సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త.
స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు.
ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు.
పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం.
సైంధవుడు సింధుదేశాధిపతి. దుర్యోధనునకు బావమరిది. నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సలకు భర్త.
సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు.
ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యుమ్నుని, పెక్కుమంది సైనికులను అడ్డుకొనగలుగుట ఎవరికైన ఆశ్చర్యము కలిగించు అంశమే. అంతకు ముందతడు పాండవులచే పొందిన అవమానము, పరమేశ్వరుని ప్రార్థించి సాధించిన విశేషములతని చేత అంత పని చేయించినవి.
ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి, వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపు నుండి ససైన్యుడై తరలి వెళ్తున్నాడు. ఆశ్రమద్వారంలో నిలిచి ఉన్న ద్రౌపదిని చూశాడు.
"నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగ జేయుచుం గ్రాలెడు వాలు గ్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలితదేహకాంతి పటలంబున జేసి వెలుంగ జేయు నబ్బాల వినీలకుంతవిభాసిని జూచి సవిస్మయాత్ముడై"
-నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లతవలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.
సైంధవుడు మదనాతురుడై రథం దిగి ద్రౌపది ఆశ్రమంలో ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె అతిథిమర్యాదలు చేసింది. సైంధవుడామెను వలపుగొన్న మాటలతో పలుకరించి తన వెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడి, ఆమెను బలాత్కారంగా ఎత్తుకుని రథం మీద బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుని పిలుస్తూ ఆక్రోశించింది.
అడవి నుండి తిరిగి వచ్చిన పాండవులు, ధౌమ్యుని వల్ల విషయం తెలుసుకుని సైంధవుడి మీదకు లంఘించారు. సంకుల సమరం సాగింది.
సైంధవుడు ద్రౌపదిని నేల దిగవిడిచి రథం తోలుకుని పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుని విడిచిపెట్టదలచలేదు. వారతనిని వెన్నంటి తరిమిపట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని,
"ఒడలెల్ల బిండి కూడుగ బొడిచి యెగయనెత్తి త్రిప్పి భూస్థలి మీదన్
బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలప్రహార కుశలుడై"
భీముడు జయద్రథుడిని (సైంధవుడిని) లొంగదీసి శరీరాన్నంతటినీ మెత్తగా అయ్యేటట్లు దెబ్బలు కొట్టి పైకి లేవనెత్తి గిరగిర తిప్పి, తిరిగి భూమిపై పడవేసి అరచేతితో వక్షాన్ని, ముఖాన్ని మోదాడు.
"వాడియైన కత్తి వాతియమ్మున గొని పగతు శిరము చెక్క లెగయగొరిగి నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా గలయ నైదు గూకటులనొనర్చె"
-పదనుగల కత్తి అంచుగల బాణంతో భీముడు జయద్రథుడి తల పీతోలు లేచిపోయేటట్లుగా గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదు శిఖలుగా నిలిపాడు.
సైంధవుడి చేతులు వెనుకకు విరిచికట్టి తెచ్చి ధర్మజు సమక్షంలో ఉంచి, ఇతడే పాండవు దాసుడు అని నివేదించాడు. పిదప ధర్మరాజు సైంధవునితో-
"ఎట్టి కష్టుడైన నిట్టి పాపముసేయ నెత్తికొనునే ధరణి నీవు దక్క నరుగు మింక నేమి యందుము నిన్ను, నింద్రియ విలోలు, నల్పు, ధృతివిహీనున్"
-ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపు పనికి (పరదారను అపహరించేందుకు) పూనుకొంటాడా? నీవంటి అల్పుడు మాత్రమె అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీవంటి అల్పుడిని, ఇంద్రియవివశుడిని, ధైర్యవిహీనుడిని ఏమని నిందించలం. ఇక నీవు ఇచ్ఛవచ్చినట్లు పొమ్ము అని విడిచి పుచ్చారు పాండవులు.
పాండవులు అతడి తేజోవధ చేసి వదిలారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా జయద్రథుడు దీనుడైనాడు. అతడు సిగ్గుతో తల దించుకుని, గంగానది సముద్రాన్ని కలిసే పుణ్యతీర్థం వద్దకు వెళ్లి, ఏకదీక్షతో తన పాదం బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి, పార్వతీపతిని మనస్సులో ధ్యానిస్తూ ఘోరతపం చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. సైంధవుడు పాండవులైదుగురను ససైన్యంగా ఓడించే వరం కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుని జయించడం తనకే కష్టతరమని పేర్కొన్నాడు. పార్థుడులేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి, అంతర్థానమైనాడు. సైంధవుడు తిరిగి సింధుదేశానికి వెళ్లాడు. ఆ సమయము కొరకు వేయికన్నులతో వేచి ఉన్నాడు.
కురుసంగ్రామం ప్రారంభమైంది. ద్రోణపర్వంలో ద్రోణుని చేత పద్మవ్యూహరచన జరిగింది. ఆ దినం తన అవమానం తీరు తరుణము, శత్రువుల ప్రియపుత్రుడు, పరాక్రమవంతుడైన అభిమన్యుకుమారుడు అంతమొందు సమయము, తన బలము, పరమేశ్వరవరము సఫలత నొందనున్న క్షణము, అన్నింటిని మించి పాండవులను జయించానన్న పేరువచ్చు ముహూర్తము, ఆనాటి సైంధవ విజృంభణము వెనుక అంత మనస్తత్వము దాగియున్నది.
పాండవులలో పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించే నేర్పు అర్జునునకు, శ్రీకృష్ణునకే ఉన్నది. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించటం తెలుసు గాని, విజయవంతంగా తిరిగి రావటం తెలియదు. వ్యూహంలో ప్రవేశించటం పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, భీమాదులను వెంటబెట్టుకుని అభిమన్యుడి వద్దకు వెళ్లి, పార్థగోవిందుల ప్రశంసలు పొందుమని కోరాడు. భీమాదులందరూ వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశం వినియోగించదలచాడు.
పద్మవ్యూహం ఛేదించిన అభిమన్యుడి వెంట, భీమాదులు మోహరంలో ప్రవేశించి, సైన్యాన్ని ఉరుమాడటం మొదలుపెట్టారు. వారికి సైంధవుడు అడ్డం పడ్డాడు. శివుడి వరం ఆనాడు సైంధవునికి అనుకూలమైనది.
పాండవులెంతో భయంకరంగా పోరాడినా సైంధవుని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకుపోయే కొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో ఒంటరివాడయ్యాడు. అతని చేతిలో విల్లమ్ములుండగా జయించటం కష్టమని ద్రోణాచార్యుడు చెప్పగా, సుయోధనుడు, కౌరవవీరులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి, అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు.
లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు దయమాలి కొట్టి చంపినట్లు, వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు.
అరివీరభయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు.
రక్తసిక్తమైన ఆ నేల మీద పడివున్న అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వలె వెలుగొందాడు. "పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని జంపుట అధర్మ మోహో" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూతసమూహాలు కేకలు వేశాయి.
అభిమన్యుడి మరణానికి శోకించని మనిషి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు తెగిపోయింది.
సాయంకాలం సవ్యసాచి శిబిరానికి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకుని ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి కారణం తెలుసుకోగోరాడు.
ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడు అడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు సైంధవకృత్యానికి మండిపడి అతనిని చంపుతానని భయంకర శపథం చేశాడు.
"అనిమిషదైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం, దునుముదు నెల్లి సైంధవుని, దోయజమిత్రుడు గ్రుంకకుండుమున్న, నరవరేణ్య, యిత్తెరగు నాకొనరింపగరాక యున్న నే ననలము సొచ్చువాడ నృపులందరు జూడగ గాండీవంబుతోన్"
ధర్మరాజా! దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలైన ఎవరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే గాండీవంతో సహా అగ్నిలోకి దూకుతాను.
అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. పాండవ శిబిరంలో, కౌరవస్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తనకెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు.
అర్జునుడు తన ప్రతిజ్ఞ ఏ విధంగానైనా సఫలమయ్యేట్లు వరమిమ్మని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. గోవిందుడు విజయం తథ్యమని అభయమిచ్చాడు.
యుద్ధం భీకరంగా సాగింది. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు, కృష్ణుడు అర్జునునితో జాగ్రత్త వహించుమని మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని కౌరవవీరులు ఉప్పొంగిపోయారు. సైంధవుడు తల ఎత్తి పడమర వైపు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ అదనెరిగి వాడి బాణంతో సైంధవుడి తలను తెగ నరికాడు. దానిని క్రింద పడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్రబాణ విద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయాతిమిరం తొలగించాడు. సూర్యుడస్తమించకుండానే సైంధవుడిని చంపి, అర్జునుడు తన శపథాన్ని నిలుపుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవశిరాన్ని అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్లో పడేటట్లు చేశాడు. అతడా శిరస్సును నేల మీద పడవేశాడు. వెంటనే వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి ముక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో, అతడి శిరస్సు వేయి ముక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు.
స్త్రీపర్వంలో సైంధవుని భార్య దుస్సల హృదయవిదారక రోదన రణభూమి శ్మశానంలో కనబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు, కన్నీరుమున్నీరౌతూ, వారి వారి భర్తలను, అన్నదమ్ములను గుర్తిస్తూ కాకులు పొడచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. ముక్కలైన దేహభాగాలను కలిపి తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి దారుణ దృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో అని గాంధారి బావురుమన్నది. (వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టి ప్రసాదించాడు).
వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు, ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోక ముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె శ్మశాన రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.
******

No comments:
Post a Comment