Saturday, December 1, 2012

ధృతరాషు్ట్ర కౌగిలి (Dhrutarashtru Kougili)

 పదివేల మదపుటేనుగుల బలముగలవాడు, పుట్టు గ్రుడ్డి (జాత్యంధుడు), బ్రజ్ఞాచక్షుడు (బుద్ధియే కన్నుగా గలవాడు). 
లోకము నందు జనులకు నెల్ల అవయవములలో శిరస్సు ప్రధానము. అట్టి శిరస్సులో గన్నులే ప్రధానములు. ధృతరాషు్ట్రనికి అట్టి కన్నులే లేవు, గాని గుణములచేత అతడు ఉత్తముడే యని పిల్ల (గాంధారి) నిచ్చి పెండ్లి చేసారని నన్నయ గారు వ్రాసారు. మరి ఆ శిరస్సు యొక్క ప్రభావమేమిటో (బుద్ధినైశిత్యం) తెలుసుకుందాం. 

ఆంధ్రదేశంలో ధృతరాషు్ట్ర కౌగిలి గురించి తెలియని తెలుగువాడుండడు అంటే అతిశయోక్తి కానేకాదు. కౌగిలి వల్ల కలిగే భావన ఏ సామాన్యునకైన ఒకటే, అదే సుఖప్రాప్తి. దీనిని కవులు వివిధ సందర్భాల్లో కవితల్లో, అనేక కావ్యాలలో వర్ణించి ఉన్నారు. ప్రియురాలి కౌగిలిలో కలిగే సుఖం, లేదా తల్లిదండ్రుల కౌగిలిలో కన్నబిడ్డలు పొందే సుఖానుభవం వర్ణనాతీతం.

శకుంతల నిండు సభలో దుష్యంతునకు కుమారుడైన భరతుని చూపిస్తూ, ఈ కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖాన్ననుభవింపుము రాజా, ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధము, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, చల్లదనాన్ని కల్గించలేవు అంటుంది.

మరి ఈ ధృతరాషు్ట్ర కౌగిలి ప్రత్యేకత ఏమిటి? ఈ కౌగిలి వల్ల సుఖప్రాప్తి మాటెలా ఉన్నా అవతలివాడు బ్రతికి బట్ట కట్టలేడంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఈ కౌగిలి బలం ఎంత అని మాత్రమే.

"బలవన్మద నాగాయుతబలయుతుడు, సుతుండు పుట్టె ప్రజ్ఞాచక్షుం డలఘుడు ధృతరాష్ట్రుండా లలనకు నంబి కకు కురుకులప్రవరుండై" - పది వేలేనుగుల బలంతో కూడుకొన్నవాడు, బుద్ధియే చూపుగా గలవాడు (అంధుడైనా బుద్ధితో గ్రహింపగల్గినవాడు) ధృతరాషు్ట్రడు అంబికకు కురువంశ శ్రేష్ఠుడుగా కొడుకై పుట్టాడు.

అంధుడు కాబట్టి ఆ మహారాజు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. కాబట్టి ప్రజలు, ప్రత్యర్థులు బ్రతికిపోయారు అని ఊహింపవలసివస్తుంది. మరి ఈ కౌగిలికి దారి తీసిన పరిణామాలు తెలుసుకుందామా? ఈ కౌగిలి రహస్యం, బలం తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు అంటే ఆశ్చర్యకరంగా లేదూ?

విచిత్రవీర్యునికి జ్యేష్ఠపుత్రుడై యుండి, సార్వభౌముడగుటకు సర్వసామర్థ్యములు కలిగియుండి ఒక్క గుడ్డితనము చేత శాశ్వతముగా రాజయోగమునకు దూరమైనాడు ధృతరాషు్ట్రడు. తమ్ముడైన పాండురాజు హస్తినకు రాజైనాడు.

పాండురాజు ప్రభువైనను అధికారమత్తుడై అన్నగారిని విస్మరించలేదు. అన్నగారినే ప్రభువుగా భావించి, తానొక రాజప్రతినిధివలె పాలన సాగించాడు. అన్ని రాజకీయ వ్యవహారములు అన్నగారికి విన్నవించి నడిపించినాడు.
పాండురాజు పాలనలో ఆంబికేయుడు తృప్తుడు. అతని కొరతను, కలతను పాండురాజు ప్రేమ తీర్చినది. ఒక విధముగా ధృతరాషు్ట్రడే తమ్మునికి ఋణగ్రస్తుడు.

పాండురాజు శాపగ్రస్తుడగుటతో పరిస్థితులు తారుమారైనవి. తనకు, తన సంతతికి రాజయోగమే లేదనుకొన్న ధృతరాషు్ట్రని చేతికి, ఒక్కసారిగా రాజ్యమువచ్చినది. శాపస్వభావమును బట్టి పాండురాజుకు సంతతి కలుగు అవకాశమే లేదు. విశేషించి గాంధారి గర్భవతి. కథ అందరకు తెలిసినదే. పాండురాజు మరణం తరువాత పాండుకుమారుల హస్తినా ప్రవేశం ధృతరాషు్ట్రనకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టినది. కురుకుమారులలో ధర్మజుడు పెద్దవాడు. పాండురాజు రాజ్యమునకు వారసుడు.

కన్నకొడుకునకొక పదవి కట్టబెట్టదలచి, పరిస్థితుల ప్రాబల్యముచే అన్యుని కాపదవి నప్పగించిన వ్యక్తి శాంతచిత్తుడై జీవించుట కష్టము. నిర్మలమనస్కుడై మసలుట దుర్ఘటము. పైగా పదవి పొందిన వ్యక్తి బలపడుకొలది ఆవేదన అధికమగుట, అతని పతనమును గూర్చి ఆలోచన సాగించుట మానవనైజం.

యుధిష్టిర యౌవరాజ్యపట్టాభిషేకానంతరము ధృతరాషు్ట్రనకు నిద్దురపట్టలేదు. కారణం తన కుమారుల భవితవ్యం అంధకారబంధురమేనా ?

లోకమున పుత్రమమకారపీడితులు తమ పుత్రుల అభ్యుదయమునకై ఎట్టి అకృత్యములకైన పాల్పడగలరు. పుత్రుల అభ్యుదయమే వారి ధ్యేయం. అన్యులేమైనను వారికక్కరలేదు.

తనయుడు కోరినట్లు పాండవులను వారణావతము పంపినాడు. వారు లక్కయింట భస్మము కాలేదు సరి గదా, బ్రతికి బయటపడి పాంచాలిని గెల్చుకొన్నారు. పాంచాలసార్వభౌముని ఆసరా అందుకొన్నారు. యదువృష్ణిభోజాంధకుల బలము పొందినారు. శ్రీకృష్ణుని ప్రాపు సంపాదించుకొన్నారు. ఇక ఆంబికేయుడు, అతని పుత్రుడు వారిని జూచి భయపడకుందురా?

మనస్సు ఒకవైపు, మాట మరొకవైపు, అతని ఆంతర్యము కనిపెట్టుట అతికష్టము.

పాండవుల అభివృద్ధి గురించి వినటం వలన ఎంతో సంతోషం కలిగింది అని విదురుని మనస్సుకు సంతోషం కలిగేటట్లు పలికి, అంతఃపురానికి వెళ్లి దుష్టచతుష్టయంతో, "మాటలలో చేతలలో పాండవుల పట్ల ప్రీతి ఉన్నట్లే ఉంటాను, కాని నా మనస్సును విదురునికి ఎన్నడూ తెలియనీయను. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవాళ్లు. ఏం చేయగలం? ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి" అంటాడు.

బహిరంగంగా పాండవప్రీతి. అంతరంగంలో పాండవద్వేషం అతని స్వభావం. అందులో తండ్రీ కొడుకులు బింబప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది. ఆచరణ తండ్రిది.

భీష్ముడు అర్ధరాజ్య పరిష్కారమును ప్రతిపాదించాడు. అది అన్ని విధముల తమ కనుకూలము గనుక కౌరవులంగీకరించారు. ధృతరాషు్ట్రడు పాండవుల పిలిపించి, అర్ధరాజ్యముగా అరణ్యప్రాంతమైన ఖాండవప్రస్థమునిచ్చి పంపించినాడు. అడవిలో బడిన పాండవులు అభివృద్ధికి వచ్చినప్పుడు చూచుకొందము లెమ్మని తండ్రీకొడుకులు ఆ క్షణంలో ఆలోచించారు.

అనుకొన్నదొకటి, అయినదింకొకటి. అనతికాలముననే ధర్మరాజు తమ్ములు అన్ని దిక్కులూ జయించారు. రాజసూయయాగము చేసి ధర్మరాజు భావిసార్వభౌముడుగా ప్రకాశించినాడు. ఈ వైభవము తండ్రీకొడుకులకు అంతులేని మనోవ్యథను కల్గించినది. మాయాద్యూతము ప్రవర్తిల్లినది. దాని ఘోరపరిణామాలు ఊహించని విధంగా మలుపులు తిరిగి పునరూ్ద్యతంలో అరణ్య అజ్ఞాతవాసాలు పాండవులకు తప్పలేదు. విధివ్రాత తప్పింపలేరు గదా! అరణ్యాజ్ఞాతవాసులైన పాండవుల విషయమై విదురుడు ధృతరాషు్ట్రనితో, 
"జరిగింది జరిగిపోయింది. ఇకనైన నీవు పాండవులను తిరిగి రప్పించి వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వాలి. దానివలన నీవు ధర్మాన్ని నిలిపినవాడవుతావు అన్నాడు.
ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడు 'ఎన్నో చెడ్డ శకునాలు' ఏర్పడితే ఆనాడే నేను వీడి వలన కౌరవులకు కీడు కలుగుతుందని చెప్పి ఉన్నాను. కులానికి చేటు తెచ్చేవాడిని నిందించి కులాన్ని రక్షించటం ధర్మం. సమస్త భూరాజ్యానికి ధర్మరాజును రాజుగా చేయుము. అట్లా చేయటం వలన నీ కొడుకులు, మనుమలు, మిత్రులు, చుట్టాలు అందరున్నూ కాపాడబడతారు. ద్రౌపదికి, భీమునికి నిండుసభలో దుశ్శాసనుడి చేత క్షమార్పణలు చెప్పించుము.
అజాతశత్రువైన ధర్మరాజు, నీ కొడుకులు చేసిన కీడును మనసులో పెట్టుకోడు" అన్నాడు. 
ఆగ్రహం చెందిన ధృతరాషు్ట్రడు "నా కొడుకులు పైకి రావటం నీవు సహించలేవు. నీ సాయం నా కక్కరలేదు. నీవు పాండవుల దగ్గరకు గాని లేక నీకిష్టమైన మరొకచోటికి గాని పొమ్ము" అని అనగానే విదురుడు వెంటనే పాండవులుండే కామ్యక కాననానికి వెళ్లాడు.

విదురునివలె తన ఉపేక్షాభావమును గర్హించి హితవాక్యములు బోధించిన వ్యాసమహర్షికి, ధృతరాషు్ట్రడు చేతులు జోడించి -
"దుర్యోధనుండు నా పలుకులు వినండు, కురుకులంబు రక్షించు నట్టి బుద్ధిగలరేని వాని మీర శిక్షింపుడని మొక్కినాడు"

- నేటికీ, కొడుకు నా మాట వినడు మీరైన చెప్పి చక్కదిద్దుడని పెద్దలకు మొ్రక్కు ద్రుతరాషు్ట్రలు లోకమున పెక్కుమంది కన్పింతురు. అరణ్యము నుండి వచ్చినవారినందరిని ఆంబికేయుడు, పాండవుల విషయమడిగి తెలుసుకొనేవాడు. వారి బలపరాక్రమములను దలచి భయమొందేవాడు. అర్జునుడు దివ్యాస్త్రములు పొందెనని వ్యాసుడు చెప్పగా విని ఆవేదన చెందినాడు. భీముని భీకరాకారము నూహించి "వాడమిత్తి నాదు పుత్రమిత్ర తతికి" అని వాపోయాడు. భీమార్జునుల వీర విజ్రుంభణము నూహించుకుని, కౌరవనాశనము తప్పదని తలచి కుమిలిపోయినాడు. అర్జునుని దివ్యాస్త్రలాభమును, అదృష్టమును స్మరించి "ఒండేటికి వారి ధనము యుర్వియు సిరియున్" అని హతాశుడైనాడు.

ధృతరాషు్ట్రడింత నాటకమాడునే గాని పాండవులను పిలిచి రాజ్యభాగమిచ్చి సఖ్యముతో నుండుమని మాత్రం కుమారునకు చెప్పడు.

అరణ్య, అజ్ఞాతవాసపరిసమాప్తి పిమ్మట, పాండవుల కడకు సంజయుని పిలిచి, "వాసుదేవ సహితముగ పాండవుల గని, వారి విషాదమెమ్మెయి మాను, నమ్మెయి దగ పలుకవలయు" నని చెప్పి రాయబారమంపినాడు. కాని రాజ్యభాగ ప్రసక్తి మాత్రము తేలేదు.

విదురుని నీతివాక్యాలు ఆచరించవలసిన కర్తవ్యాన్ని కూడా గుర్తించక -
"నీవు సెప్పిన మాటలు నిర్మలములు నిపుణసమ్మతములు, రాజనీతిమార్గ బోధకంబులు నైనను బుత్రు విడువ నోప, ధర్మోజయతి అని యుండువాడ" - అని తన పుత్రస్నేహాన్ని నిస్సహాయతను వెలిబుచ్చాడు. శ్రీకృష్ణ రాయబారం తుదకు విఫలమై యుద్ధమనివార్యమయిన తరుణంలో తనవద్ద 11 అక్షౌహిణుల సేన, పాండవులకు 7 గలదని సంఖ్యాబలం పైననే ఆధారపడిన ధృతరాషు్ట్రనితో సంజయుడు -

"ఆ సేనకు నీ సేనకు వాసి యడిగెదీవు నన్ను, వసుదేవసుతుం డా సేన గలడు తత్సము నీ సేనం జూపు మానవేశ్వర నాకున్" - అని నిలదీసి అడుగుటతో, దైవబలం లోపించిన తన కుమారుని పరాజయం తథ్యమని, దిక్కుతోచక తల్లి గాంధారిని పిలిచి కుమారునకు హితం బోధించమన్నాడు.

యుద్ధారంభమున చివరి మాటగా శాంతి చేయుమని చెప్పిన వ్యాసమహర్షితో -
"హితమును ధర్మముం దలచి యిమ్మెయి చెప్పితి రిట్లు మున్ను నా సుతుల నయంబుమై దరిమి జూచితి, వారల పంపు సేయ నే జతురుడ గాను, ప్రాభవము సాలదు, నా దెస తప్పులేమి మీ మతి దలపోసి యీ పలుకు మానుడు, పాకము దప్పెకార్యముల్" - ఓ తండ్రీ, మీరు నా మీద గల ప్రేమతో పూర్వం కూడా ఈ విధంగా నాకు హితోపదేశం చేసారు. కర్తవ్యం బోధించారు. ఇదివరలో నేను కూడా నా కొడుకులకు బుద్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు నా అదుపు తప్పిపోయారు. వారిని ఆజ్ఞాపించగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నా యెడ తప్పులేదని మీరు గ్రహించ ప్రార్థన. దయచేసి నాకు హితవు చెప్పవద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని తమకు మనవి చేస్తున్నాను.

మహాభారతంలోని విచిత్రపాత్ర ద్రుతరాషు్ట్రనిది, అన్నీ తెలిసిన మూర్ఖుడు. "పాకము దప్పె కార్యముల్" నానుడి నేటికీ సామాన్యునకు కూడ సుపరిచితం.

కాని వింతలలోని వింత మానవస్వభావం, ధృతరాషు్ట్రడు సంధి సంధాతగా వచ్చు శ్రీకృష్ణునకే  లంచమిచ్చి తన కొడుకులవైపు త్రిప్పదలంచుట.

"నీ తలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచెదు ఇంత బేలైతి గదే, సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే యాతడు, క్రీడి భక్తియును, నచ్యుతు పెంపును, నీ వెరుంగవే ?"
- విదురుడు ధృతరాషు్ట్రనితో, మహారాజా నీ ఉద్దేశం నేను గ్రహించాను, ఏదో కానుకలు సమర్పించే మిషతో శ్రీకృష్ణుడికి లంచమిచ్చి తృప్తిపరచి పాండవుల విషయమై కార్యవిధానంలో భేదబుద్ధి కల్పించవలెనని యత్నిస్తున్నావు. నీవెంత తెలివిమాలినవాడవో చెప్పలేను. నీవు మేరుపర్వతంతో సమానమైన ధనం సమర్పించినప్పటికీ ఆయన అర్జునుడిని విడువడు. వాసుదేవుడిపై పార్థుడికున్న భక్తిప్రవత్తు లెటువంటివో, గోపాలదేవుడి గొప్పతనమెటువంటిదో తెలియనివాడవా నీవు?

ధృతరాషు్ట్రడు లోభి. శ్రీకృష్ణుడిని లోభపెట్టి వశం చేసికొనవలెనని యత్నించటం ఎంత అవివేకమో విదురుడు హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు భక్తితో వశమవుతాడు కాని లంచాలతో కాదని తేల్చి చెప్పాడు. ధృతరాషు్ట్రడి నైచ్యం ఈ భేదోపాయంతో తేటపడుతుంది.
యుద్ధారంభము మొదలు పాండవుల కన్నీ విజయములే. కౌరవులకన్నీ అపజయములే.
భీముని విజ్రుంభణము విని మదాత్మజుల గాల్ప బుట్టిన చిచ్చువాడని కలత నొందినాడు. కురుకుమారులు భీమునిచే చచ్చుట విని మూరి్ఛల్లినాడు. ఆ మహావీరుల మృతితో ఆంబికేయుని ఆశలు చాలవరకు అడుగంటినాయి. ఇక కుమారుని గెలుపు గోరుట "పేదముదుకడు వేశ్యాజనముం గోరుట" అని పెదవి విరచినాడు.

ఒక దశలో తన యవస్థ "పడుచు లీక లూడ్చి పట్టియాడెడు నట్టి పులుగు చందమయ్యె" నని తలచి దిగులొందినాడు. పడుచు పిట్టను పట్టుకొని దాని ఈకలు లాగివేసి ఎగురలేకుండా చేసి ఎట్లా ఆడిస్తే  అది అట్లా ఆడుతూ పడి ఉంటుంది. ఆలోచిస్తే నేను చేసిన కొన్ని కర్మలు నావాళ్లనందరినీ నాకు దూరం చేసి నన్ను నిస్సహాయుడిని చేసి అలా ఆడిస్తున్నవని దుఃఖించాడు.

తుదకు దుర్యోధనుడు తొడలు విరిగి పడుటతో ధృతరాషు్ట్రని ఆశాతంతువు తెగిపోయినది. దుఃఖాతిశయంతో "చావరు నొవ్వరు పాండవు లేవురునని నీవు చెప్ప నిప్పలుకులు దుఃఖావేశకరములై చేతోవృత్తి దహింపజొచ్చె దుర్భరభంగిన్" - పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమైన బాధను పొందలేదు. అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి.

సుయోధనుడు తుది ఘడియలో ఎంత బాధ అనుభవించెనో యని దుఃఖించినాడు. మానవుడు తప్పు చేయునప్పుడు దాని వలన కలుగు కీడు నూహింపలేడు. ఒక వేళ కొంత ఊహించినను అహంకారంతో, స్వార్థబుద్ధితో ఉపేక్ష వహించి యూరకుండును, కీడు మూడినపుడు మాత్రమే తన తప్పిదమును పలుమారు తలచి బాధపడును.

మహాభారత యుద్ధానంతరము పుత్రమిత్రబంధునాశనమునకు పెద్దగ దుఃఖించుచు ధృతరాషు్ట్రడు, భీష్మద్రోణాదులు చెప్పిన వచనములు పాటింపనైతినే యని పరితపించినాడు. తన లోభగుణమును తానే దూషించుకొన్నాడు. తన కారణముగనే ఇంత నాశము జరిగినదని విలపించినాడు. లోకమున నేటికీ పెక్కుమంది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనకపోయితినే అని బాధపడువారే.

తన కొడుకులెంత దుర్మార్గులైనను వారందరినీ హతమార్చిన వ్యక్తిని ఏ తండ్రి క్షమించగలడు? ఎవ్వరెంత ఓదార్చినను తన కొడుకుల తప్పు తనకెంత తెలిసినను రణరంగస్మశానంలో అడుగు పెట్టుసరికి ధృతరాషు్ట్రని హృదయమున పుత్రశోకము, భీముని మీది కోపము పొంగులు వారినది. తన నూరుమంది కుమారులను హతమార్చినది భీముడే!

భీముడి పేరు వినేసరికి ఆ గుడ్డిరాజు మొగంలో భయంకరమైన క్రోధం ప్రకోపించింది. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడు, భీముడిని అతడి వద్దకు పంపకుండా అంతకుముందే అమర్చి ఉన్న ఒక ఇనుప భీమవిగ్రహాన్ని ధృతరాషు్ట్రడి ముందు ఉంచాడు. దాన్ని నిజభీముడని భావించి గుడ్డిరాజు తన వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకొని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి బిగువులో భీముడి ఉక్కు విగ్రహం ముక్కలైంది. రాజు రొమ్ము చిట్లింది. ముఖరంధ్రాలన్నింటి నుండి రక్తం కారనారంభించింది. అతడు మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో, ఈనాటికి భీముడిని చంపగలిగాను, నా కొడుకు దుర్యోధనునికి ఈనాడే మోక్షం కలుగుతుంది - అని పలవరించాడు. మూర్ఛ తేరిన తర్వాత తాను లోలోన సంతోషిస్తూనే ఎవరేమనుకొంటారో అని భీముడి పేరు ఉచ్ఛరిస్తూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు.

శ్రీకృష్ణుడా కపటనాటకాన్ని చూచి నవ్వి, భీముడు బ్రతికి ఉన్నాడని చెప్పి ధృతరాషు్ట్రని దుర్బుద్ధిని బయటపెట్టి, పాండవులను చంపినా, చనిపోయిన కౌరవులు తిరిగి వస్తారా? ఇప్పటి చర్య వలన చెరగని మచ్చవంటి పాపం చేశావని, ఇకనైన పాండవులను సామరస్యంతో చూచి విజ్ఞతను ప్రకటించుమని హెచ్చరించాడు.

శ్రీకృష్ణుడి మాటలు విని, ధృతరాషు్ట్రడు పరితప్తుడై పాండవులను సొంతకొడుకులుగా చూచుకొంటానని మాట ఇచ్చాడు.

మితిమీరిన పుత్రమమకారంతో తగిన తరుణమున తనయుల దండింపక, తరువాత దండింప గలిగినా శక్తి చాలక, సుతుల మరణమునకు, సంఘనాశనమునకు పరోక్షకారకుడై పుత్రశోకములో అపకీర్తి పాలైన తండ్రి తత్త్వమును, మహాభారతము ధ్రుతరాషు్ట్రనిలో చిత్రించింది.


                                           *******

No comments:

Post a Comment