Sunday, November 4, 2012

ధన్యుడైన పూరుడు (Dhanyudaina Poorudu)

 పూరుడు పాండవ వంశకర్త, శర్మిష్ఠ యయాతుల కుమారుడు. తన యౌవనాన్ని తండ్రికి ఒసగి వెయ్యేళ్లు వృద్ధాప్యాన్ని తండ్రి నుండి గ్రహించిన త్యాగధనుడు. 
ఈ కథ లోకానికి అందించే మహత్తర సందేశం: 
"తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెదలో జేకొనడేని వాడు తనయుం డనబడునే?  పితృధనమున కర్హుండగునే?"

చంద్రుడు మొదలుకొని పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు అనేవారు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించిన వారి చరిత్ర వృత్తాంతం వివరంగా తెలుపవలసినదని కోరుతాడు ఆంధ్రమహాభారత పీఠికలో రాజరాజు నన్నయగారిని. పాండవులు, కౌరవులనీ, భరతవంశీయులనీ అనిపించుకున్నారు. పాండవులు గార్హస్థ్యధర్మాన్నీ, క్షత్రియ ధర్మాన్నీ, మానవ ధర్మాన్నీ పరిరక్షించిన మహనీయులు. వారి గార్హస్థ్యధర్మానికి త్యాగం, సత్యం అనేవి రెండు చక్రాలు. ఒకటి పూరుమహారాజు నిల్పిన వంశధర్మం. మరొకటి భరత చక్రవర్తి నిల్పిన వంశధర్మం. ఆ రెండూ పాండవులలో పరిపూర్ణత చెందాయి. కురుమహారాజు, పాండుమహారాజు చంద్రవంశంలో ప్రసిద్ధి చెందిన మహావీరులు. 

కథా భాగానికి వస్తే, పూరుడు నహుష చక్రవర్తి మనుమడు. యయాతి శర్మిష్ఠల  చిన్నకుమారుడు. యయాతి మహారాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య శుక్రాచార్యుని కూతురు దేవయాని (బ్రాహ్మణ కన్య). రెండవ భార్య శర్మిష్ఠ, వృషపర్వ రాక్షసరాజు కుమార్తె. దేవయాని సంతానం యదు, తుర్వసులు. శర్మిష్ఠ సంతానం ద్రుహ్యుడు, అనువు, పూరుడు. 

దేవయానికి ప్రాణస్నేహితురాలు శర్మిష్ఠ. వాళ్లిద్దరు స్నేహానురాగాలతో విహరిస్తూ ఉండేవారు. ఒకనాడు వేయిమంది కన్యలతో కలిసి శర్మిష్ఠ దేవయానిని కలుపుకుని ఒక సరోవరంలో స్నానం చేశారు. కన్యలందరు తమ తమ చీరలను ఒడ్డుపై నుంచి నీటిలో దిగి జలక్రీడలాడారు. సుడిగాలికి చీరలన్నీ కలిసిపోయాయి. ఒడ్డుకు చేరిన కన్యలు వారి వారి దుస్తులు గుర్తించి కట్టుకోగా, శర్మిష్ఠ తొందరలో దేవయాని చీరను కట్టుకొన్నది. దేవయానికి శర్మిష్ఠ చీరదక్కింది. ఆ చీర కట్టుకోవటానికి దేవయానికి ఇష్టం లేదు. లోకోత్తర చరిత్రుడైన శుక్రాచార్యుని కుమార్తెను, నీకు పూజ్యురాలిని, పైగా బ్రాహ్మణ స్త్రీని, నేను నీవు విడిచిన బట్టను కట్టుకోవచ్చునా చెప్పు అని శర్మిష్ఠను నిలదీసింది. 
దానికి ప్రతిగా శర్మిష్ఠ దేవయానితో "మా అయ్యకు బాయక పని సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్ మీయయ్య! వెండి మహిమలు నా యొద్దన పలుకనీకు నానయు లేదే?"
"మీ తండ్రి అయిన శుక్రుడు మా తండ్రి అయిన వృషపర్వుడిని విడువక సేవిస్తూ, ఆశీర్వదించి ప్రియవాక్యాలు పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్పతనాలు నా దగ్గర పలికేందుకు నీకు సిగ్గులేదా? నేను కట్టుకొన్న వస్త్రం నీవు కట్టుకోరాదా ఏమిటి" అని గర్వంతో దేవయానిని ఆ ప్రక్కనే ఉన్న పాడుబావిలో త్రోసి, వేయిమంది కన్యలతో ఇంటికి తిరిగిపోయింది శర్మిష్ఠ

అదే సమయంలో నహుష పుత్రుడు అయిన యయాతి వేటకై ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సరోవరంలో నీరు త్రాగటానికి ఆ తీరానికి చేరుకొన్నాడు. ప్రక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో దేవయాని ఆర్తనాదం విన్నాడు. వరుణదేవుని భార్యయే భర్తమీద అలిగి జలనివాసం విడిచి భూస్థలానికి వచ్చిందా అన్నట్లు ఆర్తమూర్తి అయిన దేవయానిని కళ్లారా చూశాడు. ఎవరు నీవని ప్రశ్నించాడు. తాను శుక్రాచార్యుని కూతురునని, ప్రమాదవశాత్తు బావిలో పడ్డానని చెప్పి, రక్షించుమని వేడుకొన్నది. 
ఆమె దయనీయ స్థితి చూచి, యయాతి తన కుడిచేతిని చాచి దేవయాని కుడిచేయి పట్టిలాగి, ఆమెను బావినుండి పైకితీసి యయాతి తన నగరానికి తిరిగి వెళ్లాడు
దేవయానిని వెతుక్కుంటూ ఘూర్ణిక అనే చెలికత్తె అక్కడకు వచ్చింది. ఇంటికి రమ్మని దేవయానిని కోరింది. కోపంతో మండిపడుతూ శర్మిష్ఠ చేసిన అవమానానికి ప్రతీకారం చేయదలచి తండ్రి శుక్రాచార్యులను పిలిపించమని ఆజ్ఞాపించింది. 

తండ్రి శుక్రాచార్యుడు ఆత్రుతతో వచ్చాడు. బిడ్డను ఓదారుస్తూ క్రోధం వలన కలిగే అనర్థాలను బోధించాడు. శర్మిష్ఠ రాచకూతురు. చిన్నపిల్ల. ఆమెతో నీకు పంతమెందుకు ఇంటికి రమ్మని అనునయించాడు. 

ఈ వృషపర్వ నగరంలో నేను ప్రవేశించనని, ఎక్కడికైన వెళతానని బెదిరించింది. శుక్రుడికి ఎలా సముదాయించాలో తోచక కుమార్తె మాటను కాదనలేకపోయాడు. ఈ విషయం రాక్షసరాజు వృషపర్వుడు గూఢచారుల వల్ల తెలిసికొన్నాడు. శుక్రాచార్యులవద్దకు వచ్చి వినయంతో నమస్కరించాడు. శుక్రాచార్యుల మృతసంజీవని విద్యాప్రభావంతో దేవతలను మించే సంపదను దైత్యులు పొందారని, ప్రాణాలతో బ్రతుకగలిగారని, దేవయాని మనసుకు ఏది ఇష్టమైతే దానిని తప్పక ఇస్తానని వృషపర్వుడు అన్నాడు. దానికి దేవయాని సంతోషించింది. వేయిమంది చెలికత్తెలతో కూడిన శర్మిష్ఠ తనకు దాసిగా ఉండాలని కోరింది. 
ఆ మాటను కాదనలేక వృషపర్వుడు అంగీకరించాడు. శుక్రుడు సంతోషించాడు. శర్మిష్ఠ కన్యకాసహస్రంతో ప్రతిరోజూ దేవయానిని సేవిస్తున్నది. 

ఒకనాడు అందరూ కలిసి ఉద్యానవనం వెళ్లారు. ఆ సమయంలో యయాతి వేటకై వచ్చి వనంలో ప్రవేశించాడు. దేవయానిని చూచి అతిథి సత్కారాలను పొందాడు. ఆమె ప్రక్కనే ఉన్న "అతిశయ రూపలావణ్య గుణసుందరి" అయిన శర్మిష్ఠ ఎవరని ప్రశ్నించాడు. దానికి దేవయాని శర్మిష్ఠ తనకు దాసియని, వృషపర్వుని కూతురని చెబుతుంది. 
దేవయాని యయాతియందు అనురక్తురాలై తనను వివాహం చేసుకోమంటుంది. నూతినుండి బయటకు తీసిననాడే సూర్యుడే సాక్షిగా నీ కుడిచేతితో నా కుడి ముంజేతిని గ్రహించావు కాబట్టి ఇంతకుముందే నన్ను వివాహం చేసికొన్నావు. నీవు మరవటం న్యాయమా అని నిలదీస్తుంది. 
దేవయాని మాటలకు యయాతి అభ్యంతరం, ఆశ్చర్యం ప్రకటిస్తూ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడటం ధర్మవిరుద్ధమని పేర్కొన్నాడు. దేవయాని తన వాదన వీడక, సకలలోక పూజ్యుడైన శుక్రాచార్యుడు ఈ వివాహాన్ని అంగీకరిస్తే నన్ను నీదానిగా స్వీకరిస్తావా? అని అడుగుతుంది. తనకు అభ్యంతరం లేదంటాడు యయాతి. తండ్రిని పిలిపిస్తుంది దేవయాని. విషయం వివరిస్తుంది. 
పుత్రికా వ్యామోహంతో ఆమె వివాహాన్నిసమర్థిస్తాడు శుక్రాచార్యుడు. అపక్రమదోషం లేకుండా వరమిచ్చాడు. వైభవంగా వివాహం ఇద్దరకూ చేసాడు. దేవయానితో పాటు సహస్ర కన్యా పరివృత అయిన శర్మిష్ఠను అరణంగా ఇచ్చాడు. వారందరికీ అన్నపాన, భూషణాది సౌకర్యాలను యయాతి కల్పించాలని, కాని శర్మిష్ఠతో కలసి శయనించడం పరిహరించాలని ఆజ్ఞాపించాడు. 

యయాతి దేవయానిని, శర్మిష్ఠను, కన్యాసహస్రాన్నీ వెంట తీసుకొని నగరానికి వెళ్లాడు. దేవయానిని మహారాణివాసంలో ఉంచాడు. శర్మిష్ఠను అశోకవనంలో ఒక గృహంలో ఉంచాడు. దేవయానికి యదుతుర్వసులనే ఇద్దరు కుమారులను సంతతిగా పొందాడు. 
దేవయాని స్వార్థపరురాలైన అహంకారిణి. చేయి చేయి కలిసింది కాబట్టి తనకు యయాతితో పెళ్లైపోయిందని వితండవాదంతో (సమయానుకూల వాదం) వివాహమాడింది.  తండ్రిని తన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడేటట్లు చేసింది. భర్తకు తనకు తాను సమర్పించుకోవటానికి బదులు భర్తయే తనకు సమర్పితం కావాలని కోరుకున్నది. అతని గార్హస్థ్యధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్జ్వలించింది. 

మృతి చెందుతున్న మానసిక గార్హస్థ్యధర్మం యయాతిలో మరలా పునర్జీవింపజేసి అనన్యసామాన్యమైన సౌందర్యంతో, యౌవనంతో పతిని పొంది సుఖించాలని, సుతుల బడయాలని శర్మిష్ఠ ఉవ్విళ్లూరింది
దేవయాని ఏ విధంగా యయాతిని కోరి వరించి సాధించుకొన్నదో ఆ విధంగానే తాను మహారాజు మనసు దోచాలని ఆశపడింది. అదృష్టవశాత్తు ఒకనాడు యయాతి అశోకవనం వైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను చూచాడు. సంభ్రమాశ్చర్యాలతో రాజుకు నమస్కరించింది శర్మిష్ఠ
ఆ దేవయానిని పరిగ్రహించినపుడే ఆమెతో అరణంగా వచ్చిన నేను కూడా నీకు పరిగ్రహయోగ్యురాలనే, కాబట్టి నీవు కరుణించి నన్ను కూడా నీ సతిగా స్వీకరించుమని ప్రార్థించింది.
ఈ లోకంలో భార్య, దాసి (సేవకురాలు), సంతానం అనేటువంటివి పరస్పరం విడదీయరాని ధర్మాలు (విధులు) అంటూ లోకధర్మంతో సమర్థించింది. 
యజమానురాలైన దేవయానికి భర్తవు అయినట్లే దాసికి కూడా భర్తవౌతావని సూచించింది. ఈ ధర్మం వలన దేవయాని నియమానికి భంగం రాదు అన్నది. 

యయాతి, శుక్రాచార్యుడు విధించిన నియమాన్ని కాదనలేనని వివరిస్తాడు. శర్మిష్ఠ ఆపద్ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రాణం మీదకు వచ్చినప్పుడు, సర్వసంపద అపహరింపబడేటప్పుడు, విప్రవధ జరిగే సమయంలో బ్రాహ్మణరక్షణ కొరకు, స్త్రీజన సమాగమవిషయాన, పెళ్లివేళలందు అసత్యమాడవచ్చును - అని మునివచన ప్రమాణం ప్రస్తావించి వధూజనసంగమ విషయం కాబట్టి, పెళ్లి సమయాన యయాతి ఒడబడిన కారణాన బొంకవచ్చునని నచ్చచెబుతూ, నీకు అసత్యదోషం కలుగదంటుంది. 

యయాతి శర్మిష్ఠకు అనుకూలుడై ఆమె అభిమతాన్ని అంగీకరించాడు. అతని వలన ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. దేవయానికి ఆ సంగతి తెలిసి శర్మిష్ఠను, పుత్రుడెలా కలిగాడని ప్రశ్నిస్తుంది. శర్మిష్ఠ ఒక మహాముని వరం వలన పుత్రుడు జన్మించాడని పేర్కొన్నది. అటు పిమ్మట శర్మిష్ఠకు ముగ్గురు కుమారులు పుట్టారు. ముగ్గురు కలిసి త్రేతాగ్నుల వలె ఆడుకుంటున్న సమయంలో దేవయాని ఆ ప్రదేశానికి వస్తుంది. యయాతి ప్రతిరూపాలుగా ఉన్న ఆ కుమారులను చూచి యయాతిని వారెవ్వరని అడిగింది. ఆయన నిరుత్తరుడు కాగా, బిడ్డలను ప్రశ్నించగా, వారు యయాతి - శర్మిష్ఠలను తండ్రి, తల్లిగా గుర్తించారు. 

తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠ వలన సంతానాన్ని పొందటం తెలిసికొని, కోప దుఃఖంతో తండ్రి వద్దకు శీఘ్రంగా చేరి తండ్రి పాదాలపై బడి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. యయాతి కూడా దేవయానిని అనునయిస్తూ శుక్రాచార్యుని ఆశ్రమం చేరాడు. కథనంతా వివరించి యయాతి తనకు తీరని అన్యాయం చేశాడని విన్నవించింది. 
శుక్రాచార్యుడు యయాతి పలుకులను ఆలకించక, తన ప్రియకుమార్తెకు యౌవనగర్వంతో రాగాంధుడై అప్రియం చేశాడు కాబట్టి జరాభార పీడితుడుగా కావాలని శపించాడు. 
యయాతి వినయంతో ఋతుమతి అయి పుత్రార్థం పతిని కోరితే, భార్యకు ప్రతికూలుడై ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యాదోషం వస్తుందని తెలిసి శర్మిష్ఠ ప్రార్థనను అంగీకరించి ఆమె యందు సంతానం పొందానని, దానికి కోపించి శపించటం న్యాయం కాదని శాపాన్ని నివారించాలి అని వేడుకున్నాడు. నాకు నీ కుమార్తె యందు విషయోపభోగవిరక్తి కలుగలేదని శాపనివారణ కోరాడు. 

శుక్రుడు శాంతించి శాపసంహారాన్ని సూచించాడు. శాపం వలన కలిగిన జరాభారాన్ని యయాతి కొడుకుల్లో ఎవరైనా ధరిస్తే, అతని యౌవనాన్ని గ్రహించి యయాతి విషయోపభోగాలను పొందవచ్చని, భోగతృప్తి తరువాత యయాతి జరాభారాన్ని తీసుకొన్న కుమారునకు యౌవనాన్ని తిరిగి ఇవ్వవచ్చుననీ ఆ విధంగా ఆ యౌవనాన్ని ఒసగిన పుత్రుడే రాజ్యర్హుడౌతాడని, శుక్రుడు ఆదేశించాడు. 

రాజధానికి తిరిగివచ్చిన యయాతిని శాపం కాటేసింది. జరాభారం దాల్చాడు. తల వణకటం మొదలు పెట్టింది. ఇంద్రియాలమదం అణగింది. అవయవాలు సడలినాయి. శరీరాన ముడతలు ఏర్పడ్డాయి. వెంత్రుకలు నెరిశాయి. ఉబ్బసం, తలనొప్పి, పొడిదగ్గు (ముసలితనపు లక్షణాలు) కలిగాయి. 

కొడుకులను పిలిపించి క్రమంగా అందరినీ జరాభారాన్ని తీసికొని యౌవనాన్ని ఇమ్మని అడిగాడు. పూరుడు తప్ప మిగతా వారంతా ముక్తకంఠంతో "తగిలి జరయు రుజయు దైవనశంబున నయ్యెనేని వాని ననుభవింత్రు గాక, యెరిగి యెరిగి, కడగి యా రెంటి జేకొందురయ్య ఎట్టి కుమతులైన"- ముసలితనము, రోగము విధివశాన ఎవరికైన కలిగితే వారు వాటిని అనుభవిస్తారు కాని, తెలిసి తెలిసి మరొకరి నుండి కావాలని ఆ రెండింటిని ఎంత బుద్ధిహీనులైనా గ్రహిస్తారా?

"నరలు గల కామునైనను తరుణులు రోయుదురు డాయ ధనసతి యుయ్యుం బురుషుడు దుర్వార జరాపరిభూతి నభీష్టభోగబాహ్యుడ కాడే"
నెరసిన వెంట్రుకలు కలిగిన మన్మథుడినైనా యౌవన వతులు సమీపించటానికి అసహ్యించుకొంటారు. పురుషుడు ధనవంతుడైనా కూడా (కుచేలుడైనా) వారించ శక్యం కాని ముసలితనం కలిగే రోతచేత ఇష్టములైన భోగాలు పొంద వీలులేనివాడు కాడా? - అంటూ నలుగురు కొడుకులు తండ్రి మాటను తిరస్కరించారు. 

కోపం చెందిన యయాతి, యదువంశం వారిని (యాదవులను) రాజ్యానికి అయోగ్యులని శపించాడు. తుర్వసువంశం వారు కిరాతకులకు రాజులవుతారని, ద్రుహ్యవంశం వారిని జలప్రాయమైన అరణ్యదేశాలకు రాజులయ్యేట్లు, అనువంశం వారిని అల్పాయుష్కులుగా శపించాడు. 

చిన్నకుమారుడు పూరుడు మాత్రం, ప్రత్యక్షదైవాలుగా తల్లిదండ్రులను కీర్తిస్తూ తనువిచ్చిన తల్లిదండ్రులకు తనువిచ్చుకోవటం తనయుల సుకృతమని కొనియాడాడు. తన యౌవనాన్ని తండ్రికి దానం చేశాడు. వేయి సంవత్సరాలు అభిమతసుఖాలను అనుభవించి తృప్తుడై, పూరుని యౌవనాన్ని తిరిగి ఇచ్చి తన జరాభారాన్ని స్వీకరించి యయాతి పూరునకు పట్టాభిషేకం చేసి, వంశకర్తగా నిలిపాడు. పూరుని ధర్మం త్యాగం. త్యాగమే యయాతి గార్హస్థ్యధర్మానికి అమృతత్వసిద్ధిని ఇచ్చింది. 

తండ్రి ఆస్తికి వారసుడు అగ్రజుడు కాడు, తల్లిదండ్రుల మాట గౌరవించినవాడు అని యయాతి ప్రజలకు ధర్మం వివరిస్తాడు. పెద్ద కుమారుడైన యాదవుని కాదని చిన్నకుమారుడైన పూరునకు రాజ్యమిచ్చినందుకు ప్రశ్నించిన ప్రజలకు రాజు జవాబు, 
"తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెదలో జేకొనడేని వాడు తనయుం డనబడునే?  పితృధనమున కర్హుండగునే ?"
కొడుకు తల్లిదండ్రులాజ్ఞాపించిన పని చేయకపోతే, వారిమాట పట్టించుకోకపోతే (జవదాటితే) అట్టివాడు కొడుకు అనబడతాడా? తండ్రి ఆస్తికి యోగ్యుడు అవుతాడా? కాదు. 
ఈ కథాభాగం ఆదిపర్వంలో నన్నయ కృతం. విలక్షణమైన కథ.  

                                              *****

                         

No comments:

Post a Comment