్వాలను- భీష్మ- ద్రోణ- కర్ణ- శల్య- సౌప్తిక- స్త్రీ పర్వాలు అని అంటారు. ఐదవ పర్వమైన సౌప్తికపర్వాన్ని నిద్రాపర్వమని వేదవ్యాసులవారు ఎందుకు నామకరణం చేశారో తెలుసుకుంటే, పఠితులు ఆశ్చర్యపడకమానరు. గాఢనిద్రలో ఉన్న పాండవ శిబిరవాసులను 18వ రాత్రి కసిదీర జంపిన కిరాతకుడు అశ్వత్థామ. ఈయనే ద్రోణాచార్యుని ఏకైక ప్రియపుత్రుడు. ఇంత దారుణానికి ఈయన ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

కామక్రోధాదుల ఏకత్వం వలన శత్రుప్రళయాన్ని అణచేవాడున్నూ, అస్త్రశస్త్రాదులలో ఆరితేరినవాడున్నూ, మహాబలశాలియున్నూ అయిన అశ్వత్థామ ద్రోణుడికి జన్మించాడు. తాను పుట్టగానే ఇంద్రుడి అశ్వం ఉచ్చైశ్రవం వలె పెద్దసకిలింత చేశాడట. దానితో భూమి కంపించిపోయింది. అది చూచి ఆకాశం నుండి దివ్యవాణి, ఈ శిశువు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పింది. ఇది అతని సార్థకనామధేయం, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు!

ఏ మానవునకైనను మితిమీరిన ఆవేశము మంచిది కాదు. ఆవేశము వివేకమును చంపుటేగాక నీచతకు పాల్పడజేయును. అందునూ, క్రోధస్వభావుని ఆవేశము మహాక్రూరము.

తన తండ్రి విద్యాధనము అన్యుల కంటే తనకెక్కువ చెందవలెనని ఆశించుటే గాని, యోగ్యతవిషయ మాతని యోచనకు రాదు. గురు పుత్రుడనను అహంకారమే అతని ఆధిక్యభావనకు ప్రబలహేతువు.

అయోగ్యుడని తెలిసియు పుత్రప్రేమకు వశుడై ఆచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రప్రయోగము బోధించాడు. ఉపసంహారము బోధించలేదు. దాని ప్రయోగము ఎట్టి పరిస్థితులలోనూ మానవులపై జరగకూడదన్నాడు.

అయోగ్యుని విద్య అహంకారము పెంచును. ఆవేశపూరితుడు, క్రోధస్వభావుడు, అసహనపరుడైన అశ్వత్థామ అహంకారమును బ్రహ్మాస్త్రము పెంచినది. అతడొకనాడు ద్వారక కేగి శ్రీకృష్ణుని చక్రాయుధ మిమ్మన్నాడు. చక్రాయుధ మెందుకని శ్రీకృష్ణుడు అడుగగా, నీతో యుద్ధము చేసి నిన్ను గెలిచితినన్న కీర్తి గడించుటకన్నాడు. ఆశ్చర్యచకితుడై చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చక్రాయుధమును చూపి తీసికొమ్మన్నాడు. అశ్వత్థామ దాని నెత్తలేక- ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండు గాన నా కిది లేకున్న నేమి యగు? నెట్లును నీ తోడ సంగరంబు సేయంగలవాడ- నని పొగరుగా పలికి వెళ్లినాడు. అశ్వత్థామ అహంకారదురభిమానము లట్టివి!

అశ్వత్థామకు పాంచాలురన్న గిట్టదు. కారణం, తండ్రి దారుణావమానానికి గురి కావటమే. దానికి తోడు ధృష్టద్యుమ్నుడు తండ్రి గొంతు కోసినాడు. అది చూచిన అశ్వత్థామ కడుపు తరుగుకొనిపోయి, దుర్యోధనునితో నా బాహుబలం, దివ్యాస్త్రాలు ఎందుకు? కాల్చటానికా? అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మహానుభావుడైన మా తండ్రి ఏ దిక్కూ లేక యుద్ధంలో శత్రువు చేతిలో దీనంగా మృతి చెందాడు. తలచుకుంటే నన్ను గూర్చి నాకే ఏహ్యభావం గలుగుతున్నది.  దీనికంతటికి కారణం ఆ ధర్మరాజే. కపటంతో సత్యభ్రాంతిని కలుగజేసి నా తండ్రిని హత్యగావించాడు.

అస్త్రగురుడైన మా తండ్రి, ద్రోణాచార్యుడు నన్ను కన్నది శత్రువు చేతిలో తాను ఏ దిక్కూ లేక నరికివేయబడి మరణించటానికి అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏముంది? అని తండ్రి దుర్గతి దలచి వాపోయాడు. వెంటనే ఆగ్రహావేశపరవశుడై ఇలా ప్రతిజ్ఞ చేశాడు.

నా ఈ బాహుబలపరాక్రమాలతో దివ్యాస్త్రప్రయోగంతో తల్లడిల్లి మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్లు చేస్తాను. మా తండ్రి నారాయణుడిని ఉపాసించి పొందిన దివ్యాస్త్రం నాకిచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు వధ్యులు, వీరు అవధ్యులు అనే భేదం లేక శత్రునిర్మూలనం క్షణంలో చేసి వేస్తుందని పాండవబలంపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుని నేర్పుచే అది వృథా కాగా, ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుని మీద వదిలినాడు. అది బ్రహ్మాస్త్రముచే అణచివేయబడగా అశ్వత్థామ అవమానంతో క్రుంగి విల్లు పారవైచి, రథము దిగి యుద్ధభూమి నుండి తొలగినాడు.

వ్యాసమహర్షి దర్శనం కాగా, దీనంగా తన మనోవేదనను బయటపెట్టాడు. ఆ మహర్షి కృష్ణార్జునుల మహిమ వివరించటంతో  మనస్సులో ఊరట చెందాడు.

తొడలు విరిగి నేలబడి నెత్తుటి బురదలో పొరలుచున్న సుయోధనుని దుఃస్థితి చూచినప్పుడు, అశ్వత్థామ ఆవేశము మిన్ను ముట్టినది. తండ్రి దుర్మరణము, పాంచాలుర మీది పగ, ద్రుష్టద్యుమ్నుని సంహరింపలేదన్న కసి, అన్నింటిని మించి సుయోధనుని దుఃస్థితి అశ్వత్థామ క్రోధమును లెస్సగ రెచ్చగొట్టినది.

వెంటనే ఓ దుర్యోధన సార్వభౌమా, నేను నిజం చెప్తున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తుండగా ఇదిగో నేడు హతమారుస్తానన్నాడు.

దీనికి సంతోషించిన సుయోధనుని ఆజ్ఞపై, కృపాచార్యుడు, గంగాజలంతో అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకం చేశాడు.

అశ్వత్థామ చేసినది శక్తికి మించిన ప్రతిజ్ఞ. కార్యసాధనకు తనకు తోడున్న వీరులు ఇరువురే- కృతవర్మ, కృపాచార్యుడు.
దానిని సాధించుటకు వ్యవధి కూడా లేదు. కౌరవేశ్వరుడా కొన ఊపిరితో ఉన్నాడు. ఆయన కన్ను మూయకముందే విజయవార్త ఆయన చెవిలో వేయవలెను. అప్పుడు గాని అతని ప్రతిజ్ఞకు, పరిశ్రమకు సార్థకత లభించదు. జీవితములో ఇట్టి పరిస్థితులే వ్యక్తి శీలమునకు అగ్నిపరీక్షలు. పెక్కుమంది ఇట్టి పరిష్టితిలో మోసము వైపు మొగ్గుదురు. అడ్డత్రోవలు తొక్కుదురు. మానవస్వభావ మట్టిది.

ఆ రాత్రి అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. అతనిది తీరని ఆవేదన, తరుగని ఆవేశము. దిక్కు తెలియని ఆందోళన. ఇంతలో గుడ్లగూబ నిద్రపోవు కాకముల గొంతు కొరికి సద్దు లేకుండ చంపి తిను దృశ్యమాతనికి కంటబడినది. ఆ గుడ్లగూబ తన కొక మహోపదేశమిచ్చినట్లు భావించినాడు.

పాండవులను నేడు చంపక, తరువాత ఎప్పుడో చంపితే ఈ లోగా దుర్యోధనుడు కన్ను మూస్తే నేను చేసిన పనిని ఎవరు మెచ్చుకొంటారు? ధర్మయుద్ధంలో ఆ మహావీరులను చంపటం అశక్యం. శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా లభించిన ఉపాయంతో ఉత్సహించాలనటం శాస్త్రసమ్మతమే కదా?

దండెత్తినప్పుడూ, విడిది చేసినప్పుడూ, ఇరుకైన దారిలోను, గతి లేక తిరుగబడినప్పుడూ, నిద్రించేటప్పుడూ శత్రువులను క్రూరంగా మీదపడి చంపాలి. ఏ పద్ధతి అనుసరించి అయినా శత్రువులను చంపవచ్చును- అనే నీతివాక్యాలు విన్నాను. క్షత్రియధర్మం అవలంబించిన వాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి. అదీ కాక పాండవులు తాత అయిన భీష్ముడిని (శిఖండిని ముందుగా పెట్టుకుని), గురువైన తన తండ్రిని (అస్త్రత్యాగం చేసినవాడిని) చంపేటప్పుడు, న్యాయమార్గంలో యుద్ధం చేయలేదు. కాబట్టి దుష్టమైన ఉపాయాలు గల పాండవులను నిద్రించేటప్పుడు ఆకస్మికంగా చంపటం నీతే గాని నిందించదగింది కాదని నిర్ణయించుకొన్నాడు.

బలమూ, ఉపాయము తెలిసిన యోధానుయోధులు 18 రోజులు సుయోధనుని పక్షాన ధార్మికంగా పోరాడి కూడా అతనికి విజయం చేకూర్చలేకపోయారని వాపోయాడు. అశ్వత్థామ క్రూరపుపూనికను కృపాచార్యుని నీతివాక్యములు మరల్చలేకపోయినవి. చివరి యత్నంగా నిద్ర చావు వంటిదని, శవాల వలె పడి ఉన్నవాళ్లను చంపి, పాపం మూటకట్టుకుని నరకంలో పడటం మంచిది కాదని చాలాదూరం చెప్పిచూచాడు మామ కృపాచార్యుడు.

నా తండ్రిని చంపి సంతోషించే ద్రుష్టద్యుమ్నుడూ మొదలైన ఆ దురాత్ములను అధర్మమార్గంలోనే (పాపాత్ములు కావున పాపంబు తెరవున) చంపుతాను. దానివలన నాకు పురుగు పుట్టువు కలిగినా మంచిదే అంటూ కృతవర్మ, కృపాచార్యులను బలవంతంగా వెంటకొని నిద్రావివశంబైన పాండవ శిబిరంబునకు వెళ్లాడు.

అశ్వత్థామ స్థిరసంకల్పాన్ని పరీక్షించటానికి ఒక భయంకర భూతరూపంలో అతడి మార్గాన్ని ఈశ్వరుడు నిరోధించాడు. అశ్వత్థామ ఆ పెనుభూతంపై ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరకు తీవ్రస్వభావుడై ఆ అశ్వత్థామ ఆత్మోపహారానికి సంసిద్ధుడు కాగా, శివుడు ప్రత్యక్షమై అతడికొక మహనీయమైన ఖడ్గాన్ని ప్రసాదించాడు. అశ్వత్థామ సంతోషించి అప్రతిహతమైన ఆ ఖడ్గం సహాయంతో పాండవసంహారానికి ఉద్యమించాడు. ఆ స్కంధావారం గుట్టూ మట్టూ అంతకుముందే తెలిసికొన్న వాడవటం చేత, ముందుగా తన తండ్రిని చంపిన ద్రుష్టద్యుమ్నుడి శిబిరం ప్రవేశించి నిద్రిస్తున్నవాడిని తన్ని లేపి, మదగజాన్ని చంపేసింహాన్ని పోలుతూ విజృంభించి, కాలితోనూ, చేతితోనూ చితుకగొట్టి, వింటి అల్లెత్రాడు అతడి కంఠానికి బిగించి ఉరిపోసి చంపాడు. పిశాచోన్మత్తుడైన ఆ వీరుడు క్రమంగా పాంచాలురను అందరినీ, ద్రౌపదేయులనూ, అసంఖ్యాక యోధులను నిద్రపోతుండగా నిర్దయుడై వధించాడు. మేలుకొని పారిపోవటానికి ప్రయత్నించే అభాగ్యులను, శిబిరద్వారం దగ్గర ఉన్న కృపాచార్యకృతవర్మలు అడ్డగించి చంపివేశారు. అతడి రాక్షసావేశానికి, నీచపరాక్రమానికి విచారిస్తూ వారు తలలు వంచుకుని ఊరకున్నారు. పాండవులైదుగురూ, కృష్ణసాత్యకులు మాత్రం ఆ శిబిరంలో కనబడనందుకు అశ్వత్థామ విచారించాడు. 

తరువాత ఆ ముగ్గురు యోధులూ, తాము జరిపిన సంహారవృత్తాంతాన్ని వినిపించటానికి దుర్యోధనుడి వద్దకు పరుగెత్తారు. అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉండి తీవ్రవేదన పొందుతూ క్షణాలు లెక్కిస్తున్నాడు. అతడి దీనస్థితి చూచి వాళ్లు చాలా బాధపడ్డారు.  అశ్వత్థామ, దుర్యోధనుడికి ఎంతో కీర్తి సంపాదించి పెట్టిన అతడి గదాకౌశల్యాన్ని ప్రశంసించి, నీ కొరకు బాధ పడకుము. నీవు పుణ్యలోకానికి పోయినప్పుడు నా తండ్రి అయిన ద్రోణుడిని చూచి, ద్రోహి అయిన ద్రుష్టద్యుమ్నుడిని నీ కొడుకు అశ్వత్థామ చంపాడని చెప్పుము అని విన్నవించాడు. ఉపపాండవ, పాంచాలాదుల మరణం విని దుర్యోధనుడు సంతోషించి, భీష్మద్రోణులు కాని, కర్ణశల్యులు కాని, మీవలె మేలు చేయలేదు. సుఖంగా ఉండండి, మనకు పునర్దర్శనం స్వర్గలోకంలో అవుతుంది, వెళ్లండి అని పలికి ప్రాణం విడిచాడు. రథికులు ముగ్గురూ దుఃఖంతో అతడికి ప్రదక్షిణం చేసి, తిరిగి చూస్తూ, రథారూఢులై వెళ్లిపోయారు. 
మర్నాడు సూర్యోదయసమయంతో ధర్మరాజాదులకు విషయం తెలియగా విలపించి మూరి్ఛల్లారు. ధర్మరాజు నకులుడిని పాంచాలదేశానికి పంపి ద్రౌపదికి వార్త చేరవేశాడు. ఆత్మపుత్ర వినాశనానికి ద్రౌపది తీవ్రదుఃఖితురాలైంది. క్షత్రియ కాంత సంతానం యుద్ధంలో వీరమరణం పొందుట సముచితమే కదా అని ధర్మరాజు ఆమెను ఊరడించాడు. అశ్వత్థామకు సహజమైన శిరోరత్నాన్ని తెచ్చి చూపితే తప్ప జీవించనని ద్రౌపది చెప్పింది. వెంటనే భీముడు, నకులసహాయుడై అశ్వత్థామను అన్వేషింప బయలుదేరాడు. క్రూరుడైన అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందని చెప్పగా,  శ్రీకృష్ణార్జున సహితుడై ధర్మరాజు, అశ్వత్థామను వ్యాసుడి ఆశ్రమ సమీపాన తపస్సు చేస్తుండగా పట్టుకొన్నాడు. పాండవవీరులను చూచి  అశ్వత్థామ భయక్రోధాదులతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక గడ్డిపరక యందు ఆవహింపజేసి ప్రయోగించాడు. అది భయంకరజ్వాలలతో పాండవులను ఆక్రమింపబోయింది. అర్జునుడు కూడ శ్రీకృష్ణ ప్రేరితుడై ఆత్మరక్షణ కొరకు అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. నారదవేదవ్యాసులు ఆ మహాస్త్రాల చేత లోకసంక్షోభం కాకుండా, ఎవరి అస్త్రాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. సత్త్వస్వభావుడు, గురుభక్తి తత్పరుడైన అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. కాని, తామసప్రవృత్తి గల అశ్వత్థామ అట్లా చేయలేకపోయాడు. తన అస్త్రం పాండవేయగర్భాలకు హాని కలిగించి ఉపశమిస్తుందని చెప్పాడు. ఉత్తరాగర్భాన్ని మాత్రం శ్రీకృష్ణుడు రక్షించాడు. ఆమెకు పుట్టే కుమారునకు సుదీర్ఘమైన ఆయువు నిస్తానని మాటిచ్చాడు. శ్రీకృష్ణుడు, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, నిస్సహాయుడవై దుర్గంధ భూయిష్ఠమైన రక్తం చేత శరీరం దగ్ధమవుతూ ఉండగా 3000 సంవత్సరాలు తిరుగమని శపించాడు. దీనికి వ్యాసుడు ఆమోదం తెల్పాడు. వ్యాసునికి కూడా అశ్వత్థామ 'నీవు మనుష్యులలోనే ఉంటావని' ప్రతిశాపమిచ్చి తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్లాడు.గురుపుత్రుడవటం చేత, అర్జునుడు అశ్వత్థామను చంపటానికి పూనుకోక, అవమానించి, ఆయుధాలతో పాటు సిగ్గును కూడా విడిచి పెట్టేటట్లు చేశాడు. ధర్మరాజు శిరోమణిని గ్రహించి ద్రౌపదికివ్వగా ఆమె తిరిగి ధర్మరాజునకే ఇచ్చింది. శిరోమణిని పోగొట్టుకొనటం చేత అశ్వత్థామ కీర్తి, శరీరం పతనం చెంది, కలుషితమైనవి. ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి, ఉదయకాలపు ఎరుపుతో అధికంగా ప్రకాశించే చంద్రబింబంతో ఒప్పే తూర్పు కొండవలె ప్రకాశించాడు.

యుద్ధషట్కము లోని సౌప్తిక (నిద్రా) పర్వానికి సైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన అశ్వత్థామ సాధించిన విజయం సుయోధనుని పట్ల కృతజ్ఞతాభావంగా గోచరిస్తుంది.

"కుడువగ, గట్ట బంధులకు కోటివిధంబుల బెట్ట జన్నము 
ల్నడప, ననేక ధర్మ విధులం బొగ డొందగ జాలునట్టి యె 
క్కుడు సిరి యిచ్చి పేర్మినొక కొండగ మన్చిన నీవుసావగా 
నొడలిటు లోమితిం గురుకులోత్తమ యేనొక సేవకుండనే ?"

తినటానికీ, కట్టుకొనటానికీ, బంధువులకు అనేక విధాల పెట్టటానికీ, యజ్ఞాలు చేయటానికీ, పెక్కు ధర్మకార్యాలలో పేరు గాంచటానికీ సరిపడేటంత అధికమైన సంపదనిచ్చి ప్రేమతో ఒక కొండవలె నన్ను సాకిన నీవు చచ్చిపోతూ ఉంటే నేనెట్లా బ్రతికి ఉన్నాను? కురువంశ శ్రేషా్ఠ! నేనూ ఒక సేవకుడనేనా? అంటూ అశ్వత్థామ వాపోతాడు.

పక్క ఇంటి పగవానిని ప్రత్యక్షముగ ఎదిరించలేక అతడింట లేనప్పుడు రాత్రివేళ అతని కొంపకో లేక పంటకుప్పకో నిప్పంటించి లేదా అతని పండ్ల పూలతోటలనో చాటుమాటుగా ధ్వంసం చేసి నీచపరాక్రమమును, రాక్షసావేశమును ప్రదర్శించిన అశ్వత్థామలను ఎందరినో లోకమున నేడు చూస్తున్నాము- అను అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వాక్కు అక్షరసత్యం!


                                           ******

Saturday, December 1, 2012

శకుని (Shakuni)

కౌరవ సార్వభౌముని మేనమామ. దుష్టచతుష్టయంలో ప్రముఖపాత్ర శకునిది. శకునిని కౌరవులకు ఆత్మీయుని జేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. 
ఘోషయాత్ర పరాభవానంతరం దేహత్యాగానికి సిద్ధపడిన అల్లునితో శకుని - ఓ దుర్యోధన సార్వభౌమ! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరు, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ  సౌఖ్యం, గొప్పదనం చేకూరుతాయి అంటాడు. 
ఈ బోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్న మహాభారత సంగ్రామం జరిగెడిది కాదు గదా? 

శకుని వంటి కుటిలస్వభావుని చరిత్ర గురించి తెలియని ఆంధ్రుడు లేడంటే ఆశ్చర్యపోనక్కరలేదు. శకునిలాంటి వ్యక్తులను మనం నిత్యం జూస్తూనే ఉంటాం. అసూయాద్వేషాలు, కలహాలు, కుటిలబుద్ధులకు వీరు ఉనికిపట్టులు. ధర్మపక్షమున వీరెన్నటికీ చేరరు. హితము చెప్పుట వీరి చేతగాని పని. కుల్లిన హృదయమున్న చోటనే కుటిలస్వభావులు చేరుదురు. చెడు మార్గమున నడిపేందుకు, వెనుదిరుగుటకు వీలులేకుండా చేయుదురు. కుటిలస్వభావుల సాంగత్యం తాత్కాలికలాభము గూర్చినను శాశ్వత నష్టమును కల్గించును. మానవస్వభావమున అసూయా ద్వేషములున్నంతకాలం, మానవునికి మానవునికి మధ్య కలహం కొనసాగుతున్నంత కాలం సమాజమున శకునులు చిరంజీవులు!

శకుని సుయోధనునికి మేనమామ. బాంధవ్యమును బట్టి కౌరవపక్షమున నుండవలసినవాడే. కాని శకునిని, కౌరవుల కంత ఆత్మీయుని చేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. ఆ కుటిలబుద్ధి నుండి పుట్టిన ప్రియవాక్కు మాయాద్యూతము. 

రాజసూయమున పాండవుల వైభవమును చూచి అసూయపడి ఒకరితో చెప్పుకొనలేక తానోర్చుకొనలేక కుమిలి క్రుశించిపోవు దుర్యోధనునితో శకుని,

"భానుప్రభులగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మి యెల్లను నీకున్ 
నేనపహరించి, యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్"- అన్న మాట నిల్పుకొన్నాడు. ఈ మాయాద్యూతము తోడనే శకుని మహాభారతమున వెలుగులోనికి వచ్చినాడు. దుష్టచతుష్టయంలో సుయోధనుని హృదయమున సుస్థిరస్థానమేర్పరచుకున్నాడు. 

ఘోషయాత్ర:
పాండవులు ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారని, వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవపట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి, వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది చతుష్టయం. ఈ వ్యూహముల కర్త కర్ణుడు.
ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా అట్టహాసంగా సకుటుంబ ససైన్యపరివారంగా, వంధిమాగధులతో మందీమార్బలంతో దుష్టచతుష్టయం ద్వైతవనం బయలుదేరారు. దీనికి ధృతరాషు్ట్రననుమతి సాధించినవాడు శకుని. 

ద్వైతవనం చేరిన దుర్యోధనాదులు, కొంతకాలం మృగయావినోదం సాగించారు. పిమ్మట చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను వద్దకు చేరి అందులో విహరించాలని తలచారు. కావలివారు హెచ్చరించినా లెక్కచేయక గంధర్వసేనతో యుద్ధానికి దిగారు. చిత్రసేనుడు మాయా యుద్ధనిపుణుడు. వేల గంధర్వసేన చుట్టుముట్టగా భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు శక్తి కొలది ఒంటరిగా పోరాడవలసివచ్చినా, శత్రుసహస్రసంఖ్య గల గంధర్వసేన తాకిడికి నిలువలేక, రణరంగం నుండి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. తుదకు దుర్యోధనుడు కూడా యుద్ధరంగంలో ప్రవేశించక తప్పలేదు. చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరుగగొట్టి జుట్టు పట్టి లాగి పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతని ఆజ్ఞతో దుశ్శాసనాది భ్రాతృవర్గాన్ని, కౌరవుల భార్యలను, మంత్రులను బట్టి బంధించారు. కౌరవసేన చెల్లాచెదరై పారిపోయింది. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని మంత్రులు వెళ్లి జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుని సకుటుంబంగా చిత్రసేనుని చెరనుండి విముక్తి కలిగించవలసినదిగా ధర్మరాజును ప్రార్థించారు. 

భీమసేనుడు మిక్కిలి సంతోషించి కాగల కార్యము గంధర్వులే తీర్చారని, వనక్లేశాలనుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలం అనుభవిస్తున్నాడని దయార్హుడు కాడన్నాడు. 

భయంకరశత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి, ఇది దయామయుల తీరు, దీనికి ఏ ధర్మాలూ సరిగావని, అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయని భీమార్జునులను ఒప్పించి, ధర్మరాజు గంధర్వులను ఎదుర్కొనమంటాడు. 

ఇరువురూ గంధర్వులతో భీకరయుద్ధం సాగించి విజయులై సామరస్యంగా పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని, ధర్మరాజు ఎదుట నిలుపగా, అతని దుష్టస్వభావాన్ని గంధర్వుడు, ధర్మరాజుకు వివరిస్తాడు. భీమునితో కట్లు విప్పజేసి, ఇటువంటి సాహసాలు ఇక ముందు చేయబోకుమని మందలించి దుర్యోధనుని నగరానికి సాగనంపుతాడు ధర్మరాజు. 

దుర్యోధనుడు పాండవుల చేత విడిపింపబడి అవమానాన్ని, అపకీర్తిని భరించలేక, నగరానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో -
"ఒవ్వనివారల ఎదురన్, యివ్విధమున భంగపడితి నేనింక జనుల్ నవ్వగ నేటి బ్రతుకుగా నివ్వసుమతి యేలు వాడ? నెట్లు చరింతున్"- శత్రువుల సమక్షంలోనే ఈ విధంగా మిక్కిలి పరాభవం పొందాను గదా! ఇక ప్రజలు అందరూ నన్ను వెక్కిరించరా? ఇటువంటి బ్రతుకు ఇక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను? ఇక మీద ఏ మొగం పెట్టుకొని తిరుగాడగలను? 

అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది? నా అంతటివాడిని శత్రువులు యుద్ధంలో ఓడించి చెరబట్టడమా? జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేయటమా? ఏ విధంగానైనా జరిపించటానికి దైవానికి శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా?

ఆత్మాభిమానం పాడైపోయి ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్లా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. నేను ప్రాయోపవేశ దీక్ష పూని ప్రాణాలను విడనాడదలచాను. దీనికి తిరుగులేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్పలేరు - అంటూ "అన్న దుశ్శాసన, నిన్ను రాజ్యమునకు బట్టము గట్టెద బతివిగమ్ము" అనగా..

"అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గినన్ మహార్ణవమది యింకినన్, దివసనాథుడు ఇంద్రుడు తేజమేగినం, గువలయనాథ! నీకు నొక కుత్సితభావము కల్గనేర్చునే? భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే!"

ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడవు నీవే! నీ కొరకే ఈ రాజ్యం ఏర్పడింది. ఈ పృథ్వి ముక్కచెక్కలగు గాక, సముద్రం ఇంకిపోవు గాక, సూర్యచంద్రులు తమ తేజాలు కోలుపోతారు గాక, హిమాలయపర్వతమే కదులుగాక, నీలో ఎట్టి నికృష్టభావాలు పొడసూపకుండును గాక, నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! అంటూ తమ్ముడు దుశ్శాసనుడు అన్న పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు. 

కర్ణుడు ప్రవేశించి, అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు గదా? రాజుకు ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలొడ్డి అయినా వారు రాజుకు సేవ చేయాలి గదా? పాండవులు నీ సేవకులు, నీవు పాండవులకు ఏలిక అయిన సార్వభౌముడవు. పాండవులు నీ రాజ్యంలో శాంతి, భద్రతలను అనుభవిస్తూ నివసించటం సేవకుల ధర్మం. కాబట్టి వారు తమ ప్రభు ఋణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్య కర్తవ్యం. జూదంలో ఓడిన నాడే వారు నీకు దాసులు, వారి పౌరుష ప్రాభవాలన్నీ నీ సొత్తు అంటూ ఓదార్చాడు. 

దీనికి సమ్మతించని దుర్యోధనునితో శకుని, 

త||  "కడగి బుద్ధిబలంబు నంద యకంటకంబుగ జేసి యే
        పుడమి రాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం
        గుడువనేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్
        విడుతుగా కని నిశ్చయించెదు వెర్రివైతె నరేశ్వరా!"

ఓ దుర్యోధనా, నీవు సాధారణ మానవుడవు కావు, సార్వభౌముడవు. నీ కర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో యోచించుము. నీకు ఈ భూమి, రాజ్యాన్ని సమస్తాన్ని కేవలం నా బుద్ధిబలం చేత (మయాద్యూత మహిమ చేత) నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీ బాహుబలం చేత సంపాదించింది కాదు గదా. ఈ రాజ్యం నీవు ఆర్జించినచో దానిని నీవు త్యజింపవచ్చును గాని నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నా మనస్సు ఖేదపడుతుంది కదా! నీవు కష్టపడి సంపాదించనక్కరలేకుండా సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా, ప్రాయోపవేశదీక్షతో ఆత్మహత్యకు పూనటం అవివేకం. నీకు పిచ్చిపట్టిందా ఏమి? పాండునందనులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం చేయటం పాడి. ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందుట సరిగాదు.

శకుని హితబోధ దుర్యోధనుని మనస్సును ఏమాత్రం తాకలేదు. ఆ ఎత్తు మార్చి పాండవుల ప్రశంస మొదలెట్టినాడు. వారికి రాజ్యభాగమిమ్మని, 
"కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి సన్మతుల బృథాతనుజుల నమానుషతేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము! నీకు నీ క్షితీవలయంబునం బరమకీర్తియు పుణ్యము గల్గు భూవరా!" 

పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచివేసి, వారిని ఆహ్వానించుము. కుంతీకుమారులు సజ్జనులు. లోకోత్తరపరాక్రమవంతులు. దివ్యతేజస్సు గలవారు. పాండవుల పైతృకమైన రాజ్యాన్ని యిచ్చి సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలంలో సాటిలేని కీర్తి, పుణ్యం లభించగలవు. 

"వారలు నీ తోబుట్టువులీ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపారగ, నేలుడు దీనం గౌరవకులనాథ ! సౌఖ్య గౌరవ మొందున్" 
- కౌరవవంశానికి అధినేతవైన ఓ దుర్యోధనా, పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సఖ్యం, గొప్పదనం చేకూరుతాయి. 

ఈ హితబోధ చావుబోవు వ్యక్తికి చివరి చికిత్సగా గరళము బోయుట వంటిది. ఈ హితబోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్నను మహాభారతసంగ్రామము సంభవించెడిది గాదు. సర్వనాశనము జరిగెడిది కాదు. 

శకుని వంటి కుటిలబుద్ధులకు బుద్ధిబలమున్నంతగా బాహుబలముండదు. బాహుబలము ప్రదర్శించవలసిన చోట వీరు పరిహాసముల పాలగుదురు. అంతేగాక ఇంతకు ముందపకారము పొందినవారు కుటిలబుద్ధుల పాటు చూచి - "ఆనాడు మోసము చేసినట్లు గాదు, ఇప్పుడు నీ పప్పులుడుక"వని ఎత్తి పొడుతురు. సమరభూమిలో శకుని కల్పించిన మాయలన్నింటిని వమ్ము చేసి చిరునవ్వుతో అర్జునుడు-

"మాయలు జూదము తోడన బోయెం గాకింక నిచట బొనగునె యవి! మ
త్సాయకము లడ్డసాళే్ల? నీ యా చవి లేదు పొమ్ము నిలువక మామా!" 

శకుని మామా! నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటజూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్లిపొమ్ము - అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా యుద్ధభూమి నుండి పారిపోయాడు.

సహదేవుడు, శకునితో యుద్ధరంగంలో పారిపోకుండా నిలువుము మామా అంటూ భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా, తల, మొండెం భూమిపై పడి దొర్లాయి. 

కౌరవుల చెడు ప్రవర్తనకు కారణమైన శకుని, దుర్యోధనుడు చూస్తుండగానే సంహరింపబడ్డాడు. కుటిలబుద్ధుల కిట్టి గతులు తప్పవు. ప్రపంచమున కుటిలబుద్ధికి శకుని పర్యాయపదము.

                                            ******

దుష్టచతుష్టయంలో కర్ణుడు (Dushtachatushtayamlo Karnudu)

 మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచి-చెడ్డలను గురించిన పరిజ్ఞానం కలిగి ఉన్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నన్నయగారు పాండురాజు మరణానంతరం చెప్పిన మాటలు, కర్ణుని జీవితంలో అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నవి. దుష్టుల సాంగత్యం ఎవ్వరికైనా, ఏనాటికైనా పతనావస్థకు చేరుస్తుందన్నది అక్షరసత్యం.

దుర్యోధన-దుశ్శాసన-కర్ణ-శకునులు దుష్టచతుష్టయమని పేరుగాంచారు. మహాభారతంలో స్వయంగా శ్రీకృష్ణుడు కర్ణపర్వంలో ఈ దుష్టచతుష్టయం కావించిన దుశ్చర్యలను ఏకరువు పెట్టాడు.

1 . కుంతి, ఆమె కొడుకులు నిద్రపోతూ ఉండగా లక్క ఇంటిని కాల్పించి,  
2 . కపటపు జూదం కల్పించి అందులో ధర్మరాజు సంపదనంతా దొంగిలించి,  
3 . అంతటితో ఆగక ద్రౌపదిని నిండుసభలో ఆ విధంగా అవమానించి,  
4 . పాండవులను చంపటానికి ఘోషయాత్ర నెపంతో దాడిచేసి,  
5 . బాలుడైన అభిమన్యుడిని ఒక్కణ్ణి చేసి అనేక రథికులను అతడిపై పంపించి, చంపించడం. 
బాగా ఆలోచిస్తే ఈ పాపాల కన్నిటికీ మూలకర్త కర్ణుడు, క్షమార్హుడు కాడని, శ్రీకృష్ణుడు పార్థుని వధార్హుడయిన కర్ణుని వధించుమని ఆదేశిస్తాడు. 

ఆంధ్రమహాభారతంలో క్షమార్హములు కాని ఐదు దోషాలలో కర్ణుని వల్ల జరిగిన 2 సంఘటనలు, అతడు వధార్హుడేనని పాఠకులకు కావ్యాన్ని విశ్లేషిస్తే తెలుస్తాయి. 
1 ద్రౌపదీ వస్త్రాపహరణం - మూలకర్త కర్ణుడు. 2 ఘోషయాత్ర - మూలకర్త కర్ణుడు. 

ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేయాలన్న ఆలోచన దుర్యోధనునకు ఎలా వచ్చింది? మాయాజూదంలో పాండవసంపదనంతా హరించాలన్న ప్రణాళిక మాత్రమే దుర్యోధనునకు, శకునికి మధ్య జరిగిన అంగీకారం. జూదంలో సంపద హరించిన తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరవిషయాలు తెలుస్తాయి. సమస్తసంపదను ఓడిపోయిన ధర్మరాజును మరొక పందెం కాయమని శకుని బలవంతపెట్టాడు. వరుసగా సహదేవ, నకుల, పార్థ, భీములను, చివరకు తనను కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. గతిలేక కులభామ ద్రౌపదిని కూడా జూదంలో ఒడ్డి చివరకు ఆమెను కూడా ఓడిపోయాడు. సభలో కలకలం బయలుదేరింది. దుర్యోధనునకు పట్టపగ్గాలు లేవు. పాండవులు తనకు దాసులైనారని పొంగిపోయాడు. 

"వరవుళ్ల గలసి తన యిల్లు వరువడి దుడువంగ కృష్ణ బనుచు వగన్ భాసురరాజ్యదర్పమొప్ప విదురు చెచ్చెర బంచె దాని తోడ్కొని తేరన్"

దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవటానికి ద్రౌపదిని అజ్ఞాపించాలనే ఆలోచనతో రాజ్యగర్వంతో విర్రవీగుతూ - ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురున్ని వెంటనే ఆజ్ఞాపించాడు.
విదురుడు తిరస్కరించటంతో ప్రాతికామిని పంపి ఆమెను సభకు తోడ్కొని రమ్మన్నాడు.
అతడు పాంచాలి వద్దకు పోయి సంగతులన్నీ చెప్పి దుర్యోధనుడున్న సభకు రమ్మని పిలిచాడు. భార్యను జూదంలో ఓడిన రాజులు లోకంలో ఎవ్వరూ లేరని ఆశ్చర్యపోయింది ద్రౌపది. ఒక్క ధర్మసందేహాన్ని వెలిబుచ్చి దానికి ధర్మరాజు నడిగి సమాధానం తెమ్మన్నది. అతడు రమ్మంటే వస్తానని ప్రాతికామిని తిరిగి పంపింది.

"నా భర్త మొదట తన్నోడి తరువాత నన్నోడెనా? లేక ముందే నన్నోడి తరువాత తానోడెనా? అన్నీ నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు."

పై ప్రశ్నకు సమాధానం చెప్పక ధర్మరాజు దుఃఖాతిశయంతో మిన్నకున్నాడు. దుర్యోధనుడు కల్పించుకుని అధిక్షేపకాత్మకంగా ద్రౌపదిని తానే వచ్చి నిండుకొలువులో తెలిసికొమ్మని వెటకారం చేస్తూ మరల సేవకుడిని ద్రౌపది వద్దకు పంపాడు. పరిస్థితుల వైపరీత్యాన్ని ద్రౌపది గుర్తించి, ఏకవస్త్ర అయి ఉన్నా కన్నీటిధారలతో కదలి ప్రాతికామి వెంట కౌరవసభకు వచ్చి భీతయై ధృతరాషు్ట్రడి చెంత నిలిచింది. దుర్యోధనుడు మదోద్ధత్తుడై దుస్శాసనుడిని ఆజ్ఞాపించాడు- ఆమెను సభామధ్యప్రాంతానికి తీసుకురమ్మని. ఆమె భయకంపితురాలై గాంధారి యొద్దకు పరుగెత్తిపోయి నిలిచింది. ద్రౌపది తాను రజస్వలననీ ముట్టవద్దనీ ఎకవస్త్రనై పెద్దలున్న సభకు రాజాలననీ మొరపెట్టింది.

నీవు ఎకవస్త్రవైతే నేమి, విగతవస్త్రవైతేనేమి, అని ధిక్కరించి దుశ్శాసనుడు నిర్దయుడై రాజసూయావభ్రుతస్నానంతో పవిత్రమైన ఆమె దీర్ఘశిరోజాలను పట్టి నిండు సభకు లాగికొని వచ్చాడు.

దుర్యోధనుని తమ్ముడైన వికర్ణుడు, పక్షపాతం లేని బుద్ధిమంతులంతా ఇప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నకు విచారించవలసిన అవసరముంది. అలా విచారించకుండ మనకెందుకులెమ్మని ఊరకుంటే అది నరకహేతువౌతుంది. అంచేత ద్రౌపది అధర్మవిజిత  అని, ఏకవస్త్రను సభకు తేవటం అధర్మమని సభలో ఎలుగెత్తిచాటాడు.

అప్పుడు కర్ణుడు సభలో వికర్ణునితో "ఎల్లవారు నెరుగనొల్లని ధర్మువు, బేల! నీవు జెప్పనేలవలసె? జిరుత వాని కింత తరుసంటి  పలుకులు సన్నె వృద్ధజనములున్న చోట" - ఎవ్వరూ తెలియటానికి ఇష్టపడని ధర్మాన్ని మూఢుడా! నీవెందుకు చెప్పవలసి వచ్చింది? పెద్దవాళ్లుండే చోట చిన్నవాడికి ఈ అధిక ప్రసంగాలెందుకు? అని అధిక్షేపాత్మకంగా కర్ణుడు వికర్ణున్ని మందలించి-

సభలో కూర్చున్న ధర్మజ్ఞులంతా చూస్తుండగా ధర్మరాజు తన సర్వస్వాన్నీ ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపది అతనికి పరాయి మనిషి కాదు. అందుచేత అది కూడా ధర్మంగా జయించబడినట్లే. అలా కాకుంటే పాండవులంతా దానికి ఎందుకు అంగీకరిస్తారు?

"భార్యకు దైవవిహితుడైన భర్త యొక్క రుండ ఇది అనేక భర్త్రుక గావున బంధకి యనంబడు నిట్టి దాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే"దని కర్ణుడు బల్కెను.
-భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కుమంది భర్తలు గలది. అందుచేత బంధకి. ఇలాంటి దాన్ని బట్టలు లేకుండా నగ్నంగా తెచ్చినా తప్పులేదు అని కర్ణుడు వికర్ణుని మాటలు త్రోసిపుచ్చి పలుకగా దుర్యోధనుడు విని, దుశ్శాసనుని పిలిచి ఈ పాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకొమ్మని ఆజ్ఞాపించగా ఎంతో కీర్తిమంతులైన పాండవులు బలహీనులై తమపై బట్టలు ముందే తీసిపెట్టి ఆ సభలో నిలిచారు.

సజ్జనుల చేత నిందింపబడిన దుశ్శాసనుడు ఇది చేయగూడదని మనస్సులో విచారించక, అడ్డులేనివాడై ఆ ద్రౌపది కట్టుకొన్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండుసభలో విప్పాడు. ఆపకుండా అతడు విప్పుతున్నా ముందు తొలగించబడ్డ వస్త్రం వంటి వస్త్రమే ఆ లలితాంగి శరీరభాగం మీద ఎడతెగకుండా ఉండటం చూసి సభలోని సభ్యులంతా సంతోషించారు. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్ట పడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక పట్టు విడిచి, సిగ్గుచెంది ఊరకుండిపోయాడు.

కులకాంతకు ఇంతకంటే ఘోరావమానం ఏముంది? అయినా అంతమంది సభలో ఉండి, దాన్ని ఆపలేకపోయారు.

వస్త్రాపహరణాన్ని సూచించినవాడు కర్ణుడు. ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే.

అందుకే శ్రీకృష్ణుడు కర్ణుని ఈ అమానుషదుష్క్రత్యానికి మూలకర్తవు నీవేనని, వధార్హుడని అర్జునునకు యుద్ధభూమిలో చెప్పాడు.

ఘోష యాత్ర:
పాండవులు  ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారు. వనవాసక్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవ పట్టమహిషి అయిన ద్రౌపదిని తమ అనంతసంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి, తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది దుష్టచతుష్టయం. వ్యూహకర్త కర్ణుడే. అయినప్పటికీ పాపఫలం నలుగురిదీ అయినా ఫలభోక్త అయినవాడు దుర్యోధనుడే!

ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా, అట్టహాసంగా, సకుటుంబపరివార సమేతంగా దుష్టచతుష్టయం ఘోషయాత్రకు ద్వైతవనం బయలుదేరారు.

ఇంతకూ వీరి ఘోషయాత్ర ప్రధానోద్దేశము, ప్రణాళిక, అందువలన సాధించవలసినది ఏదో కర్ణుని మాటలలోనే విందాం.

కర్ణుడు దుర్యోధనునితో...
పాండవులు ఈ సమయంలో మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ దైన్యంతో ద్వైతవనంలో ఉన్నారు. నీవు ఇప్పుడు సార్వభౌముడవై గొప్ప సామా్రజ్యాన్ని ఏలుకుంటూ భోగ భాగ్యాలతో తులతూగుతున్నావు. ఇప్పుడు నీవు అక్కడికి సపరివారంగా వెళ్లి మండువేసవిలో ప్రకాశించే సూర్యుడు మాదిరిగా వారికి నీ తేజస్సు చాటి చూపుము.
మిత్రులను సంతోషపెట్టడం, శత్రువులను పరితపింపజేయటమే కదా సంపదలు కలిగినందుకు ఫలం.

"ధనధాన్య పుత్రబాంధవ జనలాభంబులును దలప సరిగావు సుఖంబున తాను తనరి శత్రులు ఘనతరదుఃఖముల నుండ గని యలరుటకున్" - తనకు ధనధాన్యాలు ఉండవచ్చును. బంధువులు తనతో సహకరించవచ్చును. కాని ఇది గొప్ప సంతోషయోగం కాదు. తాను సౌఖ్యాలతో విలసిల్లుతున్నప్పుడు తన విరోధులు మిక్కుటమైన వెతలను అనుభవించగా చూడటమే అచ్చమైన సంతోషయోగం. తనకు కలిగే మేలు కంటే శత్రువులకు కలిగే కీడు మాత్రమే అచ్చమైన ఆనందాన్ని కలిగిస్తుంది.

"నారలు గట్టి, కూర లశనంబుగ నుగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవోదారులమై కనుంగొని ముదంబున బొందగ గాంచు కంటె నింపారగ నొండు గల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వరా !" 
కౌరవులకు అధినేతవయిన ఓ దుర్యోధన సార్వభౌమా! సుకుమారసుందరమైన జిలుగు పట్టుపట్టాలు కాక ముదుక నారచీరలు ధరించి భయంకరమైన అడవిలో నివసిస్తూ కందమూలఫలాలు భక్షిస్తూ నికృష్టజీవితాన్ని గడుపుతున్నాడు అర్జునుడు. ఇక మనమా, దేదీప్యమానంగా వెలుగొందే భోగభాగ్యాలను అనుభవిస్తున్నవారం. మనం ఇప్పుడు అర్జునుడి దైన్యాన్ని కనులారా చూడటం కంటె మన జీవితాలకు ఇంకొక ధన్యత్వం గల్గుతుందా?

"అతుల సౌభాగ్య పుణ్యసమగ్రగరిమ నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి ధృతి దరిగి తన్ను దాన నిందించుకొనుచు హృదయమున బాండవాంగన యెరియవలదె?"
నీ రాణులు సాటిలేని సంపదలతో భోగభాగ్యాలతో అలరారుతుండటం చూచి ధైర్యాన్ని కోలుపోయి, తనను తాను నిందించుకొంటూ పాండవుల భార్య అయిన ద్రౌపది, తన దురవస్థకు లోలోన దుఃఖిస్తూ కుమిలిపోవాలి! 

కర్ణుని పలుకులకు దుర్యోధనుడు స్పందిస్తూ నీవు చెప్పిన మాటలు నాకు మిక్కిలి ప్రీతికరాలు. కాబట్టి తండ్రి అనుమతితో అలాగే చేద్దామని నిశ్చయించాడు. తర్వాత జరిగిన వృత్తాంతం అందరు ఎరిగినదే. కాదగిన కార్యాన్ని గంధర్వులే తీర్చారు.  "చెరపకురా చెడేవు" అన్న నానుడికి అక్షర సత్యంగా ఈ వృత్తాంతం ఎల్లకాలం నిలుస్తుంది.
ఇంతకూ ఈ విషాదాంత పరిణామానికి మూలకర్త కర్ణుడే. పాపఫలం దుర్యోధనుడే పొందాడు.

                                            ******

ధృతరాషు్ట్ర కౌగిలి (Dhrutarashtru Kougili)

 పదివేల మదపుటేనుగుల బలముగలవాడు, పుట్టు గ్రుడ్డి (జాత్యంధుడు), బ్రజ్ఞాచక్షుడు (బుద్ధియే కన్నుగా గలవాడు). 
లోకము నందు జనులకు నెల్ల అవయవములలో శిరస్సు ప్రధానము. అట్టి శిరస్సులో గన్నులే ప్రధానములు. ధృతరాషు్ట్రనికి అట్టి కన్నులే లేవు, గాని గుణములచేత అతడు ఉత్తముడే యని పిల్ల (గాంధారి) నిచ్చి పెండ్లి చేసారని నన్నయ గారు వ్రాసారు. మరి ఆ శిరస్సు యొక్క ప్రభావమేమిటో (బుద్ధినైశిత్యం) తెలుసుకుందాం. 

ఆంధ్రదేశంలో ధృతరాషు్ట్ర కౌగిలి గురించి తెలియని తెలుగువాడుండడు అంటే అతిశయోక్తి కానేకాదు. కౌగిలి వల్ల కలిగే భావన ఏ సామాన్యునకైన ఒకటే, అదే సుఖప్రాప్తి. దీనిని కవులు వివిధ సందర్భాల్లో కవితల్లో, అనేక కావ్యాలలో వర్ణించి ఉన్నారు. ప్రియురాలి కౌగిలిలో కలిగే సుఖం, లేదా తల్లిదండ్రుల కౌగిలిలో కన్నబిడ్డలు పొందే సుఖానుభవం వర్ణనాతీతం.

శకుంతల నిండు సభలో దుష్యంతునకు కుమారుడైన భరతుని చూపిస్తూ, ఈ కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖాన్ననుభవింపుము రాజా, ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధము, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, చల్లదనాన్ని కల్గించలేవు అంటుంది.

మరి ఈ ధృతరాషు్ట్ర కౌగిలి ప్రత్యేకత ఏమిటి? ఈ కౌగిలి వల్ల సుఖప్రాప్తి మాటెలా ఉన్నా అవతలివాడు బ్రతికి బట్ట కట్టలేడంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఈ కౌగిలి బలం ఎంత అని మాత్రమే.

"బలవన్మద నాగాయుతబలయుతుడు, సుతుండు పుట్టె ప్రజ్ఞాచక్షుం డలఘుడు ధృతరాష్ట్రుండా లలనకు నంబి కకు కురుకులప్రవరుండై" - పది వేలేనుగుల బలంతో కూడుకొన్నవాడు, బుద్ధియే చూపుగా గలవాడు (అంధుడైనా బుద్ధితో గ్రహింపగల్గినవాడు) ధృతరాషు్ట్రడు అంబికకు కురువంశ శ్రేష్ఠుడుగా కొడుకై పుట్టాడు.

అంధుడు కాబట్టి ఆ మహారాజు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. కాబట్టి ప్రజలు, ప్రత్యర్థులు బ్రతికిపోయారు అని ఊహింపవలసివస్తుంది. మరి ఈ కౌగిలికి దారి తీసిన పరిణామాలు తెలుసుకుందామా? ఈ కౌగిలి రహస్యం, బలం తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు అంటే ఆశ్చర్యకరంగా లేదూ?

విచిత్రవీర్యునికి జ్యేష్ఠపుత్రుడై యుండి, సార్వభౌముడగుటకు సర్వసామర్థ్యములు కలిగియుండి ఒక్క గుడ్డితనము చేత శాశ్వతముగా రాజయోగమునకు దూరమైనాడు ధృతరాషు్ట్రడు. తమ్ముడైన పాండురాజు హస్తినకు రాజైనాడు.

పాండురాజు ప్రభువైనను అధికారమత్తుడై అన్నగారిని విస్మరించలేదు. అన్నగారినే ప్రభువుగా భావించి, తానొక రాజప్రతినిధివలె పాలన సాగించాడు. అన్ని రాజకీయ వ్యవహారములు అన్నగారికి విన్నవించి నడిపించినాడు.
పాండురాజు పాలనలో ఆంబికేయుడు తృప్తుడు. అతని కొరతను, కలతను పాండురాజు ప్రేమ తీర్చినది. ఒక విధముగా ధృతరాషు్ట్రడే తమ్మునికి ఋణగ్రస్తుడు.

పాండురాజు శాపగ్రస్తుడగుటతో పరిస్థితులు తారుమారైనవి. తనకు, తన సంతతికి రాజయోగమే లేదనుకొన్న ధృతరాషు్ట్రని చేతికి, ఒక్కసారిగా రాజ్యమువచ్చినది. శాపస్వభావమును బట్టి పాండురాజుకు సంతతి కలుగు అవకాశమే లేదు. విశేషించి గాంధారి గర్భవతి. కథ అందరకు తెలిసినదే. పాండురాజు మరణం తరువాత పాండుకుమారుల హస్తినా ప్రవేశం ధృతరాషు్ట్రనకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టినది. కురుకుమారులలో ధర్మజుడు పెద్దవాడు. పాండురాజు రాజ్యమునకు వారసుడు.

కన్నకొడుకునకొక పదవి కట్టబెట్టదలచి, పరిస్థితుల ప్రాబల్యముచే అన్యుని కాపదవి నప్పగించిన వ్యక్తి శాంతచిత్తుడై జీవించుట కష్టము. నిర్మలమనస్కుడై మసలుట దుర్ఘటము. పైగా పదవి పొందిన వ్యక్తి బలపడుకొలది ఆవేదన అధికమగుట, అతని పతనమును గూర్చి ఆలోచన సాగించుట మానవనైజం.

యుధిష్టిర యౌవరాజ్యపట్టాభిషేకానంతరము ధృతరాషు్ట్రనకు నిద్దురపట్టలేదు. కారణం తన కుమారుల భవితవ్యం అంధకారబంధురమేనా ?

లోకమున పుత్రమమకారపీడితులు తమ పుత్రుల అభ్యుదయమునకై ఎట్టి అకృత్యములకైన పాల్పడగలరు. పుత్రుల అభ్యుదయమే వారి ధ్యేయం. అన్యులేమైనను వారికక్కరలేదు.

తనయుడు కోరినట్లు పాండవులను వారణావతము పంపినాడు. వారు లక్కయింట భస్మము కాలేదు సరి గదా, బ్రతికి బయటపడి పాంచాలిని గెల్చుకొన్నారు. పాంచాలసార్వభౌముని ఆసరా అందుకొన్నారు. యదువృష్ణిభోజాంధకుల బలము పొందినారు. శ్రీకృష్ణుని ప్రాపు సంపాదించుకొన్నారు. ఇక ఆంబికేయుడు, అతని పుత్రుడు వారిని జూచి భయపడకుందురా?

మనస్సు ఒకవైపు, మాట మరొకవైపు, అతని ఆంతర్యము కనిపెట్టుట అతికష్టము.

పాండవుల అభివృద్ధి గురించి వినటం వలన ఎంతో సంతోషం కలిగింది అని విదురుని మనస్సుకు సంతోషం కలిగేటట్లు పలికి, అంతఃపురానికి వెళ్లి దుష్టచతుష్టయంతో, "మాటలలో చేతలలో పాండవుల పట్ల ప్రీతి ఉన్నట్లే ఉంటాను, కాని నా మనస్సును విదురునికి ఎన్నడూ తెలియనీయను. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవాళ్లు. ఏం చేయగలం? ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి" అంటాడు.

బహిరంగంగా పాండవప్రీతి. అంతరంగంలో పాండవద్వేషం అతని స్వభావం. అందులో తండ్రీ కొడుకులు బింబప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది. ఆచరణ తండ్రిది.

భీష్ముడు అర్ధరాజ్య పరిష్కారమును ప్రతిపాదించాడు. అది అన్ని విధముల తమ కనుకూలము గనుక కౌరవులంగీకరించారు. ధృతరాషు్ట్రడు పాండవుల పిలిపించి, అర్ధరాజ్యముగా అరణ్యప్రాంతమైన ఖాండవప్రస్థమునిచ్చి పంపించినాడు. అడవిలో బడిన పాండవులు అభివృద్ధికి వచ్చినప్పుడు చూచుకొందము లెమ్మని తండ్రీకొడుకులు ఆ క్షణంలో ఆలోచించారు.

అనుకొన్నదొకటి, అయినదింకొకటి. అనతికాలముననే ధర్మరాజు తమ్ములు అన్ని దిక్కులూ జయించారు. రాజసూయయాగము చేసి ధర్మరాజు భావిసార్వభౌముడుగా ప్రకాశించినాడు. ఈ వైభవము తండ్రీకొడుకులకు అంతులేని మనోవ్యథను కల్గించినది. మాయాద్యూతము ప్రవర్తిల్లినది. దాని ఘోరపరిణామాలు ఊహించని విధంగా మలుపులు తిరిగి పునరూ్ద్యతంలో అరణ్య అజ్ఞాతవాసాలు పాండవులకు తప్పలేదు. విధివ్రాత తప్పింపలేరు గదా! అరణ్యాజ్ఞాతవాసులైన పాండవుల విషయమై విదురుడు ధృతరాషు్ట్రనితో, 
"జరిగింది జరిగిపోయింది. ఇకనైన నీవు పాండవులను తిరిగి రప్పించి వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వాలి. దానివలన నీవు ధర్మాన్ని నిలిపినవాడవుతావు అన్నాడు.
ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడు 'ఎన్నో చెడ్డ శకునాలు' ఏర్పడితే ఆనాడే నేను వీడి వలన కౌరవులకు కీడు కలుగుతుందని చెప్పి ఉన్నాను. కులానికి చేటు తెచ్చేవాడిని నిందించి కులాన్ని రక్షించటం ధర్మం. సమస్త భూరాజ్యానికి ధర్మరాజును రాజుగా చేయుము. అట్లా చేయటం వలన నీ కొడుకులు, మనుమలు, మిత్రులు, చుట్టాలు అందరున్నూ కాపాడబడతారు. ద్రౌపదికి, భీమునికి నిండుసభలో దుశ్శాసనుడి చేత క్షమార్పణలు చెప్పించుము.
అజాతశత్రువైన ధర్మరాజు, నీ కొడుకులు చేసిన కీడును మనసులో పెట్టుకోడు" అన్నాడు. 
ఆగ్రహం చెందిన ధృతరాషు్ట్రడు "నా కొడుకులు పైకి రావటం నీవు సహించలేవు. నీ సాయం నా కక్కరలేదు. నీవు పాండవుల దగ్గరకు గాని లేక నీకిష్టమైన మరొకచోటికి గాని పొమ్ము" అని అనగానే విదురుడు వెంటనే పాండవులుండే కామ్యక కాననానికి వెళ్లాడు.

విదురునివలె తన ఉపేక్షాభావమును గర్హించి హితవాక్యములు బోధించిన వ్యాసమహర్షికి, ధృతరాషు్ట్రడు చేతులు జోడించి -
"దుర్యోధనుండు నా పలుకులు వినండు, కురుకులంబు రక్షించు నట్టి బుద్ధిగలరేని వాని మీర శిక్షింపుడని మొక్కినాడు"

- నేటికీ, కొడుకు నా మాట వినడు మీరైన చెప్పి చక్కదిద్దుడని పెద్దలకు మొ్రక్కు ద్రుతరాషు్ట్రలు లోకమున పెక్కుమంది కన్పింతురు. అరణ్యము నుండి వచ్చినవారినందరిని ఆంబికేయుడు, పాండవుల విషయమడిగి తెలుసుకొనేవాడు. వారి బలపరాక్రమములను దలచి భయమొందేవాడు. అర్జునుడు దివ్యాస్త్రములు పొందెనని వ్యాసుడు చెప్పగా విని ఆవేదన చెందినాడు. భీముని భీకరాకారము నూహించి "వాడమిత్తి నాదు పుత్రమిత్ర తతికి" అని వాపోయాడు. భీమార్జునుల వీర విజ్రుంభణము నూహించుకుని, కౌరవనాశనము తప్పదని తలచి కుమిలిపోయినాడు. అర్జునుని దివ్యాస్త్రలాభమును, అదృష్టమును స్మరించి "ఒండేటికి వారి ధనము యుర్వియు సిరియున్" అని హతాశుడైనాడు.

ధృతరాషు్ట్రడింత నాటకమాడునే గాని పాండవులను పిలిచి రాజ్యభాగమిచ్చి సఖ్యముతో నుండుమని మాత్రం కుమారునకు చెప్పడు.

అరణ్య, అజ్ఞాతవాసపరిసమాప్తి పిమ్మట, పాండవుల కడకు సంజయుని పిలిచి, "వాసుదేవ సహితముగ పాండవుల గని, వారి విషాదమెమ్మెయి మాను, నమ్మెయి దగ పలుకవలయు" నని చెప్పి రాయబారమంపినాడు. కాని రాజ్యభాగ ప్రసక్తి మాత్రము తేలేదు.

విదురుని నీతివాక్యాలు ఆచరించవలసిన కర్తవ్యాన్ని కూడా గుర్తించక -
"నీవు సెప్పిన మాటలు నిర్మలములు నిపుణసమ్మతములు, రాజనీతిమార్గ బోధకంబులు నైనను బుత్రు విడువ నోప, ధర్మోజయతి అని యుండువాడ" - అని తన పుత్రస్నేహాన్ని నిస్సహాయతను వెలిబుచ్చాడు. శ్రీకృష్ణ రాయబారం తుదకు విఫలమై యుద్ధమనివార్యమయిన తరుణంలో తనవద్ద 11 అక్షౌహిణుల సేన, పాండవులకు 7 గలదని సంఖ్యాబలం పైననే ఆధారపడిన ధృతరాషు్ట్రనితో సంజయుడు -

"ఆ సేనకు నీ సేనకు వాసి యడిగెదీవు నన్ను, వసుదేవసుతుం డా సేన గలడు తత్సము నీ సేనం జూపు మానవేశ్వర నాకున్" - అని నిలదీసి అడుగుటతో, దైవబలం లోపించిన తన కుమారుని పరాజయం తథ్యమని, దిక్కుతోచక తల్లి గాంధారిని పిలిచి కుమారునకు హితం బోధించమన్నాడు.

యుద్ధారంభమున చివరి మాటగా శాంతి చేయుమని చెప్పిన వ్యాసమహర్షితో -
"హితమును ధర్మముం దలచి యిమ్మెయి చెప్పితి రిట్లు మున్ను నా సుతుల నయంబుమై దరిమి జూచితి, వారల పంపు సేయ నే జతురుడ గాను, ప్రాభవము సాలదు, నా దెస తప్పులేమి మీ మతి దలపోసి యీ పలుకు మానుడు, పాకము దప్పెకార్యముల్" - ఓ తండ్రీ, మీరు నా మీద గల ప్రేమతో పూర్వం కూడా ఈ విధంగా నాకు హితోపదేశం చేసారు. కర్తవ్యం బోధించారు. ఇదివరలో నేను కూడా నా కొడుకులకు బుద్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు నా అదుపు తప్పిపోయారు. వారిని ఆజ్ఞాపించగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నా యెడ తప్పులేదని మీరు గ్రహించ ప్రార్థన. దయచేసి నాకు హితవు చెప్పవద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని తమకు మనవి చేస్తున్నాను.

మహాభారతంలోని విచిత్రపాత్ర ద్రుతరాషు్ట్రనిది, అన్నీ తెలిసిన మూర్ఖుడు. "పాకము దప్పె కార్యముల్" నానుడి నేటికీ సామాన్యునకు కూడ సుపరిచితం.

కాని వింతలలోని వింత మానవస్వభావం, ధృతరాషు్ట్రడు సంధి సంధాతగా వచ్చు శ్రీకృష్ణునకే  లంచమిచ్చి తన కొడుకులవైపు త్రిప్పదలంచుట.

"నీ తలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచెదు ఇంత బేలైతి గదే, సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే యాతడు, క్రీడి భక్తియును, నచ్యుతు పెంపును, నీ వెరుంగవే ?"
- విదురుడు ధృతరాషు్ట్రనితో, మహారాజా నీ ఉద్దేశం నేను గ్రహించాను, ఏదో కానుకలు సమర్పించే మిషతో శ్రీకృష్ణుడికి లంచమిచ్చి తృప్తిపరచి పాండవుల విషయమై కార్యవిధానంలో భేదబుద్ధి కల్పించవలెనని యత్నిస్తున్నావు. నీవెంత తెలివిమాలినవాడవో చెప్పలేను. నీవు మేరుపర్వతంతో సమానమైన ధనం సమర్పించినప్పటికీ ఆయన అర్జునుడిని విడువడు. వాసుదేవుడిపై పార్థుడికున్న భక్తిప్రవత్తు లెటువంటివో, గోపాలదేవుడి గొప్పతనమెటువంటిదో తెలియనివాడవా నీవు?

ధృతరాషు్ట్రడు లోభి. శ్రీకృష్ణుడిని లోభపెట్టి వశం చేసికొనవలెనని యత్నించటం ఎంత అవివేకమో విదురుడు హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు భక్తితో వశమవుతాడు కాని లంచాలతో కాదని తేల్చి చెప్పాడు. ధృతరాషు్ట్రడి నైచ్యం ఈ భేదోపాయంతో తేటపడుతుంది.
యుద్ధారంభము మొదలు పాండవుల కన్నీ విజయములే. కౌరవులకన్నీ అపజయములే.
భీముని విజ్రుంభణము విని మదాత్మజుల గాల్ప బుట్టిన చిచ్చువాడని కలత నొందినాడు. కురుకుమారులు భీమునిచే చచ్చుట విని మూరి్ఛల్లినాడు. ఆ మహావీరుల మృతితో ఆంబికేయుని ఆశలు చాలవరకు అడుగంటినాయి. ఇక కుమారుని గెలుపు గోరుట "పేదముదుకడు వేశ్యాజనముం గోరుట" అని పెదవి విరచినాడు.

ఒక దశలో తన యవస్థ "పడుచు లీక లూడ్చి పట్టియాడెడు నట్టి పులుగు చందమయ్యె" నని తలచి దిగులొందినాడు. పడుచు పిట్టను పట్టుకొని దాని ఈకలు లాగివేసి ఎగురలేకుండా చేసి ఎట్లా ఆడిస్తే  అది అట్లా ఆడుతూ పడి ఉంటుంది. ఆలోచిస్తే నేను చేసిన కొన్ని కర్మలు నావాళ్లనందరినీ నాకు దూరం చేసి నన్ను నిస్సహాయుడిని చేసి అలా ఆడిస్తున్నవని దుఃఖించాడు.

తుదకు దుర్యోధనుడు తొడలు విరిగి పడుటతో ధృతరాషు్ట్రని ఆశాతంతువు తెగిపోయినది. దుఃఖాతిశయంతో "చావరు నొవ్వరు పాండవు లేవురునని నీవు చెప్ప నిప్పలుకులు దుఃఖావేశకరములై చేతోవృత్తి దహింపజొచ్చె దుర్భరభంగిన్" - పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమైన బాధను పొందలేదు. అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి.

సుయోధనుడు తుది ఘడియలో ఎంత బాధ అనుభవించెనో యని దుఃఖించినాడు. మానవుడు తప్పు చేయునప్పుడు దాని వలన కలుగు కీడు నూహింపలేడు. ఒక వేళ కొంత ఊహించినను అహంకారంతో, స్వార్థబుద్ధితో ఉపేక్ష వహించి యూరకుండును, కీడు మూడినపుడు మాత్రమే తన తప్పిదమును పలుమారు తలచి బాధపడును.

మహాభారత యుద్ధానంతరము పుత్రమిత్రబంధునాశనమునకు పెద్దగ దుఃఖించుచు ధృతరాషు్ట్రడు, భీష్మద్రోణాదులు చెప్పిన వచనములు పాటింపనైతినే యని పరితపించినాడు. తన లోభగుణమును తానే దూషించుకొన్నాడు. తన కారణముగనే ఇంత నాశము జరిగినదని విలపించినాడు. లోకమున నేటికీ పెక్కుమంది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనకపోయితినే అని బాధపడువారే.

తన కొడుకులెంత దుర్మార్గులైనను వారందరినీ హతమార్చిన వ్యక్తిని ఏ తండ్రి క్షమించగలడు? ఎవ్వరెంత ఓదార్చినను తన కొడుకుల తప్పు తనకెంత తెలిసినను రణరంగస్మశానంలో అడుగు పెట్టుసరికి ధృతరాషు్ట్రని హృదయమున పుత్రశోకము, భీముని మీది కోపము పొంగులు వారినది. తన నూరుమంది కుమారులను హతమార్చినది భీముడే!

భీముడి పేరు వినేసరికి ఆ గుడ్డిరాజు మొగంలో భయంకరమైన క్రోధం ప్రకోపించింది. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడు, భీముడిని అతడి వద్దకు పంపకుండా అంతకుముందే అమర్చి ఉన్న ఒక ఇనుప భీమవిగ్రహాన్ని ధృతరాషు్ట్రడి ముందు ఉంచాడు. దాన్ని నిజభీముడని భావించి గుడ్డిరాజు తన వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకొని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి బిగువులో భీముడి ఉక్కు విగ్రహం ముక్కలైంది. రాజు రొమ్ము చిట్లింది. ముఖరంధ్రాలన్నింటి నుండి రక్తం కారనారంభించింది. అతడు మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో, ఈనాటికి భీముడిని చంపగలిగాను, నా కొడుకు దుర్యోధనునికి ఈనాడే మోక్షం కలుగుతుంది - అని పలవరించాడు. మూర్ఛ తేరిన తర్వాత తాను లోలోన సంతోషిస్తూనే ఎవరేమనుకొంటారో అని భీముడి పేరు ఉచ్ఛరిస్తూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు.

శ్రీకృష్ణుడా కపటనాటకాన్ని చూచి నవ్వి, భీముడు బ్రతికి ఉన్నాడని చెప్పి ధృతరాషు్ట్రని దుర్బుద్ధిని బయటపెట్టి, పాండవులను చంపినా, చనిపోయిన కౌరవులు తిరిగి వస్తారా? ఇప్పటి చర్య వలన చెరగని మచ్చవంటి పాపం చేశావని, ఇకనైన పాండవులను సామరస్యంతో చూచి విజ్ఞతను ప్రకటించుమని హెచ్చరించాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని, ధృతరాషు్ట్రడు పరితప్తుడై పాండవులను సొంతకొడుకులుగా చూచుకొంటానని మాట ఇచ్చాడు.

మితిమీరిన పుత్రమమకారంతో తగిన తరుణమున తనయుల దండింపక, తరువాత దండింప గలిగినా శక్తి చాలక, సుతుల మరణమునకు, సంఘనాశనమునకు పరోక్షకారకుడై పుత్రశోకములో అపకీర్తి పాలైన తండ్రి తత్త్వమును, మహాభారతము ధ్రుతరాషు్ట్రనిలో చిత్రించింది.


                                           *******