Sunday, October 21, 2012

పక్షీంద్రుడు గరుత్మంతుడు (Paksheendrudu Garuthmanthudu)

అనూరుడు, వినతా సుతుడు, అగ్రజుడు. తొడలు లేనివాడుగా జన్మించాడు. తాను వికలాంగుడగుటకు తల్లియే కారణమని నిందించి, సవతి కద్రువకు దాసివి కమ్మని శాపమిచ్చాడు. రెండవ గుడ్డు నుండి దాస్యవిముక్తి కావించే కుమారుడు జన్మిస్తాడని, 500 ఏండ్లు కళు్ల కాయలు కాచేటట్లు ఎదురుచూచింది వినత.  

రెండవ కుమారుడు గరుత్మంతుడు తల్లి దాస్యవిముక్తికై కద్రువ కుమారులు కోరిన అమృతాన్ని తెచ్చేందుకు స్వర్గంలో ఇంద్రాది దేవతలను ఎదిరించదలచాడు. 
దేవగణాల ఆయుధ సంపత్తి అపారము, సైన్యము విస్తారము. తన ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు, భగవద్ధత్తములు. అవే పక్ష తుండాగ్ర నఖములు (రెక్కలు, ముక్కుచివరలు, గోళ్లు).  గరుత్మంతుడు ఏకాకిగా ఇంద్రాది దేవతలతో పోరాడి ఎలా విజయం సాధించాడో చదవండి. 

ఎందరో రాక్షసులు వరగర్వితులై ఇంద్రునిపై దండెత్తినవారున్నారు. అధికసేనా బలంతో వారు ఇంద్రుని జయించి స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించారు. 
కాని ఒకే ఒక పక్షి - ఇంద్రసమానుడు స్వర్గంపై దండెత్తగా విన్నారా? మరి ఇతని సాహసం వెనుక దాగిన రహస్యమేమో చదివి తెలుసుకుందాం. 
ఈ సౌపర్ణ (గరుత్మంతుని) కథ ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వంలో నన్నయ చేత రచితమైనది. 

కశ్యప ప్రజాపతి భార్యలు కద్రూవినతలు. కద్రువ నాగమాత, వినత అనూరుడు, గరుత్మంతుల తల్లి. వీరు గర్భాండముల నుండి జన్మించినవారు. కద్రువ గర్భంలోని అండాలు ఒక దాని తర్వాత ఒకటిగా పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, మొదలైన వేయిమంది సర్పశ్రేష్ఠులు పుట్టారు.
వినత తన గర్భం నుండి పుట్టిన రెండు గుడ్లనుండి కుమారులు ఎంత కాలానికీ బయల్పడని కారణాన, కృంగినదై ఒక గుడ్డును బద్దలయ్యేట్లు చేసింది. 
ఆ గుడ్డు నుండి కింది సగదేహం లేని వాడున్నూ, మీది సగదేహంతో కూడినవాడైన అరుణుడనే కుమారుడు గొప్ప నీతిమంతుడు తల్లికి అప్రియంగా పుట్టాడు. 
తాను వికలాంగుడగుటకు తల్లి కారణమని నిందించి, అనూరుడు తల్లికి శాపమిచ్చాడు. 500 సంవత్సరాలు తన సవతికి దాసిగా ఉండుమని. రెండవ గుడ్డు నుండి పుట్టబోయే కుమారుడు గొప్ప బలపరాక్రమములు గలవాడని, తన దాసత్వాన్ని పోగొడతాడని తెలిపి, అనూరుడు సూర్యుడి రథసారథిగా వెళ్లాడు.
కద్రూవినతలు సముద్రతీరాన ఒకనాడు ఇంద్రుని అశ్వాన్ని చూచారు.
గుఱ్ఱాన్ని చూచిన కద్రువ వినతతో మిక్కిలి తెల్లదైన ఆ గుఱ్ఱంలో, నిండుచంద్రుడిలోని మచ్చవలె తోకభాగం నల్లగా ఉన్నది అనగా, వినత నవ్వి, మహాత్ముని కీర్తివలె మిక్కిలి తెల్లనిదైన ఈ గుఱ్ఱానికి మచ్చ ఎక్కడిదని ప్రశ్నించింది. 
గుఱ్ఱం తెల్లని దేహంలో మచ్చ ఉంటే నీవు నాకు దాసివి, లేకుంటే నేను నీకు దాసినౌతానని పందెం కాసి రేపు చూద్దామని గృహాలకు కద్రూవినతలు వెళ్లారు.
ఇంటికి వెళ్లిన నాగమాత తన పుత్రులకు ఈవిషయం తెల్పి, పుత్రులకు తన ఆజ్ఞగా ఆ తోకను నలుపు చేసే విధంగా వేలాడమని చెప్పింది. నాగులు ఇది అధర్మమని తల్లిమాట తిరస్కరించగా, జనమేజయ సర్పయాగంలో పాములు మరణం పొందుతాయని శాపమిచ్చింది. 
శాపభయానికి వెరచి, కర్కోటకుడు తల్లి ఆజ్ఞ పాటించి, గుఱ్ఱం తోకకు వేలాడగా పందెం నియమం ప్రకారం వినత ఓడి, కద్రువకు దాసిగా 500 ఏండ్ల పాటు ఆమె చెప్పిన పనులు చేస్తుండగా-
రెండవ గుడ్డు పగిలి విశాలమైన రెక్కల గాలుల వేగానికి కులపర్వతాలు, సముద్రాలు సంక్షోభించగా, సూర్యకాంతినే తిరస్కరించే తేజస్వియైన కుమారుడు పుట్టి తల్లికి ప్రియం చేస్తూ ఆకాశానికి ఎగిరాడు. ఆతడే పక్షీంద్రుడు గరుత్మంతుడు.

విస్తుపోయిన దేవతల సమూహం ఆ కాంతి, ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల సముదాయమేమోనని అగ్నిసూక్తాలతో స్తుతించింది. వజ్రాయుధం దెబ్బ నెరుగని పెద్ద రెక్కలతో కూడిన కులపర్వతం వలె గరుడుడు తల్లి వినతకు నమస్కరించాడు. సవతి తల్లియైన కద్రువ ఆజ్ఞననుసరించి, దాస్యానికి లోబడి పాములను వీపున మోస్తూ సేవ జేస్తున్నాడు.

తల్లి ద్వారా జరిగిన మోసాన్ని, అన్న (అనూరుడు) శాపకారణాన్ని గ్రహించినవాడై తల్లి దాసత్వాన్ని పోగొట్టేందుకు ఏమిచెయ్యాలని పాములను కోరగా, వారు స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి దాసత్వాన్ని పోగొట్టుకొనేట్లు వివరించగా, గరుడుడు  అమృతం తెచ్చేందుకు స్వర్గానికి పయనమయ్యాడు ఏకాకిగా, తల్లి ఆశీర్వాదబలంతో. 
పక్షీంద్రుడైన గరుడునితో ఇంద్రాదిదేవతల యుద్ధం గురించి విలక్షణమైన రచన నన్నయది. గరుడుని ఆయుధాలు ప్రకృతిసిద్ధాలు. అవి పక్షతుండాగ్రనఖములు (రెక్కలు, ముక్కు చివరలు, గోళ్లు), భగవద్దత్తములు. వాటి బలం గరుడుని మాటలలోనే తెలుసుకుందాం. 

"ఆయతపక్షతుండ హతి అక్కులశైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును, ప్రసిద్ధియునుం గల నాకు" - కులశైలములన్నింటిని నా విశాలమైన రెక్కలతో, వాడియైన ముక్కు తోటి దెబ్బలతో, పొడిగా చేసే గొప్పబలమున్నూ ప్రసిద్ధియున్నూ నాకు గలదు. 

"స్థావరజంగమ ప్రవితతంబగు భూవలయంబు నెల్ల నా లావున బూని దాల్తు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్షసమీరణంబునన్ దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు త్రివిష్టపంబులన్". 

"దేవగణాధిపా, ఇంద్రా! చరాలు, ఆచరాలయిన పదార్థాలతో నిండినట్టి భూమండలాన్నంతటినీ నా బలంతో వంచి మోస్తాను. పెద్దవయిన నారెక్కల గాలితో, దాటశక్యం గాని సముద్రజలాన్నంతటినీ రత్నాల సమూహంతో పాటుగా వెదజల్లుతాను. మూడు లోకాలను క్షణంలో చుట్టివస్తాను."

ఇక దేవతల విషయానికి వస్తే, ఇంద్రుని సైన్యం...సిద్ద సాధ్య, సుర, యక్ష, కిన్నర, కింపురుషాదులు, అష్టదిక్పాలకులు, వసువులు, రుద్రులు మొదలైన దేవతాగణాలు.
వారి ఆయుధ సంపత్తి - పరశు (గొడ్డలి), కులిశ (వజ్రం), కుంత (బల్లెం), ప్రాస (ఈటెలు), బాణములు, ఉద్యత్పరిఘ (పైకెత్తబడిన గుదియ), చక్రాలు మొదలైన ఆయుధసమూహం, మరియు ఇంద్రుని వజ్రాయుధం. 
ఇంద్రాది దేవతలతో గరుత్మంతునకు జరిగే యుద్ధాన్ని వీక్షిస్తాం-

"పక్షతుండాగ్ర నఖక్షతదేహులై బోరన నవరక్తధార లొలుక 
విహగేంద్రునకు నోడి విహతులై సురవరుల్ సురరాజు మఱువు జొచ్చిరి కలంగి 
సాధ్యులనాయాససాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడిగి,
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల క్రియ దక్షిణాశ్రితులయిరి భీతి వంది
యపరదిక్కు బొందిరాదిత్యులు, అశ్విను లుత్తరమున కొనర బఱచి;
రనల వరుణ పవనధనదయమాసురుల్ వీకు దఱిగి కాందిశీకులైరి". 

గరుడుని రెక్కలచే, ముక్కు కొనచే, గోళ్లచే దెబ్బతిన్న శరీరం గలవారై, భోరుమని నెత్తుటి ధారలు కారుతుండగా గరుత్మంతుడి చేత విజితులై, హింసితులై, దేవశ్రేష్ఠులు ఇంద్రుడి చాటుకు చేరారు. సాధ్యులనే దేవతాగణం శ్రమ లేకుండా విజితులై గర్వం విడిచి తూర్పుదిక్కుకు పారిపోయారు. వసువులు, రుద్రులు, సంపదలేని బ్రాహ్మణుల వలె దక్షిణ దిక్కును ఆశ్రయించారు. (సంభావన, దక్షిణ). పండ్రెండుగురు సూర్యులు కలత చెంది పడమటి దిక్కును పొందారు. అశ్వినీదేవతలు ఉత్తరదిక్కుకు పారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయవు, కుబేరుడు, యముడు, అసురుడైన నైఋతి అనే దిక్పాలురు దిక్కు తెలియక చెల్లాచెదరై పారిపోయారు. దిక్కులు గల దిక్పాలకులు ఏ దిక్కులూ లేనివారు కాగా (కాందిశీకులు), ఏ దిక్కులేనివారు దిక్కులను ఆశ్రయించారు. 
ఎంత కమ్మటి రమణీయ అద్భుతభావన! అందుకే నన్నయగారు ఋషితుల్యులు, చదువరులు సుహృజ్జనులు. 

దిక్కులను చెప్పునప్పుడు ఒక క్రమం పాటించుట కవులకు పరిపాటి (ఆ పటీరాచల పశ్చిమాచల, హిమాచల పూర్వదిశాచలంబులన్) (మనుచరిత్ర). నన్నయగారు కావాలనే యిచట క్రమమును పాటించలేదు.  కారణం వారు చెల్లాచెదరైరని సూచించుటకు. అనల వరుణ పవన ధనద యమాసురుల్ అని సర్వలఘువులుగా ఆ దిక్పాలకులను చెప్పటం అల్పత్వమును సూచించుటయే.

సర్వదేవతాగణాలిలాగ పరాజితులు కాగా ఇంద్రుడు, దేవగురువు బృహస్పతి వారించినా వినక వజ్రాయుధాన్ని గరుత్మంతునిపై విసరగా, సుపర్ణుడు "మదీ యైకపర్ణ శకలచ్చేదము గావింపుమని (నాదైన ఒక్క ఈకముక్కను మాత్రము త్రుంచివేయుమని), నాపై నీ శక్తి ఇంత మాత్రమేనని, నీవు గొప్ప ముని (దధీచి) సంభవవు. నిన్నవమానించను" అని పలుకగా, సర్వభూత సమూహం అతని రెక్కల దృఢత్వానికి మెచ్చుకొని సుపర్ణుడని స్తుతించారు. 

ఆ విధంగా ఇంద్రాదిదేవతలను జయించి అమృతభాండాన్ని గ్రహించి, అమృతాన్ని రుచి చూడకుండా, అనాసక్తుడైన గరుత్మంతుని పరాక్రమానికి ముగ్ధుడై, విష్ణువు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. 

అప్పుడు విష్ణువునకు నమస్కరించి "అమృతం ఆస్వాదించకుండానే ముసలితనం చావు లేకుండటాన్నీ, అన్ని లోకాలకు అధిపతివైన నీ యెదుటను మిక్కిలి భక్తితో నిన్ను సేవించటాన్నీ కోరుతాను. దయతో ఇమ్ము" అని గరుత్మంతుడు కోరగా, సంతోషించినవాడై అతని కోర్కెలను మన్నించి, నీవు నాకు వాహనంగా గొప్ప జెండాగా ఉండుమని దీవించాడు. 

అమృతంతో వెళ్తున్న గరుడుని దేవేంద్రుడు ప్రస్తుతిస్తూ..
అమరుడవు - మరణం లేనివాడవు.
అజరుడవు - ముసలితనం లేనివాడవు.
అజితుడవు - పరాజయం లేనివాడవు. 
అమేయుడవు - కొలది (పరిమాణం) లేనివాడవు.
నీకు అమృతం ఎందుకు అని ప్రశ్నించగా, నా తల్లి వినతా దాస్యం తొలగించే నిమిత్తం కద్రువ కుమారులైన పాములు కోరిన అమృతం కొనిపోయి, వాళ్లకు ఇచ్చిన పిమ్మట వారలు ఈ అమృతం తాగకముందే నీవు తస్కరించుమన్న గరుడుని పలుకులకు సంతసించి నాతో నెప్పుడు బద్ధస్నేహం కలవాడవు కమ్మనగా, గరుడుడు అందుకు సమ్మతించి, అందుకు ప్రతిగా నా తల్లి అయిన వినతకు అపకారం చేసిన కొడుకులు తనకు ఆహారం కావాలని కోరగా, ఇంద్రుడు అంగీకరించాడు.

సురాసురులు సముద్రమథనం చేసి సాధించిన అమృతాన్ని పురుషయత్నంతో గరుడుడు సాధించాడు. అమృతాన్ని పంచిన విష్ణువునకు వాహనమైనాడు. అమృతం తాగకుండానే దాని మహిమలను అలౌల్య (అనాసక్తయోగ)మనే గుణంతో సాధించిన మహితాత్ముడు. అమృతత్వమంటే అనాసక్తియోగం, స్వేచ్ఛ (జీవన్ముక్తి) అని గరుడుడు ఈ కథ ద్వారా లోకానికి చాటుతున్నాడు.

ఫలశ్రుతి :- "ఈ సౌపర్ణాఖ్యానము భాసురముగ వినిన పుణ్యవరులకు నధికశ్రీసంపదలగు, దురిత నిరాసంబగు, బాయు నురగరక్షోభయముల్". 

గరుత్మంతుడికి సంబంధించిన ఈ కథను ఒప్పుగా వినిన పుణ్యాత్ములకు అధికమైన సిరిసంపదలు కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాముల నుండి, రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి. ఫలశ్రుతి అటుంచి, ఈ కథలోకానికి అందించే మహత్తరసందేశం ఏమిటో నన్నయ గారి వాక్కుల్లో విందాము. అదే సుపర్ణుని తల్లి మాటల్లో...

"కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల యిడుముల వాయుట యెందునుం గలయది గాబట్టి నీ యట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?"

కుమారులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగటం ఎచ్చటైనా ఉన్నదే (సహజమే) కావున నీవంటి యోగ్యుడైన కుమారుడిని పొంది నేను ఇంకా దాసినై ఉంటానా?
500 సంవత్సరాలు సవతికి దాసత్వం నెఱపిన వినత, రెండవ గుడ్డు పగిలేంతవరకు ఎప్పుడు తన కష్టాలు తీర్చే కుమారుడు (గరుత్మంతుడు) పుడతాడా యని ఎదురుచూసింది. మాట నిలుపుకున్న కుమారుడు ఎంత ధన్యుడో! ధన్యజీవి వినత! 

                                        ******

Monday, October 8, 2012

తన పేరున్న కన్యతో పెండ్లి! (Thana Perunna Kanyatho Pendli)

తన పేరున్న అమ్మాయినే జరత్కారు మహర్షి ఎందుకు వివాహమాడ దలచాడు? అన్న ప్రశ్నకు పండితులే సమాధానం చెప్పాలి. తపస్సే ధ్యేయంగా శరీరాన్ని కృశింపజేసి, సంసార పునర్భవ భీతి చేత కఠోర బ్రహ్మచర్య వ్రతావలంబి జరత్కారువు. పితృపితామహుల కోరికపై సనామధేయ యగు నాగకన్యను వివాహమాడి, నియమం పాటించని భార్యను వదిలి తపశ్చర్యకే పునరంకితమైన మహా మనీషి. 
కారణజన్ముడైన ఆస్తీక మహర్షి (జరత్కారు తనయుడు) సర్పసంహార యాగాన్ని తల్లి, మేనమామల కోరికపై నిలుపగలిగాడు. 
లోకానికి ఈ కథ అందించే మహత్తర సందేశం: 
"పుత్రవంతులగు వారు పొందునట్టి లోకములను గొప్పతపస్సు, గొప్ప యాగములు చేసియు, పుత్రులు లేనివారు పొందజాలరు. (అపుత్రస్య గతిర్నాస్తి)"

ఇలాంటి కథ ఎప్పుడైనా, ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? 
ఆంధ్రమహాభారత, ఆదిపర్వంలో సర్పసంహారయాగ సందర్భంగా ఇందుకు సంబంధించిన కథ మనకు కనబడుతుంది. వివరాలలోకి వెళితే..
జరత్కారుడనే ముని సంసారపునర్భవభీతి చేత (సంసారము నందు మళ్లీ జన్మ కలుగుతాదనే భయం వలన) తపస్సు, వేదాధ్యయనము, బ్రహ్మచర్యవ్రత దీక్షలతో శరీరాన్ని కృశింపచేసిన మహనీయుడు. ఒకనాడు అడవిలో ఒక నీటి పడియను చూచి, అందు ఎలుకలచే కొరకబడి ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉన్న అవురుగడ్డి దుబ్బును పట్టుకొని తలక్రిందులుగా సూర్యుని కిరణాలే ఆహారంగా వ్రేలాడుతున్న కొందరు ఋషులను చూచి, "ఇది తపోవిశేషమా? నాకు వివరించండి" అని ప్రశ్నించాడు. 

అప్పుడా ఋషులు, "అదృష్టహీనులమైన మా వంశంలో జరత్కారుడనే పాపాత్ముడు పుట్టి, పెండ్లి చేసుకొనటానికి, సంతానం పొందటానికి అంగీకరించకున్నాడు.  మేమాతని తండ్రితాతలం. మేము పట్టుకు వేలాడుతున్న అవురుగడ్డి దుబ్బు వ్రేళ్లనన్నింటిని యముడు ఎలుకల మిషతో కొరికేస్తే ఒక్కవేరు మాత్రం మిగిలి ఉన్నది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాలలో పడతాం. అతడు సంతానం పొందితే పైలోకాలకు వెళతాం. నీవు ఎవరో మాకు బంధువువలె ప్రీతితో ఏకాగ్రచిత్తుడవై మా మాటలు విని మన్నించావు. ఆ జరత్కారుడిని ఎరుగుదువేని మేం పొందే ఈ దురవస్థ వానికి తెలియజెప్పుము" అన్నారు. 

పితృదేవతలిట్లు పలుకగా జరత్కారుడు మిక్కిలి దయతో కూడిన హృదయం గలవాడై, "నేనే ఆ జరత్కారుడను, మీ కుమారుడను, నేను తప్పక మీరు కోరినట్లుగా వివాహం చేసుకుంటా" నని మాట ఇచ్చాడు. ఆ మహామునులు సంతోషించి జరత్కారునితో - 
"తగియెడు బుత్రులం బడసి ధర్మము తప్పక తమ్మునుత్తముల్ 
పొగడగ, మన్మహామతులు పొందు గతుల్ గడు ఘోరనిష్ఠతో
దగిలి తపంబు సేసియును దక్షిణలిమ్ముగ నిచ్చి యజ్ఞముల్ 
నెగడగ జేసియుం, బడయనేర రపుత్త్రకులైన దుర్మతుల్" అన్నారు. 

యోగ్యులైన కొడుకులను పొంది, ధర్మమార్గం తొలగకుండ తమ్ము, సజ్జనులు పొగడేటట్లుగా జీవించి, గొప్ప బుద్ధిమంతులు పొందే ఉత్తమలోకాలను, మిక్కిలి కఠినమైన నిష్ఠతో విడువక తపస్సు చేసినప్పటికీ, ఒప్పుగా దక్షిణలిచ్చి యజ్ఞాలు అధికంగా చేసినప్పటికీ పుత్రహీనులైన దుర్జనులు (అట్టిగతులు) పొందజాలరు". 

జరత్కారుడు పితృదేవతలకు, తాను తనతో సమానమైన పేరు గల కన్యను పెండ్లాడవలెనను తలంపుతో నున్నాడనని చెప్పి, వారి వద్ద సెలవు తీసుకొని అట్టి కన్యను భూవలయమంతా తిరిగి వెదికినా లభించలేదు, కాని ముసలితనం మాత్రం సంప్రాప్తించింది. 

సర్పరాజైన వాసుకి తన సేవకుల వలన విషయాన్ని తెలుసుకుని, తన తోబుట్టువయిన (నాగకన్య), జరత్కారువును వెంటతీసుకొని జరత్కారుని చెంతకు వెళ్లి, "లోకపూజ్యుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం పుణ్యవంతమయింది. మా వంశం ధన్యమయింది. నీకూ, మా చెల్లెలికిని ఉండే ఒండొరులకు తగిన గుణాల చేత, పేర్ల చేత హృదయంలో ఆనందం కలిగింది. నా చెల్లెలైన ఈ జరత్కారువును వివాహార్థమై కన్యారూపమైన భిక్షగా ప్రీతితో గ్రహించండి" అని పలుకగా, జరత్కారు మహాముని ఆ కన్యను పెండ్లాడి మొదటి సమాగమము నాడే భార్యకు, "నాకు నీవు ఎప్పుడు అగౌరవం తలపోస్తావో ఆ రోజుననే నిన్ను విడిచిపోతాను" అని నియమం చేసాడు. 

ఆనాటి నుండి "వాలుపయి నడచునట్లబ్బాలిక నడునడ నడుంగి భయమున నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును నేమఱక  పరిచరించుచునుండెన్".  

కన్య అయిన ఆ జరత్కారువు కత్తిపై నడుస్తున్నట్లు వడవడ వణికి భయంతో నియమం చేత భయంకరుడైన భర్తకు పగళ్లు రాత్రులు పొరపాటు పడకుండ శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేది. 
"అనవరతభక్తి బాయక తన పతికిం బ్రియము సేసి తద్దయు గర్భం బనురక్తి దాల్చి, యొప్పెను, దినకరగర్భయగు పూర్వదిక్సతి వోలెన్". 
ఎడతెగని భక్తితో విడువక తన భర్తకు మిక్కిలి ప్రీతి ఒనరించి, అనురాగంతో గర్భం ధరించి, సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంతవలె ప్రకాశించింది. 

ఒకనాడు జరత్కారుముని, తన భార్య తొడనే తలగడగా కృష్ణమృగచర్మపు పక్కపై నిద్రిస్తున్న సమయంలో సూర్యుడు అస్తమించుటకు సిద్ధంగా ఉండగా, ఆశ్రమంలో నివసించే ఋషులు సంధ్యాకాలంలో చేయదగిన సంధ్యావందనాదికర్మలు చేయటానికి పూనగా చూచి సంధ్యాకాలంలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగమవుతుందని, ఒకవేళ మేల్కొల్పినందుకు కోపిస్తే కోపాన్ని భరించవచ్చునని తలచి భర్తను నిద్ర నుండి లేపింది. కోపించిన భర్తకు కారణం తెలుపగా,

"నా మేల్కను నంతకు నుండక యిను డొనరగ నస్తాద్రి కేగ నోడడె చెప్పుమా". నేను మేల్కొనేంతవరకు అస్తమించకుండ ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్లటానికి భయపడడా అంటూ భార్యను మందలించాడు. తన శపథాన్ని భార్యకు గుర్తు చేస్తూ, గర్భాన ఉన్న కుమారుడు సూర్యాగ్ని తేజస్వి అని, ఇరువురి కులాల దుఃఖ నివారకుడని ఓదారుస్తూ తన అన్న చెంతకు వెళ్లుమని జరత్కారముని తపస్సు నిమిత్తం అడవికి వెళ్ళాడు.
కొంత కాలానికి:
ఆపూర్ణతేజుడు - అంతటను నిండిన తేజస్సు గలవాడు. 
అపగతపాపుడు - పాపం లేనివాడు
అపాకృతభవానుబంధుడు - తిరస్కరింపబడిన సంసార బంధం గలవాడు. 

నిజ మాతృ, పితృ పక్ష ప్రబల భయాపహుడు - తల్లిదండ్రుల ఉభయపక్షాలకు చెందినవారి అధికమైన భయాన్ని పోగొట్టేవాడున్ను అయిన ఆస్తీకుడు కాంతితో పుట్టి పెరిగాడు. ఆయన చ్యవనకుమారుడైన ప్రమతి వద్ద వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను అధ్యయనం చేసాడు.

కారణజన్ముడైన ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని నివారించగలడని తెలిసి వాసుకి, చెల్లెలి వివాహం జరత్కారువుతో జరిపించాడు.
సర్పసంహార యాగాన్ని చేయ సంకల్పించిన రాజు జనమేజయుడు. దానికి కారణం - తన తండ్రియైన పరీక్షిత్తును తక్షకుడు కాటు వేసి సంహరించడమే.
ఉదంకమహర్షి, గురుపత్ని నియోగుడై, పౌష్యకమహారాజు భార్య కుండలములను తీసుకువస్తుండగా వానిని తక్షకుడు మార్గమధ్యంలో హరిస్తాడు. తన తపోబలం చేత ఉదంకుడు నాగలోకం ప్రవేశించి, నాగులను ప్రసన్నం చేసుకుని, పాతాళలోకంలో బడబాగ్ని ప్రజ్జ్వలింపచేసి తక్షకుని చేత కుండలాలను తిరిగి పొంది, వాటిని గురుదక్షిణగా గురుపత్నికి అందజేస్తాడు.

తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారంగా, తండ్రియైన పరీక్షిత్తు మరణానికి కారకుడైన తక్షకసంహారనిమిత్తం సర్పయాగము చెయ్యమని జనమేజయ మహారాజును ప్రేరేపిస్తాడు.

అందుకు జనమేజయుడు విప్రులను సంప్రదించగా పురాణజ్ఞుడైన ఒక బ్రాహ్మణుడు, రాజా నీవు చేయబోయే ఈ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా  చేసే క్రియాకలాపం చేత సమగ్రమైనప్పటికి చివరి దాకా సాగదని, ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అని భావిని గురించి తెలిపాడు.
అయినప్పటికీ అతని మాట పెడిచెవిన బెట్టి జనమేజయుడు సర్పయాగం చేయడం మొదలెట్టాడు.

బ్రాహ్మణుల మంత్రాల, అగ్నిలో వ్రేల్చే పదార్థాల ప్రభావం చేత వశం తప్పినవారై గొప్ప సర్పములు పెక్కు తలలు గలవి, కోరల్లో విషరూపమైన అగ్నిగలవి, అధికమైన వేగంతో అగ్నిలో పడి భస్మమవజొచ్చాయి.

"తడబడబడియెడు రవమును, బడి కాలెడు రవము, గాలి పలుదెరగుల ప్రస్సెడురవమును, దిగ్వలయము గడుకొని మ్రోయించే నురగకాయోత్థితమై".  

తొట్రుపాటు పడుతూ, అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్ను పడి కాలే ధ్వనియున్నూ, కాలి పెక్కువిధాల బ్రద్దలయ్యేప్పుడు కలిగే ధ్వనియున్ను, పాముల దేహాల నుండి బయల్వెడినవై దిక్చక్రాన్ని అతిశయంగా మ్రోగేటట్లు చేశాయి. 

ఆ సమయంలో వాసుకి, చెల్లెలి వద్దకు వెళ్లి మేనల్లుడైన ఆస్తీకున్ని జనమేజయమహారాజు వద్దకు వెళ్లి సర్పయాగం మాన్పించి పాములను రక్షించేలా చేయమని కోరగా తల్లి కుమారుని పిలిచి నీ మేనమామ వాసుకి చెప్పిన పని నిర్వర్తించుమని ఆజ్ఞాపించింది. 

ఆస్తీకుడు వేదవేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణశ్రేష్ఠులతో జనమేజయుడు సర్పయాగం చేసే యాగశాలకు వచ్చి "స్వదేహకాంతి సభాంతరంబెల్ల బర్వ" తన మేనికాంతిచే సభామధ్యమంతా ప్రకాశిస్తుండగా (మహాతేజస్సంపన్నుడైన మహర్షి) మంగళవాక్య పూర్వకంబుగా జనమేజయుడిని ఈ విధంగా కీర్తించాడు. 

చంద్రవంశానికి అలంకారపురుషుడవై, రాజర్షివై ధర్మంతో కూడిన ప్రవర్తనతో భూమిని పాలిస్తూ ప్రసిద్ధులైన సూర్యచంద్రవంశ పూర్వరాజుల నడవడిలో ఉత్తముడవు నీవు. 
ఇంతవరకు దేవతలు, భూపతులు చేయని ఆది యజ్ఞమైన ఈ సర్పయజ్ఞం ధర్మరాజు రాజసూయం, బ్రహ్మ చేసిన ప్రయాగ యజ్ఞం, వరుణ, కృష్ణుల యజ్ఞాల కంటే ఎంతో గొప్పది సుమా!

ఈ యజ్ఞ ఋత్విక్కులు బుద్ధిసంపన్నులు, తపస్సే ధనంగా కలవారు, బ్రహ్మతో సమానులు, ఇంద్రుడి యగ్నంలోని ఉత్తమ ఋత్విజుల కంటె ప్రసిద్ధులు. 
విద్వాంసులలో శ్రేష్ఠుడు, మూర్తీభవించిన ధర్మమూర్తి, ముల్లోకాలలో ప్రసిద్ధ తేజస్వి, సుజనుడైన వ్యాసమహర్షి స్వయంగా కుమారుడితోను, శిష్యులతోను, ఋత్విజుల సముదాయంతోను యజ్ఞంలో పాల్గొన్నాడంటే, రాజులలో నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే.

అగ్నిహోత్రుడే స్వయంగా సాక్షాత్కరించి తన చేతులతో బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబడిన అన్నాదిహవ్యాలను గ్రహించి పుణ్యఫలితాలను నీకు ప్రసాదిస్తున్నాడు. ధన్యుడవు రాజా!" అని ఈ విధంగా ఆస్తీకుడు జనమేజయ మహారాజును, అతని యజ్ఞ మహత్యాన్ని, యజ్ఞం చేయించే ఋత్విక్కులను, యజ్ఞానికి వచ్చిన సదస్యులను, పూజ్యుడైన అగ్నిని మంగళవాక్కులతో మాటలో కరకుతనం లేకుండా, గట్టిదనం స్ఫురించకుండా, మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్లు నివేదించుకొన్నాడు. 

అంతట మహారాజు ఆస్తీకుని చూచి, "మునిశ్రేష్ఠా! నీకేది ప్రియమో దానిని నేనిస్తాను. అడుగుమనగా ఆస్తీకుడు, అభిమన్యు వంశోద్ధారకా! జనమేజయ మహారాజా! నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మాని, పాముల సమూహాన్ని కాపాడుమని కోరాడు. 
అప్పుడు యాగం వీక్షిస్తున్న సభ్యులందరూ ఏకకంఠంతో అర్హుడు, తపోధనుడైన ఉత్తమబ్రాహ్మణోత్తమునకు ప్రీతితో కోరినది ఇవ్వటం సముచితమని పలుకగా, అందరికి సమ్మతమయ్యేటట్లుగా జనమేజయుడు అతని కోరిక మన్నించి సర్పయాగం మానాడు!
ఈ కథలోని చిక్కు ప్రశ్న తన పేరున్న అమ్మాయినే జరత్కారుడు వివాహమాడడంలోని ఆంతర్యం పండితులే వివరించాలి. (సనామధేయయగు కన్యతో వివాహము). 


                                                            ******

మహాభారతం - ఫలశ్రుతి (Mahabharatham - Phalasruthi)

        "ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు, అర్థార్థులకు విపులార్ధములను 
         ధర్మార్థులకు నిత్య ధర్మసంప్రాప్తియు వినయార్థులకు మహావినయ మతియు 
         పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకిష్ట సంపదలను 
         గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమ్మహాభారతంబు"

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు, ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతత ధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్ర సంతానం కోరేవారికి పుత్ర సంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. 

ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం, వినయం ప్రాధాన్యం ఏమిటి? 

        "విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
         పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం" 

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాలనుంచారు మనవాళ్లు. అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్ధించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అన్నీ వ్యర్థాలే.


                                                                  ******