Saturday, December 1, 2012

దుష్టచతుష్టయంలో కర్ణుడు (Dushtachatushtayamlo Karnudu)

 మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచి-చెడ్డలను గురించిన పరిజ్ఞానం కలిగి ఉన్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నన్నయగారు పాండురాజు మరణానంతరం చెప్పిన మాటలు, కర్ణుని జీవితంలో అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నవి. దుష్టుల సాంగత్యం ఎవ్వరికైనా, ఏనాటికైనా పతనావస్థకు చేరుస్తుందన్నది అక్షరసత్యం.

దుర్యోధన-దుశ్శాసన-కర్ణ-శకునులు దుష్టచతుష్టయమని పేరుగాంచారు. మహాభారతంలో స్వయంగా శ్రీకృష్ణుడు కర్ణపర్వంలో ఈ దుష్టచతుష్టయం కావించిన దుశ్చర్యలను ఏకరువు పెట్టాడు.

1 . కుంతి, ఆమె కొడుకులు నిద్రపోతూ ఉండగా లక్క ఇంటిని కాల్పించి,  
2 . కపటపు జూదం కల్పించి అందులో ధర్మరాజు సంపదనంతా దొంగిలించి,  
3 . అంతటితో ఆగక ద్రౌపదిని నిండుసభలో ఆ విధంగా అవమానించి,  
4 . పాండవులను చంపటానికి ఘోషయాత్ర నెపంతో దాడిచేసి,  
5 . బాలుడైన అభిమన్యుడిని ఒక్కణ్ణి చేసి అనేక రథికులను అతడిపై పంపించి, చంపించడం. 
బాగా ఆలోచిస్తే ఈ పాపాల కన్నిటికీ మూలకర్త కర్ణుడు, క్షమార్హుడు కాడని, శ్రీకృష్ణుడు పార్థుని వధార్హుడయిన కర్ణుని వధించుమని ఆదేశిస్తాడు. 

ఆంధ్రమహాభారతంలో క్షమార్హములు కాని ఐదు దోషాలలో కర్ణుని వల్ల జరిగిన 2 సంఘటనలు, అతడు వధార్హుడేనని పాకులకు కావ్యాన్ని విశ్లేషిస్తే తెలుస్తాయి. 
1 ద్రౌపదీ వస్త్రాపహరణం - మూలకర్త కర్ణుడు. 2 ఘోషయాత్ర - మూలకర్త కర్ణుడు. 

ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేయాలన్న ఆలోచన దుర్యోధనునకు ఎలా వచ్చింది? మాయాజూదంలో పాండవసంపదనంతా హరించాలన్న ప్రణాళిక మాత్రమే దుర్యోధనునకు, శకునికి మధ్య జరిగిన అంగీకారం. జూదంలో సంపద హరించిన తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరవిషయాలు తెలుస్తాయి. సమస్తసంపదను ఓడిపోయిన ధర్మరాజును మరొక పందెం కాయమని శకుని బలవంతపెట్టాడు. వరుసగా సహదేవ, నకుల, పార్థ, భీములను, చివరకు తనను కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. గతిలేక కులభామ ద్రౌపదిని కూడా జూదంలో ఒడ్డి చివరకు ఆమెను కూడా ఓడిపోయాడు. సభలో కలకలం బయలుదేరింది. దుర్యోధనునకు పట్టపగ్గాలు లేవు. పాండవులు తనకు దాసులైనారని పొంగిపోయాడు. 

"వరవుళ్ల గలసి తన యిల్లు వరువడి దుడువంగ కృష్ణ బనుచు వగన్ భాసురరాజ్యదర్పమొప్ప విదురు చెచ్చెర బంచె దాని తోడ్కొని తేరన్"

దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవటానికి ద్రౌపదిని అజ్ఞాపించాలనే ఆలోచనతో రాజ్యగర్వంతో విర్రవీగుతూ - ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురున్ని వెంటనే ఆజ్ఞాపించాడు.
విదురుడు తిరస్కరించటంతో ప్రాతికామిని పంపి ఆమెను సభకు తోడ్కొని రమ్మన్నాడు.
అతడు పాంచాలి వద్దకు పోయి సంగతులన్నీ చెప్పి దుర్యోధనుడున్న సభకు రమ్మని పిలిచాడు. భార్యను జూదంలో ఓడిన రాజులు లోకంలో ఎవ్వరూ లేరని ఆశ్చర్యపోయింది ద్రౌపది. ఒక్క ధర్మసందేహాన్ని వెలిబుచ్చి దానికి ధర్మరాజు నడిగి సమాధానం తెమ్మన్నది. అతడు రమ్మంటే వస్తానని ప్రాతికామిని తిరిగి పంపింది.

"నా భర్త మొదట తన్నోడి తరువాత నన్నోడెనా? లేక ముందే నన్నోడి తరువాత తానోడెనా? అన్నీ నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు."

పై ప్రశ్నకు సమాధానం చెప్పక ధర్మరాజు దుఃఖాతిశయంతో మిన్నకున్నాడు. దుర్యోధనుడు కల్పించుకుని అధిక్షేపకాత్మకంగా ద్రౌపదిని తానే వచ్చి నిండుకొలువులో తెలిసికొమ్మని వెటకారం చేస్తూ మరల సేవకుడిని ద్రౌపది వద్దకు పంపాడు. పరిస్థితుల వైపరీత్యాన్ని ద్రౌపది గుర్తించి, ఏకవస్త్ర అయి ఉన్నా కన్నీటిధారలతో కదలి ప్రాతికామి వెంట కౌరవసభకు వచ్చి భీతయై ధృతరాషు్ట్రడి చెంత నిలిచింది. దుర్యోధనుడు మదోద్ధత్తుడై దుస్శాసనుడిని ఆజ్ఞాపించాడు- ఆమెను సభామధ్యప్రాంతానికి తీసుకురమ్మని. ఆమె భయకంపితురాలై గాంధారి యొద్దకు పరుగెత్తిపోయి నిలిచింది. ద్రౌపది తాను రజస్వలననీ ముట్టవద్దనీ ఎకవస్త్రనై పెద్దలున్న సభకు రాజాలననీ మొరపెట్టింది.

నీవు ఎకవస్త్రవైతే నేమి, విగతవస్త్రవైతేనేమి, అని ధిక్కరించి దుశ్శాసనుడు నిర్దయుడై రాజసూయావభ్రుతస్నానంతో పవిత్రమైన ఆమె దీర్ఘశిరోజాలను పట్టి నిండు సభకు లాగికొని వచ్చాడు.

దుర్యోధనుని తమ్ముడైన వికర్ణుడు, పక్షపాతం లేని బుద్ధిమంతులంతా ఇప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నకు విచారించవలసిన అవసరముంది. అలా విచారించకుండ మనకెందుకులెమ్మని ఊరకుంటే అది నరకహేతువౌతుంది. అంచేత ద్రౌపది అధర్మవిజిత  అని, ఏకవస్త్రను సభకు తేవటం అధర్మమని సభలో ఎలుగెత్తిచాటాడు.

అప్పుడు కర్ణుడు సభలో వికర్ణునితో "ఎల్లవారు నెరుగనొల్లని ధర్మువు, బేల! నీవు జెప్పనేలవలసె? జిరుత వాని కింత తరుసంటి  పలుకులు సన్నె వృద్ధజనములున్న చోట" - ఎవ్వరూ తెలియటానికి ఇష్టపడని ధర్మాన్ని మూఢుడా! నీవెందుకు చెప్పవలసి వచ్చింది? పెద్దవాళ్లుండే చోట చిన్నవాడికి ఈ అధిక ప్రసంగాలెందుకు? అని అధిక్షేపాత్మకంగా కర్ణుడు వికర్ణున్ని మందలించి-

సభలో కూర్చున్న ధర్మజ్ఞులంతా చూస్తుండగా ధర్మరాజు తన సర్వస్వాన్నీ ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపది అతనికి పరాయి మనిషి కాదు. అందుచేత అది కూడా ధర్మంగా జయించబడినట్లే. అలా కాకుంటే పాండవులంతా దానికి ఎందుకు అంగీకరిస్తారు?

"భార్యకు దైవవిహితుడైన భర్త యొక్క రుండ ఇది అనేక భర్త్రుక గావున బంధకి యనంబడు నిట్టి దాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే"దని కర్ణుడు బల్కెను.
-భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కుమంది భర్తలు గలది. అందుచేత బంధకి. ఇలాంటి దాన్ని బట్టలు లేకుండా నగ్నంగా తెచ్చినా తప్పులేదు అని కర్ణుడు వికర్ణుని మాటలు త్రోసిపుచ్చి పలుకగా దుర్యోధనుడు విని, దుశ్శాసనుని పిలిచి ఈ పాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకొమ్మని ఆజ్ఞాపించగా ఎంతో కీర్తిమంతులైన పాండవులు బలహీనులై తమపై బట్టలు ముందే తీసిపెట్టి ఆ సభలో నిలిచారు.

సజ్జనుల చేత నిందింపబడిన దుశ్శాసనుడు ఇది చేయగూడదని మనస్సులో విచారించక, అడ్డులేనివాడై ఆ ద్రౌపది కట్టుకొన్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండుసభలో విప్పాడు. ఆపకుండా అతడు విప్పుతున్నా ముందు తొలగించబడ్డ వస్త్రం వంటి వస్త్రమే ఆ లలితాంగి శరీరభాగం మీద ఎడతెగకుండా ఉండటం చూసి సభలోని సభ్యులంతా సంతోషించారు. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్ట పడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక పట్టు విడిచి, సిగ్గుచెంది ఊరకుండిపోయాడు.

కులకాంతకు ఇంతకంటే ఘోరావమానం ఏముంది? అయినా అంతమంది సభలో ఉండి, దాన్ని ఆపలేకపోయారు.

వస్త్రాపహరణాన్ని సూచించినవాడు కర్ణుడు. ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే.

అందుకే శ్రీకృష్ణుడు కర్ణుని ఈ అమానుషదుష్క్రత్యానికి మూలకర్తవు నీవేనని, వధార్హుడని అర్జునునకు యుద్ధభూమిలో చెప్పాడు.

ఘోష యాత్ర:
పాండవులు  ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారు. వనవాసక్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవ పట్టమహిషి అయిన ద్రౌపదిని తమ అనంతసంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి, తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది దుష్టచతుష్టయం. వ్యూహకర్త కర్ణుడే. అయినప్పటికీ పాపఫలం నలుగురిదీ అయినా ఫలభోక్త అయినవాడు దుర్యోధనుడే!

ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా, అట్టహాసంగా, సకుటుంబపరివార సమేతంగా దుష్టచతుష్టయం ఘోషయాత్రకు ద్వైతవనం బయలుదేరారు.

ఇంతకూ వీరి ఘోషయాత్ర ప్రధానోద్దేశము, ప్రణాళిక, అందువలన సాధించవలసినది ఏదో కర్ణుని మాటలలోనే విందాం.

కర్ణుడు దుర్యోధనునితో...
పాండవులు ఈ సమయంలో మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ దైన్యంతో ద్వైతవనంలో ఉన్నారు. నీవు ఇప్పుడు సార్వభౌముడవై గొప్ప సామా్రజ్యాన్ని ఏలుకుంటూ భోగ భాగ్యాలతో తులతూగుతున్నావు. ఇప్పుడు నీవు అక్కడికి సపరివారంగా వెళ్లి మండువేసవిలో ప్రకాశించే సూర్యుడు మాదిరిగా వారికి నీ తేజస్సు చాటి చూపుము.
మిత్రులను సంతోషపెట్టడం, శత్రువులను పరితపింపజేయటమే కదా సంపదలు కలిగినందుకు ఫలం.

"ధనధాన్య పుత్రబాంధవ జనలాభంబులును దలప సరిగావు సుఖంబున తాను తనరి శత్రులు ఘనతరదుఃఖముల నుండ గని యలరుటకున్" - తనకు ధనధాన్యాలు ఉండవచ్చును. బంధువులు తనతో సహకరించవచ్చును. కాని ఇది గొప్ప సంతోషయోగం కాదు. తాను సౌఖ్యాలతో విలసిల్లుతున్నప్పుడు తన విరోధులు మిక్కుటమైన వెతలను అనుభవించగా చూడటమే అచ్చమైన సంతోషయోగం. తనకు కలిగే మేలు కంటే శత్రువులకు కలిగే కీడు మాత్రమే అచ్చమైన ఆనందాన్ని కలిగిస్తుంది.

"నారలు గట్టి, కూర లశనంబుగ నుగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవోదారులమై కనుంగొని ముదంబున బొందగ గాంచు కంటె నింపారగ నొండు గల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వరా !" 
కౌరవులకు అధినేతవయిన ఓ దుర్యోధన సార్వభౌమా! సుకుమారసుందరమైన జిలుగు పట్టుపట్టాలు కాక ముదుక నారచీరలు ధరించి భయంకరమైన అడవిలో నివసిస్తూ కందమూలఫలాలు భక్షిస్తూ నికృష్టజీవితాన్ని గడుపుతున్నాడు అర్జునుడు. ఇక మనమా, దేదీప్యమానంగా వెలుగొందే భోగభాగ్యాలను అనుభవిస్తున్నవారం. మనం ఇప్పుడు అర్జునుడి దైన్యాన్ని కనులారా చూడటం కంటె మన జీవితాలకు ఇంకొక ధన్యత్వం గల్గుతుందా?

"అతుల సౌభాగ్య పుణ్యసమగ్రగరిమ నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి ధృతి దరిగి తన్ను దాన నిందించుకొనుచు హృదయమున బాండవాంగన యెరియవలదె?"
నీ రాణులు సాటిలేని సంపదలతో భోగభాగ్యాలతో అలరారుతుండటం చూచి ధైర్యాన్ని కోలుపోయి, తనను తాను నిందించుకొంటూ పాండవుల భార్య అయిన ద్రౌపది, తన దురవస్థకు లోలోన దుఃఖిస్తూ కుమిలిపోవాలి! 

కర్ణుని పలుకులకు దుర్యోధనుడు స్పందిస్తూ నీవు చెప్పిన మాటలు నాకు మిక్కిలి ప్రీతికరాలు. కాబట్టి తండ్రి అనుమతితో అలాగే చేద్దామని నిశ్చయించాడు. తర్వాత జరిగిన వృత్తాంతం అందరు ఎరిగినదే. కాదగిన కార్యాన్ని గంధర్వులే తీర్చారు.  "చెరపకురా చెడేవు" అన్న నానుడికి అక్షర సత్యంగా ఈ వృత్తాంతం ఎల్లకాలం నిలుస్తుంది.
ఇంతకూ ఈ విషాదాంత పరిణామానికి మూలకర్త కర్ణుడే. పాపఫలం దుర్యోధనుడే పొందాడు.

                                            ******

No comments:

Post a Comment